new sarpanches
-
పల్లె గూటికి పండగొచ్చింది
సాక్షి, అమరావతి: కొత్త సర్పంచ్‌లు కొలువుదీరడంతో పల్లె గూటికి పండగొచ్చింది. రెండున్నరేళ్ల తరువాత పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో శనివారం నుంచి ప్రజా పాలన తిరిగి మొదలైంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్.. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,099 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన 1.33 లక్షల మంది బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల పాలన మొదలైంది. టీడీపీ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకులు బాధ్యతలు చేపట్టారు. పల్లెకు కొత్త రూపు తెస్తా గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని గాంధీ చెప్పిన మాటలు నిజం చేసేలా పల్లెకు కొత్త రూపు తీసుకువస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించడంతో పాటు మరిన్ని పనులు చేపట్టేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నా. పచ్చదనం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుదల దిశగా మొదటి అడుగులేస్తున్నాం. – బీరం ఉమా, సర్పంచ్, తిమ్మారెడ్డిపల్లె, వైఎస్సార్ జిల్లా ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి 23 ఏళ్ల వయసులో నాకు గ్రామ సర్పంచ్‌గా అవకాశం వచ్చింది. ఇంటింటికీ తాగునీరు అందించడం నా ముందున్న ప్రధాన లక్ష్యం. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతా. గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు ప్రభుత్వ వైద్యుడి నియామకం జరిగేలా కృషి చేస్తా. – ఎల్ల రాముడు, సర్పంచ్, గోవర్ధనగిరి, కర్నూలు జిల్లా జగనన్న అడుగుజాడల్లో నడుస్తా మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యా. పాలనలో మహిళలకు అధిక రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడిచి.. ఆయన ఆశయం మేరకు సంక్షేమ పాలనను కొనసాగిస్తాను. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – బోయ శృతి, సర్పంచ్,కెంచానపల్లి, అనంతపురం జిల్లా -
పవర్ లేని పంచాయతీలు
వెల్దుర్తి(తూప్రాన్): గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో పలు మార్పులు, చేర్పులు చేసినా అది కంటితుడుపు చర్యగానే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. చట్ట సవరణలు సరే పంచాయతీలకు వివిధ శాఖలపై పట్టు ఏది ?.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పంచాయతీ పాలకవర్గాలు చేసే తీర్మానాలను ఏ ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడంలేదు. పాలకవర్గ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వ శాఖపై అజమాయీషీకి పంచాయతీ లకు విశేషమైన అధికారులు లేకపోవడం. పంచాయతీ సమావేశాలకుఅన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరుకావాలి. కానీ ఏ అధికారి హాజరుకావడం లేదు. తప్పదు అనుకున్నప్పుడు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. నిజానికి పంచాయతీ పరిధిలో 29 ప్రభుత్వ శాఖలు ఉండాలి. ఈ శాఖలపై పంచాయతీ పాలకవర్గం అజమాయిషీ కలిగి ఉండాలి. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం 29 రకాల ప్రభుత్వ శాఖలను పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించాల్సి ఉంది. ఈ శాఖలు గ్రామస్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల పరిషత్‌లు, జిల్లాస్థాయిలో జిల్లా ప్రజాపరిషత్‌ల అజమాయిషీలో పని చేయా ల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ప్రభుత్వ శాఖలను ఇప్పటివరకు బదలాయించలేదు. రాజ్యాంగంలోని సంబంధిత ఆదేశికం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వశా ఖలు పంచాయతీలను పట్టించుకోవడంలేదు. పా లకవర్గ తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నాయి. బదలాయించాల్సిన ప్రభుత్వ శాఖలు.. వ్యవసాయశాఖ: పంచాయతీ పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు, విస్తరణ, పంటలసాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, సబ్సిడీ, సస్యరక్షణ చర్యలు తదితర కార్యకలాపాలను పాలకవర్గం పర్యవేక్షణలో అమలు చేయాలి. రెవిన్యూశాఖ: పంచాయతీ పరిధిలో భూ సంస్కరణల అమలు, భూసార రక్షణ, భూమి అభివృద్ధి, భూముల ఏకీకరణ, భూరికార్డుల నవీకరణ, భూ తగాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల కింద వ్యవసాయ భూముల కేటాయింపు తదితర కార్యక్రమాలను గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో అమలు చేయాలి. నీటిపారుదలశాఖ: పంచాయతీ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్ట్‌ల అమలు, నీటి నిర్వహణ, చెరువులు, కుంటల అభివృద్ది, పంట కాలువల నిర్మాణం, చివరి భూముల వరకు నీరందించేందుకు పైప్లైన్ల నిర్మాణం,చెక్‌డ్యాంల ఏర్పాటు తదితర పనులను పంచాయతీ కనుసన్నల్లో అధికారులు నిర్వర్తించడం.పశుసంవర్థక శాఖ: గ్రామాల్లో పశు సంవర్థకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం, ప్రభుత్వపరంగా అమలయ్యే పథకాలపై ప్రచారం, అవగాహన, లబ్ధిదారుల ఎంపిక తది తర అంశాలను పాలకవర్గంతో కలిసి అమలు చేయడం. మత్స్యశాఖ: గ్రామ పరిధిలోని చెరువుల్లో చేపలపెంపకం, చేప విత్తనాల పంపిణీ, చేపల మార్కెటింగ్, చేపల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, చేపల పెంపకందారులకు రాయితీపై వలలు, సైకిళ్ల అం దజేత వంటివి పంచాయతీ పాలకవర్గంతో చర్చిం చి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవడం. సోషల్ ఫారెస్ట్: గ్రామాల్లో సామాజిక అడవుల పెంపకం, చేలల్లో చెట్ల పెంపకం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, మొక్కల పంపిణీ, చెట్ల నరికివేత నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటివి పంచాయతీ సర్పంచ్‌లు, వారి సభ్యులతో కలిసి వారి సూచనలు మేరకు చేయడం. పరిశ్రమల శాఖ: పంచాయతీ పాలకవర్గంతో కలిసి గ్రామంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను అన్వేషించడం, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడం. ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు: గ్రామాల్లో కుటీర పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖాదీ, చేనేతపై ఎక్కువమంది ఆధారపడి జీవిస్తుంటారు. పట్టు పురుగుల పెంపకాన్ని కూడా చేపడతారు. పంచాయతీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు, ప్రతిపాదనలకు అనుగుణంగా ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజారోగ్యశాఖ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. రక్షిత మంచినీటికోసం అల్లాడుతుంటారు. ప్రజారోగ్యశాఖ గ్రామ జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం విజ్ఞప్తుల మేరకు పనులను చేపట్టాల్సి ఉంటుంది. రోడ్లు భవనాలు: గ్రామాల అభివృద్ధిలో రోడ్లు భవనాల శాఖ పాత్ర కీలకం. గ్రామంలో రోడ్డు, కల్వర్టులు, వంతెనలు, కాల్వలు నిర్మాణాల్లో పంచాయతీ పాలకవర్గంతో కలిసి ఈ శాఖ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. డీఆర్డీఏ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల్లో దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. గ్రామంలో ప్రజల జీవన విధానం, స్థితిగతుల గురించి పంచాయతీ పాలకవర్గానికి తెలిసినంత అధికారులకు తెలియదు. ఏ పథకం అమలు చేయాలన్నా ముందుగా వారి సూచనలు, సలహాలను, ప్రతిపాదనలను తీసుకోవాలి. విద్యుత్‌శాఖ: గ్రామీణ విద్యుద్దీకరణలో విద్యుత్ శాఖ పాత్ర కీలకం. గ్రామంలో విద్యుత్ పనుల అమలు విషయంలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు పంచాయతీ ప్రతిపాదనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అలాంటిదేది ప్రస్తుతం ఎక్కడా జరగడంలేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇతర శాఖలు: ప్రజాపంపిణీ వ్యవస్థ, బలహీనవర్గాల సంక్షేమం, సాంఘీక సంక్షేమం, మహిళలు, శిశు సంరక్షణ, వైద్యం, మార్కెట్ల ఏర్పాటు, గ్రంథాలయాల నిర్వహణ, వయోజన విద్య, అనియత విద్య, సాంకేతిక శిక్షణ, వృత్తిపరమైన విద్య, సంప్రదాయేతర ఇంధన వనరులు, సామాజిక ఆస్తుల నిర్వహణ తదితర వాటి విషయంలో సంబంధిత శాఖలు పంచాయతీలతో నిమిత్తం లేకుండానే తమ సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రతిపాదనలను రూపొం దించి అమలు చేస్తున్నాయి. గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు గ్రామీణులకు అందడం లేదు. కనీసం ఇప్పుడైనా.. పంచాయతీ పాలకవర్గాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొలువుదీరాయి. కనీసం ఇప్పుడైనా పంచాయతీలకు 29 ప్రభుత్వశాఖల బదలా యింపు జరిగేనా? ప్రభుత్వ శాఖలపై పంచాయతీలు అజమాయిషీ చేసే అధికారం దక్కేనా? అన్నది వేచి చూడాల్సిందే. -
‘పవర్’ లేని పదవి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సర్పంచులు గెలిచి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వారికి చెక్‌పవర్ ఇవ్వలేదు. హామీలిచ్చి గెలిచిన నాయకులు మాట నిలబెట్టుకోలేక.. ప్రజలకు సమాధానం ఇవ్వలేక లోలోన మదన పడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు చేయిద్దామని ముందుకు వచ్చే సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. కావాల్సిన నిధులు ఖాతాల్లో పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సొంత ఖర్చులతో పనులు.. గెలిచిన ఆనందంలో కొత్త సర్పంచ్‌లు సొంత ఖర్చులతో గ్రామాల్లో కొన్ని పనులు చేయించారు. పంచాయతీ కార్యాలయాల్లో ఫర్నీచర్ కొనుగోలు, వీధి లైట్ల మరమ్మతులు, తాగునీటి అవసరాల ఏర్పాట్లు, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం, సిబ్బందికి జీతాలు, మరుగుదొడ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వంటికి చేతినుంచి ఇచ్చి చెక్‌పవర్ వచ్చాక బిల్లులు చేసుకుందామని అనుకున్నారు. కానీ ఆ అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల వసూలైన పన్నులతో సిబ్బందికి కొంత వరకు జీతాలు ఇస్తుండగా, మరుగుదొడ్ల నిధులు జీపీల ఖాతాల్లో ఉన్నా విడిపించలేక పోతున్నారు. పెరిగిన అదనపు ఖర్చులు గెలిచిన సర్పంచ్‌లంతా ఫిబ్రవరి 2వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. సీట్లో కూర్చొగానే వారికి సమస్యలు స్వాగతం పలికాయి. వీధి లైట్లు, గేట్‌వాల్వ్‌లు లీకవుతున్నాయని, నెలల తరబడి మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలని ప్రజలనుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం పాడైన విద్యుత్ మోటార్ల స్థానంలో కొత్తవి బిగించాలని కోరారు. దీంతో గెలిచిన ఉత్సాహంతో సర్పంచ్ ప్రజల విన్నపాలకు స్పందించి సొంత ఖర్చులతో పనులు చేయించారు. తెలిసిన వారి దుకాణాల్లో ఖాతాలు తెరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. చెక్‌పవర్ రాబోతుందని తెలిసి నిధులు డ్రా చేసి బకాయిలు చెల్లించవచ్చని భావించారు. తీరా నెలలు గడుస్తున్నా సర్పంచ్‌లకు చెక్ పవర్ రాలేదు. దీంతో బిల్లుల చెల్లింపు పెండింగ్ పడింది. సిబ్బంది వేతనాలకూ ఇబ్బంది మండల కేంద్రాలుగా పంచాయతీల్లో సుమారు 10 మంది వరకు సిబ్బంది పని చేస్తుంటారు. చిన్న పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు పని చేస్తారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, విద్యుత్ మెకానిక్‌లు, రోడ్లు, మురికి కాల్వలు శుభ్రం చేసే కార్మికులు ఉంటారు. పన్నుల రూపేన వసూలు చేసిన డబ్బులను ఉద్యోగులు ఏ రోజుకారోజు జీపీ ఖాతాలో జమ చేస్తారు. వీరందరికి ప్రతి నెల పంచాయతీ నుంచే జీతాలు చెల్లించాలి. కొత్త సర్పంచ్‌లు తమ జీపీ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించ లేకపోతున్నారు. కొన్ని చోట్ల పన్నుల రూపేన వసూలు చేసిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఒక్కొక్కరికి జీతాలు చెల్లిస్తారు. అభివృద్ధిపై ప్రభావం కొత్త పాలకులు కొలువుదీరినా అధికారాలు బదిలీ కాకపోవడంతో గ్రామ పాలన పూర్తిగా గాడి తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ప్రకటించినట్లుగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ అప్పగించిన కొంత మేరకు గ్రామ సర్పంచ్‌లకు చెక్ పవర్ అప్పగించిన కొంత మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కానీ చెక్ పవర్ సర్పంచ్‌లకు ఇస్తే నిధులు దుర్వినియోగం జరుగుతుందన్న వాదన కూడా లేక పోలేదు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో తాగునీరు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పనులకు సర్పంచ్‌లు సొంత ఖర్చులతో చేయిస్తుండడంతో వారి బేబులకు చిల్లు పడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులకు బ్రేక్ కేంద్రం ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టింది. పంచాయతీల ద్వారా ఒక్కో మరుగుదొడ్డి నిర్మించినందుకు గాను రూ.12 వేలు అందిస్తోంది. లబ్ధిదారులకు మొదటి దఫా 6 వేలు, రెండో దఫా 6 వేల చెక్కుల రూపంలో అందుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్ధిదారుల పేర్లపై బిల్లులు చేసి జీపీ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేని కారణంగా కూడా బిల్లులకు బ్రేక్ పడినట్లవుతోంది. కారణాలేంటో? కొత్త సర్పంచ్‌లకు చెక్‌పవర్ రాకపోవడానికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మాట్లాడగా కొన్ని కారణాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన పంచాయతీ రాజ్ చట్టం–2018లో తొలుత సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి చెక్‌పవర్ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ స్థానంలో పంచాయతీ కార్యదర్శలకు చెక్‌పవర్ ఇవ్వాలని పేర్కొనలేదు. దీంతో సర్పంచ్‌లతో కలిపి ఎవరికీ చెక్‌పవర్ ఇవ్వాలో తేలలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్పా తామేమి చేయలేమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పుల పాలవుతున్నాం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిధుల్లేక చేతినుంచి పెట్టుకుని అప్పుల పాలవుతున్నాం. ఎన్నో ఆశలతో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యాం. కానీ చెక్ పవర్ లేక ప్రజల సమస్యలను పరిష్కరించలేక పోతున్నాం. కనీసం నీటి సమస్య, వీధి లైట్ల సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. చెక్ పవర్‌ను త్వరగా ఇస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాపూర్ సర్పంచ్ ఓపిక పట్టండి.. తప్పదు సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే ఎంపీడీఓలకు ఆదేశాలు ఇస్తాం. ఎంపీడీఓలు తమ పరిధిలో గల బ్యాంకులకు లేఖలు రాస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేదాక సర్పంచ్‌లు ఓపిక పట్టాలి తప్పదు. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
కొలువుదీరారు
వనపర్తి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో శనివారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరు ఐదేళ్ల పాటు పాలన సాగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాత, కొత్త గ్రామ పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 2013 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018 జూలై 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. తెలంగాణ సర్కారు వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీల పాలనబాధ్యతలను అధికారులకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల మూడు విడతలుగా 2019 జనవరిలో నిర్వహించింది. ఈ మేరకు శనివారం పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వారితో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు అను నేనూ.. అంటూ ఎమ్మెల్యే, ఎంపీల తరహాలోనే ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 45 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 210 పంచాయతీలకు అధికారులు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన వార్డు సభ్యులలో ఒకరిని, మిగతావారి మద్దతుతో అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఏడునెలల విరామం తర్వాత.. 2018 జూలై 31 నాటికి పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రభుత్వం పంచాయతీ పాలన అధికారులకు అప్పగించటంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో అధికారికి రెండు, అంతకంటే ఎక్కువ పంచాయతీల పాలన అప్పగించటంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదు. -
ముహూర్తం నేడే...
కోస్గి (కొడంగల్) : అటు ప్రజలు.. ఇటు పల్లెలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.. సరిగ్గా ఆరు నెలల అనంతరం గ్రామపంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, పాలకవర్గాలు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇదే రోజు పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంతో పాటు మామిడి ఆకుల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు.. స్వపరిపాలన నినాదంతో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో తొలిసారి పాలన మొదలుకానుండడంతో ఆయా పంచాయతీల్లో సందడి నెలకొంది. 733.. 721.. 719 జిల్లాలో గతంలో 468 గ్రామపంచాయతీ ఉండేది. స్వపరిపాలన నినాదంతో కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాలోని 265 ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసింది. ఇందులో 107 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరగా.. ఇందులో 12 జీపీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో జీపీల సంక్య 721కి చేరింది. అయితే, జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి, శంకరాయపల్లి తండాల పాలకవర్గాల గడువు ఇంకా ముగియలేదు. ఫలితంగా జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1వ తేదీన వెల్లడించింది. ఈ మేరకు మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా తొలి విడత జనవరి 21న 10 మండలాల్లోని 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల్లో, రెండో విడతగా జనవరి 25న ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడతగా 30వ తేదీన ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీలు, 2,024 వార్డుల్లో పోలింగ్, లెక్కింపు జరిపి విజేతల వివరాలను ప్రకటించారు. టీఆర్ఎస్ హవా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను ఏకగ్రీవం చేసేందుకు యత్నించారు. అలా వారి కృషి ఫలించి మొత్తంగా 126 జీపీల కార్యవర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. మిగతా వాటికి మాత్రం మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఏకగ్రీవమైన వాటితో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 503 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 47 స్థానాలను, స్వతంత్రులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకున్నట్లయింది. ఆరు నెలల అనంతరం అంతకుముందు ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు గత ఏడాది ఆగస్టు 2న ముగిసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక డిసెంబర్ మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జనవరి 30న ముగిసింది. ఇక 2వ తేదీ శనివారం అని గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించింది. అంటే సరిగ్గా ఆరు నెలల తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది. ఇందులో 265 కొత్త పంచాయతీలు ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. -
కొత్తగా...
చుంచుపల్లి/బూర్గంపాడు: కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లాలో గతంలో ఉన్న 205 పంచాయతీలకు తోడుగా మరో 276 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. పాత 205 పంచాయతీల్లో 2 పంచాయతీలు సారపాక, భద్రాచలం పురపాలక సంఘాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. దీంతో పాత పంచాయతీలు 203, కొత్త పంచాయతీలు 274తో కలిపి మొత్తం 477 పంచాయతీల్లో పరిపాలన శనివారం నుంచి మొదలు కానుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 479 పంచాయతీలకు 54 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీల్లోఎన్నికలు నిర్వహించలేదు. జిల్లావ్యాప్తంగా 477 పంచాయతీలో జిల్లా వ్యాప్తంగా కొత్త పాలక మండళ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. కొత్త పంచాయతీల్లో సమస్యల తిష్ట జిల్లాలో ఇటీవల ఏర్పాటైన 276 కొత్త పంచాయతీల్లో పక్కా భవనాలు లేవు. పాత పంచాయతీల్లోనూ పూర్తిస్థాయిలో భవనాల సమస్య వెంటాడుతూనే ఉంది. 276 కొత్త పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో ఆగస్టు 2 తేదీ నుంచి అద్దె భవనాల్లోనే పరిపాలనను కొనసాగిస్తున్నారు. వాటి నిర్మాణాలకు కేంద్రం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలు వరకు కేటాయిస్తోంది. కొత్త పంచాయతీలు ముందుగా పంచాయతీ భవనాల నిర్మాణాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పంచాయతీల్లో సరిపడా గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. ఆర్థిక వనరులపై దృష్టి సారించాలి పంచాయతీ పాలకవర్గాలు ఆదాయాన్ని సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ నిధులు కాకుండా పంచాయితీకి స్వయంగా సృష్టించుకోవాలి.అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయితీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. చేపలచెరువుల నిర్వహణ, బందెలదొడ్లు, వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టాలి. పంచాయతీలకు ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా,మండల పరిషత్ నిధులు, సంతల నిర్వహణ ద్వారా నిధులు, ఎంపీ,ఎమ్మెల్యేల నిధులు, ఉపాధిహామీ ద్వారా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకంలో గ్రామపంచాయతీ భవనాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదులు, భోజనశాలలు ఏర్పాటు చేసుకునే వీలుంది. కొత్త పాలకవర్గాలు 14వ ఆర్థికసంఘం నిధులు అందుబాటులో ఉంటాయి. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనులు,అనుబంధ గ్రామాల ప్రజలకు కొత్త పంచాయతీలతో సుపరిపాలన చేసుకునే అవకాశం దక్కింది. అభివృద్ధి సం క్షేమంలో ఇతర గ్రామాలతో పోటీ పడే అవకాశం చిన్న గ్రామాలకు దక్కనుంది. పాలన గిరిజనులదే.. కొలువుదీరనున్న 477 పంచాయతీల్లో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డే ఉన్నాయి. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారడంతో గిరిజనులకు స్వయంగా పాలించుకునే అవకాశం లభించింది. సుమారు 95శాతం వరకు సర్పంచులు, వార్డు సభ్యులు గిరిజనులే ఉన్నారు. ఇక నుంచి గ్రామపాలన వీరి ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సహజంగా గిరిజనులలో ఉండే ఐక్యతను గ్రామాభివృద్ధిలో చాటుకుంటే గ్రామాల్లో అభివృద్ధికి బీజం పడుతుంది. నేటి నుంచి కొత్త పాలనకు శ్రీకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇటీవల ఎంపికైన నూతన పాలక మండళ్లు శనివారం ప్రమాణ స్వీకారం చేస్తాయి. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో పరిపాలన నేటి నుంచి అమల్లోకి వస్తుంది. –ఆర్.ఆశాలత, డీపీవో నూతన పంచాయతీలకు కార్యాలయ భవనాలు కరువు అశ్వాపురం: నూతన పాలకవర్గాలకు పంచాయతీ కార్యాలయ భవనాల సమస్య తలనొప్పిగా మారనుంది. నూతనంగా కొత్త పంచాయతీలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించలేదు. నేడు నూతన పంచాయతీ పాలకవర్గాలు అరకొర వసతులతో అద్దె భవనాలలోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. పాత పంచాయతీ కార్యాలయాలకు పలు గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పలు చోట్ల పనులు పూర్తి కాలేదు. కొత్త పంచాయతీలు ఏర్పాటై ఆరు నెలలు గడిచినా అద్దె భవనాలలోనే అరకొర వసతులతో పంచాయతీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అద్దె భవనాల్లో ఫర్నిచర్ కూడా లేదు. ప్రభుత్వం స్పందించి నూతన పంచాయతీలకు గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేయాలని నూతన పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు. -
రేపే ముహూర్తం
పాపన్నపేట(మెదక్): కొత్త సర్పంచ్‌లు కొలువు దీరేందుకు ఫిబ్రవరి 2వ తేదీ ముహూర్తం ఖరారయ్యింది. గతేడాది ఆగస్టు 2 నుంచి నేటి వరకు 184 రోజుల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. నేటితో ఈ పాలనకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పిస్తు.. వారి విధులు.. అధికారాలు గురించి వివరించేందుకు 11వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మెదక్ కొత్త జిల్లాగా అవతరించినపుడు మొదట 312 గ్రామంచాయతీలు ఉండేవి.అయితే 500 జనాభా గల గిరిజన తండాలను, మధిర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 157 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే ఎనిమిది గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 4,58,325 ఓటర్లున్నారు. ఇందులో 90 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 2న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈమేరకు అపాయింట్మెంట్ డే గా నిర్ణయిస్తూ పంచాయతీరాజŒ æశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అతే ఆ రోజు జరిగే సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేస్తారు. ఆరోజు నుంచి 5 ఏళ్ల పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది. ఫిబ్రవరి 11 నుంచి శిక్షణ కొత్త సర్పంచ్‌లకు విధులు, అ«ధికారాలు, బాధ్యతలు తదితర విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ 11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉండనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 3 నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇస్తారు. పదవీ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేసేందుకు వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 2వ తేదీన ఉదయం స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి చార్జి అప్పగిస్తారు. ఈ మేరకు మినిట్స్‌లో నమోదు చేస్తారు. –హనోక్, డీపీఓ శిక్షణ మంచి కార్యక్రమం నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, సర్పంచ్ విధులు, అధికారాలు, గ్రామ సభల ఏర్పాటు, హరితహారం, బాధ్యతలు, ఆదర్శ గ్రామావృద్ధి తదితర విషయాలు, రికార్డుల నిర్వాహణ గురించి ఎక్కువగా తెలియదు. అందు వల్ల సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సంతోషం. –కలాలి నవీన్‌గౌడ్, కొత్త లింగాయపల్లి -
ఆఖరి మోఖా !
జెడ్పీలో అడ్డగోలుగా పనులు - నామినేషన్ల పద్ధతిన అప్పగిస్తున్న అధికారులు - నెలాఖరులో ఉన్నతాధికారి రిటైర్మెంట్ - కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం - కొత్త పాలక మండలి కొలువుదీరే ముందు హడావుడిపై సందేహాలు - పాత తేదీలతోనే ఆమోదం సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్‌లో పద్ధతి మారింది. పనుల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా... పట్టించుకోని జెడ్పీ అధికారులు ఇప్పుడు పిలిచి మరీ ఇస్తున్నారు. ఎండాకాలం లో గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారుతుందని ముందే పనుల ప్రతిపాదనలు పంపిన సర్పంచ్‌లను అప్పుడు పక్కనబెట్టారు. వర్షాలు మొదలవుతున్న తరుణంలో ఆ పనులకు ఇప్పుడు ఆమోదం తెలుపుతున్నారు. ఇది కూడా వేగంగా జరుగుతోంది. అధికారుల్లో ఇంత పెద్ద మార్పునకు కారణం ఏమై ఉంటుందనేది జిల్లా పరిషత్‌లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న అధికారి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈయన రిటైర్మెంట్కు ముందు... కొత్త పాలకమండలి వచ్చే తరుణంలో పనుల కేటాయింపు విషయం లో జిల్లాపరిషత్ అధికారుల అత్యుత్సాహం చూపుతుండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధనలు ఇప్పుడు లేవు ! జిల్లా పరిషత్‌కు పాలకమండలి లేక మూడేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులు లేని ఈ మూడేళ్ల ప్రత్యేక పాలన కాలంలో అధికారులే అధికారం చెలాయించారు. తాజాగా.. కొత్త పాలకమండలి ఏర్పాటుకు ముందు పనుల కేటాయింపులో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. గ్రామ పంచాయ తీ ఎన్నికల తర్వాత ఆయా గ్రామాల్లో అవసరమైన పనుల మంజూరు కోసం కొత్త సర్పంచ్‌లు కాళ్లరిగేలా జిల్లా పరిషత్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అరునా... ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇదే జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు పిలిచి మరీ పనులు కేటాయిస్తున్నరు. పనుల మంజూరుకు సంబంధించిన అన్ని అంశాలను జిల్లా పరిషత్‌లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారులే చూసుకుంటున్నారు. పనుల మంజూరుకు అవసరమైన పత్రాలన్నీ కచ్చితంగా ఉండాలని గతంలో నిబంధనల పేరిట చేతులు దులుపుకున్నారు. తాజాగా లేని కాగితాలు, పనుల ప్రతిపాదనలను వారే తయారు చేసి వేగంగా ఆమోదం తెలుపుతున్నారు. పాత తేదీలతో ఆమోదం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీ ఎఫ్), 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ), సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధు లు కేటాయిస్తుంది. గ్రామాల్లో తాగునీటి సరఫ రా కోసం అవసరమైన పైపులైన్ల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి పనులను నామినేషన్లపై జిల్లా పరిషత్ మంజూరు చేస్తుంది. రూ.5 లక్షల పనులకు సంబంధించి మాత్రమే ఇలా కేటాయిస్తారు. ఈ పనుల కో సం గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలి. దీని ఆధారంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనుల కేటాయింపుపై ప్రతిపాదనలను జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. జెడ్పీ సీఈఓ ద్వారా కలెక్టర్ ఆమోదంతో పనుల కేటాయింపు జరుగుతుంది. ఇన్నాళ్లు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓ వరకు వచ్చి ఆగినపనుల ప్రతిపాదనలు ఇప్పుడు వేగంగా కదులుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో పెట్టిన ప్రతిపాదనల దరఖాస్తులు ఇప్పుడు పాత తేదీలతో ఆమోదం పొందుతున్నాయి. రికార్డుల్లో తేడా రాకుండా ఉండేందుకు కొన్ని కొత్త ప్రతిపాదనలకు సైతం పాత తేదీల తో తీర్మానం లేఖలు తీసుకుని మరీ పనులు కేటాయిస్తున్నారు. బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సం ఘం, ఎస్ఎఫ్సీ, సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ జనవరి నుంచి ఈ నెల వరకు 82 పను ల కోసం 3.72 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వేసవిలో అవసరమైన పను లే ఉన్నాయి. నర్సంపేట, పాలకుర్తి, జనగామ, భూపాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఇలా ఎక్కువ పనులు కేటాయించారు. -
పడకేసిన పాలన
ఉదయగిరి రూరల్/ సంగం, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై నెల రోజులు దాటినా ఇంత వరకూ ‘పవర్’ దక్కలేదు. గ్రామాల అభివృద్ధిలో కీలకమైన సర్పంచ్‌లకు ‘చెక్’ పెడుతూ పవర్‌కు ఆంక్షలు విధించింది. రెండేళ్లుగా పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన కొనసాగింది. సర్పంచ్‌లు ఎన్నికైనా ‘చెక్‌పవర్’ లేకపోవడం, సమైక్య ఉద్యమం ప్రభావంగా ప్రస్తుతం అనివార్యంగా ప్రత్యేక పాలనే అమలవుతోంది. ప్రస్తుత పరిణామాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ ఎన్నికలు ముగిసీ ముగియక ముందే సోనియాగాంధీ సీడబ్ల్యూసీ నిర్ణయంగా రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రకటించింది. దీంతో సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పవర్‌పై ఆంక్షలు విధిస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విధాన నిర్ణయాన్ని సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఏపీ ఎన్జీఓల సమ్మె కారణంగా కొత్త ఉత్తర్వులు కూడా సంబంధిత పంచాయతీ కార్యాలయాలకు అందలేదు. పంచాయతీ కార్యదర్శులూ సమ్మెలో ఉన్నారు. జాయింట్ చెక్‌పవర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నా.. మండల పరిషత్‌ల నుంచి జిల్లా కలెక్టరేట్ల వరకు అన్నీ మూతపడి ఉండటంతో సర్పంచులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్‌లకు మాత్రమే చెక్ పవర్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల డ్రా చేసుకునే వీలు కూడా లేదు. పంచాయతీల బిల్లులు, చెక్‌లు క్లియర్ చేసే ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పంచాయతీ నిధుల్లో రూపాయి ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన తలపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, సమస్యల పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. మురుగు కూపాలుగా పల్లెలు సర్పంచ్ల పాలన వచ్చినా తాజా పరిస్థితుల్లో ప్రత్యేక పాలనే తలపిస్తోంది. ఫలితంగా పారిశుధ్యం, తాగునీరు సమస్యలు జఠిలమవుతున్నాయి. ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఇటీవల అడపా దడపా వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కాలువల్లో మురుగు పేరుకుపోయి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధిలైట్లు వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రోడ్డు నిర్మాణం, ట్యాంకుల్లో క్లోరినేషన్ వంటి పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. పంచాయతీల్లో నూతన పాలక వర్గం కొలువు తీరినా సర్పంచ్‌లకు చెక్ ‘పవర్’ లేకపోవడంతో ఈ దుస్థితి నెల కొంది. కొన్ని గ్రామాల్లో ఆర్థిక స్తోమత ఉన్న సర్పంచ్‌లు తమ సొంత నిధులు వెచ్చించి తాగునీరు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఖాతాల్లో నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగించుకునేందుకు చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది. సంగం మండలంలోని సిద్దీపురం, దువ్వూరు, సంగం, కొరిమెర్ల, చెన్నవరప్పాడు పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీరు సమస్యలు తిష్టవేశాయి. ము రుగునీరు ముందుకు కదలక దోమలు ప్రబలుతున్నాయి. గతంలో సంగంలో డెంగీతో అనేక మంది మృత్యువాత పడిన దాఖలాలు ఉన్నాయి. రెండు రోజులుగా ఆత్మకూరు, వింజమూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో విష జ్వరం, డెంగీతో పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ చిత్తడిగా మారాయి. ఇప్పటికైనా కొత్త సర్పం చులు, అధికారులు చొరవ తీసుకోకపో తే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దోమల బెడద ఎక్కువైంది చెత్తా చెదారం నిల్వతో దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి. వెంకటలక్ష్మమ్మ, కొరిమెర్ల, సంగం