మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం
21 రోజుల నిరీక్షణ తర్వాత వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు
నేటి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్పష్టత
175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థుల పోటీ
వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ
బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ
ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు
ఉదయం 8 గంటల నుంచే ఈవీఎంల లెక్కింపు ప్రారంభం
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. 45 వేల మంది పోలీసులు, 67 కంపెనీల సాయుధ బలగాల వినియోగం
పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పహారా
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.
గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఒంటరిగా సిద్ధం
వైఎస్సార్‌సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు.
టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.
ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..
ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్‌ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
https://results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు.
25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనా
రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు.
పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు.
ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు.
ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment