టార్గెట్ జెడ్పీ! | Zilla Parishad elections seat reserved to general finalized | Sakshi
Sakshi News home page

టార్గెట్ జెడ్పీ!

Published Mon, Mar 17 2014 11:37 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Zilla Parishad elections seat reserved to general finalized

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  జిల్లా పరిషత్ పోరు రసవత్తరంగా మారనుంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జెడ్పీ జనరల్‌కు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ఈ సీటుపై గురి పెట్టాయి. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న ఎన్నికలను కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ‘త్రిముఖ’ పోటీకి తెరలేచిన ప్రాదేశిక పోరులో పైచేయి సాధించడానికి మూడు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 1985 నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్‌లో ఆధిపత్యం కొనసాగించిన ‘దేశం’ ఈసారి కూడా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

 అసమ్మతి రాజకీయాలతో రెండుసార్లు జెడ్పీ పీఠాన్ని త్రుటిలో కోల్పోయిన  కాంగ్రెస్ ఈసారైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పాటుతో మంచి ఊపు మీదున్న టీఆర్‌ఎస్ కూడా ప్రాదేశిక ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారాలని అనుకుంటోంది. జెడ్పీ పీఠంపై కన్నేసిన  మూడు పార్టీలు, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక, అండ బలం ఉన్న నేతలను ఎంపిక చేయడంలో తలమునకలైన పార్టీలు.. ఎన్నికల అనంతరం అవసరమైతే జెడ్పీటీసీలతో ‘క్యాంపు’ల నిర్వహణకు కూడా సిద్ధంగా ఉండేవారికోసం వెతుకులాడుతున్నాయి. రిజర్వేషన్ ‘జనరల్’ కావడంతోనే రంగంలోకి దిగిన పలువురు ఆశావహులు జిల్లా పరిషత్ చైర్మన్‌కు తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని అధిష్టానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కోరుకున్న మండలాలు రిజర్వేషన్ అచ్చిరాకున్నా... జనరల్‌గా ఖరారైనా మారుమూల మండలాల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

 కాంగ్రెస్‌లో పోటీ తీవ్రం!
 జిల్లా పాలనలో కీలకభూమిక పోషించే వీలున్న జెడ్పీపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి గురి పెట్టారు. నవాబ్‌పేట మండలానికి చెందిన యాదవరెడ్డి అక్కడి నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టడం ద్వారా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ పదవి కట్టబెట్టడంపై మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్‌తోనూ హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా యాదవరెడ్డికి పేరుంది. దీంతో జైపాల్ ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నట్లుగానే భావించవచ్చు.

 మరోవైపు సరూర్‌నగర్ జెడ్పీటీసీగా పోటీకి హయత్‌నగర్ మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సబిత కూడా రాంరెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. జిల్లా పరిషత్ రేసులో మల్‌రెడ్డి కూడా ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిరువురేకాకుండా పలువురు మాజీ జెడ్పీటీసీలు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

 తూర్పుపైనే ‘దేశం’ ఆశలు
 జిల్లా పరిషత్‌ను మూడు దశాబ్ధాలుగా తమ ఆధీనంలో ఉంచుకున్న ‘టీడీపీ’ ఈ సారి కూడా పట్టు నిలుపునేందుకు వ్యూహరచన చేస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేల నిష్ర్కమణతో జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో జెడ్పీని నిలబెట్టుకోవడం ‘దేశం’కు అగ్నిపరీక్షే. ఈ క్రమంలో జిల్లా పరిషత్‌లో పాగా వేసేందుకు అనువైన మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు.. తూర్పు మండలాలను నమ్ముకుంది. శివారు మండలాల్లో పార్టీ బలీయంగా ఉండడంతో సాధ్యమైనంతవరకు ఎక్కువ సీట్లను సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సైతం ఈ మండలాల జెడ్పీటీసీల పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్‌రెడ్డిని ఘట్‌కేసర్ నుంచి రంగంలోకి దించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే సరూర్‌నగర్ నుంచి జిల్లెల నరేందర్‌రెడ్డికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆర్థికంగా వీరిరువురు బలంగా ఉండడంతో సంఖ్య తగ్గినా.. ఎన్నికల అనంతరం శిబిరాల నిర్వహణకు సమాయత్తంగా ఉండేలా దిశానిర్దేశం చేస్తోంది.

 ‘కీ’ కోసం టీఆర్‌ఎస్..
 ఇప్పుడిప్పుడే బలోపేతమవుతున్న టీఆర్‌ఎస్.. జిల్లా పరిషత్‌లో మెరుగైన ఫలితాలను సాధించే దిశగా వ్యూహం రూపొందిస్తోంది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన మండలాలు దక్కడం అసాధ్యమేనని భావిస్తున్న గులాబీ నాయకత్వం.. చైర్మన్ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారాలని భావిస్తోంది.

 ఈ క్రమంలో పరిగి, తాండూరు, చేవెళ్ల మండలాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తమ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకోవాలని ఇటీవల టీడీపీని వీడి టీఆర్‌ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గాల్లో ‘కారు’ స్పీడును పెంచేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడి వ్యవహరించిన కొంపల్లి అనంతరెడ్డిని నవాబ్‌పేట నుంచి బరిలోకి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం భావిస్తుండగా, తాండూరు సీటును ఆశిస్తున్న పైల ట్ రోహిత్‌రెడ్డిని పోటీచేయించాలని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వ ర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement