
వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.
కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.