పరుగులు పెట్టిస్తున్న పులి
ముమ్మరంగా గాలిస్తున్న అధికారులు
ట్రాప్, సీసీ కెమెరాల ఏర్పాటు
రాజమహేంద్రవరం రూరల్/కడియం: కొద్ది రోజులుగా చిరుత పులి అందరినీ పరుగులు పెట్టిస్తోంది.. ఎక్కడా చిక్కకుండా తిరుగుతోంది.. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియక జనంతో పాటు అధికారులూ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.. ఆ చిరుత పులి నుంచి ఎవరికి ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం అందరిలో వెంటాడుతోంది. కడియం నుంచి వీరవరం వెళ్లే రోడ్డులో దోసాలమ్మ కాలనీ సమీపంలోని ఎన్‌ఎస్‌టీసీ నర్సరీలో మంగళవారం రాత్రి చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. ఇవి దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో తిరిగిన పులి పాదముద్రలతో సరిపోలడంతో అది ఇక్కడకు వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులూ ధ్రువీకరించారు.
అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా పులి పాదముద్రల ఆనవాళ్లు పోయాయి. చిరుతపులి కదలికలను గుర్తించడానికి పలుచోట్ల ట్రాప్, సీసీ కెమెరాలను అమర్చారు. జిల్లా అటవీశాఖాధికారి ఎస్.భరణి ఆధ్వర్యంలో చిరుతపులి కదలికలను గుర్తించడానికి ఐదు బృందాలుగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాని జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖాధికారి ఎస్.భరణి మాట్లాడుతూ వరద సమయంలో గోదావరి మీదుగా వచ్చినట్లు భావించిన చిరుత పులి బుర్రిలంక సమీపంలోని లంకల్లో జింకలు ఉంటాయని అటువైపు వెళ్తున్నట్లు భావిస్తున్నామన్నారు.
కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడామని, వారి పూర్తి సహాయ సహకారాలు అటవీశాఖ సిబ్బందికి అందజేస్తున్నారన్నారు. నర్సరీలో పనిచేసే వారికి, చుట్టుపక్కల గ్రామస్తులకు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. అటవీ శాఖ సిబ్బందికి అంతా సహకరించాలని, అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దన్నారు. అసత్య ప్రచారాలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని భరణి హెచ్చరించారు.
చిరుత సంచారంపై ఆరా
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తూ కడియపులంక గ్రామంలో ఆగి చిరుత పులి సంచారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చిరుత పులి అని దాని కదలికలు, పాదముద్రల ద్వారా నిర్ధారించామని వివరించారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని, మనుషులపై దాడిచేసే అవకాశం లేదని, వర్షం వల్ల చిరుత ఎక్కడో నక్కిందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకుని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని మంత్రి ఆదేశించారు. దాని కదలికల కోసం ప్రయత్నిస్తున్నామని భరణి మంత్రికి వివరించారు.
పనులకు రాని కూలీలు
కడియం నర్సరీల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నర్సరీలో పనిచేసే కూలీలు కానీ, ఎగుమతి దిగుమతులు చేసే జట్టు కూలీలు కానీ పనులకు రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఈ చిరుత పులిని పట్టుకునే ఏర్పాట్లను వేగవంతం చేయాలని నర్సరీ రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment