
సాక్షి, పులివెందుల: కడప జిల్లాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుండటంపై వైఎస్ఆర్ సీపీ నేత, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి పరిశీలించారు. వెంకటేశ్వరి మృతిపై అనేక అనుమానాలున్నాయని.. వెంటనే విచారణ జరిరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థిని వెంకటేశ్వరి ఆత్మహత్య ఘటనపై సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ జి. శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఆత్మహత్య ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని కడప పీవో, సింహాద్రిపురం ఎస్ఓలను ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. ఎస్ఎస్ఏ జేడీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఓ టీమ్ కడపకు బయలుదేరినట్లు సమాచారం. కాగా, కడప జిల్లా కేంద్రంలోని మౌంట్‌ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్‌రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.