∙మళ్లీ బడి పిల్లలమై..; బడిలో 100 సంవత్సరాలు దాటిన బామ్మ... రహేల్ (మధ్యలో)
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు....
దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్‌లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు.
‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు.
ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల.
‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు.
‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు.
పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత.
Comments
Please login to add a commentAdd a comment