పచ్చ ముఠాల విధ్వంస కాండ | TDP Leaders Attacks On YSRCP Leaders with Fear of defeat | Sakshi
Sakshi News home page

పచ్చ ముఠాల విధ్వంస కాండ

Published Tue, May 14 2024 5:16 AM | Last Updated on Tue, May 14 2024 5:17 AM

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి  ఇంటి ముందు ఉన్న కార్లపై కర్రలు, రాళ్లతో దాడిచేస్తున్న టీడీపీ గూండాలు , పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో  పెట్రోల్‌ బాంబులు విసరడంతో దగ్ధమవుతున్న బైక్‌లు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ముందు ఉన్న కార్లపై కర్రలు, రాళ్లతో దాడిచేస్తున్న టీడీపీ గూండాలు , పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో పెట్రోల్‌ బాంబులు విసరడంతో దగ్ధమవుతున్న బైక్‌లు

ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు 

రాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతం

యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన

చంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచన

ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనత

శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్‌ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలు 

అన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజం

వైఎస్సార్‌ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసం

జంగాలపల్లి పోలింగ్‌ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలు

చిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసం 

కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. 

దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం  ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్‌ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభ­త్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది.  

తెగబడ్డ టీడీపీ, జనసేన 
సోమవారం ఉదయం పోలింగ్‌ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్‌ సరళి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్‌ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు.  

చోద్యం చూసిన ఈసీ 
టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్‌కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్‌(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్‌సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్‌ యాప్‌ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్‌ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. 

అయినా సరే పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్‌సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. 

గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్‌ను మాత్రమే  గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. 

మచ్చుకత్తితో దాడి 
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త నవీన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.  

వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌లపై హత్యాయత్నం 
పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల రిలీవ్‌ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. 

కారెంపూడిలోని 288 నెంబర్‌ బూత్‌లో ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 

పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్‌ బూత్‌లతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్‌తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్‌ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్‌ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. 

చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు.  

పసుపు కండువాతో ‘గంటా’ హల్‌చల్‌  
భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్‌చల్‌ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళుతుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. 

రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్‌ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్‌ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్‌ బూత్‌ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్‌ ఫోన్‌ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.

‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి 
పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్‌సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా వచ్చారు. 

అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్‌ పాఠశాల బూత్‌లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్‌ సీపీకి చెందిన బూత్‌ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్‌ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు.  

కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..
> పోలింగ్‌ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చి­త్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఏజంట్‌పై కత్తితో దా­డి చేశారు. అనంతరం పోలింగ్‌ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి.  

వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి షాహీద్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.  

రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్‌సీపీ నేత తిరుపాల్‌ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయు­లపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 

మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రైమరీ స్కూల్‌ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement