ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా? | Sakshi
Sakshi News home page

గురజాల: ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?

Published Thu, May 16 2024 8:25 AM

The People Of Gurajala Constituency Are Expressing Their Grief Over The Threats Of TDP

టీడీపీకి ఓటేయకుంటే ఊరు వదిలి పోవాలా...

ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు

వైఎస్సార్‌సీపీకి ఓటేయడం మేం చేసిన తప్పా?

భయాందోళనలోనే కొత్తగణేశునిపాడు ప్రజలు

సాక్షి, నరసరావుపేట: ‘స్వతంత్రంగా ఓటేసుకునే హక్కు ఉండకూడదా... టీడీపీకి ఓటేయకుంటే గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోవాలా... వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపడం నేరమా... మమ్మల్ని పోలీసులు ఎందుకు కాపాడటం లేదు...’ ఇదీ ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజల ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదన్న అక్కసుతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ గూండాలు సోమవారం అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఊరొదిలి వేరేచోట బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ‘సాక్షి’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు.  వైఎస్సార్‌సీపీకి ఓటేశామన్న కక్షతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి సుమారు ఐదు గంటల పాటు గ్రామంలో అరాచకం సృష్టించారనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే  లక్ష్యంగా వారు దాడిచేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకు రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం..
ఎస్టీ వాడివి మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తావా ఎంత ధైర్యంరా అంటూ మాపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. భయంతో పొలాల్లోకి పరుగులు తీశాం. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు, ఆటోని ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ మావాళ్లను కొట్టారు.  దిక్కుతోచని స్థితిలో బందువుల వద్ద తలదాచుకున్నాం.

– కాండ్రకుంట హనుమంతు

ఊళ్లో ఉంటే చంపేస్తామంటున్నారు!
జగనన్న పాలనలో మాకు మంచి జరిగింది కాబట్టే వైఎస్సార్‌సీపీకి ఓటేశాం. అందుకే మాపై కక్ష పెంచుకున్నారు. ఊళ్లో ఉంటే చంపుతామని బెదిరించారు. పోలీసులే రక్షణ కల్పించాలి.

– దేవరపు రత్తయ్య బీసీ రజక

టీడీపీకి ఓటేయకపోతే బతకనివ్వరా?
పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్లం. మా జీవితాలు మారుస్తున్నాడన్న అభిమానంతో జగనన్నకి ఓటేశాం. దానికే మాపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. మా జేసీబీ, ట్రాక్టర్, బైకులు ధ్వంసం చేశారు. ఊళ్లో ఉంటే చంపుతారని భయమేసి భార్యా, పిల్లలతో పక్క ఊళ్లో ఉంటున్నాం. టీడీపీకి ఓటేయకపోతే ఊరొదిలి పోవాలా...

– మేకల హనుమంతు, కొత్తగణేశునిపాడు

Advertisement
 
Advertisement
 
Advertisement