ఆఖరి మోఖా !
జెడ్పీలో అడ్డగోలుగా పనులు
- నామినేషన్ల పద్ధతిన అప్పగిస్తున్న అధికారులు
- నెలాఖరులో ఉన్నతాధికారి రిటైర్మెంట్
- కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం
- కొత్త పాలక మండలి కొలువుదీరే ముందు హడావుడిపై సందేహాలు
- పాత తేదీలతోనే ఆమోదం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్‌లో పద్ధతి మారింది. పనుల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా... పట్టించుకోని జెడ్పీ అధికారులు ఇప్పుడు పిలిచి మరీ ఇస్తున్నారు. ఎండాకాలం లో గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారుతుందని ముందే పనుల ప్రతిపాదనలు పంపిన సర్పంచ్‌లను అప్పుడు పక్కనబెట్టారు. వర్షాలు మొదలవుతున్న తరుణంలో ఆ పనులకు ఇప్పుడు ఆమోదం తెలుపుతున్నారు.
ఇది కూడా వేగంగా జరుగుతోంది. అధికారుల్లో ఇంత పెద్ద మార్పునకు కారణం ఏమై ఉంటుందనేది జిల్లా పరిషత్‌లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న అధికారి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈయన రిటైర్మెంట్‌కు ముందు... కొత్త పాలకమండలి వచ్చే తరుణంలో పనుల కేటాయింపు విషయం లో జిల్లాపరిషత్ అధికారుల అత్యుత్సాహం చూపుతుండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ నిబంధనలు ఇప్పుడు లేవు !
జిల్లా పరిషత్‌కు పాలకమండలి లేక మూడేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులు లేని ఈ మూడేళ్ల ప్రత్యేక పాలన కాలంలో అధికారులే అధికారం చెలాయించారు. తాజాగా.. కొత్త పాలకమండలి ఏర్పాటుకు ముందు పనుల కేటాయింపులో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. గ్రామ పంచాయ తీ ఎన్నికల తర్వాత ఆయా గ్రామాల్లో అవసరమైన పనుల మంజూరు కోసం కొత్త సర్పంచ్‌లు కాళ్లరిగేలా జిల్లా పరిషత్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అరునా... ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇదే జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు పిలిచి మరీ పనులు కేటాయిస్తున్నరు.
పనుల మంజూరుకు సంబంధించిన అన్ని అంశాలను జిల్లా పరిషత్‌లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారులే చూసుకుంటున్నారు. పనుల మంజూరుకు అవసరమైన పత్రాలన్నీ కచ్చితంగా ఉండాలని గతంలో నిబంధనల పేరిట చేతులు దులుపుకున్నారు. తాజాగా లేని కాగితాలు, పనుల ప్రతిపాదనలను వారే తయారు చేసి వేగంగా ఆమోదం తెలుపుతున్నారు.
పాత తేదీలతో ఆమోదం
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీ ఎఫ్), 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ), సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధు లు కేటాయిస్తుంది. గ్రామాల్లో తాగునీటి సరఫ రా కోసం అవసరమైన పైపులైన్ల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి పనులను నామినేషన్లపై జిల్లా పరిషత్ మంజూరు చేస్తుంది. రూ.5 లక్షల పనులకు సంబంధించి మాత్రమే ఇలా కేటాయిస్తారు.
ఈ పనుల కో సం గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలి. దీని ఆధారంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనుల కేటాయింపుపై ప్రతిపాదనలను జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. జెడ్పీ సీఈఓ ద్వారా కలెక్టర్ ఆమోదంతో పనుల కేటాయింపు జరుగుతుంది. ఇన్నాళ్లు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓ వరకు వచ్చి ఆగినపనుల ప్రతిపాదనలు ఇప్పుడు వేగంగా కదులుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో పెట్టిన ప్రతిపాదనల దరఖాస్తులు ఇప్పుడు పాత తేదీలతో ఆమోదం పొందుతున్నాయి.
రికార్డుల్లో తేడా రాకుండా ఉండేందుకు కొన్ని కొత్త ప్రతిపాదనలకు సైతం పాత తేదీల తో తీర్మానం లేఖలు తీసుకుని మరీ పనులు కేటాయిస్తున్నారు. బీఆర్‌జీఎఫ్, 13వ ఆర్థిక సం ఘం, ఎస్‌ఎఫ్‌సీ, సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ జనవరి నుంచి ఈ నెల వరకు 82 పను ల కోసం 3.72 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వేసవిలో అవసరమైన పను లే ఉన్నాయి. నర్సంపేట, పాలకుర్తి, జనగామ, భూపాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఇలా ఎక్కువ పనులు కేటాయించారు.