Zilla Parishad
-
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. -
నల్లగొండ జిల్లా పరిషత్ పాత ఆఫీస్‌లో అగ్నిప్రమాదం
-
పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. ‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ::ఎమ్మెల్యే ఆళ్ళ నాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము. ::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు. :::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం ::: ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండో మహిళగా.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్‌గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్‌గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం భారత్ రాష్ట్ర సమితి ‘భారత్ పరివర్తన్ మిషన్’గా పని చేస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మే 7 నుంచి జూన్ 7 వరకు నెల రోజుల్లో మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు వేస్తామని, జూన్‌లో 10 లక్షల నుంచి 12 లక్షల మంది రైతులతో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. నాగపూర్, ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మహారాష్ట్రను తీర్చిదిద్దుతామని, ఓట్లు వేస్తేనే ఎవరైనా సహాయం చేయగలరు అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశ సంస్కరణ లక్ష్యంతో ముందుకు.. ‘దేశంలో ఎన్నో పార్టీలు, ఎందరో రాజకీయ నాయకులు, ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలున్నా.. దేశ పరిస్థితులపై అవగాహన ఉన్నా సరైన రీతిలో స్పందించడం లేదు. మనది వింత దేశం, ప్రజలు కూడా వింతైన వారు. మనం కుట్రలో ఇరుక్కుపోవడానికి గల కారణాలను చర్చించాలి. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించలేదు. భారతదేశాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో అపూర్వ సంపద ఉన్నా నీరు, విద్యుత్తు వంటి సమస్యలను తెలంగాణ మినహా మహారాష్ట్ర సహా యావత్ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆనకట్టల ద్వారా నీటిని బంధించి, తాగునీరు, సాగు నీరు ఇవ్వడం ద్వారా రైతులు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది..’అని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎందుకు? ‘మహారాష్ట్ర పుణ్యభూమిలో గోదావరి, కృష్ణా, వెన్‌గంగ, పెన్‌గంగ, వార్ధా, మూల, ప్రవర,పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు పుడుతున్నాయి. అయినా ఔరంగాబాద్‌లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. అకోలాలోనూ ఇలాంటి పరిస్థితే ఉండాల్సిన ఆగత్యం ఎందుకు? మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. అవినీతి నేతలే దివాళా తీస్తారు.. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ ఆర్థికంగా బాగానే ఉంది. మహారాష్ట్ర కంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది? అవినీతికి పాల్పడే నాయకులే దివాళా తీస్తారు.ౖమహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం..’అని తెలిపారు. ఫడ్నవీస్ నుంచి జవాబు లేదు ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెబితే ఇప్పటివరకు ఫడ్నవీస్ నుంచి సమాధానం లేదు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు? అని ప్రజలు ప్రశ్నించుకోవాలి..’అని కేసీఆర్ అన్నారు. పెద్ద సంఖ్యలో చేరికలు బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతల్లో ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఒబీసీ వెల్ఫేర్ సంఘ్ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్ రావ్ అంగళ్వార్, వంచిత్ ఆఘాడీ ఉమెన్, చంద్రాపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మ హాన్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ.బల్బీర్ సింగ్ గురు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్ సలూజా, గడ్చిరోలి మాజీ జెడ్పీ చైర్మన్ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యులు సంజయ్ చర్దుకె, యువ స్వాభిమాన్ పార్టీ రజురా జిల్లా అధ్యక్షుడు సూరజ్ థాకరే, చంద్రాపూర్ డీసీసీ అధ్యక్షుడు దిలీప్ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్ అధ్యక్షుడు సంతోష్ కులమతే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్ బల్లార్పూర్ విభాగ్ అధ్యక్షుడు ప్రశాంత్ గడ్డల, భారత్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు శంకర్, యువ స్వాభిమాన్ పార్టీ కార్యదర్శి ఆదిత్య భాకె, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్ భాసర్ బీఆర్ఎస్లో చేరారు. చంద్రాపూర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్ ఐటీటీయూసీ అధ్యక్షుడు నర్సింగ్ రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్ ప్రధాన కార్యదర్శి రాజేషం పుల్లూరి, తేలి సమాజ్ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరమల్ ముంజమ్, శివసేన పార్టీ రాజుర పట్టణ అధ్యక్షుడు రాకేష్ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెరెన అజ్మీరా, యువ స్వాభిమాన్ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్ చన్నే, చంద్రాపూర్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వ్యవస్థాపకుడు అభిలాష్ సింగ్‌తో పాటు మరో నలభై మందికి పైగా నేతలు కూడా బీఆర్ఎస్లో చేరారు. -
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విజయ గీతిక.. ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్సీపీనే వరించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది. జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌గానే కొనసాగించారు. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ దివస్ అయిన గత ఏప్రిల్ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్ తృతీయ స్థానంలో నిలిచింది. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్‌లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాకారమైంది. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్‌ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి, సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. అందరి సమన్వయంతో ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్ చేశాం. జిల్లాపరిషత్ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా -
నాలుగు బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: నాలుగు బిల్లులకు శుక్రవారం శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లాల ప్రకారమే పాత జిల్లా పరిషత్‌లు కొనసాగేందుకు వీలుగా ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఆర్డీసీలో ఇకపై 16 మంది సభ్యులు ఉండేలా ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు, ఏపీ సివిల్ సర్వీసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్ బిల్లు) చట్ట సవరణ బిల్లుకు, సవరించిన మార్కెట్ సెస్ నుంచి కొంత మొత్తాన్ని కేంద్ర మార్కెట్ నిధికి జమ చేయడానికి ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ మార్కెట్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా, శుక్రవారం ఆమోదించాయి. మరో నాలుగు బిల్లులు.. ఒక తీర్మానం శాసనసభలో శుక్రవారం మరో నాలుగు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. ఇండియన్ స్టాంప్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, ఏపీ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ చట్ట సవరణ బిల్లును మంత్రి ధర్మాన సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రైల్వే ప్రయాణికుల కమిటీలో శాసనసభ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని కోరుతూ సభ తీర్మానించింది. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
MLA Jogarao: ‘మార్గం’ చూపిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో వంతరాం నుంచి కొత్త వంతరాం వరకు రూ.20లక్షలతో రోడ్డు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొత్తవంతరాం గ్రామస్తులకు సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుండడంతో ఎమ్మెల్యే జోగారావుకు కొద్దికాలం క్రితం గ్రామస్తులు విన్నవించుకున్నారు. వంతరాం నుంచి కొత్తవంతరాం వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇదే దీనికి స్పందించిన ఎమ్మెల్యే జోగారావు జిల్లా పరిషత్ నిధులు రూ.20లక్షలు మంజూరుచేయించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు చేపట్టి నిర్మాణం పూర్తయితే తమ అవస్థలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
పాత జెడ్పీ చైర్మన్లే.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్లో పేర్కొంది. 2026 సెప్టెంబరు వరకు.. గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీ కాలం 2026 సెప్టెంబరు 24 వరకు ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌ల పాలన కొనసాగనుంది. పాత జిల్లాల ప్రాతిపదికనే జెడ్పీ సీఈవో కార్యాలయాలు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో జెడ్పీ కార్యాలయాలు ప్రత్యేకంగా ఉండవు. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు న్యాయ వివాదాలు తలెత్తకుండా జిల్లా పరిషత్తులపై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలోనూ.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తెలంగాణలో 2016లో దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో 2014లో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో పూర్తి పదవీకాలం ముగిసే వరకు కొనసాగారు. 2019లో జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు మాత్రమే 33 జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను విభజించి ఎన్నికలు నిర్వహించారు. ఇది చదవండి: ఏపీలో కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
606 మండలాల్లో వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 623 మండలాల్లో మంగళవారం రెండో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 606 మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏడు మండలాల్లో తెలుగుదేశం, మూడుచోట్ల జనసేన, ఒక చోట సీపీఎం ఆ పదవుల్ని దక్కించుకున్నాయి. ఆరు మండలాల్లో ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందారు. 2 జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 623 మండలాల్లో మంగళవారం ఎన్నికలు ముగిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నిక పూర్తవగా, మిగిలిన 11 జిల్లాల్లో 26 మండలాల్లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ మండలాల్లో బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులకు మండల ప్రిసైడింగ్ అధికారులు సమాచారం ఇచి్చనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా పాపిరెడ్డి మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో పలుచోట్ల ఖాళీగా ఉన్న జెడ్పీ చైర్మన్, మండల అధ్యక్ష (ఎంపీపీ), ఒకటో ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన యర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► విశాఖ జిల్లా మాకవరపాలెం, చిత్తూరు జిల్లా గుర్రంకొండ, రామకుప్పం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రామకుప్పం మండలంలో ఎన్నిక వాయిదా పడింది. మాకవరపాలెం, గుర్రంకొండ మండలాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ గెల్చుకుంది. రామకుప్పం మండలంలో బుధవారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ► వైఎస్సార్ జిల్లా గాలివీడు, సిద్ధవటం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలాల్లో మొదటి ఉపాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెల్చుకున్నారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో రెండు ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
విషాదం: జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా పరిషత్‌లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా గుర్తింపు పొందారు. అంబటి అనిల్.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు. అనిల్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అనిల్ సొంతూరు సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పీ వైస్ చైర్మన్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనిల్ మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..! -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. -
ఏపీ: జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్ సభ్యుల పదవులకూ శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదీ సామాజిక న్యాయమంటే.. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే.. ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. ►కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. ►ఇలా జనరల్, జనరల్ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. ►మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు. ►అంతేకాక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి.. వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్దపీట వేశారు. ►ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. ‘జనరల్’లో బీసీలకు అవకాశం ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు రిజర్వు చేస్తే.. బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. -
రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల జెడ్పీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఓటర్లందరూ సమర్థించారు. మాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచారు. ఈ పదవుల వలన మరింత బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడి పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థులు వందకి వంద శాతం గెలుపొందారు. అందరికీ పార్టీ తరపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నా. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన మజ్జి శ్రీనివాస్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నాం. గెలిపించిన ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ప్రజల కోసం పాలన చేపడతాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. టీడీపీ ఒకవైపు పోటీ చేసి మరోవైపు ఎన్నికకు దూరంగా ఉన్నాం అంటూ కుంటి సాకులు చెప్పింది. రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందిని మంత్రి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు: జెడ్పీ చైర్మన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పరిపాలన, సంక్షేమం వలనే ప్రజా విజయం సాధించాం. ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడతా. సీఎంకు పేరు, గౌరవం తెచ్చే విధంగా బాధ్యతలను నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా. పదవి ఉన్నా.. లేకున్నా ఒకేలా ఉంటా అని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్‌రావు అన్నారు. చదవండి: (ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే: బొత్స) -
Andhra Pradesh: జెడ్పీ వైస్ ఛైర్మన్లు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైఎస్సార్సీపీనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారిగా జెడ్పీ వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారు.... తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ), బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం), దిల్షాద్ నాయక్, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (వైఎస్సార్), అంబటి అనిల్‌కుమార్, బాపూజీ నాయుడు(విజయనగరం). చదవండి: AP ZPTC Chairman Election: 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లగా ఎంపికైన వారు -
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
ఏపీ: నేడు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. -
మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్‌రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా కొంత కాలం పని చేశాను. రాజకీయరంగ ప్రవేశం ఇలా.. మా తండ్రి జితేందర్‌రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్‌గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను. భర్త, మామ ప్రోత్సాహంతో.. పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్తో వివాహం జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్‌దేవ్‌సింగ్ కూడా ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను. మహిళలకు అండగా.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను. -
Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్ టాపిక్ అయింది. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి రాకముందే.. అడ్వకేట్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని, హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్లోనూ అందుబాటులో లేరు. గన్మెన్లు మధు వెంటే ఉన్నారా..? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అదృశ్యం అయిన పుట్ట మధు వెంట రక్షణ కోసం నలుగురు గన్మెన్లు ఉంటారు. మంథని నుంచి గన్మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ధ్రువీకరించలేదు. ‘జెడ్పీ చైర్మన్ మధు వెంటే గన్మెన్లు ఉన్నారు. మధు అదృశ్యమైనట్లు గన్మెన్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు రాలేదు’ అని ‘సాక్షి’కి తెలిపారు. గన్మెన్ల ఫోన్లు పనిచేస్తున్నాయని మాత్రం చెప్పిన సీపీ మధు ఎక్కడున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ‘ప్రజాప్రతినిధులు పనుల మీద దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. వారితోపాటు వారి రక్షణ కోసం గన్మెన్లు కూడా వెళతారు. ఆ వివరాలేవీ గన్మెన్లు మాకు రిపోర్టు చేయరు’ అని సీపీ సత్యనారాయణ వివరించారు. హంతకులను అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో చెప్పిన సీఎం వామన్‌రావు దంపతుల హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని, తమ పార్టీ వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కేసులో దోషులను కూడా అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ హత్యకేసులో నిందితుడు కావడంతో మంథనిలో పుకార్లు ఆగలేదు. తాజాగా వామన్‌రావు హత్యకు రూ.2 కోట్ల సుపారీ అందించారని, ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిద్దరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. నిందితుల్లో ఒకరు అప్రూవల్‌గా మారారని.. చాలా విషయాలు వెల్లడించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మధు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఒకట్రెండు రోజుల్లో ఫోన్ ఆన్ అవుతుందన్న ముఖ్య నేత పుట్ట మధు ఎక్కడికీ పోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ అవడం వ్యక్తిగతమని చెప్పిన ఆయన.. ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారని అన్నారు. అయితే.. మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు చర్చ జరుగుతుండగా.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటలతో తనకేమీ సంబంధం లేదనే విషయాన్ని హైకమాండ్‌కు చెప్పాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఎమ్మెల్యే పదవిపై తొలగని ఉత్కంఠ Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం -
కార్పొరేషన్ల చైర్మన్లకు జెడ్పీల్లో ఎక్స్అఫిషియో సభ్యత్వం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లలో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించనుంది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సాధారణంగా.. జిల్లా పరిషత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతుంటారు. అలాగే, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తమతమ వర్గాల సమస్యలను జెడ్పీ సమావేశాల్లో ప్రస్తావించేందుకు వీలుగా వారికీ ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతమున్న 61 కార్పొరేషన్ల చైర్మన్లు తాము కోరుకున్న జిల్లాలో ఎక్స్అఫిషియో సభ్యునిగా హోదా పొందే వీలు కలుగుతుంది. ఓటు హక్కు మాత్రం ఉండదు ఇదిలా ఉంటే.. జెడ్పీలో ఇప్పటికే ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జెడ్పీ చైర్మన్ ఎంపిక తదితర అంశాల్లో ఓటు హక్కు లేదు. అలాగే, కార్పొరేషన్ చైర్మన్లకూ ఇది వర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. కానీ, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే స్టాండింగ్ కమిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా కూడా నియమితులయ్యే వీలుంటుందని వారు వివరించారు. -
భూ వివాదం: ఎస్ఐపై జెడ్పీటీసీ ఫిర్యాదు
సాక్షి, మునుగోడు/రామగిరి(నల్లగొండ): మునుగోడు ఎస్ఐ మండలంలోని భూ వివాదాలతో పాటు ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపిస్తూ స్థానిక జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణిరవి ఆదివారం ట్విట్టర్లో డీజీపీతో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. భూవివాదాల్లో అనేక మందిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఒకే వర్గం వ్యక్తులకు పూ ర్తి మద్దతు పలుకుతూ బాధితులను రోజుల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆరో పించారు. ఎస్ఐ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అధి కారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని కోరారు. స్పందించిన జిల్లా ఎస్పీ రంగనాథ్ త్వరలో విచారణ జరిపిస్తానని మెసేజ్ ద్వారా హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ తెలిపారు. అదృశ్యమైన మహిళ మృతి మిర్యాలగూడ: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెందిన కామెల్లి సుధీర్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన అనూష(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. కొంత కాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో రెండు రోజుల క్రితం అనూష ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సుధీర్‌కుమార్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బోటిక్పార్క్ పెద్ద చెరువు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం అనూషదిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి అనూష తల్లికి సమచారం అందించారు. మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, క్షణికావేశంలో కుటుంబ కలహాలతోనే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి
సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి) గ్రామం రాజన్న స్వస్థలం. ఈయన గతంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌రూరల్ జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. పలువురు నాయకులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. సోమవారం చాందా(టి)లో అంత్యక్రియలు నిర్వహించగా.. అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పీ సీఈవో కిషన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఆదిలాబాద్ ఎంపీపీ సెవ్వ లక్ష్మీ, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్ నుంచి జెడ్పీ వైస్ చైర్మన్ వరకు.. ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన రాజన్న రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిçష్కరించేలా చొరవ చూపేవారని పలువురు పేర్కొన్నారు.