Rural Poverty Alleviation organization
-
పల్లెప్రగతితో జీవనోపాధి
* 37.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం * రూ. 642 కోట్లతో ‘సెర్ప్’ తాజా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతు కుటుంబాల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జీవనోపాధికి ప్రాధాన్యత కల్పించింది. మొత్తం పల్లెప్రగతి ప్రాజెక్ట్ వ్యయం రూ.642 కోట్లు కాగా, జీవనోపాధి కార్యక్రమాలకే రూ.264 కోట్లు కేటాయించింది. వివిధ రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తిదారుల సంస్థ(ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఉత్పత్తులకు మెరుగైన ధర పొందేలా సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం చేయనుంది. 165 ఉత్పత్తిదారుల సంస్థల్లో 2.55 లక్షల మందిని భాగస్వాములు చేయనుంది. మానవాభివృద్ధి మెరుగుదలకు: జీవనోపాధి కల్పనతో పాటు మానవాభివృద్ధి మెరుగుదల కోసం పల్లెప్రగతి కార్యక్రమం కింద పలు చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం నాణ్యమైన విద్యను అందించడం ఇందులో ముఖ్యమైనవి. 2.50 లక్షల కుటుంబాలు మెరుగైన మానవాభివృద్ధిని అనుభవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిటీ పర్యవేక్షణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలను అందించేందుకు డిజిటల్ కనెక్టివిటీతో సమగ్ర సేవా కేంద్రాలను స్థాపించి, ఉపాధిహామీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ ఉపకార వేతనాలు.. తదితర చెల్లింపులన్నీ ఈ కేంద్రాల నుంచే పొందే వీలు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ-గవర్నెన్స్, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఒకేచోట లభించేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. -
‘ఆందోళన’లో సెర్ప్ ఉద్యోగులు
16న విజయవాడలో సదస్సు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఈవోకి వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళల్లో చైతన్యం నింపడానికి దోహదపడిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సంస్థ నిర్వహణకు నిధులివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో వారి ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకమైంది. దీంతో వారు ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వం నిధులిచ్చి తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. సంస్థలో ఉన్న 3,413 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శుక్రవారం సెర్ప్ సీఈవో హెచ్. అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం తదితరులు సీఈవోని కలిశారు. తమకు ఉద్యోగ భధ్రత కల్పించే విషయంలో చొరవ చూపాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అధ్యక్షత జరిగిన సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కూడా నిర్వహణ నిధుల నిలిపివేతపై చర్చ జరిగింది. ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా, సంస్థ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడం, ప్రభుత్వ అభ్యంతరాలను సీఈవో, అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిధుల విడుదలపై సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సెర్ప్ ఉద్యోగులు గౌరి, బాలాజీ, రమ, సునీత, రాజా ప్రతాప్ తదితరులు కలిశారు. ప్రపంచ బ్యాంకు సాయంపై ప్రతిపాదనలు ఏపీ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకు మూడో దశలో సెర్ప్‌కు చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రతిపాదనలకు సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా, తుపాను బాధితుల కోసం సెర్ప్ ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చారు. -
రంగుల్లో పింఛన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న వివిధ సామాజిక భద్రతా పింఛన్ కార్డులకు రంగులు ఖరారయ్యాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నమూనా పింఛన్ కార్డులను 20 రకా ల రంగుల్లో రూపొందించగా వాటిలో మూడింటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. వృద్ధాప్య పింఛన్ కార్డుకు గులాబీ రంగును ఖరారు చేయగా, వికలాంగ పింఛన్ కార్డుకు ఆకుపచ్చ రంగు, వితంతు పింఛన్లకు ఉదారంగు(వయోలెట్)ను ఎంపిక చేశారు. పింఛన్‌కార్డుల జారీకి గడువు సమీపిస్తున్నా, దరఖాస్తుల ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 39.95 లక్షల దరఖాస్తులు రాగా, శుక్రవారం నాటికి 24.30లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆహారభదత్ర కార్డులకు సంబంధించి మొత్తం 92.22లక్షల దరఖాస్తులకు గాను 22.68 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.