జూన్ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.
ఎన్నికల పోలింగ్ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.
శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా..
ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.
మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.
ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
పార్టీల తీరు ఇలా..
ఏపీలో వైఎస్సార్‌సీపీలో జోష్ కనిపిస్తోంది. మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.
ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment