వత్తాసు పలికిన పోలీసు అధికారులు
స్పందించని నాటి జిల్లా కలెక్టర్
ఎన్నికలు ముగిసిన తర్వాత ఘర్షణలకూ వారే కారణం
సిట్ బృందానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్‌గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది.
ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి
జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్‌చార్జ్‌గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్‌గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు.
అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్‌రాజ్‌ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్‌ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.
పేట్రేగిపోయిన పచ్చమూకలు
11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్‌ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు.
తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్‌లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.
‘నారా’యణస్వామి భక్తి
కారంపూడి సర్కిల్‌లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్‌టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.
వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్‌కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్‌ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్‌కు పిలవలేదు.
పైగా బాధితుడైన ఎస్‌ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్‌లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్‌ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్‌తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment