దాడులు.. లూటీలు.. విధ్వంసం | Post Poll Violence In AP: Telugu Desam Party Attacks In Palnadu District, More Details Inside | Sakshi
Sakshi News home page

Post Poll Violence In AP: దాడులు.. లూటీలు.. విధ్వంసం

Published Wed, May 15 2024 5:39 AM | Last Updated on Wed, May 15 2024 12:35 PM

Telugu Desam Party attacks in Palnadu

టీడీపీ నేతల మూక దాడులతో అట్టుడికిన పల్నాడు జిల్లా 

సాక్షి, నరసరావుపేట/వినుకొండ(నూజెండ్ల)/కారెంపూడి/పెదకూరపాడు/మాచవరం : పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో చేస్తున్న అరాచకపర్వం రెండో రోజూ కొనసాగింది. సోమ­వారం పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీకి ప్రజలు భారీ స్థాయిలో ఓటు వేస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం నుంచే దాడులు ప్రారంభించారు. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఓవైపు వైఎస్సార్‌సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు జరుగు­తున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జిల్లా ఎస్పీ వ్యవహరిస్తు­న్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్య­కర్తలు వాపోతున్నారు. 

ఇన్ని దాడులు జరుగుతున్నా కేంద్ర బలగాలు ఏవని ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని పేటసన్నె­గండ్ల గ్రామ శివారు బాలచంద్రనగర్‌ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీ గూండాలు సుమారు 70 మంది సోమవారం రాత్రి వారి ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావ బాదారు.  ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు, బల్బులను పగుల­గొట్టారు. చిల్లర కొట్టునూ లూఠీ చేశారు. సామాన్లు, నగదును దోచుకెళ్లారు. 

వైఎస్సార్‌సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయ­కుడు పెల్లూరి బిక్షంకు చెందిన బైక్‌ను, మక్కెన శేషుకు చెందిన బైక్‌ను మరో ఇద్దరి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొ­ట్టారు. రాళ్ల దాడితో అందరూ ప్రాణభయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే చోట తల దాచుకున్నారు. ఏరా.. టీడీపీకి ఓటు వేయమంటే వేయకుండా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారా.. నా కొడకల్లారా.. అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచకపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. 

జూన్‌ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ‘ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్లు కర్రలతో కొట్టారు. ఇళ్లలోకి జొరబడి సామాన్లన్నీ చిందవందర చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. భయమేసింది. పిల్లలు పరారయ్యారు. ఎటూ పోలేని మమ్మల్ని చితకబాదారు. బూతులు తిట్టారు’ అంటూ గొర్ల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా చేయి విరగ్గొట్టారు. నేను పని చేస్తేనే పిల్లలను పోషించుకునేది. ఇప్పుడు ఎలా పని చేయాలి? ఇన్నాళ్లూ మా బాగోగులు పట్టించుకున్నారా.. కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా.. అలాంటి వారు మాపై దౌర్జన్యం ఏమిటి? మా లాంటి బీదోళ్లపై పడి కొట్టడం ఏమిటి? ఓటు వేయలేదని కొడతారా?’ అంటూ కప్పెర లక్ష్మి వాపోయింది.    

ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు 
» సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి కొనసాగింది. తిరిగి మంగళవారం ఉదయం తొండపి గ్రామంలోని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతి పరులు ఆడ, మగ బేధం లేకుండా మూకుమ్మడిగా చొరబడ్డారు.

»    మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంట్లోని సామగ్రి పగలకొట్టారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దాడికి పాల్పడుతున్న తరుణంలో ముస్లిం కుటుంబాల్లోని మగ వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు.

»    ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి మండలంలోని తొండపి, మాదల గ్రామాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ ముస్లిం వర్గీయులే వైఎస్సార్‌సీపీ మద్దతు దారులుగా ఉండగా, టీడీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం వర్గీయులంతా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లోను వైఎస్సార్‌సీపీ కి అండగా ఉంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారు. 
కేసానుపల్లిలో 

వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడి 
»  గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని కేసానుపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావు, చుండు రామారావు ఇళ్లపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నాయకులు రాళ్లు విసిరారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. 
»   వైఎస్సార్‌సీపీ నేత చుండు రామారావు తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లచ్చమ్మతో పాటు మరో ఇద్దరిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. టీడీపీ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తంగెడ, ఇరికేపల్లి, దాచేపల్లి గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.  

ఎస్సీలపై దాష్టీకం 
»  చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్‌ సందర్భంగా సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ 211లో ఉదయం 7.30 గంటలకు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి ఓట్లు కొన్ని పోల్‌ కావాల్సినవి మిగిలి ఉన్నాయి. దీనికోసం సమయం పెంచాల్సిందిగా వైఎస్సార్‌సీపీ తరుఫున బూత్‌ ఏజెంటుగా ఉన్న నలమాల కాంతయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇది నచ్చని టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కాంతయ్యపై దాడి చేశారు. దీంతో ఇతను తల పగిలి పడిపోయాడు. 

»  దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కట్టెం ఆనందరావు, మరి కొందరికి కూడా గాయాలయ్యాయి. కాంతయ్య, ఆనందరావులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కావూరులోని మంచినీటి ప్లాంట్‌ నుంచి ఎస్సీ వర్గీయులు మంగళవారం మంచి నీరు తీసుకువెళ్లకుండా కట్టడి చేసి వారి దాష్టీకాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు.  

కంభంపాడులో పచ్చ మూకల విధ్వంస కాండ
» పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో వైఎస్సార్‌సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సోమ­వారం పోలింగ్‌ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలు అని కూడా చూడ­కుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య) సతీమణి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ ఆర్తిమళ్ల ఆంజమ్మ లక్ష్యంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. 

»   పోలింగ్‌ ముగిసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన పచ్చమూకలు.. నాగేశ్వరరావు, అతని కుమారులు రాజశేఖర్, ప్రవీణ్, ఆర్తిమళ్ల తిరుపతిరావు, ఎస్సీ కాల­నీకి చెందిన సురేష్, బీసీ కాలనీకి చెందిన బ్రహ్మం, పల్లపాటి కృష్ణవేణిలపై దాడులకు పాల్ప­డ్డారు. పలువురి తల, కాళ్లు, చేతులు, ఛాతీపై రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టీడీపీ గూండాలు పలు మార్లు ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
 

కారెంపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి
» కారెంపూడిలో టీడీపీ గూండాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బీభత్సం సృష్టించారు. సుమారు 500 మంది రౌడీలు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్‌ కరీంకు చెందిన వాచ్‌ షాపును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్‌లతో భయానక వాతావరణం సృష్టిస్తూ గ్రామం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేశారు. 

»  కారెంపూడి ఎంపీపీ బొమ్మిన సావిత్రికి చెందిన పాల కేంద్రాన్ని ధ్వంసం చేసి తగల బెట్టారు. తర్వాత మాచర్ల రోడ్డులో ఉన్న పోలిరెడ్డికి చెందిన టీస్టాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో లూధరన్‌ చర్చి వద్ద ఎస్సీ కాలనీలో బీభత్సం సష్టించారు. తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అక్బర్‌ నివాసంపై దాడి చేశారు. 

»  స్టేట్‌ బ్యాంక్‌ సెంటర్‌లో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మావతి భర్త నిర్వహిస్తున్న ఆటో కన్సల్టెన్సీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 40 బైక్‌లకు నిప్పు పెట్టారు. బైక్‌లకు ఉన్న బ్యాటరీలు పేలడంతో దానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో నిలిపి ఉంచిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి కారును ధ్వంసం చేశారు. 

»  టీడీపీ రౌడీ గ్యాంగ్‌ మరొకటి.. ఆర్య వైశ్య వీధి ముస్లిం ఏరియాలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. తర్వాత గ్రామ శివారులో ఉన్న ఆదినారాయణ కాలనీలో వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్‌ నివాసానికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తలకు బలౖ­మెన గాయం అయింది. జెడ్పీ హైస్కూల్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న టీడీపీ నాయకుని స్కార్పియోను దుండగులు ధ్వంసం చేశారు. 

»   మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేయగా, వైఎస్సార్‌సీపీ వర్గీయులు ప్రతిఘటించారు. ఓ దశలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడులలో వైఎస్సార్‌సీపీకి చెందిన మూఢావత్‌ మల్లయ్యనాయక్, మూఢావత్‌ కొండానాయక్, ఆర్‌.నాగేశ్వరరావునాయక్‌ , మూఢావత్‌ నాగేశ్వరరావు నాయక్‌ గాయపడ్డారు. క్షతగాత్రులు గురజాల, పిడుగురాళ్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 
నూజెండ్లలో టీడీపీ మూకల దాడులు

»   వినుకొండ నియోజక­వర్గం నూజెండ్లలో టీడీపీ నాయకులు రెచ్చిపో­యారు. మంగళవారం పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాన సెంటరులోకి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి పైగా తీవ్ర గాయాల­పాల­య్యారు. మహిళలను వెంటాడి దాడి చేశారు. గ్రామంలో అందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్నారనే అక్కసుతో టీడీపీ నాయకులు దాడులు చేశారు. 

ఈ దాడుల్లో కాజా ఆదిశేషమ్మ, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కిరెడ్డి గోవిందరెడ్డి, అమ్మిరెడ్డి సంజీవరెడ్డి, భవనం సంజీవరెడ్డి, మల్లంపాటి చెంచిరెడ్డి, నక్కా ఆదిలక్ష్మి, కాజా జయమ్మ, వంగూరి ప్రసాద్‌ సహా 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, గొడవను అదుపు చేయలేక పోవటం పలు విమ­ర్శలకు తావిచ్చింది. క్షతగా­త్రులను విను­కొండ ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. 

»  బొల్లాపల్లి మండలం పేరూరుపాడులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్వల్ప వివాదంతో కావాలనే టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement