పిన్నెల్లికి బెయిల్ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు?
నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ నియమించిన పోలీసు అధికారులు స్వామి భక్తి చాటుకునేందుకు బరి తెగిస్తున్నారు. పోలింగ్ రోజు పల్నాడు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. పల్నాడులో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్వో (రిటర్నింగ్ అధికారి) నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకూ, ఎస్పీ నుంచి డీజీపీ దాకా పలుదఫాలు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న రెంటచింతల మండలంలో ఎన్నికల రోజు భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించగా, టీడీపీ మద్దతుదారులున్న చోట్ల హోంగార్డులతో సరిపెట్టడం గమనార్హం.
తాపీగా సీఐ ఫిర్యాదు..
మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై ఈనెల 20న నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఎడిట్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్‌లో ఎక్కడా నమోదు చేయలేదు. పోలింగ్‌కు విఘాతం కలిగినట్లు పేర్కొనలేదు. సిట్ కూడా దీని గురించి ప్రస్తావించలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నట్లు చెప్పలేదు. ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలోనూ ఆ ప్రస్తావనే లేదు. అసలు వెబ్‌కాస్టింగ్ నుంచి అది ఎలా లీకైంది? నిజమైనదేనా? మార్ఫింగ్ చేసిందా? అనే విషయాలను ధృవీకరించుకోకుండా పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.
దీన్ని సవాల్ చేసిన పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు మరో మూడు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 14న కారంపూడిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను చెదరగొడుతుండగా తన తలకు గాయమైందని, ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారంటూ సీఐ నారాయణస్వామి తాపీగా ఈనెల 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదైంది. పోలింగ్ రోజు తనను హత్య చేయడానికి పురిగొల్పారని ఆరోపణలు చేసిన ఓ టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయగా, తనను చంపుతానని బెదిరించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడో కేసును పిన్నెల్లిపై నమోదు చేశారు. వీటిని పరిశీలిస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?
నరసరావుపేటలో పోలింగ్ రోజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. గోపిరెడ్డి దొరకకపోవడంతో ఆయన మామపై పచ్చ మూక దాడి చేసింది. అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేయకుండా ఆ కేసును పోలీసులు గోపిరెడ్డిపై బనాయించడం విస్మయం కలిగిస్తోంది. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లభ్యమైతే ఆయనపై చిన్న కేసుతో సరిపుచ్చారు. పోలింగ్ మర్నాడు కారంపూడిలో టీడీపీ మూకలు పేట్రేగినా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment