బడుగులపై బరితెగింపు | Attacks of TDP groups on women | Sakshi
Sakshi News home page

బడుగులపై బరితెగింపు

Published Thu, May 16 2024 5:28 AM | Last Updated on Thu, May 16 2024 5:28 AM

Attacks of TDP groups on women

వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలు

నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం 

ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులు

కృష్ణా జిల్లాలో దమనకాండ

మహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత

మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత  

గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 

చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం 

ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం 

రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు..  

కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం  

అయ్యన్న గ్యాంగ్‌ అరాచకం
ఎన్నికల్లో చురుగ్గా పని చేసిందనే క్షక్షతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఓ ఒంటరి మహిళ పట్ల అయ్యన్నపాత్రుడి అనుచరులు దుశ్శాసనుల్లా వ్యవహరించారు. మంగళవారం అర్థరాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చముఠాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పొలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలసి జీవిస్తోంది. కొన్నాళ్లు వలంటీరుగా పని చేసింది. 

పోలింగ్‌ రోజు ఓటర్లకు స్లిప్‌లు రాసిచ్చి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేయడం అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. పోలింగ్‌ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీకి చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు,  నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదటంతో బయటకు వచ్చింది.

రౌడీ మూకలు ఆమె మొబైల్‌ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడ్డాయి. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై కొట్టి చెవి దుద్దులు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి అనుచరురాలు, జెడ్పీటీసీ సుకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురిగొల్పినట్లు బాధితురాలు పేర్కొంది.

సాక్షి, అమరావతి/విశాఖ సిటీ/ఉంగుటూరు, నెట్‌వర్క్‌:  ‘ఈసీ’ ఉదాసీనతతో పేట్రేగుతున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై పాశవికంగా దాడులకు తెగబడుతున్నాయి. గ్రామాల్లో హింసను ప్రేరేపిస్తూ దమనకాండకు తెర తీశాయి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఫ్యాన్‌కు ఓటేసిందనే కక్షతో ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి హత్యాయత్నానికి తెగబడ్డాయి. 

ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా పని చేయడమే ఈ అక్కచెల్లెమ్మలు చేసిన నేరం! తాజాగా పల్నాడులోనూ టీడీపీ మూకల దాష్టీకా­లకు బడుగు, బలహీన వర్గాలు ఓ రాత్రంతా దేవా­ల­యంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడు­కున్నా­రు. ఓట్ల లె­క్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళి­క­ను టీడీపీ మూకలు అమలు చేస్తు­న్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే జూన్‌ 4వరకు రాష్ట్రం రావణకాష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేత­లు, కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తె­లుస్తోంది. 

దీనికనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మూ­కలు స్వైర విహారం చేస్తుండటంతో ఏ­పీలో భీతా­వహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ­కీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల కమిషన్‌ ఈ దాడు­ల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితిని మ­రింత దిగజా­రుస్తోంది. సమస్యాత్మక జిల్లాల్లో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమూకల దౌర్జన్యకాండకు కొమ్ము కాస్తున్నారు.

బెదిరించి.. భయపెట్టి
ప్రజాబలంతో టీడీపీ నెగ్గలేదని స్పష్టం కావ­డంతో పోలింగ్‌ రోజు రాష్ట్రవ్యాప్తంగా అవ్వా­తాతలు, మహి­ళలను బెదిరిస్తూ దాడులతో హడలెత్తించే కుట్రలను చంద్రబాబు అమలు చేశారు. పోలింగ్‌ రోజు మొదలైన ఈ విధ్వంస కాండ ఇంకా కొనసా­గుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు పథకాలను రచిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూ గ్రామాల్లో లేకుండా చేయాలని, జూన్‌ 4న కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు సైతం రాకుండా భయోత్పాతం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.

పల్నాడులో చల్లారని ఉద్రిక్తతలు
ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడులో ఉద్రిక్తతలు చల్లబడలేదు. టీడీపీ మూక దాడులతో ఎస్టీ, బీసీ వర్గాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్నాయి. పోలింగ్‌ రోజు రాత్రి అరాచక ముఠాల దాడులతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూ­తిపరులు ఇంతవరకు స్వగ్రామాలకు చేరుకోలేదు. పల్నాడులో 144 సెక్షన్‌తో దుకాణాలు మూతబ­డ్డాయి. 

మాచర్ల, గురజాల, నరసరావు­పేట ఎమ్మె­ల్యేలు హౌస్‌ అరెస్ట్‌లో ఉన్నారు. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుప­రాడ్లతో దాడి చేయడంతో గాయపడ్డాడు. తాడిపత్రిలో పట్టణాన్ని వీడి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో చొరబడ్డ పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. కంప్యూటర్లను పగులగొట్టారు.

ఫ్యాన్‌కు ఓటేసిందని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించబోయాడు!
వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిందని కక్షగట్టి ఓ మహిళను టీడీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించబోగా తృటిలో తప్పించుకుంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణి వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసిందని టీడీపీ నాయకుడు ఏడుకొండలు కక్ష పెంచుకున్నాడు. 

బుధవారం ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఘర్షణ పడి తన ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గన్నవరం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీమోహన్‌ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

పోలీసుల దన్ను... ఈసీ ఉదాసీనత 
టీడీపీ మూకలు బరితెగించి దాడులు, విద్వంసానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో డీఐజీ నుంచి ఎస్సై వరకూ పోలీసు అధికారులను పోలింగ్‌కు ముందు ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారి స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని అధికారులను నియమించింది. 

శాంతిభద్రతల పరిరక్షణ­లో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలను కూడా ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి అందచేసిన జాబితాలో సూచించిన వారినే నియమించింది. అదే దన్నుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడటంతో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. 

అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ ఈ దాడుల పట్ల బుధవారం వరకూ స్పందించలేదు. ఎస్పీలు, డీఐజీలకు ఆదేశాలు ఇవ్వలేదు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లతో చర్చించలేదు. ఈసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిలదీయడంతో ఇక తప్పదన్నట్లుగా సమీక్షకు ఉపక్రమించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement