kasturba gandhi balika vidyalaya
-
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
విద్యార్థినిపై పీఈటీ టీచర్ దాష్టీకం.. కడ్డీతో చెంపపై కాల్చిన వైనం
సాక్షి, కర్నూలు: కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. ఆదర్శంగా ఉండాల్సిన టీచరే విద్యార్థి ని చెంపపై కడ్డీతో కాల్చింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి కేజీబీవీలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. చున్నీ వేసుకోకుండా తిరగడమే కాక తనను వేరే విద్యార్థినుల ముందు తిడతావా అని కీర్తిపై పీఈటీ టీచర్ పావని ఆగ్రహించింది. అంతటితో వదలకపోగా శనివారం ప్రార్థన సమయంలో కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. కీర్తికి గిట్టని ఓ విద్యార్థిని చెప్పిన మాటలను నమ్మి సదరు టీచర్ ఇలా చేసినట్లు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ -
చికెన్, మటన్, నెయ్యి!
కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థినులకు ఇక మంచి పోషకాహారం అందనుంది. చికెన్, మటన్, గుడ్డు, నెయ్యి అందించేలా సర్కార్ చర్యలకు ఉపక్రమించనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో చికెన్, గుడ్డు అందిస్తున్నారు. ఇకపై నెలలో రెండు వారాలు మటన్, నిత్యం నెయ్యి అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో ఎదిగే విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం అందనుంది. వికారాబాద్, యాలాల(తాండూరు): బడిబయటి పిల్లలతో పాటు చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినులు ఆరోగ్యపరంగా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు వారికి నాణ్యమైన మాంసకృత్తులు అందించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూర్బాల్లో చికెన్‌తో పాటు మేక మాంసం, ప్రతిరోజు గుడ్డు, నెయ్యితో మెనూను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వారానికొకసారి అందించే చికెన్‌తో పాటు మేకకూర ప్రతిరోజు నెయ్యి, గుడ్డు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు కోసం కొత్త సంవత్సరం నుంచి కేజీబీవీల్లో కొత్త మెనూ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అస్కారం ఉంటుంది. జిల్లాలోని కసూర్బా పాఠశాలలు.. జిల్లాలోని 18 మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,374 మంది విద్యార్థినులు విద్యభ్యాసం చేస్తున్నారు. వీరికి ప్రతిరోజూ నాణ్యమైన భోజనంతో పాటు వారంలో ఒకరోజు(ఆదివారం)చికెన్ అందిస్తున్నారు. భోజనంతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి రూ.33 పర్ కేపిటాగా నెలకు రూ.990లు ఖర్చు చేస్తున్నారు. అయితే, కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న నూతన మెనూలో భాగంగా మటన్, నెయ్యి, గుడ్డు విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగంగా మార్కెట్లో మటన్ కిలోకు దాదాపు రూ.400, నెయ్యి కిలోకు రూ.400, గుడ్డు ఒక్కోటి రూ.5గా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.45 పర్ కేపిటాగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎదిగే బాలికలు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుకుండా, రక్తహీనత బారినపడకుండా ఉండేందుకు ఈ కొత్త మెనూ దోహదపడుతుందని కేజీబీవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అమలు అవుతున్న మెనూలో భాగంగా నెలకు నాలుగుసార్లు చికెన్‌తో పాటు రెండుసార్లు మేక మాంసాన్ని మెనూ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రతినెలా రెండు, నాలుగో ఆదివారం మేక మాంసం అందించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. ఇదే అమలు అయితే విద్యార్థినులు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం కేజీబీవీల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న మెనూతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుకుంటారు. ఇక్క డ కేజీబీవీల్లో విద్యార్థినులు రక్తహీనత, ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతుంటారు. కొత్త మెనూ ప్రకారం మేక మాంసం, నెయ్యి, గుడ్డుతో ఎంతో మేలు కలుగుతుంది. తద్వారా విద్యార్థినులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికే మెనూపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. –సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ, యాలాల -
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యో గులకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. 2005లో నియమితులై ఇప్పటివరకు రిమార్క్ లేకుండా పనిచేస్తున్న వారందరినీ కొనసాగించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2012–13లో వచ్చిన నియామక మార్గదర్శకాలతో ప్రమే యం లేకుండా వీరి సర్వీసులను క్రమబ ద్ధీకరించే విషయాన్ని పరిగణనలోకి తీసు కోవాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఖాళీ లు ఏర్పడితే వాటిని 2012–13 మార్గదర్శ కాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగు ణంగా భర్తీ చేసు కోవచ్చని సూచించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు గత వారం తీర్పు వెలువరించారు. కేజీబీవీల్లో మహిళలనే ఉద్యోగులుగా నియ మించుకోవాలని.. పురుషులకు కేజీబీవీల్లో నివాసం ఉండేందుకు అనుమతి నివ్వరా దని 2012–2013లో కేంద్రం మార్గ దర్శకా లు జారీ చేసిందన్న కారణంతో తమను తొలగించి, తమ స్థానాల్లో ఔట్ సోర్సింగ్ కింద నియామాకాలు చేపట్టేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన పలు సర్క్యు లర్లను సవాలు చేస్తూ కాంట్రాక్టు ఉద్యో గులు హైకోర్టును ఆశ్రయించారు. నిరుపేదలకే అసైన్డ్ భూములు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు అసైన్డ్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అసైన్డ్ భూముల్లో ప్రస్తుతం కబ్జాలో ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అసైన్డ్‌భూముల్లో కబ్జాలో ఉన్న వ్యక్తుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం ఈ భూములను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి అసైన్డ్ చేయనున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. -
వెంకటేశ్వరి మృతిపై ఎన్నో అనుమానాలు!
సాక్షి, పులివెందుల: కడప జిల్లాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుండటంపై వైఎస్ఆర్ సీపీ నేత, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి పరిశీలించారు. వెంకటేశ్వరి మృతిపై అనేక అనుమానాలున్నాయని.. వెంటనే విచారణ జరిరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని వెంకటేశ్వరి ఆత్మహత్య ఘటనపై సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ జి. శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఆత్మహత్య ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని కడప పీవో, సింహాద్రిపురం ఎస్ఓలను ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. ఎస్ఎస్ఏ జేడీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఓ టీమ్ కడపకు బయలుదేరినట్లు సమాచారం. కాగా, కడప జిల్లా కేంద్రంలోని మౌంట్‌ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్‌రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని మౌంట్‌ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్‌రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జిల్లాలోని సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ లోనే వెంకటేశ్వరి బలన్మరణానికి పాల్పడిందని, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ విద్యార్థిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున కడప పట్టణ శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ స్కూలు హాస్టల్లోనే చరణ్‌రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ధరించిన టైతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నప్పటికీ, విద్యార్థి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
అమ్మో దెయ్యం.. మాకు భయం
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయంలోని 50 మంది బాలికలు శనివారం దెయ్యం తిరుగుతోందంటూ ఇంటి బాట పట్టారు. పాఠశాలలో రాత్రి పూట కొందరు బాలికలకు దెయ్యం పడుతోందని, ఆ భయంతోనే వెళ్లిపోయారని కొందరు చెబుతుండగా, సంఘటన వెనుక కొందరు స్వార్థపరులు కథ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 185 మంది బాలికలు చదువుతున్నారు. కొంత కాలంగా పాఠశాలలోని బోధకులు మధ్య విభేదాలు ఉన్నాయని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారిణి లక్ష్మిని ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొందరు విద్యార్థినులను పావులుగా వాడుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. ఏటీడబ్ల్యువో విచారణ తాజంగి కస్తుర్భా బాలికలు ఇంటి బాట పట్టడంపై ఏటీడబ్ల్యువో దేముళ్లు విచారణ జరిపారు. విద్యార్థినులు వెళ్లి పోవడానికి గల కారణాలను సిబ్బంది, బాలికలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన వెనుక వినిపిస్తున్న కథనంపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇళ్లకు వెళ్లిపోయిన బాలికలందరినీ వెనక్కు రప్పించేందుకు ప్రత్యేక అధికారి లక్ష్మి చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. -
హస్టల్లోని 30 మంది బాలికలకు అస్వస్థత
కర్నూలు: కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బుధవారం ఆసుపత్రి పాలైయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసిన కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
విద్యార్థులకు అస్వస్థత
కస్తూర్బా పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అస్వస్థతకు గురైన తమ పిల్లల ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఎస్వో ఉమాదేవి, ఎస్ఎస్ఏ పీవో బి. నగేష్‌లను నిలదీశారు. యాజమాన్యం, భోజన నిర్వాహకుల తీరు సక్రమంగా లేదని వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆర్డీవో పద్మావతి వారితో చర్చలు జరిపారు. ఇకపై సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో, ఎస్ఎస్ఏ పీవో హామీతో ఆందోళన విరమించారు. ఎంపీడీవో స్వరూపరాణి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంఈవో సత్యనారాయణ , జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దిన్‌బాబు, వైస్ ఎంపీపీ కె. అనిత బాధిత విద్యార్థినులను పరామర్శించారు. - తప్పిన ప్రమాదం - రాంబిల్లి కస్తూర్బా పాఠశాలలో ఘటన - వంటలో తేడా వల్లేనని వైద్యాధికారుల వివరణ - పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన - ఎస్ఎస్ఏ పీవో సమాధానంతో విరమణ రాంబిల్లి: వంటకంలో తేడాతో రాంబిల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో 25 మంది విద్యార్థినులు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9గంట ల సమయంలో విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులకు గురయ్యారు. పాఠశాలలో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. అదే సమయంలో సీట్ల ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు పాఠశాలకు వచ్చి న మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు కొవిరి రామకృష్ణ ఎస్వో ఉమాదేవి, ఉపాధ్యాయినుల సాయంతో వారిని రాంబిల్లి పీహెచ్‌సీకి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన తొమ్మిది మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అంతా కోలుకుంటున్నారు. ఆదివారం రాత్రి విద్యార్థినులకు అన్నంతోపాటు బెండకాయ కూర, రసం వడ్డించారు. సోమవారం ఉదయం మెనూ ప్రకారం పులిహోరకు బదులు వాముజావ పెట్టారు. రాత్రి అన్నం ఉడకలేదని, కూర, రసంలో మసాల, కారం అధికంగా వేసి వంట చేశారని విద్యార్థినులు వాపోయారు. పాఠశాలలో సక్రమంగా భోజనం తయారుచేయడం లేదని, ఎస్వో ఉమాదేవికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆర్డీవో పద్మావతి, డిప్యూటీ డీఈవో రేణుక, ఎస్ఎస్ఏ పీవో బి. నగేష్‌ల వద్ద వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను డిప్యూటీ డీఎంహెచ్‌వో పి. నాగేశ్వరరావు పరిశీలించారు. కలుషిత ఆహారం కారణమని తొలుత ప్రకటించారు. ఆహారం తయారీలో లోపమంటూ తర్వాత వివరణ ఇచ్చారు. 182 మంది విద్యార్థినులు ఆహారం తినగా వారిలో 25 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఆహారం కలుషితమైతే మొత్తం విద్యార్థినులంతా ఇబ్బందిపడేవారని రాంబిల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రేష్మ విలేకరులకు తెలిపారు. -
నగ్నంగా ఫోటోలు తీశారని ...
బరంపురం: ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుంది... బుద్దిగా చదువుకోవచ్చని భావించిన ఆ బాలికల ఆశలు పేక మేడల్లా కుప్పకూలాయి. తమను నగ్నంగా ఫోటోలు తీశారని వార్త తెలుసుకున్న వారు సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. తీవ్ర కలత చెందారు. ఇక్కడ రక్షణ లేదని భావించిన దాదాపు 60 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలి గురువారం ఇంటిముఖం పట్టారు. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా గుడియాలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక కస్తూరి బా బాలిక విద్యాలయం హాస్టల్లోని ఆరు, ఏడు తరగతి విద్యార్థినులను గతేడాది విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో స్కూల్ గుమాస్తా సదరు విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో ... వారి ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ విషయం స్కూల్ ప్రధాన ప్రిన్సిపల్‌కు తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్కూల్ గుమాస్తాకు హాస్టల్ వంటమనిషి సహకరించినట్లు విచారణలో తెలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుమస్తా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్లో మొత్తం 87 మంది విద్యార్థినుల్లో 60 మంది ఇంటికి పయనం కావడంతో ప్రస్తుతం 27 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ లో బాలికల రక్షణ కోసం మహిళా కానిస్టేబుల్ ను ప్రభుత్వ ఉన్నతాధికారులు నియమించారు. -
బ్లాక్‌లిస్టులో పెట్టేస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులను సమీక్షించారు. అదేవిధంగా అదనపు తరగతిగదులు, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల నిర్మాణ పనుల తీరునూ పరిశీలించారు. పరిగి, షాబాద్ తదితర ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమస్యలుంటే మండల తహసీల్దార్, ఎంపీడీఓలను సంప్రదించి పరిష్కరించుకోవాలని, అలాకాకుండా పనులు నిలిపివేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నందున హెచ్చరికలతో సరిపెడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మరోమారు సమీక్షిస్తానని, పురోగతి లేకుంటే ఆ కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు కాంట్రాక్టరు పేరును బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. సదరు కాంట్రాక్టరుకు ప్రభుత్వపరంగా ఎలాంటి పనులు మంజూరుకావని తేల్చి చెప్పారు. ఇటీవల మంజూరైన అదనపు తరగతి గదుల పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీఎం అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు వదిలేస్తే సరిపోదు.. సర్వశిక్షా అభియాన్ కింద చేపట్టిన కస్తూరా్భా గాంధీ బాలికల పాఠశాలల పనుల్లో తీవ్ర జాప్యం చేయడంపై కలెక్టర్ ఆగ్రహించారు. తొమ్మిది నెలల్లో చేపట్టాల్సిన పనులు ఏడాదిన్నర పూర్తయినా చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్ఎస్ఏ ఇంజినీర్లు ఈ పనులు ఎందుకు సమీక్షించడంలేదంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఇంజినీరింగ్ అధికారులు చోద్యం చూడకుండా పనులను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. నెలావారీగా లక్ష్యాలు నిర్దేశించి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. కేజీబీవీలకు ప్రహరీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ కిషన్‌రావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎస్ఈ మల్లేష్, ఈఈ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కస్తూర్బాధలు!
జోగిపేట, న్యూస్‌లైన్: ఆర్థిక, ఇతరత్రా కారణాల వల్ల చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడిబాట పట్టించేందుకు గాను ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఆశయం నీరుగారుతోంది. పాఠశాలలను ఆర్భాటంగా ప్రారంభించినా ఇందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. చిత్తశుద్ధి కొరవడడంతో లక్ష్యం మరగున పడినట్టు కన్పిస్తోంది. జోగిపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 115 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇంత మంది విద్యార్థినుల కోసం ఒకే షెడ్డు ఉంది. అందులోనే ఫర్నిచర్, విద్యార్థినుల పెట్టెలు ఉండగా అక్కడే బోధనా తరగతులు, భోజనం, నిద్రించడానికి కూడా అదే షెడ్డు దిక్కు. వంట మాత్రం పక్కనేగల చిన్న గదిలో చేస్తుంటారు. ఇలా వారు అసౌకర్యాల మధ్య చదువులను సాగిస్తున్నారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అందులో ఉండలేని పరిస్థితి. ఇక్కడ సొంత భవనం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. -
ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల మంజూరుపై చూపిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై చూపకపోవడం సరికాదని అధికారులకు హితవు పలికారు. డంపింగ్ యార్డులు లేనిచోట తహసీల్దార్లను సం ప్రదించి స్థలాలు సేకరించాలని సూచిం చారు. ఒకప్పుడు ఆదర్శ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేటలో నేడు పారి శుద్ధ్యం కొరవడిందని అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల గొట్టాలపై దోమల బెడద నివారించేందుకు నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదని వా రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా విషయాలపై వెంటనే మున్సిపల్ కమిషనర్లకు మెమోలు జారీ చేయాలని మెప్మా పీడీని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటిపై విధిగా మూడో బృందంతో విచారణ చేయించాలని సూ చించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న బాలకార్మికులను రెసిడెన్షియల్, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు, బ్రిడ్జి కోర్సులలో చేర్పించాలని సూచిం చారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను మార్చి నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు మొక్కుబడిగా సమావేశానికి హాజరైతే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ ఆమోస్, నల్లగొండ ఆర్డీఓ జహీర్, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లాఆడిట్ అధికారి సీహెచ్.వేణుగోపాల్‌రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అశ్విని, కమిషనర్లు పాల్గొన్నారు. -
‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంల ఏర్పాటుతో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బడి మానేసిన వారి ని చేర్పించి విద్యతోపాటు వృత్తివిద్యపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2009 జూన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలో ఎనిమిది విద్యార్థులు చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011-12లో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఉండగా.. 2012-13 నాటికి 20కి తగ్గింది. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాలయాన్ని రూ.38.75లక్షలతో, అదనపు గదుల నిర్మాణాన్ని రూ.31.08లక్షలు, ఎఫ్ఎఫ్ నిధులు రూ.30లక్షలతో చేపట్టారు. విద్యార్థులకు కుట్టుశిక్షణ, అల్లికలు, ఎంబ్రయిడరీ, ఆటపాటలపై శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల దుస్తులు, జామెట్రిక్ బాక్స్, బ్లాంకెట్, కార్పెట్, పళ్లెం, గ్లాసు, ప్రతి నెలా తరగతి ఆధారంగా రూ.55 నుంచి రూ.75వరకు కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తున్నారు. బడిమానేసిన వారిని పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. -
కేజీబీవీలో విషాహారం..25 మందికి అస్వస్థత
సోంపేట, న్యూస్‌లైన్ : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయలో గురువా రం రాత్రి విషాహారం తిని 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవటం కలకలం రేపింది. ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స కొనసాగిస్తుండగా మిగిలినవారిని పాఠశాలకు తిరిగి తీసుకెళ్లారు. బాధిత విద్యార్థినులు, కేజీబీవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు అల్పాహారంగా కొమ్ముశెనగలు తిన్నారు. తర్వాత రాత్రి 7 గంటల సమయంలో అన్నం, సాంబారు, మిల్మేకర్ దుంపల కూరతో భోజనం చేశారు. ముందుగా తిన్న 6,7 తరగతుల విద్యార్థినులు కూర బాగోలేదని మిగతావారికి చెప్పారు. అరగంట తర్వాత విద్యార్థినులకు వాంతులు మొదలయ్యాయి. వెంటనే పాఠశాల సిబ్బంది మొదట వాంతులు చేసుకొన్న ఐదుగురిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారికి ఆక్సిజన్ కూడా ఎక్కించారు. తర్వాత మరో 20 మంది కడుపునొప్పిగా ఉందని చెప్పటంతో వారిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 8వ తరగతి విద్యార్థినులు సౌజన్య, రాజేశ్వరి, స్వాతి, దేవి, ఆశ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. మిగతా 20 మందిని పాఠశాలకు తీసుకెళ్లారు. విషాహారం తినటం వలనే అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వైద్యుడు రమేష్‌కుమార్ విలేకరులతో చెప్పారు.కూరకు వినియోగించిన మిల్మేకర్ను డీసీఎంఎస్ వారు సరఫరా చేశారని పాఠశాల ఎస్ఓ టి.కాంతమ్మ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఎప్పట్లాగే మెనూ ప్రకారం ఆహారం వండిపెట్టామని, దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని అన్నారు. మందుగా తిన్నవారు కూర బాగోలేదని చెప్పటంతో తినటం మానేశామని 8వ తరగతి విద్యార్థిని ప్రశాంతి తెలిపింది. -
కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ధర్నాకు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వేతనాలు పెరగడం లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్ 3 విడుదల చేసినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఇస్తున్న బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చంద్రమోహన్, అధ్యక్షులు వహిదాబేగం, కార్యదర్శి లీలావతి, విజయవాణి, ఫరీదాబేగం, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.