టీడీపీకి 1.53 కోట్ల మంది మద్దతు
నోటాకు ఓటు వేసిన 3.68 లక్షల మంది
అత్యధికంగా గాజువాకలో పల్లాకు 95,235 ఓట్ల మెజార్టీ
భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజార్టీతో గంటా, లోకేష్ గెలుపు
మడకశిరలో 351, గిద్దలూరులో 392 ఓట్ల తేడాతో మారిన ఫలితాలు
ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినా 1.32 కోట్ల మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచినట్లు ఎన్నికల సంఘం తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా మే 13న జరిగిన పోలింగ్‌లో పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 3.38 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో టీడీపీకి 45.63 శాతం ఓట్లతో 1,53,56,470 మంది ఓటర్లు మద్దతు తెలుపగా, 39.37 శాతం ఓట్లతో 1,32,57,919 మంది మేం జగన్ వెంటే ఉన్నామంటూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు.
జనసేనకు సుమారు 8.3 శాతం ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలుపగా బీజేపీకి 9.53 లక్షల మంది (2.80 శాతం) ఓట్లు వేశారు. 1.72 శాతంతో కాంగ్రెస్ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవ్వగా నోటాకు 1.09 శాతంతో 3.68 లక్షల మంది ఓటు వేశారు. ఎన్నికల సంఘం ఇంకా తుది ఫలితాలను ప్రకటించకపోవడంతో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
గాజువాకలో రికార్డు మెజార్టీ
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా రికార్డు మెజార్టీలు నమోదయ్యాయి. గాజువాక నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు సమీప వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌పై 95,235 మెజార్టీతో గెలుపొందారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ 91,413, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ గ్రామీణ, రాజమహేంద్రవరం సిటీ, విశాఖ తూర్పు, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైగా మెజార్టీలు నమోదయ్యాయి. మడకశిర నుంచి వైఎస్సార్ సీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు చేతిలో ఓడినట్లు తొలుత ప్రకటించగా దీనిపై రీ కౌంటింగ్ కోరడంతో 351 ఓట్లతో వెనుకబడినట్లు ప్రకటించారు.
దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫలితం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గిద్దలూరులో రౌండు రౌండ్‌కు ఫలితం దోబూచులాడగా చివరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి 392 ఓట్లతో గెలిపొందారు. ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మందకొడిగా ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నాలుగున్నర గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు.
నిర్దేశించుకున్న సమయం కంటే చాలా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. రాత్రి పది గంటల సమయానికి 155 నియోజకవర్గాల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అర్థరాత్రి లోగా మొత్తం ఫలితాలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment