మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా మండల, జిల్లా ప్రాదేశిక స్థానాల ఖరారు ప్రక్రియను ప్రారంభించింది. జూలై 4, 5 తేదీలతో ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్నందున ఆ లోపు కొత్త జిల్లాల ప్రాతిపదికన వీటికి ఎన్నికలు నిర్వ హించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 25వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 2016లో జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించింది. రంగారెడ్డికి అదనం గా మేడ్చల్, వికారాబాద్‌ను నూతనంగా ఏర్పాటు చేసింది. అయితే, అప్పట్లో పంచాయతీరాజ్ విభాగాన్ని పునర్విభజన నుంచి మినహాయించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జిల్లాపరిషత్ కొనసాగుతోంది. మరికొన్ని నెలల్లో జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానున్నందున కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీలను కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల డీలిమిటేషన్‌కు ముందు మన జిల్లాపరిషత్ పరిధిలో 33 మండల పరిషత్‌లు ఉండగా.. పునర్విభజన అనంతరం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.
ప్రస్తుతం కేవలం 21 మండల పరిషత్‌లే ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉన్నా.. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు ఆర్బన్ మండలాలు. ఇవి పంచాయతీరాజ్ నుంచి డీనోటిఫై అయ్యి.. పురపాలన పరిధిలోకి చేరాయి. గండిపేట మండలంలోని పంచాయతీలను కూడా పురపాలనలో విలీనం చేసినప్పటికీ, ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి యథాతథ పరిస్థితి కొనసాగుతోంది. ఈ మండలాలను మినహాయిస్తే గ్రామీణ మండలాలకు కొత్తగా ఎంపీపీ, జెడ్పీటీసీలు రానున్నారు.
రాక..పోక
జిల్లాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడ్డ వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు మండలాలు విలీనమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి పరిగి, కుల్కచర్ల, దోమ, పూడూరు, నవాబ్‌పేట, వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలు చేరాయి. గండీడ్ మండలం మహబూబ్‌నగర్‌లో విలీనమైంది.
ఇక మేడ్చల్ జిల్లాలో ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కలిశాయి. కాగా, మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాలు వికారాబాద్‌లోకి వచ్చాయి. ఇక మేడ్చల్‌లో మాత్రం పాత జిల్లాలోని మండలాలే కలిసాయి. రంగారెడ్డి జిల్లాలోకి పాలమూరు నుంచి ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ విలీనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment