16న విజయవాడలో సదస్సు
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఈవోకి వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళల్లో చైతన్యం నింపడానికి దోహదపడిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సంస్థ నిర్వహణకు నిధులివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో వారి ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకమైంది. దీంతో వారు ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వం నిధులిచ్చి తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు.
సంస్థలో ఉన్న 3,413 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శుక్రవారం సెర్ప్ సీఈవో హెచ్. అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం తదితరులు సీఈవోని కలిశారు. తమకు ఉద్యోగ భధ్రత కల్పించే విషయంలో చొరవ చూపాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అధ్యక్షత జరిగిన సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కూడా నిర్వహణ నిధుల నిలిపివేతపై చర్చ జరిగింది. ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా, సంస్థ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడం, ప్రభుత్వ అభ్యంతరాలను సీఈవో, అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిధుల విడుదలపై సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సెర్ప్ ఉద్యోగులు గౌరి, బాలాజీ, రమ, సునీత, రాజా ప్రతాప్ తదితరులు కలిశారు.
ప్రపంచ బ్యాంకు సాయంపై ప్రతిపాదనలు
ఏపీ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకు మూడో దశలో సెర్ప్‌కు చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రతిపాదనలకు సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా, తుపాను బాధితుల కోసం సెర్ప్ ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చారు.
‘ఆందోళన’లో సెర్ప్ ఉద్యోగులు
Published Sat, Nov 15 2014 1:28 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement