ఆది నుంచి ఆమె తీరు వివాదాస్పదం..
యర్రగొండపాలెంలో తొలి నుంచి వైఎస్సార్‌సీపీనే టార్గెట్
ఈవీఎంలో గ్లాస్ గుర్తు మాయం వెనక తెరవెనుక మంత్రాంగం
బహిరంగంగా టీడీపీ, బీజేపీ
జెండాలు రెపరెపలాడినా పట్టించుకోని వైనం
సీఎం జగన్ స్టిక్కర్ కనిపిస్తే చిందులు తొక్కడమే ఆమె పని
వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లపై అక్రమ కేసులు
యర్రగొండపాలెం: సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి వివాదాస్పద అధికారిగా మారిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) పి.శ్రీలేఖ చౌదరీపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆమెను ఆర్వో బాధ్యతల నుంచి తప్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ఎన్నికల కమిషన్ యర్రగొండపాలెం నియోజకవర్గ ఆర్వో బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీని టార్గెట్‌గా చేసుకుని ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.
ప్రజలకు నీళ్లు సరఫరా చేసి పక్కన పడేసిన పాత ట్యాంకర్లపై ఉన్న సీఎం జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లను సైతం ఆమె వదల్లేదు. అలాగే, నిబంధనల ప్రకారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, స్టిక్కరింగ్‌లను సైతం ఆమె తొలగింపజేశారు. కానీ, అదే సమయంలో టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించేందుకు ఆమె శ్రద్ధ వహించలేదు.
బస్టాండ్‌కు సమీపంలో జెండా కర్రపై బహిరంగంగా కనిపిస్తున్న ఆ పార్టీ చిహ్నం, అక్కడికి సమీపంలోని బీజేపీ కార్యాలయంపై ఉన్న బోర్డు, జెండాలను పట్టించుకోలేదు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఆమె పట్టనట్లు వ్యవహరించారు. ఇదేంటని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ, బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలపై వివాదం చెలరేగడంతో వాటిని తొలగించారు.
ఇక శ్రీలేఖ పచ్చనేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారని, ఆర్వో కార్యాలయంలో జరిగే ప్రతి సమాచారం టీడీపీ నేతలకు చేరవేసే వారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో స్టిక్కర్లు పంచారని, భోజనాలు పెట్టించారని వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఒక కేసు, ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌పై మూడు కేసులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నర్రెడ్డి వెంకటరెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు.
గ్లాసు గుర్తుపై తెరవెనుక మంత్రాంగం..
ఇక నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తును కేటాయించాల్సి వచ్చింది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఆమె చివరివరకూ స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరిపారని, ఆర్వో కార్యాలయం కేంద్రంగా చివరివరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి.
గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ పార్టీ నుంచి ఒత్తిళ్ల మేరకు ఆమె స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపణలొచ్చాయి. ఈవీఎంలో కూడా ఆ గుర్తు కనిపించకుండా చేశారన్న విమర్శలున్నాయి.
పోలింగ్ సమయంలో కూడా ఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 3గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు కావడంతో పోలింగ్ కొనసాగిస్తూ వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి.
పచ్చ పత్రికలో అసత్య కథనం
ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు గురైన మహిళా ఆర్వోపై వేటు.. అంటూ పచ్చపత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం నిజంలేదని పలువురు ఖండించారు. ఎన్నికల సమయంలో ఆర్వోతో అభ్యర్థులు కలిసి మాట్లాడటం సహజమని.. అంతమాత్రాన బెదిరించారని ఆరోపించడం సరికాదని వారంటున్నారు.
ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేక పోయారని, కౌంటింగ్ నిర్వహణ కూడా అదే విధంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆమెను విధుల నుంచి తప్పించి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment