వనపర్తి మండలం చందాపూర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సన్మానం చేస్తున్న గ్రామస్తులు
వనపర్తి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో శనివారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరు ఐదేళ్ల పాటు పాలన సాగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాత, కొత్త గ్రామ పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 2013 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018 జూలై 31న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. తెలంగాణ సర్కారు వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీల పాలనబాధ్యతలను అధికారులకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల మూడు విడతలుగా 2019 జనవరిలో నిర్వహించింది.
ఈ మేరకు శనివారం పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వారితో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు అను నేనూ.. అంటూ ఎమ్మెల్యే, ఎంపీల తరహాలోనే ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 45 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 210 పంచాయతీలకు అధికారులు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన వార్డు సభ్యులలో ఒకరిని, మిగతావారి మద్దతుతో అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారు.
ఏడునెలల విరామం తర్వాత..
2018 జూలై 31 నాటికి పాత సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రభుత్వం పంచాయతీ పాలన అధికారులకు అప్పగించటంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో అధికారికి రెండు, అంతకంటే ఎక్కువ పంచాయతీల పాలన అప్పగించటంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment