
జెడ్పీపై టీ‘ఢీ’పీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. శనివారం జరగనున్న జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు జెడ్పీ సీఈవో నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 22 స్థానాలు టీడీపీకి దక్కగా, వైఎస్‌ఆర్‌సీపీకి 16 స్థానా లు దక్కాయి. దీంతో టీడీపీకే జెడ్పీ పీఠం దక్కడం ఖాయం. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మి పేరును అధ్యక్ష పదవికి ప్రకటించినప్పటికీ, మంత్రి మండలి ఏర్పాటు తర్వాత సామాజిక సమీకరణల పేరుతో జెడ్పీని కాపు వర్గానికి ఇవ్వాలని ఒత్తిళ్లు పెరిగాయి.
అధ్యక్ష పీఠం కాళింగులకే ఇస్తే.. ఉపాధ్యక్ష పదవైనా కాపులకు ఇచ్చేలా ఆ వర్గం నేతలు పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇదే పోస్టును టెక్కలి డివిజన్‌కు చెందిన మత్స్యకారులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఎన్నిక సందర్భంగా టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో చౌదరి ధనలక్ష్మికే పీఠం దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్ష పదవికి మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఈ రెండు పదవులు తమ వర్గానికే దక్కించుకోవడం ద్వారా సీనియర్ నేత కళాకు చెక్ పెట్టాలని కింజరాపు వర్గం యోచిస్తోంది.
వైస్ పదవిపై మల్లగుల్లాలు
చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు ఖరారైనట్లేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత కళా వెంకటరావు వర్గానికి అన్యాయం జరగకుండా ఉండేందుకు, కాపులకు కాస్తయినా సంతృప్తి కలిగించేందుకు జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు గత రెండు రోజులుగా జిల్లా టీడీపీ నేతలు పలుమార్లు మంతనాలు జరిపి నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సామాజికవర్గానికి చెందిన పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు, వంగర జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావు నాయుడు, సంతకవిటి జెడ్పీటీసీ అయిన పార్టీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు భార్య పేరుతో పాటు మరో మహిళా జెడ్పీటీసీ పేరూ వినిపిస్తోంది.
అయితే పార్టీలో చాలా మంది దామోదర్‌రావు పేరును వ్యతిరేకించినట్టు తెలిసింది. వేరే పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆయనకు పదవి ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చైర్మన్ పదవి మహిళకు కట్టబెట్టినప్పుడు వైస్ పదవి కూడా మహిళ కెందుకు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సోంపేట ప్రాంతానికి చెందిన మత్స్యకార సభ్యుడు కూడా వైస్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నిక జరిగేదిలా...
- అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నిక కార్యక్రమం ఇలా జరుగుతుంది.
- ఉదయం 10 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
- మధ్యాహ్నం 1 గంట- నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన
- మధ్యాహ్నం 3 గంటలు - జెడ్పీ తొలి సమావేశం. ఏకగ్రీవం కాకపోతే చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహణ
- అనంతరం.. కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షల ప్రమాణ స్వీకారం