మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ.
రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది.
చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది.
అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు.
‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు.
స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు.
‘సర్పంచ్ ఎలక్షన్‌లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది.
‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు.
సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ.
బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు.
ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది.
‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ.
Comments
Please login to add a commentAdd a comment