Standing Committees
-
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు ఎంపీలకు చోటు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కమిటీలకు సంబంధించిన వివరాలను బులిటెన్‌లో విడుదల చేసింది. కాగా, పలు కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ చోటు కల్పించారు. - ఇక, తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజ్యసభ సభ్యులకు చోటుదక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో విజయ సాయి రెడ్డి(వైఎస్సార్సీపీ), కే. కేశవరావు (టీఆర్ఎస్)లకు చోటు కల్పించారు. - కమిటీ ఆన్ రూల్స్‌లో డాక్టర్ కె. లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్‌లో జీవీఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు అవకాశం దక్కింది. - హౌజ్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రమేశ్(బీజేపీ)నియామకం, సభ్యుడిగా బి. లింగయ్య టీఆర్ఎస్)లు చోటు దక్కించుకున్నారు. ఇక.. కమిటీ రూల్స్, కమిటీ ప్రివిలేజెస్, బిజినెస్ అడ్వైజరీ కమిటీలకు చైర్మన్‌గా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొనసాగనున్నారు. -
పంచాయతీ పటిష్టం!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీల బాధ్యతలు 1.జనరల్ స్టాండింగ్ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్ కమిటీ : గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 3.ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 4. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ : అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 5.సోషల్ జస్టిస్ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
సాక్షి, నారాయణపేట: గ్రామాల్లోని టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడు నెలులు కావస్తుండగా సర్పంచ్, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఇప్పటికే కొలువుదీరారు. పరిపాలనా సౌలభ్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి జవాబుదారీతనం పెంచడానికి అదనంగా త్వరలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మళ్లీ పంచాయతీల్లో కొత్త పదవుల పండుగ వచ్చినట్లయింది. పంచాయతీ బరిలో నిలిచి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కోఆప్షన్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,684 పంచాయితీల్లో నియామకం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 మండలాల పరిధిలోని 1,684 గ్రామ పంచాయతీల్లో త్వరలో కోఆప్షన్ సభ్యుల నియామకం జరగనుంది. గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యవేక్షణ పెరిగి నిధుల సద్వినియోగం చేసుకోవడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు మున్సిపాలిటీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్ తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాలను నియమించింది. కొత్త చట్టం ప్రకారం గ్రామ కోఆప్షన్ సభ్యులను నియమించాలని అన్ని పంచాయతీలకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు సైతం పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన కాపీలను అధికారులు అందజేశారు. కో అప్షన్సభ్యుల ఎంపిక ఇలా సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులుంటారు. కొత్త చట్టంలోని 7(3) ప్రకారం గ్రామాభివృద్ధి విషయంలో శ్రద్ధ కలిగిన విశ్రాంత ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్ మొదటి కోఆప్షన్ సభ్యుడిగా, గ్రామంలోని వివిధ సంఘాల అధ్యక్షుల్లో ఒకరిని రెండో కో ఆప్షన్ సభ్యుడిగా, గ్రామాభివృద్ధికి విరాళమిచ్చే దాతల్లో ఒకరిని మూడో కో ఆప్షన్ సభ్యుడిగా గ్రామ పంచాయతీ నియమిస్తుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి సలహాలు, సూచనలు కో ఆప్షన్ సభ్యులు ఇవ్వొచ్చు. మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వీరికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను 5,052 మంది కో ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ శ్రేణులో చిగురించిన ఆశలు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులతో పాటు స్థాయీ సంఘాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు మొదలు పెడుతుండడంతో గ్రామాల్లోని టీఆర్ఎస్ నాయకుల్లో పదవుల సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80 శాతం సర్పంచులను టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఆయా గ్రామాల్లో వార్డుసభ్యులుగా పోటీచేసి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కో ఆప్షన్‌సభ్యులుగా పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. స్థాయీ సంఘం కమిటీల నియామకం గ్రామాల్లో నాలుగు స్థాయి సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పారిశుద్ధ్యం నిర్వహణ కమిటీ, రెండోది వీధి దీపాల నిర్వాహణ కమిటీ, మూడోది మొక్కల పెంపకం, నా లుగోది సంతల నిర్వాహణ, పనుల నిర్వాహణ కోసం కమిటీలను వేయనున్నారు. వీటిలో ఒ క్కో సంఘంలో పది మందికి తక్కువ కాకుండా నియమించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క కమిటీకి పది అనుకున్నా 67,360 మందికి అవకాశాలు కల్పించనున్నారు. పది మంది కంటే ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. గైడ్లేన్స్ వచ్చిన తర్వాతే.. గ్రామ పంచాయతీలో నూతన చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను వేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గైడ్లేన్స్ రావాల్సి ఉంది. ఈ నెల 3 తర్వాత పూర్తిస్థాయిలో చేసేందుకు అవకాశం ఉంది. – మురళి, డీపీఓ, నారాయణపేట జిల్లా -
స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం
సాక్షి, భూపాలపల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని సమస్యలను ఆ శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జిల్లా పరిషత్‌కు స్థాయి సంఘాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అటువంటి స్థాయీసంఘాలకు నేడు సభ్యుల ఎన్నిక జరగబోతోంది. దీని కోసం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు సమావేశం కాబోతున్నారు. దీంతో అన్ని మండలాల జెడ్పీటీసీలతో సహా, కోఆప్షన్ మెంబర్లు, జిల్లాతో సంబంధం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం వారం క్రితమే ప్రతీ జెడ్పీటీసీ సభ్యుడికి అధికారులు తెలియజేశారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్‌తో కలిపి మొత్తం 11 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లతో పాటు జిల్లాకు సంబంధం ఉన్న ములుగు, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీల కూర్పు జిల్లా పరిషత్ పాలనలో కీలకమైనవి స్థాయిసంఘాలు. ప్రతీ జిల్లా పరిషత్‌లో 7 సాయీ సంఘాలు ఉంటాయి. ఇందులో 1. ఆర్థికం ప్రణాళిక , 2. పనుల స్టాండింగ్ కమిటీ, 3. గ్రామీణాభివృద్ధి , 4. విద్యా వైద్యం ఈ నాలుగు స్థాయిసంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరి స్తారు. 5. వ్యవసాయ స్టాండింగ్ కమిటీకి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తా రు. 6. మహిళా స్త్రీ శిశు సంక్షేమ కమిటీకి, 7. సాంఘిక సంక్షేమ స్థాయిసంఘానికి మహిళా జెడ్పీటీసీలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ మహిళలే కావడంతో జిల్లాలోని ప్రతీ స్థాయీ సంఘానికి మహిళలే అ«ధ్యక్షురాలిగా ఉండనున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్య కమిటీలకు డిమాండ్ జిల్లా పరిషత్‌లో ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నా రెండింటికి మాత్రమే ఫుల్ డిమాండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, విద్యావైద్యానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉండేందుకే జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈరెండింటాì ఎక్కువగా సమీక్షించే అవకాశం ఉండటం కూడా డిమాండ్‌కు కారణంగా ఉంది. స్థాయీ సంఘాల ఎన్నికకు సంబధించిన నియమాలు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యుడు ఒకటి కంటే ఎ క్కువ సంఘాల్లో సభ్యుడిగా ఉండరాదు. ఏ స్థాయి సంఘం కొరకు ఎన్నిక జరుగుతుందో, ఆ స్థాయీ సంఘం పేరును, ఖాళీల సంఖ్యను ప్రకటిస్తారు. ఎన్నిక కోసం నిలబడే ప్రతి అభ్యర్థిని ఒక జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదించాలి, మరోకరు బలపరచాలి. సరైన క్రమంలో ప్రతిపాదించబడిన జెడ్పీటీసీ సభ్యుల పేర్లను ఈ సమావేశంలో చదువుతారు. ఎన్నిక జరిగేలోపు అభ్యర్థి ఏ దశలోనైన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చ. ప్రతిపాదించిన అభ్యర్థుల సంఖ్య కమిటీల్లోని స్థానాల కన్నా ఎక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక వేళ అభ్యర్థుల సంఖ్య, స్థాయి సంఘాల్లో ఉండాల్సినసభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటే నిబంధనలకు లోబడి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికైనట్లు ప్రకటించవచ్చు. ఏదేని కారణం వల్ల స్థాయీ సంఘం ఎన్నిక జరగకపోతే తరువాత ఎన్నిక ఉంటుంది. ఉన్న సభ్యులతోనే సర్దుబాటు మొత్తం జెడ్పీ చైర్మన్‌తో సహా 19 మంది సభ్యులు 7 సాయీ సంఘాల్లో సభ్యులుగా ఉండనున్నారు. హోదారీత్యా జెడ్పీచైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో సభ్యురాలిగా ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ సంఘాల్లో సభ్యులుగా ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పాలకపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదో ఒక కమిటీలో చోటు దక్కనుంది. సభ్యులు తక్కువగా ఉండటంతో జెడ్పీచైర్మన్‌తో కలిపి కొన్ని స్థాయిసంఘాల్లో నలుగురు, కొన్నింటిలో ముగ్గురు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే 7 కమిటీల్లో నాలుగు కమిటీల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు మొత్తంగా నలుగురు సభ్యులు ఉంటే, మూడు స్థాయీ సంఘాల్లో జెడ్పీ చైర్మన్, మరో ఇద్దరు సభ్యులు మొత్తంగా ముగ్గురు సభ్యులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వారు కాగా, నలుగురు కాంగ్రెస్, ఒక్కరు ఏఐఎఫ్బీ నుంచి ఉన్నారు. -
సమర్థులకు పెద్దపీట?
జెడ్పీ స్థాయీ సంఘాల కూర్పులో చైర్పర్సన్ సునీతారెడ్డి సమర్థులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. జెడ్పీలో టీఆర్ఎస్కు మెజార్టీ బలం ఉన్నందున స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. దీంతో ఏయే కమిటీలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంలో చైర్పర్సన్ నిర్ణయమే కీలకం కానుంది. నిబంధనల మేరకు అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలతో స్థాయీసంఘాల కూర్పును పూర్తిచేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండింగ్ కమిటీలో సభ్యుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది సాక్షి, వికారాబాద్: జిల్లా పరిషత్ పాలనలో స్థాయీ సంఘాలది కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న స్థాయీ సంఘాల కమిటీలను ఈనెల 27న ఏర్పాటు చేయనున్నారు. దీంతో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల దృష్టి ఈ కమిటీల ఏర్పాటుపై పడింది. విమర్శలకు తావివ్వకుండా అన్ని వర్గాల జెడ్పీటీసీలకు న్యాయం జరిగేలా చైర్పర్సన్ సునీతారెడ్డి స్థాయీ సంఘాల కూర్పు ఎలా చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు సునీతారెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో స్థాయీ సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. జెడ్పీలో టీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నందున స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. చైర్పర్సన్ సునీతారెడ్డి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యుల కూర్పు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేలతో సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్త్రీశిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా తన తల్లి ప్రమోదినిదేవికి స్థానం కల్పించే దిశగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌గా తన సతీమణికి చాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏడు కమిటీలు.. జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలు (స్టాండింగ్ కమిటీలు) ఉంటాయి. 1994 పంచా యతీరాజ్ యాక్టును అనుసరించి స్థాయీ సం ఘాలను ఏర్పాటు చేస్తారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన ప్రణాళిక, ఆర్థిక కమిటీ, గ్రామీణాభి వృద్ధి, విద్య ఆరోగ్యం, నిర్మాణం పనులు కమి టీలు పనిచేస్తాయి. జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవసాయ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్త్రీశిశు సంక్షే మ కమిటీ చైర్‌పర్సన్‌గా మహిళా జెడ్పీటీసీని ఎన్నుకుంటారు. అలాగే సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆ సామాజికవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. జెడ్పీలో మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. చైర్పర్సన్ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య శాశ్వత సభ్యులు. అలాగే 17 మండలాల జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్సన్ సభ్యులుగా ఉన్నారు. దీంతో జెడ్పీలో మొత్తం సభ్యుల సంఖ్య 28 చేరుకుంది. ఈలెక్క ఒక్కో కమిటీలో చైర్పర్సన్ కాకుండా నలుగురు సభ్యు లు ఉంటారు. ఏడు కమిటీలకుగాను ఒక్కో కమిటీకి నలుగురు సభ్యులను ఎన్నుకోవా ల్సి ఉంటుంది. జెడ్పీ స్థాయీ సంఘాల సభ్యులను ఎన్నుకుంటారు. టీఆర్ఎస్కు మెజార్టీ సభ్యులు ఉన్నందున ఎన్నిక ఎకగ్రీవం కానుంది. -
స్టాండింగ్ కమిటీకి గ్రీన్‌సిగ్నల్
రెండేళ్లకు మోక్షం కార్పొరేషన్లలో ఎన్నికల సందడి కరీంనగర్ కార్పొరేషన్ : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న స్టాండింగ్ కమిటీల ఎన్నికకు ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోగా కమిటీలు ఏర్పాటు చేయూలని అధికారులను ఆదేశించింది. ఈమేరకు జీవో నంబర్ 88 ద్వారా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో మరోమారు ఎన్నికల సందడి మొదలుకానుంది. ఇన్నాళ్లు పెండింగ్ అప్రూవల్స్‌తో నత్తనడకన నడిచిన అభివృద్ధి పనులు ఇక నుంచి పరుగెత్తనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక సంస్థల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఇన్నాళ్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేక, పెండింగ్ అప్రూవల్స్తోనే పాలకవర్గాలు కాలం వెళ్లదీస్తున్నారుు. కొన్నిసార్లు కౌన్సిల్ ఆమోదానికి ఆరునెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు. గతంలో స్టాండింగ్ కమిటీలు ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి సమావేశమయ్యే వీలుండేది. కానీ రెండేళ్లుగా స్టాండింగ్ కమిటీలు లేకపోవడంతో ఎజెండాలో వందల సంఖ్యలో అంశాలు చేర్చాల్సి వస్తుంది. దీంతో కౌన్సిల్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరిగిన సందర్భాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీల నియామకానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పాలకవర్గాలు ఎదురుచూస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో ప్రతి 10 డివిజన్లకు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. కార్పొరేటర్లుగా గెలుపొందిన సభ్యుల నుం చే నియమిస్తారు. వార్డులు, డివిజన్ల లెక్కన కాకుండా మున్సిపాలిటీని యూనిట్‌గా తీసుకుని నియమిస్తారు. ఏ డివిజన్ నుంచైనా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశముంటుంది. వరుస 10 డివిజన్ల నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి పనులకు ఆటంకాలుండవు ప్రస్తుతం ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా పెండింగ్ అప్రూవల్‌గా తీసుకుని టెండర్లు నిర్వహిస్తున్నారు. తర్వాత కౌన్సిల్ సమావేశంలో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి బిల్లుల చెల్లింపులు కూడా పూర్తయి అప్రూవల్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కౌన్సిల్ చర్చకు వచ్చినా నిష్ర్పయోజనమే అవుతుంది. బిల్లులు చెల్లించాక ఈ అంశాలపై చర్చించే అవకాశమే ఉండదు. అదే స్టాండింగ్ కమిటీ ఉంటే ప్రతి 10 అంశాలకు ఒకసారి సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసర సమావేశం ద్వారా తీర్మానించుకోవచ్చు. స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వం స్టాండింగ్ కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల్లో జాప్యం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.