అవ్వాతాతలను, మహిళలను హడలగొట్టడమే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా పచ్చ మూకల విధ్వంసకాండ
దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్
చంద్రబాబు, పురందేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం
క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీ
అవగాహనలేని అధికారులకు సమస్యాత్మక జిల్లాల్లో పోస్టింగ్‌లు
చిన్నమ్మ జాబితా ప్రకారమే నియామకాలు
ఫలితంగా యథేచ్చగా దాడులకు తెగబడ్డ పచ్చ మూకలు
చోద్యం చూసిన అధికారులు.. రావణకాష్టంగా మారిన రాష్ట్రం
ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఈసీ ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: ఈసీ చేష్టలుడిగి చూస్తుండటంతో పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం వేస్తున్నాయి! ఎన్నికల వేళ తమ మాట వినలేదనే ఉక్రోషంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ముకాస్తుండటం విస్మయపరుస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించేది గ్రామీణ ప్రజలు, మహిళలు, అవ్వాతాతలేనని పసిగట్టిన పచ్చ ముఠాలు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెర తీశాయి. వైఎస్సార్ సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రికత్తలు రేకెత్తించాయి. ‘మనవాళ్లంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలి’ అని చంద్రబాబు పోలింగ్‌కు ముందురోజు పిలుపునివ్వడం చూస్తే.. మద్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని, అవ్వాతాతలను, మహిళలను పోలింగ్ బూత్‌లకు రానీయకుండా చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని తేటతెల్లమవుతోంది.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన జిల్లాల్లో హింస కొనసాగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో వైఎస్సార్‌సీపీకి ఓటేసేశారనే అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో మహిళలు, పిల్లలు రాత్రంతా ఓ దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంభయంగా గడిపారు.
కుట్రలకు పరోక్ష సహకారం
మ్యాచ్ రిఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ రాజకీయాల కుట్రలకు తలొగ్గింది! పోలింగ్ సందర్భంగా, అనంతరం దాడులకు పాల్పడ్డాలని టీడీపీ రూపొందించిన ముందస్తు కుట్రలకు దాసోహమైంది. సమస్యాత్మక జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులను హఠాత్తుగా బదిలీ చేసి చంద్రబాబు కుట్రల అమలుకు దారి చూపింది.
టీడీపీ అధినేత ఆదేశాలతో పురందేశ్వరి సూచించిన అధికారులను ఆ స్థానాల్లో నియమించి పచ్చ కుట్రలకు పరోక్షంగా సహకరించింది. ఇదే అదునుగా టీడీపీ రౌడీలు బరితెగించి దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నా.. బాంబుల మోత మోగిస్తున్నా ఆ జిల్లాలపై పట్టులేని పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.
ఒత్తిడికి తలొగ్గి హఠాత్తుగా బదిలీలు
జిల్లాలపై క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న పోలీసు అధికారులు కొనసాగితే ఎన్నికల వేళ తమ పథకం పారదని చంద్రబాబు ముఠా ఆందోళన చెందింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలసి చంద్రబాబు పన్నిన పన్నాగంలో ఈసీ చిక్కుకుంది. విజ్ఞతతో ఆలోచించకుండా ఒత్తిడితో అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంది. సున్నితమైన జిల్లాలు, సమస్యాత్మక నియోజకవర్గాలపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టున్న అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత రాజ్యాంగబద్ధంగా అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆ«దీనంలోకి వెళుతుంది. అధికార యంత్రాంగం ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత ఈసీదే. అయితే టీడీపీ, బీజేపీ ఫిర్యాదులను సహేతుకంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈసీ తన బాధ్యతను విస్మరించి అసంబద్ధంగా వ్యవహరించింది.
చంద్రబాబు, పురందేశ్వరి ఫిర్యాదు చేయడమే ఆలస్యం వారు కోరినట్లుగా పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసేసింది. ఏకంగా 29 మంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. వీరిలో నలుగురు మినహా 25 మంది పోలీసు అధికారులే ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించిన పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని అధికారులే 90 శాతం మంది ఉన్నారు.
పురందేశ్వరి జాబితా ప్రకారమే అంతా
రాష్ట్ర శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్‌చార్జ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులతోపాటు పల్నాడు పరిధిని పర్యవేక్షించే గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ జిల్లాలను పర్యవేక్షించే అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని ఈసీ హడావుడిగా బదిలీ చేయడం విస్మయకరం. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీలను కూడా ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది.
డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. ఈ అధికారులంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కొద్ది నెలలుగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. అలాంటి వారిని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ బదిలీ చేయడం విభ్రాంతికరం. పోనీ ఆ స్థానంలో నియమించిన పోలీసు అధికారుల విషయంలోనైనా ఈసీ సహేతుకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందా అంటే అదీ లేదు.
చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకే ఈసీ పోస్టింగులు ఇవ్వడం విభ్రాంతికరం. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడం సహజం. కానీ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ జాబితాను సమర్పించడం ఇప్పటివరకు దేశ చరిత్రలోనే లేదు. తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా జాబితాను ఆమోదించి చేతులు దులుపుకొంది.
ఈసీ దన్నుతో టీడీపీ విధ్వంసకాండ
తాము చెప్పినట్లుగా ఎన్నికల కమిషన్ ఆడుతుండటంతో టీడీపీ మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసిన జిల్లాల్లోనే హింస చెలరేగడం, పచ్చ ముఠాలు రక్తపాతానికి తెగబడటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సీఎం జగన్‌కు వెన్నంటి నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, పేద వర్గాలే లక్ష్యంగా టీడీపీ దాడులకు పాల్పడుతోంది. పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో టీడీపీ గూండాలు, రౌడీ మూకలు కర్రలు, కత్తులు, బాంబులతో స్వైర విహారం చేస్తున్నారు.
పల్నాడులో పురి విప్పిన ఫ్యాక్షన్..
పల్నాడులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌రెడ్డిపై టీడీపీ మూకలు దాడులకు దిగాయి. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులకు తీవ్రగాయాలయ్యాయి. నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆసుపత్రులపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 15 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బాంబు దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. పిడుగురాళ్ల శివారు ప్రాంతం, మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడులో ఎస్సీ, బీసీ కుటుంబాలపై టీడీపీ రౌడీలు దాడులకు తెగబడటంతో బాధితులు రాత్రంగా ఓ గుడిలో తలదాచుకున్నారు.
సీమలో చెలరేగిన హింస..
తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వాహనశ్రేణిపై టీడీపీ మూకలు దాడి చేసి రెండు కార్లను ధ్వంసం చేశాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు ఆస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డితో కలసి విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై రాళ్లతో దాడులు చేయించారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ప్రత్యక్షంగా దాడులకు నేతృత్వం వహించారు.
టీడీపీ దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో టీడీపీ గూండాల దాడుల ఘటనపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి ఎన్నికల అధికారులను కలిసి దాడులకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.
మంత్రి అంబటి మాట్లాడుతూ.. కొత్తగణేషునిపాడులో పోలింగ్ ముగిశాక యాదవ కాలనీ, రజక కాలనీలపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేయడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలనీలు వదిలి గంగమ్మ ఆలయంలో రాత్రి తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారన్నారు. పోలీసు అధికారులకు సమాచారం అందించినా స్పందించ లేదని ఆరోపించారు.
మంగళవారం ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారని, గ్రామం నడిబొడ్డులో ఉన్న మరికొంతమందిని పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు కర్రలు, మారణాయుధాలతో దాడి చేశాయన్నారు.
సమర్థులను తప్పించి అనుకూలురకు పోస్టింగ్‌లు
ఐజీ పాలరాజు, ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల సందర్భంగా పల్నాడులో హింస చెలరేగేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు. ఎన్నికల రోజే కాకుండా మర్నాడు కూడా హింస కొనసాగుతున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోవడం దీనికి నిదర్శనం.
ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసు సిబ్బందిని ఎవరు నియంత్రించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసు బలగాలు భారీగా అందుబాటులో ఉన్నా తాపీగా గంటన్నర తరువాత చేరుకోవడం, ఈలోగా టీడీపీ నాయకులు విధ్వంసానికి తెగబడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పోల్ అబ్జర్వర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులెక్కడ?
ఎన్నికలకు ముందు గుంటూరు రేంజి ఐజీగా పాలరాజు, పల్నాడు ఎస్పీగా రవిశంకరరెడ్డి లాంటి సమర్థ అధికారులున్నారు. వారు ఉంటే తమ ఆటలు సాగవనే భయంతో టీడీపీ పదేపదే ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. పురందేశ్వరి ద్వారా రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ వీరి స్థానంలో డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీగా బింధుమాధవ్‌ను నియమించింది.
ఎన్నికలకు 4 రోజుల ముందు మాచర్ల, కారంపూడి సీఐలతో పాటు వెల్దుర్తి ఎస్‌ఐలను మార్చి టీడీపీకి అనుకూలంగా ఉండే వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత పచ్చ ముఠాలు రెచ్చిపోయాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యతో పాటు కుమారుడిపై కూడా దాడి జరిగింది. ఎన్నికల సమయంలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారిని నియమిస్తే రౌడీ మూకలు, నేరగాళ్లను సమర్థంగా అదుపు చేసే అవకాశం ఉంటుంది. బదిలీల తరువాత దీనికి భిన్నంగా జరిగింది.
అంబటిపై రివాల్వర్ ఎక్కుపెట్టి..
సమస్యాత్మక కేంద్రాల గురించి తెలిసినా బందోబస్తు కల్పించకుండా ఒక్క కానిస్టేబుల్‌తో సరిపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు ఫోన్ చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినా పోలీసు సిబ్బంది కనీసం స్పందించని పరిస్థితి నెలకొంది. మాచర్లలో పోలీసుల తీరు ఆక్షేపణీయంగా ఉంది. వైఎస్సార్‌సీపీ అనుకూల గ్రామాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లు బయటకు రావడానికి భయపడే పరిస్థితి కల్పించారు.
టీడీపీ అనుకూల గ్రామాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారి కూడా లేకుండా చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. ఈవీఎంలు ధ్వంసం చేసి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండా చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు దిగారు. మంత్రి అంబటిని హౌస్ అరెస్టు చేసి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను పోలింగ్ బూత్‌ల వద్దకు తిరిగేందుకు అనుమతించారు. కన్నా కుమారుడు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు అందినా సీఐ స్పందించలేదు.
ఘటనాస్థలికి వచ్చిన మంత్రి అంబటిపై రివాల్వర్ ఎక్కు పెట్టే ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. సత్తెనపల్లిలో చీఫ్ ఏజెంట్‌గా ఉన్న మంత్రి అంబటి అల్లుడు ఉపేష్‌పై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైదాడి చేశారు.
ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసినా..
గురజాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల అరాచకం అంతా ఇంత కాదు. మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడు, కేసానుపల్లిలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాయి. తమ మాట వినకుండా వైఎస్సార్ సీపీకి ఓటేశారనే ఆగ్రహంతో టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సోమవారం రాత్రి గ్రామంలోని గంగమ్మ గుడిలో తలదాచుకున్నారు. వారిని పరామర్శించడానికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ రావడంతో వారిపై కూడా దాడులకు బరి తెగించారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
ఘటనా స్థలానికి ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారని సమాచారం ఉన్నా సరైన బందోబస్తు కల్పించకపోవడం, పరిస్థితిని నియంత్రించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామంలో బీసీలు, ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరడంతో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని భావించి ఎన్నికలు ముగిసిన వెంటనే ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. 2019లో కూడా కాసు మహేష్‌రెడ్డిపై ఇదే గ్రామంలో దాడికి ప్రయత్నించారు. పల్నాడులో గెలవలేమని టీడీసీ నిర్ధారణకు రావడంతో దాడులు, దౌర్జన్యాలు, ఈవీఎంల ధ్వంసానికి పూనుకుంది.
ఇదంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకే జరిగినట్లు చెబుతున్నారు. సస్పెండ్ అయిన పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పోలీసులను నడిపించారన్న ఆరోపణలకు పల్నాడు పోలీసులు వ్యవహారశైలి అద్దం పడుతోంది. కొంతమంది నిజాయితీగా పనిచేసే వారున్నా ఉన్నతాధికారుల తీరు చూసిన తర్వాత అభద్రతా భావంతో విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉండిపోయారు.
పల్నాడు చరిత్రలో ఈ తరహాలో పోలీసుల వ్యవహార శైలి ఎప్పుడూ చూడలేదని సీనియర్ సిబ్బంది పేర్కొంటున్నారు.మాచవరంలో మరో దాడిపల్నాడు జిల్లా మాచవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చౌదరి సింగరయ్యపై మంగళవారం రాత్రి టీడీపీ మూకలు దాడి చేయడంతో కాలు, చేయి విరిగాయి. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ దారం లచ్చిరెడ్డికి చెయ్యి విరిగింది. ఘటనలో కారు ధ్వంసం కాగా మరో కార్యకర్తకు కూడా గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment