జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
జెడ్పీ స్థాయీ సంఘాల కూర్పులో చైర్‌పర్సన్ సునీతారెడ్డి సమర్థులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. జెడ్పీలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ బలం ఉన్నందున స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. దీంతో ఏయే కమిటీలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంలో చైర్‌పర్సన్ నిర్ణయమే కీలకం కానుంది. నిబంధనల మేరకు అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలతో స్థాయీసంఘాల కూర్పును పూర్తిచేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండింగ్ కమిటీలో సభ్యుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది
సాక్షి, వికారాబాద్: జిల్లా పరిషత్ పాలనలో స్థాయీ సంఘాలది కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న స్థాయీ సంఘాల కమిటీలను ఈనెల 27న ఏర్పాటు చేయనున్నారు. దీంతో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల దృష్టి ఈ కమిటీల ఏర్పాటుపై పడింది. విమర్శలకు తావివ్వకుండా అన్ని వర్గాల జెడ్పీటీసీలకు న్యాయం జరిగేలా చైర్‌పర్సన్ సునీతారెడ్డి స్థాయీ సంఘాల కూర్పు ఎలా చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు సునీతారెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో స్థాయీ సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. జెడ్పీలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నందున స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యుల కూర్పు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేలతో సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్త్రీశిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా తన తల్లి ప్రమోదినిదేవికి స్థానం కల్పించే దిశగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌గా తన సతీమణికి చాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరుతున్నట్లు సమాచారం.
ఏడు కమిటీలు..
జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలు (స్టాండింగ్ కమిటీలు) ఉంటాయి. 1994 పంచా యతీరాజ్ యాక్టును అనుసరించి స్థాయీ సం ఘాలను ఏర్పాటు చేస్తారు. జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన ప్రణాళిక, ఆర్థిక కమిటీ, గ్రామీణాభి వృద్ధి, విద్య ఆరోగ్యం, నిర్మాణం పనులు కమి టీలు పనిచేస్తాయి. జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవసాయ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్త్రీశిశు సంక్షే మ కమిటీ చైర్‌పర్సన్‌గా మహిళా జెడ్పీటీసీని ఎన్నుకుంటారు. అలాగే సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆ సామాజికవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. జెడ్పీలో మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు.
చైర్‌పర్సన్ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య శాశ్వత సభ్యులు. అలాగే 17 మండలాల జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్సన్ సభ్యులుగా ఉన్నారు. దీంతో జెడ్పీలో మొత్తం సభ్యుల సంఖ్య 28 చేరుకుంది. ఈలెక్క ఒక్కో కమిటీలో చైర్‌పర్సన్ కాకుండా నలుగురు సభ్యు లు ఉంటారు. ఏడు కమిటీలకుగాను ఒక్కో కమిటీకి నలుగురు సభ్యులను ఎన్నుకోవా ల్సి ఉంటుంది. జెడ్పీ స్థాయీ సంఘాల సభ్యులను ఎన్నుకుంటారు. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సభ్యులు ఉన్నందున ఎన్నిక ఎకగ్రీవం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment