* 37.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం
* రూ. 642 కోట్లతో ‘సెర్ప్’ తాజా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతు కుటుంబాల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో జీవనోపాధికి ప్రాధాన్యత కల్పించింది. మొత్తం పల్లెప్రగతి ప్రాజెక్ట్ వ్యయం రూ.642 కోట్లు కాగా, జీవనోపాధి కార్యక్రమాలకే రూ.264 కోట్లు కేటాయించింది. వివిధ రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తిదారుల సంస్థ(ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఉత్పత్తులకు మెరుగైన ధర పొందేలా సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం చేయనుంది.
165 ఉత్పత్తిదారుల సంస్థల్లో 2.55 లక్షల మందిని భాగస్వాములు చేయనుంది.
మానవాభివృద్ధి మెరుగుదలకు: జీవనోపాధి కల్పనతో పాటు మానవాభివృద్ధి మెరుగుదల కోసం పల్లెప్రగతి కార్యక్రమం కింద పలు చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం నాణ్యమైన విద్యను అందించడం ఇందులో ముఖ్యమైనవి. 2.50 లక్షల కుటుంబాలు మెరుగైన మానవాభివృద్ధిని అనుభవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కమ్యూనిటీ పర్యవేక్షణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలను అందించేందుకు డిజిటల్ కనెక్టివిటీతో సమగ్ర సేవా కేంద్రాలను స్థాపించి, ఉపాధిహామీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ ఉపకార వేతనాలు.. తదితర చెల్లింపులన్నీ ఈ కేంద్రాల నుంచే పొందే వీలు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ-గవర్నెన్స్, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఒకేచోట లభించేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పల్లెప్రగతితో జీవనోపాధి
Published Wed, Aug 26 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement