సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీటెక్ రవి హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బీటెక్ రవి రాజకీయం చేస్తుండటంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ, కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పులివెందులలో నీటి పన్ను నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. గిడ్డంగివారిపల్లిలో బీటెక్ రవి తన అనుచరులతో కలిసి నో డ్యూ సర్టిఫికెట్లను చింపివేశారు. అలాగే, ఇనగలూరులో అధికారాలను అడ్డుపెట్టుకుని నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో తన అనుచరులను అడ్డుపెట్టుకుని బీటెక్ రవి హల్ చల్ చేస్తున్నాడు.
ఇక, నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ నేతలకు నో డ్యూ సర్టిఫికెట్లు రాకుండా కూటమి నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు.. పలుచోట్ల వీఆర్వోలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపాలని లేఖలో కోరారు. అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నేతలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారుల తీరుపై ఆర్డీవో, డీఎస్పీకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment