ఆ ఊరి పేరు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది! | Abhilasha Jeph: A crime-infested Rajasthan village is called IAS factory | Sakshi
Sakshi News home page

ఆ ఊరి పేరు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!

Published Sat, Aug 10 2024 12:59 AM | Last Updated on Sat, Aug 10 2024 12:59 AM

Abhilasha Jeph: A crime-infested Rajasthan village is called IAS factory

ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు,  అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన  రాజస్థాన్‌లోని నయాబస్‌ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్‌ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం.  జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్‌ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్‌ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్‌ మోడల్‌...

ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్‌ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.

ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని  ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో  ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్‌ కా ఠాణా జిల్లాలోని నయాబస్‌ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.

‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే  గృహిణి.

అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్‌ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్‌ను ఇప్పుడు ‘ఐఏఎస్‌ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.

ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్‌లు కలర్‌ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్‌ సెంటర్‌ల వారు అంటించిన ఈ పోస్టర్‌లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.

ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్‌ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్‌ ఉన్నాయి.

చదువు వల్ల నయాబస్‌ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.

ఆటల్లోనూ...
ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్‌లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్‌ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! 

చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్‌ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల  ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత  ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement