తిరుపతిలో రహదారి శిలాఫలకం ధ్వంసం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఇరువాడలోనూ ఇదే తంతు
వైఎస్సార్ జిల్లా నల్లచెరువులో జగన్ ఫొటోపై టీడీపీ ప్రతాపం
సాక్షి నెట్‌వర్క్: టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి ఘర్షణల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దౌర్జన్యం చేయడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై 20 రోజులు దాటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండ ఆపకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం సైతం శిలాఫలకాల ధ్వంసం వంటి ఘటనలు కొనసాగాయి.
తిరుపతిలో ఆగని విధ్వంసం
తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు శిలాఫలకాన్ని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటి మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 22 రోడ్లను నిర్మించారు. ప్రతి మాస్టర్ ప్లాన్ రోడ్డుకు కవులు, మహానీయుల పేర్లు పెట్టారు.
అందులో భాగంగానే తిరుపతి జీవకోన ప్రధాన మార్గంలోని సత్యనారాయణపురం మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ‘విరజా మార్గం’గా నామకరణం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీసీ నేతలు ఇలా కక్ష సాధింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ చర్యతో ఇరువాడలో ఉద్రిక్తత
సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను ఎందుకు పెట్టలేదంటూ సచివాలయ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన అచ్యుతాపురం మండలం ఇరువాడలో గురువారం చోటుచేసుకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గునపాలతో శిలాఫలకాలు ధ్వంసం చేసి పెకలించడంతో సచివాలయ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడంతో వీడియోల ఆధారంగా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్ జగన్ ఫొటో ధ్వంసం
వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె రైతు భరోసా కేంద్రం భవనంపై నవరత్నాలు పేరుతో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫొటోను రాళ్లతో పగులగొట్టారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ యువనేతపై హత్యాయత్నం
బీరు సీసాలు, మారణాయుధాలతో దాడి
పాకాలలో చిత్తూరు రౌడీ గ్యాంగ్ బీభత్సం
చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు
పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు నుంచి దిగుమతి అయిన రౌడీమూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి పాకాల మండల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు (చంటి)పై చిత్తూరు నుంచి బైకులపై వచ్చిన ఐదుగురు సభ్యుల రౌడీ గ్యాంగ్ బీరు సీసాలు, మారణాయుధాలతో దాడిచేసి అతడిని హతమార్చేందుకు యత్నించారు. యుగంధర్ తలను బీరు బాటిల్‌తో పగులగొట్టారు. మారణాయుధాలతో ఒళ్లంతా గాయాలు చేశారు.
‘మా అన్న పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి పనిచేస్తావా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుగారిపల్లి సమీపంలోని తన మామిడి తోటలో ఉండగా.. గుర్తు తెలియని ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై తోటలోకి చొరబడి హతాయత్నం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మామిడి తోటలోని తన గెస్ట్‌హౌస్‌లో ఉన్న గృహోపకరణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీలో కొనసాగితే ప్రాణాలతో ఉంచబోమని బెదిరించారని తెలిపారు. చిత్తూరు నుంచి కిరాయి మూకలను రప్పించి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేయించి ఓ నేత పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితుడు మండిపడ్డాడు.
ఇది ప్రజాస్వామ్యమా .. అరాచకమా?
దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ స్పందించాలి
మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
సాక్షి,అమరావతి/ రైల్వేకోడూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 25 రోజులుగా కొనసాగిస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, దాషీ్టకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక అరాచక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తమకు ఊహ వచి్చనప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజలపై జరుగుతున్న దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కోరారు.
పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం..
ఎస్టీ కాలనీ వాసుల ఇళ్లను రెవెన్యూ, ఏపీఎండీసీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకాపుపల్లె ఎస్టీ కాలనీ వాసుల గృహాలను బుధవారం జేసీబీతో అధికారులు కూల్చి వేశారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లల్లో బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలున్నారని చూడకుండా తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment