Telangana Panchayat Elections 2019
-
కాకి లెక్కలు
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఏరులై పారిన మద్యం.. యథేచ్ఛగా డబ్బుల పంపిణీ సర్వవిధితమే.. పోటా పోటీగా సాగిన అభ్యర్థుల ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. మేజర్ పంచాయతీల్లో రూ. కోటిన్నర వరకు అభ్య ర్థులకు వ్యయం అయినట్లు అంచనా.. కాగా వారు ఎన్నికల సంఘానికి చూపిన లెక్కలు విస్మయపరుస్తున్నాయి. మోర్తాడ్ (బాల్కొండ): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ప్రచార ఖర్చు లెక్కలను మొక్కుబడిగానే చూపారని తెలుస్తోంది. అభ్యర్థులు ప్రచారం కోసం రూ.లక్షలు కుమ్మరించగా ఎన్నిక ల సంఘానికి మాత్రం రూ.వేలల్లోనే ఖర్చు చేసినట్లు చూపి నట్లు అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందించిన నివేదికలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. గడచిన ముందస్తు శాసనసభ ఎన్నికలను తలపించేలా పంచాయతీ ఎన్నికలు సాగా యి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్య ర్థి తమ గెలుపు కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు గ్రామాల్లో జరిగిన విందు రాజకీయాల ద్వారా స్పష్టమైంది. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్న లెక్కలను చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో 330 గ్రామ పంచాయతీలకు గాను 4,932 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు సర్పంచ్, 11 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. అలాగే కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలకు గాను 4,642 వార్డు స్థానాలు ఉన్నాయి. కొన్ని పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా మరి కొన్ని చోట్ల, సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే కొన్ని పంచాయతీల్లో వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అయితే అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చేసిన ప్రచారంకు సంబంధించిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అం దించాల్సి ఉంది. 5 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీ ల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచారం కోసం రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ఎన్నికల సంఘం పరిమితిని విధిం చింది. వార్డు సభ్యులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అలాగే 5 వేలకు తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు. వాల్ పోస్టర్లు, డోర్ స్టిక్కర్లు, మద్దతు దారులకు టీ, టిఫిన్, భోజనం, టెంట్, ఆటో లేదా ఇతర వాహనాలకు మైక్ సెట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించడం తదితర వాటికి మాత్రమే అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంది. ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి పోటీ జరిగిన స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారని అంచనా. వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. మద్యం, మాంసాలతో విందులకే కాకుండా ప్రచార సామగ్రి కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితమైన ఖర్చులనే అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందిస్తున్నారు. ఈనెల 9లోగా ఆయా మండలాల్లో అభ్యర్థులు తమ ప్రచారం లెక్కలను చూపాలని లేదంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించడంతో అభ్యర్థులు ఆదరబాదరగా లెక్కలను అప్పగించారు. మొక్కుబడిగా లెక్కలను రాసి తప్పుడు రసీదులను జత పరిచి వ్యయ పరిశీలకులకు ప్రచారానికి సంబంధించిన లెక్కలను అభ్యర్థులు అప్పగించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన వ్యయానికి, చూపుతున్న లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉంది. -
ఈసారి పక్కా!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా వ్యాప్తంగా జనవరి 30తో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కానీ 30 పంచాయతీల్లో కోరం లేక పోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతనెల 30వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మరుసటిరోజు సాయంత్రం వరకు ఉప సర్పంచులను ఎన్నుకోవడానికి గడువు ఉంటుంది. ఆ సమయం వరకు ఎన్నికలు పూర్తి కాకపోతే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ జారీ జిల్లాలో మిగిలిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికకు సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ పదవికి పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. మొదటి విడుతలో కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట్, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలో కలిపి 249 పంచాయతీలు, 2,274 వార్డులో జనవరి 21వ తేదీన పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట్, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో జనవరి 25వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక మూడో విడతలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దుర్, కోస్గీ మండలాల్లో 227 పంచాయతీలు, 2,024 వార్డులో జనవరి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించారు. వాటిలో 30 స్థానాలు మినహా 689 గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచ్ ఎన్నికలను జిల్లా ఎన్నిల అధికారులు పూర్తి చేశారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. పెరిగిన పోటీ.. మొదటి విడతలో 13, రెండో విడతలో 7, మూడో విడదలో 10 స్థానాల్లోని ఉపసర్పంచ్‌కు ఎన్నిక నిర్వహించనున్నారు. అత్యధికంగా మక్తల్, అడ్డాకుల, నారాయణపేట, కోయిల్‌కొండ మూడేసి ఉప సర్పంచులు, దన్వాడ, హన్వాడ, కోస్గి, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఒక్కొక్క ఉప సర్పంచ్ ఎన్నిక జరుతుంది. అడ్డాకుల, బలీద్‌పల్లి, కన్మానూర్, బాల్నగర్ మండలంలో మన్నేగూడెంతండా, నేరళ్లపల్లి, సీసీకుంట మండలంలో నెల్లకొండి, ఉంద్యాల, దామరగిద్ద మండలంలో కంసాన్పల్లి, ధన్వాడలో కిష్టాపూర్, గండీడ్ మండలంలో చౌదర్పల్లి, ధర్మాపూర్, హన్వాడ మండలంలో బుద్దారం, జడ్చర్ల మండలంలో ఈర్లపల్లి, కోడ్గల్, కోయిల్‌కొండ మండలంలో అనంతపూర్, లింగాల్చేడ్, శేరివెంకటాపూర్, కోస్డి మండలంలో హన్మాన్‌పల్లి, మద్దూరు మండలంలో నందిగామ, ఎక్కామేడ్, మక్తల్ మండలంలో కర్ని, రుద్రసముద్రం, సంగంబండ, మిడ్జిల్ మండలంలో బోయినపల్లి, మసిగుండ్లపల్లి, నారాయణపేట్ మండలంలో అమ్మిరెడ్డిపెల్లి, అప్పిరెడ్డిపల్లి, షెమాపల్లి, నర్వ మండలంలో ఎల్లంపల్లి, ఊట్కూర్ మండలంలో పులిమామిడి గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచి ఎన్నిక జరగనుంది కోరం లేకున్నా.. ఉప సర్పంచ్ ఎన్నికకు ఎలాంటి కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహించనున్నారు. కోరం అవసరం లేకున్నా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దానికి అనుగుణంగానే 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చా యి. దానికి అనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారిలో ఒక్కరిని కచ్చితంగా ఉప సర్పంచ్‌గా ఎన్నిక జరుపనున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మిగిలి పోయిన 30 స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తాం. కోరం ఉంటేనా సరి.. లేకున్నా ఎన్నిక మాత్రం ఆగదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి -
గ్రామాల్లో గులాబీ బలగం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గ్రామాల పాలక మండళ్లే పార్టీ నిర్మాణంగా మారిన అరుదైన అవకాశం అధికార టీఆర్ఎస్కు లభించింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులు, వార్డు సభ్యులే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో గ్రామస్థాయిలో పార్టీకి బలమైన బలగం లభించినట్లయింది. టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేకపోగా, గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన పాలక మండళ్లే గ్రామ కమిటీలుగా క్రియాశీలక పాత్రపోషించబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్కు ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొలి నుంచీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్ల నియామకంతోనే సరిపెట్టే పార్టీలో మిగతా వారంతా జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులుగానే చలామణి అవుతున్నారు. పార్టీ ఏర్పాటైన తొలినాళ్లలో 2004, 2009లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయాలు నమోదు చేసుకున్నప్పటికీ, సంస్థాగతంగా మండల, జిల్లా కార్యవర్గాల ఏర్పాటు జరగలేదు. ఇక 2014లో పార్టీ అధికారం చేపట్టినా, అదే పరిస్థితి. తాజాగా 2018 ఎన్నికల్లో సైతం పార్టీ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. 18 సం వత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎలాంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించని టీఆర్ఎస్కు ఈసారి ఏకంగా అధికార హోదాలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం ఏర్పాటు కావడం అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. 933 పంచాయతీల్లో గులాబీదే హవా! ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 1,508 గ్రామ పంచాయతీలకు గాను 1,493 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన గ్రామాలు కలుపుకొని 933 పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచు అభ్యర్థులే విజయకేతనం ఎగరేశారు. ఒక్కో గ్రామంలో 6 నుంచి 12 మంది వార్డు సభ్యులు కూడా ఆ పార్టీ మద్ధతుదారులే. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాజకీయ పార్టీల ఏకీకరణ పేరుతో ఇతర పార్టీలకు చెందిన వారందరినీ గులాబీ గూటికి చేర్చుకొంది. . ఇటీవల పం చాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతోపాటు ఓడిపోయిన వారు కూడా టీఆర్ఎస్ మద్ధతుదారులే ఎక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఆ పార్టీకి చెంది న వారే అధికం. ఇప్పుడు గ్రామ కమిటీలు కూడా టీఆర్ఎస్ చేతికే చిక్కడంతో సంస్థాగత పార్టీ ని ర్మాణంతో సంబంధంలేకుండా...అధికార హోదా ల్లో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. కాంగ్రెస్‌కు 265 పంచాయతీలే.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఆసిఫాబాద్‌లోనే స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 82 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఆదిలాబాద్‌లో 65, కుమురంభీంలో 67, మంచిర్యాలలో 51 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఎందరు కాంగ్రెస్‌లో కొనసాగుతారనేది ప్రశ్న. ఇక స్వతంత్రులు గెలిచిన 249 స్థానాల్లో 200 మందికి పైగా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన టీఆర్ఎస్ అదే ఊపుతో రాబోయే ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తుండగా, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఏడు మున్సిపాలిటీలకు తోడు మరో నాలు గు కొత్తవి ఏర్పాటు కాబోతున్నాయి. 11 మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ, గ్రామాల్లోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎంపీ అభ్యర్థుల విజయానికి దోహదపడే అవకాశం ఉంది. -
కొలువుదీరారు
వనపర్తి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో శనివారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరు ఐదేళ్ల పాటు పాలన సాగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాత, కొత్త గ్రామ పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 2013 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018 జూలై 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. తెలంగాణ సర్కారు వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీల పాలనబాధ్యతలను అధికారులకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల మూడు విడతలుగా 2019 జనవరిలో నిర్వహించింది. ఈ మేరకు శనివారం పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వారితో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు అను నేనూ.. అంటూ ఎమ్మెల్యే, ఎంపీల తరహాలోనే ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 45 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 210 పంచాయతీలకు అధికారులు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన వార్డు సభ్యులలో ఒకరిని, మిగతావారి మద్దతుతో అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఏడునెలల విరామం తర్వాత.. 2018 జూలై 31 నాటికి పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రభుత్వం పంచాయతీ పాలన అధికారులకు అప్పగించటంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో అధికారికి రెండు, అంతకంటే ఎక్కువ పంచాయతీల పాలన అప్పగించటంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదు. -
ముహూర్తం నేడే...
కోస్గి (కొడంగల్) : అటు ప్రజలు.. ఇటు పల్లెలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.. సరిగ్గా ఆరు నెలల అనంతరం గ్రామపంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, పాలకవర్గాలు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇదే రోజు పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంతో పాటు మామిడి ఆకుల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు.. స్వపరిపాలన నినాదంతో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో తొలిసారి పాలన మొదలుకానుండడంతో ఆయా పంచాయతీల్లో సందడి నెలకొంది. 733.. 721.. 719 జిల్లాలో గతంలో 468 గ్రామపంచాయతీ ఉండేది. స్వపరిపాలన నినాదంతో కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాలోని 265 ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసింది. ఇందులో 107 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరగా.. ఇందులో 12 జీపీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో జీపీల సంక్య 721కి చేరింది. అయితే, జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి, శంకరాయపల్లి తండాల పాలకవర్గాల గడువు ఇంకా ముగియలేదు. ఫలితంగా జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1వ తేదీన వెల్లడించింది. ఈ మేరకు మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా తొలి విడత జనవరి 21న 10 మండలాల్లోని 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల్లో, రెండో విడతగా జనవరి 25న ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడతగా 30వ తేదీన ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీలు, 2,024 వార్డుల్లో పోలింగ్, లెక్కింపు జరిపి విజేతల వివరాలను ప్రకటించారు. టీఆర్ఎస్ హవా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను ఏకగ్రీవం చేసేందుకు యత్నించారు. అలా వారి కృషి ఫలించి మొత్తంగా 126 జీపీల కార్యవర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. మిగతా వాటికి మాత్రం మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఏకగ్రీవమైన వాటితో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 503 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 47 స్థానాలను, స్వతంత్రులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకున్నట్లయింది. ఆరు నెలల అనంతరం అంతకుముందు ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు గత ఏడాది ఆగస్టు 2న ముగిసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక డిసెంబర్ మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జనవరి 30న ముగిసింది. ఇక 2వ తేదీ శనివారం అని గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించింది. అంటే సరిగ్గా ఆరు నెలల తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది. ఇందులో 265 కొత్త పంచాయతీలు ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. -
కొత్తగా...
చుంచుపల్లి/బూర్గంపాడు: కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లాలో గతంలో ఉన్న 205 పంచాయతీలకు తోడుగా మరో 276 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. పాత 205 పంచాయతీల్లో 2 పంచాయతీలు సారపాక, భద్రాచలం పురపాలక సంఘాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. దీంతో పాత పంచాయతీలు 203, కొత్త పంచాయతీలు 274తో కలిపి మొత్తం 477 పంచాయతీల్లో పరిపాలన శనివారం నుంచి మొదలు కానుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 479 పంచాయతీలకు 54 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీల్లోఎన్నికలు నిర్వహించలేదు. జిల్లావ్యాప్తంగా 477 పంచాయతీలో జిల్లా వ్యాప్తంగా కొత్త పాలక మండళ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. కొత్త పంచాయతీల్లో సమస్యల తిష్ట జిల్లాలో ఇటీవల ఏర్పాటైన 276 కొత్త పంచాయతీల్లో పక్కా భవనాలు లేవు. పాత పంచాయతీల్లోనూ పూర్తిస్థాయిలో భవనాల సమస్య వెంటాడుతూనే ఉంది. 276 కొత్త పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో ఆగస్టు 2 తేదీ నుంచి అద్దె భవనాల్లోనే పరిపాలనను కొనసాగిస్తున్నారు. వాటి నిర్మాణాలకు కేంద్రం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలు వరకు కేటాయిస్తోంది. కొత్త పంచాయతీలు ముందుగా పంచాయతీ భవనాల నిర్మాణాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పంచాయతీల్లో సరిపడా గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. ఆర్థిక వనరులపై దృష్టి సారించాలి పంచాయతీ పాలకవర్గాలు ఆదాయాన్ని సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ నిధులు కాకుండా పంచాయితీకి స్వయంగా సృష్టించుకోవాలి.అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయితీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. చేపలచెరువుల నిర్వహణ, బందెలదొడ్లు, వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టాలి. పంచాయతీలకు ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా,మండల పరిషత్ నిధులు, సంతల నిర్వహణ ద్వారా నిధులు, ఎంపీ,ఎమ్మెల్యేల నిధులు, ఉపాధిహామీ ద్వారా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకంలో గ్రామపంచాయతీ భవనాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదులు, భోజనశాలలు ఏర్పాటు చేసుకునే వీలుంది. కొత్త పాలకవర్గాలు 14వ ఆర్థికసంఘం నిధులు అందుబాటులో ఉంటాయి. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనులు,అనుబంధ గ్రామాల ప్రజలకు కొత్త పంచాయతీలతో సుపరిపాలన చేసుకునే అవకాశం దక్కింది. అభివృద్ధి సం క్షేమంలో ఇతర గ్రామాలతో పోటీ పడే అవకాశం చిన్న గ్రామాలకు దక్కనుంది. పాలన గిరిజనులదే.. కొలువుదీరనున్న 477 పంచాయతీల్లో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డే ఉన్నాయి. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారడంతో గిరిజనులకు స్వయంగా పాలించుకునే అవకాశం లభించింది. సుమారు 95శాతం వరకు సర్పంచులు, వార్డు సభ్యులు గిరిజనులే ఉన్నారు. ఇక నుంచి గ్రామపాలన వీరి ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సహజంగా గిరిజనులలో ఉండే ఐక్యతను గ్రామాభివృద్ధిలో చాటుకుంటే గ్రామాల్లో అభివృద్ధికి బీజం పడుతుంది. నేటి నుంచి కొత్త పాలనకు శ్రీకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇటీవల ఎంపికైన నూతన పాలక మండళ్లు శనివారం ప్రమాణ స్వీకారం చేస్తాయి. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో పరిపాలన నేటి నుంచి అమల్లోకి వస్తుంది. –ఆర్.ఆశాలత, డీపీవో నూతన పంచాయతీలకు కార్యాలయ భవనాలు కరువు అశ్వాపురం: నూతన పాలకవర్గాలకు పంచాయతీ కార్యాలయ భవనాల సమస్య తలనొప్పిగా మారనుంది. నూతనంగా కొత్త పంచాయతీలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించలేదు. నేడు నూతన పంచాయతీ పాలకవర్గాలు అరకొర వసతులతో అద్దె భవనాలలోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. పాత పంచాయతీ కార్యాలయాలకు పలు గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పలు చోట్ల పనులు పూర్తి కాలేదు. కొత్త పంచాయతీలు ఏర్పాటై ఆరు నెలలు గడిచినా అద్దె భవనాలలోనే అరకొర వసతులతో పంచాయతీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అద్దె భవనాల్లో ఫర్నిచర్ కూడా లేదు. ప్రభుత్వం స్పందించి నూతన పంచాయతీలకు గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేయాలని నూతన పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు. -
పంచాయతీ @రూ.105 కోట్లు
ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు చాలా హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయాలకు తొలిమెట్టు అయిన పంచాయతీల్లో గెలుపొందేందుకు సర్పంచ్ అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల రోజు వరకు కులసంఘాలు, యువకులను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల మధ్యలోనే వచ్చిన సంక్రాంతి పండుగను కూడా వదలలేదు. సర్పంచ్, వార్డుమెంబర్‌గా బరిలో ఉన్న వారు నేరుగా ఇళ్లకే మద్యం, మాంసం ఇస్తూ తమను ‘గుర్తు’ంచుకునేలా చేశారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 210 గ్రామాల్లో దాదాపు రూ.105 కోట్ల వరకు వెచ్చించారు. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుండగా.. ఓడిన వారు ఎలా జరిగిందనేదానిపై సమీక్షించుకుంటున్నారు. సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా రెండు గ్రామాలు మినహా 253 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 43 గ్రామాల్లో ఏకగ్రీవంకాగా.. 210 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో జిల్లావ్యాప్తంగా 1,056 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. రాజకీయాల్లో తొలిమెట్టుగా భావించే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార, ప్రలోభపర్వాలకు తెరలేపారు. 210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ.105 కోట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగాయి. పంచాయతీకి ఎమ్మెల్యేలు దూరం జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగగా స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోలేదు. మానకొండూరు, వేములవాడ, చొప్ప దండి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్ ఒకటి, రెండుసార్లు నియోజకవర్గం లోని ముఖ్య గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. మిగతా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేలు దూ రంగా ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పంచాయతీ ఎన్నికలకు దూ రంగా ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు గ్రామస్తులు ఐక్యంగా చేసుకుంటేఎమ్మెల్యే కోటాలో రూ.15లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అంతకుమించి ఆయన ఎవరు గెలిచినా నా వాళ్లే అంటూ కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం పంచాయతీ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. పంచాయతీ ఖరీదు రూ.105 కోట్లు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు చాలా ఖరీదయ్యాయి. గ్రామ పంచాయతీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రలోభాలపర్వం జోరుగా సాగింది. జిల్లాలోని 210 గ్రామపంచాయతీల్లో 1,056 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేయగా.. వారంతా పోటాపోటీగా ఖర్చుపెట్టారు. సగటున చిన్న గ్రామాల్లో రూ.3లక్షలు వెచ్చించగా.. పెద్ద పంచాయతీలు, పోటీ ఎక్కువగా నెలకొన్న గ్రామాల్లో రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చీరలు పంచుతూ, సెల్ఫోన్లు కొనిస్తూ.. నేరుగా డబ్బులిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. ఎన్నికల సమయంలోనే సంక్రాంతి పండుగ రావడంతో.. సందర్భాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు నూనెప్యాకెట్లు, చికెన్, మద్యం బాటిళ్లను నేరుగా ఇళ్లకే పంపుతూ ఓటర్లకు అభ్యర్థులు ‘గుర్తు’ండిపోయేలా ప్రలోభాలకు గురిచేశారు. మరోవైపు యువకులకు క్రికెట్కిట్లు, టీషర్ట్స్, కులసంఘాలకు, ఆలయాలకు మైక్సెట్లు ఇస్తూ ప్రచారం సాగించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.105 కోట్ల వరకు వెచ్చించినట్లు ప్రాథమిక అంచనా.. చిలుము వదిలింది ! ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్ని లక్షలు వెచ్చించాం.. ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు పూర్తవగా విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికలకు చేసిన ఖర్చులను లెక్కలేస్తుండగా ఓడిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు, వచ్చిన ఓట్లను లెక్కిస్తూ నారాజవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడంలో ప్రత్యర్థులు అనుసరించిన వ్యూహాలను సమీక్షించుకుంటున్నారు. డబ్బులతోపాటు లోపాయికారీగా జరిగిన ఒప్పందాలు, జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ పరాజితులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డుమెంబర్ సభ్యులు సైతం ఎన్నికల్లో చేసిన ఖర్చులను లెక్కలేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వార్డుసభ్యులు సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీని ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ఖరీదు రూ.వంద కోట్ల మైలురాయిని దా టడం జిల్లా చరిత్రలో తొలిసారి కావడం విశేషం. నేతల మద్దతు కోసం విజేతలు జిల్లాలో విజయం సాధించిన సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అధికార పార్టీ మద్దతుతో విజయం సాధించినవారు ఇప్పటికే ఎమ్మెల్యేలను కలిశారు. ఇక.. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు ఐదేళ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేనిదే వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. -
రేపే ముహూర్తం
పాపన్నపేట(మెదక్): కొత్త సర్పంచ్‌లు కొలువు దీరేందుకు ఫిబ్రవరి 2వ తేదీ ముహూర్తం ఖరారయ్యింది. గతేడాది ఆగస్టు 2 నుంచి నేటి వరకు 184 రోజుల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. నేటితో ఈ పాలనకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పిస్తు.. వారి విధులు.. అధికారాలు గురించి వివరించేందుకు 11వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మెదక్ కొత్త జిల్లాగా అవతరించినపుడు మొదట 312 గ్రామంచాయతీలు ఉండేవి.అయితే 500 జనాభా గల గిరిజన తండాలను, మధిర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 157 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే ఎనిమిది గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 4,58,325 ఓటర్లున్నారు. ఇందులో 90 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 2న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈమేరకు అపాయింట్మెంట్ డే గా నిర్ణయిస్తూ పంచాయతీరాజŒ æశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అతే ఆ రోజు జరిగే సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేస్తారు. ఆరోజు నుంచి 5 ఏళ్ల పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది. ఫిబ్రవరి 11 నుంచి శిక్షణ కొత్త సర్పంచ్‌లకు విధులు, అ«ధికారాలు, బాధ్యతలు తదితర విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ 11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉండనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 3 నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇస్తారు. పదవీ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేసేందుకు వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 2వ తేదీన ఉదయం స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి చార్జి అప్పగిస్తారు. ఈ మేరకు మినిట్స్‌లో నమోదు చేస్తారు. –హనోక్, డీపీఓ శిక్షణ మంచి కార్యక్రమం నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, సర్పంచ్ విధులు, అధికారాలు, గ్రామ సభల ఏర్పాటు, హరితహారం, బాధ్యతలు, ఆదర్శ గ్రామావృద్ధి తదితర విషయాలు, రికార్డుల నిర్వాహణ గురించి ఎక్కువగా తెలియదు. అందు వల్ల సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సంతోషం. –కలాలి నవీన్‌గౌడ్, కొత్త లింగాయపల్లి -
గులాబీ జోరు
సాక్షి, మెదక్: పల్లెల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. రెండు విడతల్లో మెజార్టీ పంచాయతీలు గెలుపొందిన టీఆర్ఎస్ మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. జిల్లాలో బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 133 పంచాయతీలు, 1031 వార్డుల్లో ఎన్నికలు జరగగా 90.28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, తూప్రాన్, నార్సింగి, చేగుంట, మనోహరాబాద్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఎనిమిది మండలాల్లో మొత్తం 1,53, 354 మంది ఓటర్లు ఉండగా 1,38, 445 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 67182 మంది ఉండగా, మహిళలు 71,263 మంది ఓట్లు వేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి మెదక్ మండలంలోని మాచవరంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన స్వగ్రామం కోనాపూర్‌లో ఓటు వేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మూడవ విడతలో 133 పంచాయతీల్లో 505 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగిన 133 పంచాయతీలకుగాను 108 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 15 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా చేగుంట మండలంలోని గొల్లపల్లి, జక్రంతండా, చిట్టోజిపల్లిలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోయారు. దీంతో పల్లెల్లో టీడీపీ జాడ లేకుండా పోయింది. మూడు విడతల్లోనూ టీఆర్ఎస్ హవా.. జిల్లాలో మూడు విడతల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ పంచాయతీల్లో విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలకుగాను 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 385 పంచాయతీలకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 385 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 358 పంచాయతీల్లో టీఆర్ఎస్, 73 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే మూడు పంచాయతీల్లో బీజేపీ, 35 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొదట విడతగా 122 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 82 టీఆర్ఎస్, 28 కాంగ్రెస్, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో 130 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 30 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 16 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బుధవారం మూడవ విడత 133 పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 108 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 15 పంచాయతీల్లో కాంగ్రెస్, మూడు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మూడవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో విజయోతవ్స ర్యాలీలు నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి స్వగ్రామం బాలానగర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు వికాస్ 23 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ మద్దతుదారు గోపాల్‌పై గెలుపొందారు. మాచవరంలో కాంగ్రెస్ మద్దతుదారు సంధ్యారాణి 165 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ బలపర్చిన రాధికపై విజయం సాధించారు. మంబోజిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభాకర్ నాలుగు ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజాంపేట మండలం చల్మెడలో నర్సింహారెడ్డి 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నార్లపూర్ పంచాయతీలో కాంగ్రెస్ జిల్లా నేత అమరసేనారెడ్డి టీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్‌లో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కామారంలో బీజేపీ మద్దతుదారు రాజిరెడ్డి ఓటమిపాలయ్యారు. తూప్రాన్ కోనాయిపల్లి(పిబి) గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి కంకణాల పాండు, టీఆర్ఎస్ మద్దతుదారు విఠల్‌కు 143 చొప్పున సరిసమానం ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా స్వతంత్ర అభ్యర్థి పాండు గెలుపొందారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో ఆరుగురు పోటీ చేయగా టీఆర్ఎస్ మద్దతుదారు మన్నె మహాదేవి గెలుపొందారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. ముప్పిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభావతి గెలుపొందారు. మనోహరాబాద్‌లో టీఆర్ఎస్ మద్దతుదారు చిట్కుల్ మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
పల్లె సిగలో గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసనసభ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ పోరులోనూ పైచేయి సాధించింది. మూడు విడతల్లో మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 264 జీపీలు టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా ఆయా పంచాయతీల్లో గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా చెప్పుకోదగ్గ రీతిలో జీపీలను హస్తగతం చేసుకున్నారు. 171 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెండు విడతల్లో స్థబ్దుగా ఉన్న బీజేపీ చివరి దశ ఎన్నికలో కాస్త తేరుకుంది. 16 జీపీల్లో కాషాయ జెండాను ఎగురవేసింది. తుది విడతలో పోటాపోటీ.. మొదటి, రెండో విడతల ఎన్నికల ఫలితాలకు, తుది దశ ఫలితాల్లో కాస్త తేడా కనిపించింది. ఒకటి, రెండు విడతల్లో కారు ప్రభంజనం కొనసాగగా.. ఆఖరి దశ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ రెండు పార్టీల నడుమ రసవత్తర పోరు నడిచింది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మూడు మండలాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మార్క్ కనిపించింది. ఈ మండలాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఆమె గెలిపించుకోగలిగారు. ఆమె సొంత గడ్డ అయిన చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరులో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్ల పంచాయతీని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ మద్దతుదారు పాగా వేయడం విశేషం. తగ్గిన పోలింగ్ శాతం తొలి, రెండో విడతలతో పోల్చితే తుది దశ ఎన్నికలు జరిగిన 186 జీపీల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొదటి రెండు విడతల్లో 93 శాతం, 89 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. చివరి దశలో 88 శాతమే నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 నుంచి 11 గంటలలోపే అధికశాతం మంది ఓటేశారు. ఈ రెండు గంటల వ్యవధిలో 37 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య 33 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చివరి రెండు గంటల్లో 18 శాతం మంది ఓటేశారు. అన్ని పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగిసిన పంచాయతీ ఎన్నికలు
సాక్షి, వరంగల్ రూరల్: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటైన తర్వాత , స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. 89.78శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూర్, దామెర, గీసుకొండ మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలు, 1070 వార్డు స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 29 గ్రామాల్లో సర్పంచ్‌లు, 310 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 91 గ్రామాలు, 760 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తమ ఓటును వినియోగించుకున్నారు. దామెర మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. జిల్లాలో 91.23శాతం ఓటింగ్.. మూడో విడతలోని చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఐదు మండలాల్లో 1,16,846 మంది ఓటర్లు ఉండగా 1,04910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 57,898 మంది పురుష ఓటర్లుండగా 51,978, 58,939 మంది మహిళా ఓటర్లుండగా 52,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో 89.78శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా ఆత్మకూర్‌లో 92.28శాతం ఓటింగ్ నమోదు కాగా నెక్కొండలో తక్కువగా 88.02శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారిగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
ప్రశాంతంగా మూడో విడత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీ చివరి విడత పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ము గిసింది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,098 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 211 పంచాయతీలకు గాను, 61 జీపీలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఇందల్వాయి మండలంలోని రెండు జీపీలు తిర్మన్‌పల్లి, గంగారాంతండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయనందున ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 148 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికార యంత్రాంగం, భోజ న విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించిన తర్వాత, సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టా రు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా 87 శాతం ఓట్లేసిన మహిళలు.. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 2.16 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.73 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళలు 1,00,847 (87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 72,262 (71శాతం) మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషు ల కంటే మహిళలే ఉత్సాహం గా ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 35.40 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వ రకు ఈ పోలింగ్ శాతం 59.69 శాతానికి పెరిగింది. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 79.81 శాతం పోలింగ్ నమోదైందని అధికార యంత్రాంగం ప్రకటించింది. పకడ్బందీ ఏర్పాట్లు.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఓటేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగు నీ టి వసతి కూడా కల్పించారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. సిరికొండ మండలం రావుట్లలో నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు జగన్, కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జల్లాపల్లికి పోలింగ్.. పోలింగ్ నిలిచిపోయిన కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి బుధవారం పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో జరగాల్సి ఉండగా, బ్యాలెట్ పేపర్లో జరిగిన పొరపాటు కారణంగా పోలింగ్ నిలిపివేవారు. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఇందల్వాయి మండలం గన్నారంలో కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాక్లూర్ మండలం కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన.. జిల్లాలో పోలింగ్ సరళిని కలెక్టర్ ఎంఆర్ఎం రావు కలెక్టరేట్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక ఎనిమిది పంచాయతీల పరి«ధిలోని 25 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్‌క్యాస్టింగ్ ప్రక్రియను నిర్వహించారు. -
గులాబీ గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో 837 పంచాయతీలకు ఎన్నికలు జరగగా... టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో విజయం సాధించి తమ పట్టును నిరూపించుకున్నారు. తొలి రెండు విడతల్లో దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లలో 20 మండలాల పరిధిలోని 580 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 380 పంచాయతీలు టీఆర్ఎస్ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. బుధవారం మూడో విడత నల్లగొండ డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 241 పంచాయతీల్లో (మొత్తం 257 కాగా, 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి) పోలింగ్ జరిగింది. మూడో విడతలో టీఆర్ఎస్ మద్దతుదారులు 140 పంచాయతీల్లో గెలిచారు. దీంతో మొత్తంగా జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 268 పంచాయతీల్లో, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుదారులంతా కలిపి 49 పంచాయతీల్లో విజయం సాధించారు. ఏకగ్రీవాల ద్వారానే 102 మూడు విడతల పంచాయతీ సమరంలో ఏకగ్రీవాల ద్వారానే టీఆర్ఎస్ మద్దతుదారులు 102 చోట్ల విజయం సాధించారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్లోని 305 గ్రామ పంచాయతీలకు గాను 52 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వీరిలో 50 మంది టీఆర్ఎస్ మద్దతుదారులే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 276 గ్రామ పంచాయతీలకుగాను 43 మంది సర్పంచులు ఏకగ్రీవం కాగా, వీరిలో 42 మంది టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యారు. మూడో విడతలో 257 పంచాయతీల్లో కేవలం 16 పంచాయతీల్లో మాత్రం సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. మొత్తంగా మూడు విడతల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాల ద్వారానే 102 పంచాయతీలను సొంతం చేసుకున్నారు. చిత్రమైన పొత్తులు పల్లెలపై పట్టుకోసం ఆయా పార్టీలు పంచాయతీ సమరంలో చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి. పూర్తిగా పార్టీ రహిత ఎన్నికలే అయినా... ప్రతి పంచాయతీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, ఆ పార్టీ నేతల ప్రచారం చేయకుండా ఎన్నికలు జరగలేదు. ప్రధానంగా టీఆర్ఎస్లో సర్పంచ్ టికెట్లకు గట్టి పోటీ ఏర్పడింది. దీంతో పదుల పంచాయతీల్లో టీఆర్ఎస్ వర్గీయుల్లోనే పోటీ నెలకొంది. మరోవైపు పంచాయతీలను గెలుచుకునేందుకు స్థానిక పరిస్థితులను బట్టి పార్టీల మద్దతుదారులు పొత్తులు పెట్టుకున్నారు. అయితే.. ఒక పంచాయతీకి మరో పంచాయతీకి పోలికే లేకుండా అయ్యింది. కొన్ని పంచాయతీల్లో టీఆర్ఎస్, సీపీఎం, ఇతర పార్టీలు కలిస్తే, మరికొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ సీపీఎం, ఇతర పార్టీలు కలిశాయి. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీసీఎం, తదితర పార్టీలు కలిసి పోటీ చేసిన పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుదారులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీలో నిలిచిన వారికి ఎదుటి పక్షం వారూ మద్దతిచ్చి గెలిచిపించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పంచాయతీ సమరంలో చిత్రవిచిత్రమైన పొత్తులు కనిపించాయి. పొత్తుల్లో ఉప సర్పంచ్ పదవులే కీలకంగా మారాయి. ఉనికి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులకు అనుకూలంగా గాలి వీచినా.. కొన్ని మండలాల్లో కాం గ్రెస్ మద్దతు దారులు సైతం సమ ఉజ్జీలుగా నిలిచారు. జిల్లా మొత్తంలో ఆ పార్టీ మద్దతుదారులు 268 పంచాయతీల్లో గెలిచారు. తొలి రెండు విడతల్లో ఏకంగా 167 చోట్ల విజయం సాధించారు. మూడో విడతలో 101 పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా మొత్తం గా 268 పంచాయతీల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు తమ పార్టీ ఉనికిని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు అభినందనలు : కోమటిరెడ్డి నల్లగొండ రూరల్ : నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారంతా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడంతోపాటు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్నారు. పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గెలుపొందిన అభ్యర్థులు కృషి చేయాలని కోమటిరెడ్డి కోరారు. -
దూసుకెళ్లిన కారు
హుజూరాబాద్‌రూరల్: మూడో విడత పంచాయతీలు ఎన్నికలు బుధవారం ప్రశాం తంగా జరిగాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, వి.సైదా పూర్ మండలాల్లో తుది దశ ఎన్నికలు నిర్వహించారు. 109 గ్రామపంచాయతీలకు గాను, 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 96 గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 1024 వార్డులకు గాను 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలతో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు దీటుగా.. టీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు పట్టం కట్టారు. బుధవారం జరిగిన మూడో విడతలో మొత్తం 407 పంచాయతీలకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నిక వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 406 పంచాయతీల్లో టీఆర్ఎస్ 279, కాంగ్రెస్ 55 బీజేపీ 15, టీడీపీ 02, స్వతంత్రులు 55 స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ విడతలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 40 చోట్ల విజయం చేకూరింది. అసెంబ్లీ ఎన్నికల విజయఢంకా మోగించిన టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోను జోరు కొనసాగడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మూడు విడతల్లోనూ ఆధిక్యమే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మూడు విడతల్లో కూడా అత్యధికంగా టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 21న మొదటి విడతలో మొత్తం 414 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ 289, కాంగ్రెస్ 82 చోట్ల గెలుపొందగా, బీజేపీ ఎనిమిది, టీడీపీ 03 స్వతంత్రులు 32 చోట్ల విజయం సాధించారు. రెండో విడతలో 389 పంచాయతీలకు 249 టీఆర్ఎస్, 68 కాంగ్రెస్, 16 బీజేపీ, 01 టీడీపీ, 07 సీపీఐ, 48 స్వతంత్రులు గెలుచున్నారు. బుధవారం జరిగిన మూడో విడతలో 407 పంచాయతీలకు 279 టీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్నిక కాగా, 55 కాంగ్రెస్, 15 బీజేపీ, టీడీపీ 02, స్వతంత్రులు 55 గెలుచుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలకు పరిమితం కాగా, సీపీఐ ఏడింట గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఫలితాలు మరింతగా దిగజారిపోయాయి. కేవలం ఆరు స్థానాలకే పరిమిత కావాల్సి వచ్చింది. 2013లో ఎన్నికల్లో 379కే టీఆర్ఎస్ పరిమితం... 2013లో పూర్వ కరీంనగర్ జిల్లాల్లో 1207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 379 గ్రామాల్లో టీఆర్ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచ్‌లు ప్లేట్ ఫిరాయించారు. దీంతో మూడింట రెండు వంతులకు పైగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహించడం, జగిత్యాల నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో పలువురు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టు 2న సర్పంచ్‌లు పదవీ విరమణ చేసే నాటికి 942 మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. తాజా ఎన్నికల్లో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళించింది. -
సం‘గ్రామం’.. సమాప్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. తొలి దశలో తప్పిస్తే రెండు, మూడో దశల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చివరి దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో భాగంగా ఎనిమిది మండలాల్లోని 227 పంచాయతీలకు గాను 24 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 203 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవసరం రాకపోవడం.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 85.91 శాతం నమోదు మూడో దశ ఎన్నికల సందర్భంగా 85.91 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈనెల 21న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.71 శాతం, 25వ తేదీన రెండో దశ ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా మూడో దశలో పోలింగ్ నమోదైనట్లయింది. పర్యవేక్షించిన అధికారులు ఎన్నికల సందర్భంగా అటు ఉద్యోగులు, ఇటు ఓటర్లకు ఇటు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎనిమిది మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించిన వారు సజావుగా సాగేలా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకొడిగా... మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చలి ప్రభావం పెరిగింది. ఇది బుధవారం జరిగిన పోలింగ్‌పై ప్రభావం చూపింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనా పెద్దగా ఓటర్లు రాలేదు. ఇక 9 గంటల తర్వా త మాత్రం పోలింగ్ జోరందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 31.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత 11 గంటల్లోపు ఇది 66.07 శాతానికి చేరింది. మొత్తంగా ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సరికి పోలింగ్ శాతం 85.91గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి పోలింగ్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. కోస్గి మండలంలోని ముశ్రీఫా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న నర్సప్ప (48)కు ఎన్నికల సందర్భంగా అదే పంచాయతీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే కన్నుమూశారు. ఓటు వేసిన ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూత్పూర్ మండలంలోని సొంత గ్రామమైన అన్నసాగర్లో ఆయన ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బారులు తీరిన ఓటర్లు ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సాహం చూపారు. మూడో విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, అత్యధికంగా దేవరకద్ర మండలంలో 91.49 శాతం, తక్కువగా గండీడ్ మండలంలో 74.75 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో ఉదయం మందకొడిగా సాగినా.. 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక సమయం ముగిసే ఒంటి గంటకు కొద్దిముందు ఓటర్లు ఎక్కువగా> రాగా.. అందరినీ అనుమతించారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఆ బూత్‌ల్లో గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రెమారాజేశ్వరి స్వయంగా పలు కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. ఓటు వేసిన 2,17,049 మంది మూడో విడతగా ఎన్నికలు జరిగిన 203 పంచాయతీల్లో 2,52,647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జీపీల్లో మొత్తం 1,26,476 మంది పురుషులు, 1,26,090 మంది మహిళా ఓటర్లతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1,08,778 మంది పురుషులు, 1,08,269 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇద్దరు ఇతరులు ఓటు వేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. అనంతరం భోజనం కోసం అధికారులు గంట పాటు విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. -
పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి
కోస్గి (కొడంగల్): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఓ వీఆర్ఓ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంఘటన మండలంలోని ముశ్రీఫాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సప్ప(48) ఎన్నికల విధుల్లో భాగంగా ఇదే పంచాయతీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగానే కొనసాగుతున్న తరుణంలో నర్సప్పకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతూ చెమటలు పట్టడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లారు. బీపీ ఎక్కువగా ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా ఆటోలో కోస్గికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పతికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బుచ్చయ్య, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని నర్సప్ప కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా నర్సప్ప స్వగ్రామం దౌల్తాబాద్ మండలం చంద్రకల్ కాగా, ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
తీన్మార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. తొలి, మలి విడతల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ.. మూడో విడతలోనూ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 24 జీపీలు ఏకగ్రీవం కావడంతో బుధవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఏకగ్రీవాలతో కలుపుకుని టీఆర్ఎస్ మద్దతుదారులు 114, కాంగ్రెస్ 50, టీడీపీ 2, సీపీఐ 5, సీపీఎం 10, స్వతంత్ర అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా టీఆర్ఎస్ తన ప్రభావం చూపడం విశేషం. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఒక జీపీ ఎన్నిక వాయి దా పడింది. మూడు విడతలుగా జరిగిన జీపీ ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించడం ద్వారా పల్లె రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో దాదాపు ప్రశాంతంగానే ముగిశాయి. మూడో విడతలో ఒకటి, రెండు మండలాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చింతకాని మండ లం నేరెడ జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా పోటీ చేసిన ఈశ్వరమ్మ ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించగా.. దీనిపై టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించిన అనంతరం అధికారులు ఈశ్వరమ్మ ఐదు ఓట్లతో గెలిచినట్లు ధ్రువీకరించారు. మూడోవిడత పంచా యతీ ఎన్నికలు టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో జరిగాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 12 స్థానాలు ఏకగ్రీవం కావడానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ తీసుకోగా.. మిగిలిన పంచాయతీల్లో టీఆర్ఎస్ విజయం కోసం స్వయంగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం 25 జీపీలకు ఎన్నికలు జరగ్గా.. టీఆర్ఎస్ 13 జీపీలను, కాంగ్రెస్ 11, సీపీఐ ఒక గ్రామ పంచాయతీని గెలుచుకున్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా మండలాల్లో మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. సీపీఎం, సీపీఐలు మూడు విడతల ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకునే స్థాయిలో పంచాయతీలను గెలుపొందగా.. టీడీపీ ఉనికి పంచాయతీ ఎన్నికల్లో మరింత ప్రశ్నార్థకంగా మారింది. 2013 ఎన్నికల్లో అత్యధిక జీపీలను గెలుచుకున్న పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీ ఈ ఎన్నికల్లో 25 స్థానాలను సైతం గెలుచుకోలేకపోయింది. మధిర మండలంలో స్వతంత్ర అభ్యర్థులు 6 పంచాయతీలను కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 6 పంచాయతీలను గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారిలో ఒకరు గెలిచి.. మరొకరు ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ ఈ ఉద్రిక్తతకు దారితీసింది. మూడు విడతల్లోనూ గులాబీదే హవా.. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 584 గ్రామ పంచాయతీలకుగాను.. ఏన్కూరు మండలం నూకాలంపాడు జీపీకి ఎన్నిక జరగలేదు. 80 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 503 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ మూడు విడతల్లో 351 జీపీలు, కాంగ్రెస్ 114, సీపీఎం 24, సీపీఐ 12, టీడీపీ 22, న్యూడెమోక్రసీ 5, బీజేపీ ఒక జీపీ, స్వతంత్ర అభ్యర్థులు 54 గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు. -
పంచాయతీ ఎన్నికల్లో విషాదం
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. బుధవారం వికారాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఆర్వో, ఓటేసి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నర్సప్ప (50) కోస్గి మండలం ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్నారు. బుధవారం తుదివిడత పంచాయతీ ఎన్నికల కోసం.. కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి వెళ్లాడు. విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నర్సప్ప కిందపడిపోయాడు. స్థానికులు గమనించి కోస్గి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అరుణమ్మ ఇటీవల చంద్రకల్ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఘటనలో ఓటరు పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ (65) బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటేసేందుకు వరుసలో నిల్చుని ఉంది. ఓటేసిన వెంటనే వెంకటమ్మకు గుండెపోటు రావడంతో ఆమె పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. పరిశీలించిన స్థానిక వైద్యులు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. -
‘ఓటేయ్యండి.. బాండ్ రాసిస్తా’
సాక్షి, నల్లగొండ : ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీ దగ్గరినుంచి రూపాయి ఆశించను. ఇప్పుడు ఉన్న ఆస్తికంటే ఎక్కువ సంపాదిస్తే జప్తు చేసి ప్రజలకు పంచండి’అంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి వంద రూపాయల బాండ్ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు పంచుతూ ఓట్లను అభ్యర్థించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో చిలుముల రమణ రామస్వామి బరిలో నిలిచారు. తనని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ మంగళవారం రూ.100 బాండ్ పేపర్ జిరాక్స్ ప్రతులను ఇంటింటికి పంపిణీ చేశారు. -
మూడో విడత పోలింగ్ ప్రారంభం.. 23 గ్రామాల్లో ఎన్నికల బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో భూపాలపల్లి జిల్లాకు చెందిన 23 పంచాయతీల్లో ఎన్నికలను నిలిపివేశారు. -
తుది సమరం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే తొలి, మలివిడత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. అదే తరహాలో మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ ఒంటిగంట వరకు కొనసాగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరాలతోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మూడో విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అందులో 24 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమయ్యారు. అలాగే 1,740 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 245 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. 1,495 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏడు మండలాల్లో 2,20,011 మంది ఓటర్లు ఉండగా.. 1,08,007 మంది పురుషులు.. 1,11,990 మంది మహిళలు, ఇతరులు 14 మంది ఉన్నారు. 24 జీపీలు ఏకగ్రీవం.. రెండో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 24 గ్రామ పంచాయతీలు, 245 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా.. 3,484 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వెబ్‌కాస్టింగ్‌లో 136 మంది పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. పల్లెల్లో పోటాపోటీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలను ప్రారంభించారు. -
పోలింగ్ విధులకు హాజరైన కానిస్టేబుల్‌కు పాము కాటు
సాక్షి, పెద్దపల్లి : పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన మహిళా కానిస్టేబుల్ పాము కాటుకు గురైన ఘటన ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలింగ్ విధుల నిమిత్తమై బసంతనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనిత నందిమేడారం గ్రామానికి వెళ్లారు. డ్యూటీలో ఉన్న వనిత మంగళవారం రాత్రి పాము కాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, స్థానికుల సాయంతో వనితను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వనిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. -
సర్పంచ్‌గా అవకాశం ఇవ్వలేదని గర్భిణి ఆత్మహత్య
సాక్షి, అశ్వారావుపేట రూరల్: సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే మనస్తాపానికి గురైన ఓ గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన రెబక్కారాణి(26)ని టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దింపేందుకు స్థానిక నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించి ఆమె వివరాలు తీసుకున్నారు. అయితే ఈమె ఏడు నెలల గర్భిణి కావడంతో రెబక్కారాణి వదిన(సోదరుడి భార్య) సాధు జ్యోత్స్నబాయిని బరిలోకి దింపారు. ఈనెల 25న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో జ్యోత్స్నబాయి సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, తనకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా చేశారంటూ జ్యోత్స్నబాయి నామినేషన్ వేసిన రోజు నుంచి రెబక్కారాణి కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతోంది. సోమవారం కూడా తన అన్న, తండ్రితో తీవ్రంగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంతోనే తన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో బయటకు వెళ్లిన భర్త నరేంద్ర కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో పక్క ఇంట్లోనే ఉన్న మామ, బావమరుదులను పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి రెబక్కారాణి మృతి చెంది ఉంది. మృతురాలికి భర్తతో పాటు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. స్థానిక ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భయంకరంగా రాజకీయాలు : ఉత్తమ్
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : రానురాను రాజకీయాలు భయంకరంగా మారిపోతున్నాయని టీపీసీసీ చీఫ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని దొండపాడు, వజినేపల్లి, గాంధీనగర్‌తండా, గుడిమల్కాపురం, చింతలపాలెం గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పేద ప్రజలు, సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోతోందని, అంతా ధన రాజకీయం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఓటు వేయాలని కోరారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపిస్తే పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నాయకుల బెది రింపులకు భయపడవద్దని ఆ నాయకుల మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా వీరారెడ్డి, పుల్లారెడ్డి, గున్నం నాగిరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, రాములు నాయక్, సీతారెడ్డి, ఉస్తేల నారాయణరెడ్డి, ఉస్తేల సజన, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డులకు పోటీలో ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘తుది’ ప్రచారానికి నేటితో తెర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెర పడనుంది. ఇప్పటికే ఐదు రోజులపాటు ప్రచారం చేసిన అభ్యర్థులు.. చివరిరోజున మరింత హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ర్యాలీలు, ఓటర్ల ఇంటింటికీ వెళ్లి అభ్యర్థించడం, ఆయా పార్టీల ప్రధాన నాయకులు, ఎమ్మెల్యేలు పర్యటించడం వంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఆ తర్వాత అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించేందుకు పావులు కదుపుతున్నారు. తుది విడతగా 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మండలాల పరిధిలో 198 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 12 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఇక్కడ ఎన్నికలు ఉండవు. మిగిలిన 186 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పల్లెల్లో సర్పంచ్ పదవుల కోసం 586 మంది బరిలో నిలిచారు. అలాగే 1,756 వార్డులకుగాను 178 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవిపోను మిగిలిన 1,578 వార్డుల్లో 815 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. -
నేటితో ప్రచారానికి తెర
ఆత్మకూరు(పరకాల): మూడోవితడ జీపీ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 22న ముగిశాయి. 23 నుంచి అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లను ఓటుకోసం శతవిధాల అభ్యర్థిస్తున్నారు.నేడు (సోమవారం)ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటల తర్వాత ప్రచారానికి తెరపడనున్నది.మూడోవిడత ఎన్నికలు ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. చెన్నారావుపేటలో 30 గ్రామపంచాయతీలకు గాను కాలనాయక్‌తండా, బోజెర్వు, ఖాదర్‌పేట, గొల్లభామతండా, తిమ్మరాయనిపహాడ్ జీపీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 25జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. నెక్కొండ మండలంలో 39 జీపీలకు గాను అలంకానిపేట, లావుడ్యనాయక్తండా, వెంకటనాయక్‌తండా, రెడ్యానాయక్‌తండా, హరిచంద్‌తండా, చెరువు ముందరితండా, నెక్కొండతండా, దేవునితండా, అప్పలరావుపేట, మూడుతండా, గొల్లపల్లి, మేడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 27 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆత్మకూరులో 16 గ్రామపంచాయతీలు ఉండగా పెంచికలపేట, గుడెప్పాడ్, కామారం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 13జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. కామారంలో వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. దామెర మండలంలో 14 గ్రామపంచాయతీలు ఉండగా కొగిల్వాయి, సింగరాజుపల్లె, ల్యాదెళ్ల, దమ్మన్నపేట, దుర్గంపేట, సీతారాంపురం గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎనిమిది గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గీసుకొండ మండలంలో 21 జీపీలకు గాను గీసుకొండ,మచ్చాపూర్, మరియపురం, హర్జతండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 17జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్య నాయకుల ప్రచారం.. గ్రామాలలో ప్రచారరథాలు, మైకులతో హోరెత్తించారు.కొన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు, దామెర మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఉత్తర జిల్లాల కో ఆర్డినేటర్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. అలాగే దామెరలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రలోభాలు షురూ... ప్రచారం గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు ప్రలోబాలు షురూ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులు ఇప్పటికే తమ గుర్తులకు సంబంధించిన వస్తువులను సంకేతంగా ఉండడానికి ఓటర్లకు చేరవేశారు. వార్డు సభ్యుల ద్వారా మద్యం బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని కొన్ని చోట్ల మాంసం పార్సిళ్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం దుకాణాలు బంద్ కానుండడంతో ఇప్పటికే మద్యం డంప్‌చేసి భద్రపర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ఓటర్ల జాబితాలను పరిశీలిస్తూ డబ్బుల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వినికిడి. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు ఇప్పటికే అభ్యర్థులు ఫోన్లు చేసి ఆఫర్లు పెట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థులో టెన్షన్.. ప్రచారం గడువు ముగుస్తుండడం, పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో గ్రామపంచాయతీలలో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే దావత్‌లకు, ప్రచారానికి డబ్బులు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఓట్లకు నగదు పంపిణీచేయనున్నట్లు ప్రచారం జరుగుతండగా రూ.లక్షలో ఖర్చుపెట్టి ఫలితం ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 30న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. -
గులాబీ గాలికి.. ఎదురీది!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా గులాబీ గాలి వీస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 20 మండలాల పరిధిలోని 581 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 30వ తేదీన నల్లగొండ డివిజన్లోని 256 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినా.. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీల్లో సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఇంతగా టీఆర్ఎస్ గాలి వీస్తున్నా.. కొన్ని పంచా యతీల్లో ఈ గాలిని తట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు సర్పంచులుగా గెలిచారు. తొలి, మలి విడతల్లో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా 168 పంచాయతీల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ముఖ్య నాయకుల గ్రామాలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేసినా.. తమ పార్టీ మద్దతుదారులను గట్టెకించుకోలేకపోయారు. టీఆర్ఎస్ నాయకత్వం కట్టకట్టుకుని ప్రచారం చేసిన పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలవడం, అత్యధిక వార్డులను కైవసం చేసుకోవడం వంటి అంశాలు గులాబీ నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొదటి, రెండో విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయా మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అనుముల మండలంలో కొత్తపల్లి, పంగవానికుంట గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. పెద్దవూర మండలంలో 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో పర్వేదుల, కొత్తల్లూరు, శిరసనగండ్ల, కుంకుడుచెట్టు తండా, చలకుర్తి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తిరుమలగిరి మండలంలో 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు శ్రీరాంపురం, అల్వాల, నాయకునితండా, తునుకినూతల గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. త్రిపురారం మండలంలో 16 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మండలంలో బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, బెజ్జికల్, వస్త్రాంతండా, అన్నారం, బొర్రాయిపాలెం, రాజేంద్రనగర్, చెన్నాయిపాలెం, సత్యనారాయణపురం, డొంకతండా, మాటూరు, దుగ్గెపల్లి, కామారెడ్డిగూడెం, నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అదే విధంగా నిడమనూరు మండలంలో 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మండలంలో నారమ్మగూడెం, తుమ్మడం, పార్వతీపురం, మార్లగడ్డతండా, రాజన్నగూడెం, శాఖాపురం, బంకాపురం, ఊట్కూరు, ముప్పారం, వడ్డెరగూడెం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గుర్రంపోడు మండలంలో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మండలంలో బుద్దరెడ్డిగూడెం, పాల్వాయి, జూనూతల, కాల్వపల్లి, తేరాటిగూడెం, నడికుడ, కొత్తలాపురం, తేనేపల్లి, పోచంపల్లి, ఎల్లమోనిగూడెం, ముల్కలపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మొదటి, రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలంలో అప్పలగూడెం, త్రిపురారం, మర్రిగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా మాటూరు, చెన్నాయిపాలెం, డొంకతండా, అంజనపల్లి, నీలాయిగూడెం, సత్యనారాయణపురం, బెజ్జికల్ గ్రామాల్లో ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. ఈ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా పెద్దవూర మండలంలోని పర్వేదులలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ గ్రామంలో 10 వార్డులకు పది కాంగ్రెస్ గెలుచుకుంది. నిడమనూరు మండలంలో బంకాపురం, నిడమనూరు, ముప్పారం, నారమ్మగూడెంలో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం ఉపయోగపడలేదు. ఈ పంచాయతీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో.. మిర్యాలగూడ డివిజన్‌లోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. దామరచర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కలిసి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోటిరెడ్డిని టీఆర్ఎస్లో చేర్పించి తమ పార్టీ మద్దతుతో పోటీ చేయించారు. ఆయనతోపాటు స్థానిక టీడీపీ నాయకులను కూడా టీఆర్ఎస్లో చేర్పించారు. అయినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీలైన వీర్లపాలెం, కొండ్రపోల్, నర్సాపురం, కల్లేపల్లి, మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు, రాయినిపాలెం, గూ డూరు, మాడ్గులపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని తోపుచర్ల, చిరుమర్తి, కన్నెకల్, వేములపల్లి మండలంలోని సల్కునూరు, కామేపల్లి, ఆమనగల్లు, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు గ్రామాల్లో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. అయినా కాంగ్రెస్ బలపర్చిన వారే విజయం సాధించారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు, రాయినిపాలెం, దామరచర్ల మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం, కల్లేపల్లి, నర్సాపురం, కొండ్రపోల్ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఎన్నికల ప్రచారం చేశారు. దామరచర్ల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గంపూడి నారాయణరెడ్డి స్వగ్రామమైన వీర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలిచారు. వేములపల్లి మండలంలోని సల్కునూరు, ఆమనగల్లు, కామేపల్లి, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం, మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తిలో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. కన్నెకల్‌లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దేవరకొండ డివిజన్లో.. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దేవరకొండ మండలంలో తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి, గొట్టిముక్కల గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ స్పల్ప మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. డిండి మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన డిండి పట్టణం, కామేపల్లి, తవక్లాపూర్, టి.గౌరారం, ప్రతాప్‌నగర్, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. కాగా టీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిండి, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో రోడ్‌షో నిర్వహించినప్పటికీ పలితం లేదు. ఉమ్మడి చందంపేట మండలంలోని ప్రధాన పంచాయతీలైన కాచరాజుపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, రేకులగడ్డ, బుడ్డోనితండాలలో టీఆర్ఎస్ మద్దతుదారుల తరఫున ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలో మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల, పడమటితండా, అజ్మాపురం, నంభాపురం, కేశంనేనిపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులు ఆయా పంచాయతీలను కైవసం చేసుకున్నారు. చింతపల్లి మండలంలో వెంకటంపేట, చింతపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రచారం నిర్వహించినప్పటికీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. -
నేటితో ప్రచారం సమాప్తం..
కరీంనగర్: జిల్లాలో మూడోవిడత నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనుంది. ఎన్నికలకు ఇక రెండురోజులే మిగిలి ఉండడంతో పల్లెల్లో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. జిల్లాలో మూడోవిడత ఐదు మండలాలు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, ఇల్లందకుంట మండలాలోŠల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లోని 109 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 96 స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొత్తంగా 404 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,024 వార్డుస్థానాలకు 227 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 797వార్డు స్థానాలకు 2,184 మంది బరిలో నిలిచారు. గ్రామాల్లో పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాలు, యువజన సంఘాలు, ఇతర కులాలను ఇలా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు సహా ఉద్యోగ, ఉపాధి, చదువురీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని రప్పించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. చాలాగ్రామాల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీతోపాటు మద్యం ఏరులై పారిస్తున్నారు. పెద్ద పంచాయతీలు మొదలు చిన్న గ్రామాలు సైతం ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.లక్షలు దాటినట్లు సమాచారం. గ్రామాల్లో పెద్ద కుటుంబాలు మొదలు, కాలనీలు, యువజన సంఘాలు, కులసంఘాలు, వార్డుల వారీగా ప్రచారం చేస్తూ వారి ఓట్లను రాబట్టేందుకు ఎంతకైనా సిద్ధమంటూ హామీలిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే తమస్థాయికి తగినట్లు పదిరోజుల నుంచి మద్యాన్ని కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. కావాల్సిన మద్యాన్ని ముందే కొనుగోలు చేసి తమకు నమ్మకమైన వారి ఇళ్లల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మేజర్ గ్రామపంచాయతీల్లో అదీ.. జనరల్ అయిన గ్రామపంచాయతీల్లో నగదు ప్రభావం విపరీతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన గుర్తుల నమూనాలతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుల బొమ్మలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న పెద్ద కుటుంబాలకు వెండి నాణాలు బహూకరిస్తున్నట్లు సమాచారం. 5 నుంచి 10ఓట్లు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేస్తూ అభ్యర్థులు వారికి నజరానాలు ముట్టజెప్పుతున్నారు. ఇక వార్డు సభ్యులుగా పోటీచేస్తున్న వారు సైతం వెనుకాడకుండా తమకు కేటాయించిన గుర్తులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రిజర్వ్ గ్రామపంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవులకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో గ్రామాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు సైతం వార్డు మెంబర్లుగా పోటీ చేస్తూ విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. మూడవ విడత పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రచార హోరుతో పల్లెల్లో పంచాయతీ రాజకీయం వేడెక్కింది. నిబంధనలు కీలకం.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలి. ప్రచారంలో అభ్యర్థులు సంబంధిత అధికారుల ద్వారా ముందస్తు లిఖితపూర్వక అనుమతులు లేకుండా, ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయాన్ని మించి ఊరేగింపులు తీయొద్దు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదు. ప్రభుత్వ, ప్రై వేట్ స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లు అంటించొద్దు. గోడలపై ప్రచార రాతలతో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ఇలా చేస్తే 1997 చట్టం ప్రకారం మూడు నెలల కారగార శిక్ష.. లేదా రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంటి యజమానుల అనుమతి తీసుకుని ప్రచారానికి వినియోగించుకోవచ్చు. రాతపూర్వకమైన అనుమతులు తీసుకుని ఆ పత్రాన్ని ఎన్నికల అధికారులకు పంపాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైౖ వేట్ స్థలంలో సమావేశాన్ని నిర్వహించుకోవాలనుకున్నా.. కచ్చితంగా అనుమతి ఉండాల్సిందే. దేవాలయాలు, మసీదులు, చర్చిలు లేదా ప్రార్థన మందిరాలకు సంబంధించిన స్థలాల్లో ప్రచారం చేయడానికి అనుమతి ఉండదు. సభలు, సమావేశాలు నిర్వహించొద్దు. జాతి, మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఓటు వేయాలని కోరొద్దు. వ్యక్తిగత ఆరోపణలు చేయరాదు. అభ్యర్థుల నివాసాల వద్ద ప్రత్యర్థి పార్టీల వారు పో టాపోటీ కార్యకలాపాలు నిర్వహించొద్దు. ఎన్నికల ఊరేగింపుల నిర్వహణకు అనుమతి ఉండాలి. ఒక అభ్యర్థి ఊరేగింపు చేస్తున్నప్పుడు పోటీగా మరో ప్రదర్శన తీయరాదు. అనుమతులు పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించుకోవాలి. -
పోరు.. జోరు
అడ్డాకుల (దేవరకద్ర): గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం చివరి దశకు వచ్చేసింది. మూడో విడత ఎన్నికలు ఈనెల 30వ తేదీన జరగనుండగా ప్రచారానికి నేటి సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్, వార్డుసభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులే కాకుండా వారి తరుఫున బడా నేతలు, కుటుంబసభ్యులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే దూరపు బంధువులు కూడా ప్రచారానికి రంగంలో దించేశారు. తెలిసిన వారిని కలిసి తమ అభ్యర్థికి ఓట్లేయాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల పిల్లల్లో చాలా మంది ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. వారంతా ఊర్లకు వచ్చి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కొందరు అభ్యర్థులు పేరు మోసిన బంధువులను ప్రత్యేకంగా పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు. పల్లెల్లో సందడి ఎన్నికల సందర్భంగా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో దూరపు ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు యువత అంతా తమ బంధువుల ప్రచారంలో నిమగ్నమై కనిపించారు. ఇంటర్, డిగ్రీ చదువుకునే పిల్లలు సైతం ప్రచారంలో తమ మార్కును చూయించే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహితుల తల్లిదండ్రులు, బంధువులతో తమ స్నేహితుడి బంధువుకు ఓట్లేయాలని ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందించిన వారిని ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండే వారు ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నారు. ఆదివారం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం సాగించారు. 8 మండలాలు.. 227 పంచాయతీలు జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉండగా, రెండింటి పాలకవర్గాలకు ఇంకా సమయం ఉండడంతో 719 జీపీల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు మొదటి విడతలో 249 పంచాయతీలు, రెండో విగడతలో 243 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మూడో విడతగా 227 జీపీల్లో ఈనెల 30వ తేదీన బుధవారం పోలింగ్ జరగనుంది. అయితే, తొలి విడతలో 46 జీపీలు, రెండో విడతలో 56 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా.. మూడో విడతకు సంబంధించి మాత్రం కేవలం 24 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఈ విడత పంచాయతీల్లో పోరు హోరాహోరీగా కొనసాగనుందని చెప్పాలి. ఇక మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. అత్యధికంగా మద్దూరు మండలంలో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, భూత్పూర్ మండలంలో ఒక్క జీపీ కూడా ఏకగ్రీవం కాలేదు. అలాగే, సర్పంచ్ పదవి ప్రతీ పంచాయతీలో ఇద్దరు, ముగ్గురుపైనే అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. గండీడ్ మండలంలోనైతే 49 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవం కాగా, మిగిలిన 45 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఏకంగా 125 మంది పోటీ పడుతున్నారు. పెరిగిన ఎన్నికల వే‘ఢీ’ సర్పంచ్ ఎన్నికలంటేనే రసవత్తర పోరుకు నిదర్శనం. ఎందుకంటే ఒక్క ఓటు కూడా అభ్యర్థి ఫలితాన్ని తారుమారు చేస్తుంది. బుధవారమే పోలింగ్ జరుగనుండటంతో గ్రామాల్లో వేడి రా జుకుంది. ఓవైపు రెండు రోజులుగా ముసురు వ ర్షాలు కురుస్తుంటే మరోవైపు అభ్యర్థుల్లో రోజురోజుకు వేడి పెరుగుతోంది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రచారం సాగుతోంది. మద్ద తుదారులు, అనుయాయులను ఇంటికే పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు. తమ వర్గం ఓట్లు పక్కకు జారకుండా చూసుకుంటున్నారు. సర్వత్రా ఉత్కంఠ సర్పంచ్, ఉప సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ‘మనకు ఓట్లేసే వారెవరు...మనకు చేయిచ్చే వారెవరు’ అంటూ ముఖ్య నాయకులతో లెక్క కడుతుతున్నారు. ఓటర్లు కూడా చైతన్యమై ఎవరు వచ్చి ఓట్లడిగినా మీకే వేస్తామంటూ భరోసాగా చెబుతుండటంతో అభ్యర్థులు తికమకపడుతున్నారు. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో తెలియని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు అందని విధంగా ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. నేటితో ప్రచారానికి ‘తెర’ పోలింగ్‌కు 44 గంటల ముందే ప్రచార పర్వా న్ని ముగించాలన్న నిబంధనతో నేటి సాయం త్రం ప్రచారం ముగియనుంది. ప్రచారానికి తెరపడిన వెంటనే ప్రలోభాల పర్వం మొదలు కానుంది. మద్యం, డబ్బులతో ఓటర్లకు ఎర వేయడానికి అంతా సిద్దం చేసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రలోభాల పర్వం సాగనుంది. ఇందుకోసం అభ్యర్థులు చివరి అస్త్రాలన్నింటినీ ప్రయోగించేందుకు సిద్దమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి దేనికైనా...ఎంతకైనా వెనుకాడడం లేదు. ఇదిలా ఉండగా వలస ఓటర్లు గ్రామాల బాటపట్టారు. దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు గ్రామాలకు చేరుతున్నారు. రెండు రోజుల్లో ఊర్లో గడిపి ఓట్లేసి పోవచ్చని ముందే వస్తున్నారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం : ఆల దేవరకద్ర రూరల్: గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమానికి ప్ర భుత్వం అహర్నిషలు పాటుపడుతుందన్నారు. మండలంలోని జీన్గరాల, గుడిబండ, డోకూర్ గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఆల పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సాగునీరు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాతలను అ న్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో వినూత్నరీతిలో తీసుకొచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయని, రాబోయే రో జుల్లో చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. -
రెండో విడతలోనూ ప్రభంజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశలోనూ గులాబీ గుబాళించింది. అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకొని తిరుగులేని అధిక్యతను సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో అన్నింట్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. తొలిదశలో కారుజోరు సాగగా.. రెండో విడతలో కూడా దుమ్ము రేపింది. ఏకంగా ఆ పార్టీ 85 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకుంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గణనీయంగా సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. తలకొండపల్లిలో ఏకంగా 24 గ్రామ సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకోగా.. కడ్తాల్‌లో 14, మాడ్గులలో 19 గ్రామాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 41 పల్లెలను హస్తగతం చేసుకుంది. ఆరు జీపీల్లో బీజేపీ, నాలుగు చోట్ల సీపీఎం, మూడు గ్రామాల్లో టీడీపీ విజయం సాధించింది. 12 చోట్ల స్వతంత్రులు విజయఢంకా మోగించారు. ఇదిలావుండగా, శివారు మండలాలు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. స్థిరాస్తి రంగం ప్రభావం గ్రామాలపై కనిపించడంతో సర్పంచ్, వార్డుల్లో పాగా వేసేందుకు ఇబ్బడిముబ్బడిగా నగదును వెదజల్లారు. రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచ్ పోస్టును కైవసం చేసుకోవడానికి రూ.లక్షలు వెచ్చించారు. 89శాతం పోలింగ్ రెండో దశ పంచాయతీ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 89శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలకుగాను 21జీపీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో మాడ్గుల మండలం ఫల్గుతండా సర్పంచ్ పదవి వివాదాస్పదమైంది. పదవిని వేలం వేశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో ప్రస్తుతానికి దీన్ని పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఈసీ నిర్ణయం వెలువరించే వరకు వేచిచూడాల్సిందే! మరోవైపు ఏకగ్రీవం పోను మిగతా 160 పంచాయతీలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠ మధ్య సాగిన కౌంటింగ్‌లో విజేతలు నిలిచిన అభ్యర్థులు విజయ దరహాసంతో ఊరేగగా.. పరాజితులు ఓటమి భారంతో వెనుదిరగడం కనిపించింది. మాడ్గుల మండలం కొల్కుల్‌పల్లిలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి విజేత వర్గీయులపై రాళ్లురువ్విన సంఘటనలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. -
కారు అదే జోరు
సాక్షి, వరంగల్ రూరల్: మొదటి విడతలో ఉన్నట్లుగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జోరు కొనసాగింది. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ సాధించింది. గులాబీ సర్పంచు వార్డు సభ్యులు తమ సత్తా చాటారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరి లబ్ది పొందుతుండడంతో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించారు. రెండో విడతలో పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీల్లో 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదు గ్రామ పంచాయతీలను ఇండిపెండెంట్లు, ఒక్క గ్రామాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ దక్కించుకుంది. 136కు 111 టీఆర్ఎస్వే.. వరంగల్ రూరల్ జిల్లాలో మొదటి విడతలో 145 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ దక్కించుకుంది. అదే జోష్ రెండో విడతలో సైతం కొనసాగించింది. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగగా 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పరకాలలో 7, నడికూడ 10, శాయంపేట 16, ఖానాపురంలో 19, నల్లబెల్లిలో 23, రాయపర్తిలో 36 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లను గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ పరకాలలో 2, నడికూడలో 3 , శాయంపేటలో 6, ఖానాపురంలో 1, నల్లబెల్లిలో 4, రాయపర్తిలో 2 గ్రామ పంచాయతీలను దక్కించుకున్నాయి. శాయంపేటలో ఇద్దరు ఇండిపెండెంట్లు, పరకాల, నడికూడ, నల్లబెల్లి, రాయపర్తిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీని దక్కించుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా శుక్రవారం జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదయింది. 87.52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 11న రెండో విడతకు నోటిఫికేషన్ జారీ చేశారు. పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 401 గ్రామ పంచాయతీలుండగా రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు 392 వార్డులు ఏకగీవమయ్యాయి. రాయపర్తి మండలంలోని జయరాం తండాలో నాలుగు వార్డులకు నామినేషన్లు వేయలేదు. రెండో విడతలో 103 గ్రామ పంచాయతీలకు, 814 వార్డులకు ఎన్నికలు జరిగాయి.103 గ్రామ పంచాయతీలకు 309 మంది సర్పంచ్ అభ్యర్థులు, 814 వార్డులకు 1884 మంది వార్డు సభ్యులుగా పోటీ చేశారు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. నల్లబెల్లిలో నర్సంపేట ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత పరకాల, శాయంపేట, నల్లబెల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 87.52 శాతం ఓటింగ్.. రెండవ విడతలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఆరు మండలాల్లో 1,45, 023 మంది ఓటర్లు ఉండగా1,26, 931 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు మండలాల్లో 87.52శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా పరకాల మండలంలో 90.66 శాతం ఓటింగ్ నమోదు కాగా çశాయంపేటలో తక్కువగా 86.01 శాతం ఓటింగ్ నమోదయింది. ఓటింగ్‌లో మహిళలే అధికం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళ ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు 72,809 మంది ఉండగా 63, 602 మహిళలు, 72, 208 పురుషులు ఉండగా 63చ 329 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట గంటకు పెరిగిన పోలింగ్... ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతూ వచ్చింది. మొదటి రెండు గంటలు 67.16శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే వరకు 87.52శా–బహిష్కరించిన శ్రీరామనగర్ తండా వాసులు రాయపర్తి మండలంలోని శ్రీరామనగర్తండా వాసులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. శ్రీరామనగర్ తండాను గ్రామ పంచాయతీగా చేయాలని ఓటింగ్‌లో పాల్గొనకుండా తమ నిరసన తెలిపారు. పరకాల మండలం నాగారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మద్యహ్నాం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
ప్రశాంతంగా పోలింగ్
నిజామాబాద్‌అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బోధన్ డివిజన్లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రునగర్‌లో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలీసు కమిషనర్ కార్తికేయతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు జిల్లా, రెవెన్యూ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు తాగునీరు, వైద్యసదుపాయాలు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. గత ఎన్నికలను దృష్టిలో పె ట్టుకొని, సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన చోట్ల అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్ వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణతో పాటు సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ సరళిని గమనించారని తెలిపారు. -
84.93 శాతం పోలింగ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం బోధన్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో పూర్తయింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఉదయం పలుచోట్ల చిరు జల్లులు కురవడంతో ప్రారంభంలో పోలింగ్ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి షురువై వేగం పుంజుకుంది. రెండు గంటల్లోనే దాదాపు 40 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలన్నీ దాదాపు వెలవెల బోయాయి. పోలింగ్ ముగిసే సమయానికి 84.93 శాతం నమోదైంది. పోలింగ్ పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పరిశీలించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్ తదితర మండలా ల్లోని పలు గ్రామాల్లో జరుగుతున్న పో లింగ్ కేంద్రాలను ఆయన సందర్శించా రు. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రెంజల్ మండలం కూనేపల్లి, వీరన్నగుట్ట పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సందర్శించారు. సీపీ కార్తికేయ కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తును పరిశీలించారు. తొలి విడత కంటే అధికంగా.. తొలి విడత ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని 141 జీపీలకు జరిగిన పోలింగ్ 78.56 శాతం కాగా, రెండో విడతలో పోలింగ్ శాతం కాస్త పెరిగింది. సుమారు 6.37 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో 68.23 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 83.66 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈ పంచాయతీ ఎన్నికల విషయాని కి వచ్చే సరికి 84.93 శాతానికి పెరగడం గమనా ర్హం. పంచాయతీల పరిధి చిన్నగా ఉండటంతో అభ్యర్థులు తమ విజయం కోసం ఓటర్లను కేంద్రాలకు రప్పించేందు కు ప్రత్యేక ఆసక్తి చూపారు. ఓటర్లందరిని భాగస్వామ్యం చేసేందుకు అధికార యం త్రాంగం చేపట్టిన చర్యలు పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జల్లపల్లికి మూడో విడతలో.. కోటగిరి మండలం జల్లపల్లిలో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. సర్పంచ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో పొరపా ట్లు జరగడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.సర్పంచ్‌తో పాటు, వార్డు సభ్యుల ఎన్నికలను కూడా నిలిపివేశారు. మూడో విడత నిజామాబాద్ డివిజన్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించే రోజున జల్లపల్లికి కూడా పోలింగ్ జరిపే అవకాశాలున్నాయి. -
గులాబీదే జోరు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ దళం దూసుకుపోతోంది. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. పేరుకు పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలే అయినా.. పంచాయతీల్లో అభ్యర్థులు పార్టీల వారీగానే విడిపోయి పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం మిర్యాలగూడ డివిజన్లోని పది మండలాల పరిధిలోని 276 గ్రామ పంచాయతీల్లో జరిగింది. మొత్తం పంచాయతీల్లోనామినేషన్ల ఉప సంహరణల నాటికే 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పంచాయతీల్లోని వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిపారు. కాగా, మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పది మండలాల్లోని మొత్తం పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 92.01శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగా ఏర్పాటైన అడవిదేవులపల్లి మండలంలో అత్యధికంగా 95.24శాతం, అత్యల్పంగా తిరుమలగిరి (సాగర్) మండలంలో 88.44శాతం పోలింగ్ నమోదైంది. పది మండలాలకు గాను ఏకంగా ఎనిమిది మండలాల్లో తొంభై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగిలి రెండు మండలాల్లో సైతం 88శాతానికి పైనే ఓట్లు పోలయ్యాయి. డివిజన్లో మొత్తం 2,59,040 ఓట్లకు గాను, 2,38,351 ఓట్లు పోలయ్యాయి. గులాబీ జోరు గ్రామ పంచాయతీ ఎన్నికల మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ హవా కనిపించింది. 276 పంచాయతీలక గాను నామినేషన్ల దశలోనే ఏకగీవ్రంగా 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా కాగా, వాటిలో 51 మంది సర్పంచులు టీఆర్ఎస్ మద్దతు దారులే కావడం గమనార్హం. ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. మిగిలిన 224 పంచాయతీల్లో 146 మంది టీఆర్ఎస్కు చెందిన వారు సర్పంచులుగా విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో 66 మంది కాంగ్రెస్ మద్దతు దారులు, సీపీఎం 02, స్వతంత్రులు 09 మంది సర్పంచులుగా విజయం సాధించారు. -
మలి విడత ప్రశాంతం
ఇచ్చోడ(బోథ్): జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారిని వాహనాలు, మంచాలపై పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటేయించారు. రెండో విడతలో బోథ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 83 పంచాయతీలు, 322 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మండల కేంద్రాలతోపాటు పెద్ద పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. చివరి నిమిషం వరకు కూడ ఓట్లు వేశారు. ఎన్నికలు జరిగిన 83 పంచాయతీల పరిధిలో మొత్తం 94,463 మంది ఓటర్లు ఉండగా 78,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో 40,051 మంది పురుషులు ఉండగా 38,356 మంది మహిళలు ఓటు వేశారు. పోలింగ్ జరిగింది ఇలా.. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఆయా పంచాయతీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా, 9 గంటల వరకు పోలింగ్ అంతంత మాత్రమే జరిగింది 11 గంటల వరకు తలమడుగు మండలంలో 29.19 శాతం, గుడిహత్నూర్ మండలంలో 29.51 శాతం, బోథ్ మండలంలో 21.68, బజార్హత్నూర్ మండలంలో 22.07, నేరడిగొండ 31.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల నుంచి పోలింగ్ ఊపందుకుంది. బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, గిర్నూర్, పిప్రి పంచాయతీల్లో మినహా ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వచ్చారు. వికలాంగులు, వృద్ధులను ఆటోల్లో మోటార్ సైకిళ్ల ద్వార ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు. బోథ్ మండలంలోని కుచ్లపూర్ పంచాయతీ సర్పంచ్‌కు 6 వార్డులకు ఏకగ్రీవంగా కాగా కేవలం ఒక్క వార్డుకే ఎన్నికలు జరిగాయి. ఒక్క వార్డు కోసం రిటర్నింగ్ ఆధికారితోపాటు ఇద్దరు ఎన్నికల సిబ్బంది ద్వారా ఎన్నికలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వార ఓట్లు వేసిన ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వార ఓటింగ్‌కు కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. నిరక్షరాసులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలలో రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడంతో తికమక పడ్డారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు ఓటు వేసే విధానాన్ని వివరించి చెప్పడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్తండాలో సర్పంచ్‌గా పోటీ చేసిన కళాబాయి తన ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా ఆమెకు ప్రాణపాయస్థితి తప్పింది. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. -
గులాబీ.. పల్లెలు
పల్లెల్లో మరోమారు గులాబీ గుబాళించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం కడపటి సమాచారం అందే వరకు మొత్తం 107 పంచాయతీలకు ఏకగ్రీవం కలుపుకుని 63 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు సాధించుకున్నారు. మిగతా 44 స్థానాల్లో కాంగ్రెస్ 20, సీపీఐ 3, టీడీపీ ఒకచోట గెలుపొందగా, 20 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధిం చారు. మెజార్టీ ఉపసర్పంచ్‌లుగా టీఆర్ఎస్ మద్దతుదారులే నెగ్గారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఐదు మండలాల్లో 107 గ్రామపంచాయతీలు, 1014 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇందులో ఐదు పంచాయతీలు, 167 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పంచాయతీలు, వార్డులు కలిపి మొత్తం 104 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలైంది. తొమ్మిది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. ఒంటిగంటకు పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు ‘క్యూ’లు కట్టడంతో శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ గ్రామాల్లోని 21 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 వరకు కూడా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఐదు మండలాల్లో రెండో విడతలో 89.52 శాతంగా పోలింగ్ నమోదైంది. 89.52 శాతం పోలింగ్.. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదైంది. దీంతో ఓటర్ల నమోదు, ఓటుహక్కు వినియోగంపై అధికారులు ఉద్యమంలా చేపట్టిన కృషి ఫలించింది. ఐదు మండలాల్లో మొత్తం 16,3,788 మంది ఓటర్లకు 1,46,623 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా సగటున 89.52 శాతంగా నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. ఇందులో 81,799 మంది పురుషులకు 73,114 మంది, 81,989 మంది మహిళలకు 73,509 మంది ఓట్లేశారు. అత్యధికంగా శంకరపట్నం మండలంలో 91.20 శాతంగా కాగా, అత్యల్పంగా చిగురుమామిడి మండలంలో 87 శాతంగా ఉంది. గన్నేరువరంలో 90.39 శాతం, మానకొండూరులో 89.84 శాతంగా పోలింగ్ జరిగింది. వార్డులు, పంచాయతీలు కలుపుకుని మొత్తం 104 పంచాయతీల్లో 102 మంది సర్పంచ్‌లు, 847 వార్డుల్లో సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతినాయక్. పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తదితరులు పలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతం.. ఉత్కంఠగా కౌంటింగ్ ఐదు మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలు, వార్డులకు రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల సక్రమ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా ఉండడానికి రెండో విడతలోని 42 ప్రాంతాల్లోని 2,346 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అందులో 13 ప్రాంతాల్లోని 144 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం కావాల్సిన మోడెమ్‌లను కొనుగోలు చేశారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసిన చోట నేరుగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించడానికి వీలు కల్పించారు. 29 ప్రాంతాల్లో గుర్తించిన 202 పోలింగ్ స్టేషన్లను 29 మంది మైక్రో అబ్జర్వర్లకు బాధ్యతలు అప్పగించారు. వారు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చేరుకుని పర్యవేక్షించడంతో పాటు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎన్నికలు జరిగే పంచాయతీలను 16 జోన్లు, 36 రూట్లుగా గుర్తించి, అందుకోసం ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణ కోసం 983 మంది పోలింగ్ అధికారులుగా, మరో 1257 మందిని అదనపు పోలింగ్ అధికారులకు బాధ్యతలను అప్పగించగా, వీరికి అదనంగా 261 పీవో, 562 మంది ఓపీవోలను రిజర్వులో సిద్ధంగా ఉంచిన అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ఉప సంహరణల అనంతరం మానకొండూర్ మండలంలోని 26 పంచాయతీల్లో 121 మంది సర్పంచ్ బరిలో ఉండగా, తిమ్మాపూర్‌లో 21 స్థానాలకు 99 మంది, శంకరపట్నంలో 24 స్థానాలకు 94 మంది, గన్నేరువరంలో 14 స్థానాలకు 43 మంది, చిగురుమామిడి మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 82 మంది కలిపి మొత్తంగా 102 సర్పంచి స్థానాల్లో 439 మంది బరిలో నిలిచారు. 846 వార్డు స్థానాల కోసం 2,354 మంది బరిలో నిలిచారు. అయితే పెద్ద సంఖ్యలో పోటీ ఉండటంతో ఫలితాలు వెలువడే వరకు కూడా సస్పెన్స్ నెలకొంది. అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు అభ్యర్థులను ఉత్కంఠకు గురి చేసింది. రెండో విడత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఓటెత్తిన పల్లెలు !
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడత జీపీల్లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఓట్లు వేసేందుకు పల్లె ప్రజలు ఉత్సాహం చూపారు. తొలి విడతతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో 84.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ విడతలో 89.5 శాతంగా నమోదైంది. మొత్తంగా రెండో విడత పోలింగ్ సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాలోని పలు బూత్‌ల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. 89.5 శాతం రెండో విడత ఎన్నికలు జిల్లాలోని ఏడు మండలాలు, 185 పంచాయతీల్లో జరిగాయి. ఈ సందర్భంగా 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తక్కువగానే వచ్చారు. ఇక 9 గంటల తర్వాత పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. 9 నుంచి 11 గంటల వరకు ఏకంగా 68.98 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగుల వెంట సహాయకులు తోడుగా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సమయం ముగియనుండగా చివరి గంటలో ఎక్కువ మంది బూత్‌లకు వచ్చారు. ఉత్సాహంగా.. ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సహం చూపారు. ముందు నుంచి ప్రభుత్వం కూడా ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం కల్పించడం.. గ్రామాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు చేసిన కృషి ఫలించింది. ఉదయం కాస్తా పలుచగా కనిపించిన జనం సమయం దగ్గర పడుతున్న కొద్ది పోలింగ్ బూత్‌లకు ఎక్కువగా రావడం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకున్న 1,68,169 మంది రెండో విడతలో మొత్తం 1,68,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొ త్తం 1,88,845 ఓటర్లలో 1,68.169 మంది ఓటు వేశారు. దీంతో 89.5 శాతంగా పోలింగ్ నమోదైంది. కాగా, 1,88,845 మంది ఓటర్లలో 95,367 మంది పురుషులకు గాను 85,075 మంది, 93,478 మంది మహిళలకు గాను 83,094 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన టనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించిఛాయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించడం సత్ఫలితాలను ఇచ్చింది. కాగా, బందోబస్తు చర్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ రెమారాజేశ్వరి పర్యవేక్షించారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు నమోదు కాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
కారు.. హవా
జడ్చర్ల టౌన్ : అదే జోరు కొనసాగింది! అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు.. ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలోని 719 పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుండగా.. మొదటి దశ పోలింగ్ 21వ తేదీన ముగిసింది. ఈ దశలో 249 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులకు 145 స్థానాలు దక్కాయి. ఇక రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా 201 సీట్లను అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు దక్కించుకోవడం విశేషం. అలాగే, మొదటి దశలో 59 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు.. ఈ దశలో కేవలం 20 సీట్లకే పరిమితం కావడం, బీజేపీకి రెండు సీట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వీరు మినహాయిస్తే మరో 20 సీట్లలో సర్పంచ్‌లుగా స్వతంత్రులు గెలుపొందారు. అయితే, వీరిలో చాలా మందిటీఆర్‌ఎస్ రెబెల్స్ కావడంతో ఈ స్థానాలు కూడా అధికార పార్టీ ఖాతాలో పడినట్లుగానే భావిస్తున్నారు. ఉత్కంఠ... రెండో విడతగా 721 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, ఇందులో రెండింటి పాలకవర్గాల పదవీకాలం ముగియకపోవడంతో 719 పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయగా.. కాగా, ఒక్కో నామినేషన్ దాఖలైనవి, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కటే మిగిలినవి 58 జీపీలు ఉండడంతో ఇవి ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. మిగిలిన 185 పంచాయతీల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఆయా స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 594 మంది బరిలో ఉన్నారు. ఇక ఏకగ్రీవమైన 697 వార్డులు మినహాయిస్తేమిగిలిన 1,369 వార్డుల్లో 3,427 మంది పోటీలో మిగిలారు. ఈ మేరకు శుక్రవారం పోలింగ్ నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కటొక్కటిగా ఫలితాలను వెల్లడించారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొసాగింది. అనంతరం గంట పాటు ఉద్యోగులకు భోజన విరామం సమయం కేటాయించారు. ఆ తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచారు. ముందుగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్లను వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టారు. ఇక తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించాక.. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ నెలకొంది. తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడించగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులతో పాటు మద్దతు దారులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఫలితాలు వెల్లడయ్యాక గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోగా.. ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు. వార్డు సభ్యుల ఫలితాలను తొలుత వెల్లడించడంతో ఎవరి ప్యానల్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారో వారు తమకు ఉప సర్పంచి పదవి కావాలని లాబీయింగ్ మొదలుపెట్టారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించడం పూర్తి కాగానే అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. పార్టీల వారీగా విడిపోయిన వార్డుసభ్యులు తమ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా ఉందంటూ ఉప సర్పంచ్ పదవి కోసం పట్టుపట్టడం కనిపిచింది. -
‘కారు’.. జోరు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మద్దతుదారులు రెండో విడతలోనూ సత్తా చాటారు. జిల్లాలోని మొత్తం 204 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీకి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో శుక్రవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. మొత్తం 91.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు వరుసలో బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెదురు మదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రాత్రి వరకు కొనసాగింది. ఈ విడతలో సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు, వైరా నియోజకవర్గంలోని రెండు మండలాల్లోని జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇటు సత్తుపల్లి.. అటు వైరా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల్లో అత్యధిక జీపీలను దక్కించుకున్న టీఆర్ఎస్.. ఎన్నికల్లో కూడా తన హవా చాటింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాల్లోనూ టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో స్వతంత్రులు నిలిచారు. అయితే టీఆర్ఎస్కు.. స్వతంత్ర అభ్యర్థులకు భారీ వ్యత్యాసం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో అసలు ఖాతా తెరవలేకపోయింది. ఇక టీడీపీ కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో 15 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం 31 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంమీద ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ 139 స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 31, కాంగ్రెస్ 9, టీడీపీ 15, సీపీఐ ఒకటి, సీపీఎం 7, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒకస్థానాన్ని గెలుపొందాయి. వేంసూరు మండలంలో 26 స్థానాలకుగాను.. 21 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, టీడీపీ స్థానాలకు పరిమితమయ్యాయి. సత్తుపల్లి మండలంలో 21 జీపీలు ఉండగా.. 15 జీపీలను టీఆర్ఎస్ గెలుపొంది సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడు స్థానాల్లో గెలుపొందాయి. తల్లాడ మండలంలో 27 జీపీలకుగాను.. టీఆర్ఎస్ 16 స్థానాల్లో, సీపీఎం 3, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. -
టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి
టేకులపల్లి: టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది. కోయగూడెంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని అవమానించారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కలిసి టేకులపల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శుక్రవారం ప్రచారం చేస్తున్నారు. ఆమెను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. టీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టేకులపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి బోడ సరితకు చెందిన ప్రచార వాహనం అద్దం పగులకొట్టారు. సీఐలు నాగరాజు, వేణుచందర్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. విచారణ చేపట్టారు. -
ముగిసిన రెండో విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గత సోమవారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు రెండు విడతల పోలింగ్ జరగగా ఈనెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం ఖమ్మం 73.35 శాతం నల్లగొండ 65 శాతం సూర్యపేట 77 శాతం పెద్దపల్లి 67.30 శాతం రంగారెడ్డి 65.3 శాతం కరీంనగర్ 64 శాతం యాదాద్రి 63 శాతం కామరెడ్డి 81.78 శాతం నిజామాబాద్ 69.38 శాతం వనపర్తి 80 శాతం నాగర్ కర్నూల్ 76 శాతం జోగులాంబ గద్వాల 78 శాతం వరంగల్ అర్బన్ జిల్లా 87 శాతం జనగామ 90 శాతం భూపాల్ పల్లి 83 శాతం -
వేటు పడింది!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత కొన్ని బ్యాలెట్ పత్రాలను భద్రపరిచేందుకు తీసుకెళ్లనందుకు సస్పెండ్ అయ్యారు. జిల్లా పంచాయతీ ఉప ఎన్నికల అధికారి, ఆర్డీఓ మోహన్‌రావు ఇచ్చి న నివేదిక ఆధారంగా చివ్వెంల మండలం గుంజలూరు స్టేజ్ –2 అధికారి బుచ్చిరెడ్డి, మోతె మండలం హుస్సేన్ బాద్ స్టేజ్ –2 అధికారి ఖాజాఖలీల్‌ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 21న గుంజలూరు, హుస్సేన్‌బాద్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్ అయిన బ్యాలెట్ పత్రాలు కొన్ని గుంజలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సర్పంచ్ బరిలో నిల్చొని ఓటమిపాలైన అభ్యర్థితో పాటు, ఆయనకు మద్దతుగా గ్రామస్తులు ఈ విషయమై ఆందోళన వ్యక్తంచేశారు. గరిడేపల్లి జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న వై.బుచ్చిరెడ్డి ఇక్కడ స్టేజ్ –2 అధికారిగా విధులు నిర్వర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంవహించి కొన్ని బ్యాలెట్ పత్రాలను భద్రపర్చలేదని విచారణలో తేలింది. దీంతో అతనిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అలాగే మోతె మండలం హుస్సేన్‌బాద్‌లోకొన్ని బ్యాలెట్ పేపర్లు పాఠశాల లోని చెత్తకుప్పలో దర్శనమివ్వడంతో ఓటమిపాలై న అభ్యర్థి ఈ విషయాన్ని ఎన్నికల అ ధికారి దృష్టి కి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేసిన అధికారు లు స్టేజ్ –2 అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని నిర్దారణకు వచ్చారు. అధికారి ఇచ్చిన నివేదికతో కలెక్టర్ ఇక్కడ స్టేజ్–2 అధికారిగా విధులు నిర్వహించిన దురాజ్‌పల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఖాజాఖలీల్‌ఖాన్‌ను సస్పెండ్ చేశారు. -
ఓటేయ రారండోయ్...!
కరీంనగర్/కమాన్‌చౌరస్తా(కరీంనగర్): మానకొండూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వారు ఉపాధికోసం మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ గ్రామంలో వారికి ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి వారితో మాట్లాడి గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని ప్రాధేయపడ్డాడు. వారి కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉండగా ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయడంతో వారు ఓట్లు వేసేందుకు రావడానికి బయల్దేరారు. గన్నేరువరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన పదిమంది వరకు యువకులు ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. వారికి గ్రామంలో ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి, సదరు వార్డు సభ్యులు సైతం పేరుపేరునా ఫోన్ చేసి ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థించారు. ఒకరికి మించి ఒకరు ఫోన్లు చేసి వివిధ రకాల ఆఫర్లు ప్రకటించారని తెలిసింది.పంచాయతీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఎలాగైనా కుర్చీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శుక్రవారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మూడో విడత ఎన్నికల ప్రచారం గ్రామాల్లో ముమ్మరంగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఉపాధి, చదువుల కోసం వెళ్లినవారు, ఉద్యోగులతో పాటు ఇతర పనుల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని నానా పాట్లు పడి ఓట్ల కోసం రప్పిస్తున్నారు. వారికి రకరకాల నజరానాలతో పాటు రానుపోను ఖర్చులు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒక రోజు ముందే గ్రామాలకు చేరుకోగా, ఈ రోజు మరికొంత మంది రానున్నారు. వివరాలు సేకరించిన అభ్యర్థులు... రెండో విడతలో గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉంటున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటినుంచే గ్రామం, వార్డుల్లోని ఓటరు లిస్టు చూస్తూ స్థానికేతరులను గుర్తించారు. వారి వివరాలు సేకరించి ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకొని స్వయంగా ఫోన్లు చేయడం, వారి అనుచరులు, బంధుగణంతో ఫోన్లు చేయించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. వారికి అవసరమైన రవాణా ఖర్చుతో పాటు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని పలు పల్లెలకు చెందినవారు స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువుల నిమిత్తం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, మహారాష్ట్ర, బెంగళూర్, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్... వలస ఓటర్లకు ఊరు రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండదు కాబట్టి వారికి ఎంత కావాలంటే అంత ముట్టజెపుతున్నట్లు తెలిసింది. తమ పనులను, సమయాన్ని, వ్యాపారాలను తమ కోసం కేటాయించడానికి సిద్ధపడుతున్నందుకు వారికి పెద్ద ఎత్తున్న నజరానాలు అందించడానికి సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఓటర్ల అకౌంట్లలోకి తేజ్, పేటీఎం, గూగూల్ పేలతో పాటు వివిధ యాప్‌ల ద్వారా కొంతమందికి ట్రాన్స్ఫర్ నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సాంకేతికత లేని వారికి వారి అకౌంటు నంబర్లు తీసుకొని ఓటుకు కొంత మొత్తం చెప్పున లెక్కించి వారి ఖాతాల్లో జమ చేసినట్లు పలు గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఓట్లతో పాటు వలస ఓట్లు కీలకంగా ఉండడంతో అభ్యర్థుల గెలుపులో స్థానికేతరులు కీలకపాత్ర పోషించనున్నారని అర్థమవుతోంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎలాగైనా గెలువాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ నోట్ల కట్టలు పంచుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో ఎవరి వ్యూహాలు ఫలించాయో సాయంత్రానికల్లా తేలనుంది. -
సంగ్రామం 2
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా 243 పంచాతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 58 పంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 185 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏడు మండలాలు... జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించే షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రెండో విడతగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో ఎన్నికలకు ఏర్పాటుచేశారు. అయితే, ఏకగ్రీవమైన పంచాయతీలు పోను మిగతా జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవ జీపీలు... రెండో విడతగా ఏడు మండలాల్లో మొత్తంగా 58 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. నవాబుపేట మండలంలో అత్యధికంగా 19 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా, మహబూబ్‌నగర్ రూరల్‌లో 5, జడ్చర్లలో 8, మిడ్జిల్‌లో 3, హన్వాడలో 7, బాలానగర్‌లో 10, రాజాపూర్‌లో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా మండలాల్లోని 697 వార్డుసభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిడ్జిల్ మండలంలోని పంచాయతీల్లో 48 వార్డులు, బాల్నగర్లో 120, రాజాపూర్‌లో 57, జడ్చర్లలో 117, నవాబ్‌పేట్‌లో 191, మహబూబ్‌నగర్ రూరల్‌లో 50, హన్వాడలో 114 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో 4,021 మంది గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జీపీల్లో మొత్తం 4,021 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్పంచ్ స్థానాలకు 594 మంది బరిలో ఉండగా.. వార్డు సభ్యులుగా 3,427 మంది పోటీలో మిగిలారు. మిడ్జిల్ మండలంలోని 24 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవం కాగా, 21 పంచాయతీల్లో, బాలానగర్‌లో 37 జీపీలకు 10 ఏకగ్రీవం కాగా 27 పంచాయతీల్లో, రాజాపూర్‌లో 24 జీపీల్లో 6 ఏకగ్రీవం కాగా 18 పంచాయతీల్లో, జడ్చర్లలో 43 జీపీలకు 8 ఏకగ్రీవం కాగా 35 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవాబుపేట మండలంలో 54 పంచాయతీల్లో 19 ఏకగ్రీవం కాగా, 35 జీపీల్లో, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 26 జీపీల్లో 5 ఏకగ్రీవం కాగా 21 జీపీల్లో, హన్వాడలో 35 జీపీలకు 7 ఏకగ్రీవం కాగా, 28 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 243 జీపీల్లో 58 ఏకగ్రీవం కాగా మిగిలిన 185 జీపీలకు 594 మంది సర్పంచ్ స్థానం కోసం బరిలో నిలిచారు. ఇక 2,066 వార్డులకు గాను 697 ఏకగ్రీవం కాగా 1,369 వార్డుల్లో 3,427 మంది బరిలో నిలిచారు. వలస ఓటర్లపై నజర్ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. పోలింగ్ శుక్రవారం జరగనుండగా.. గురువారం రాత్రి వరకే ఎక్కడ ఉన్న ఓటర్లయినా స్వస్థలాలకు చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పట్టణాలకు వెళ్లి వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు వారికి గ్రామాలకు చేర్చడంతో పాటు తిరిగి పట్టణాలకు పంపించే లా సొంత ఖర్చు తో వాహనాలు సమకూర్చారు. 4,685 మంది పోలింగ్ సిబ్బంది రెండో విడత ఎన్నికల నిర్వహణకు మొత్తం 4,685 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఇందు లో 2,274 మంది పీఓలు కాగా 2,411 మంది ఏపీఓలు, ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి గ్రామపంచాయతీలను కేటాయించగా.. గురువారం ఉదయం పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు బయలుదేరారు. ఇందుకోసం జిల్లా యంత్రాం గం ప్రత్యేక వాహనాలు కేటాయించింది. పోలింగ్.. ఆ వెంటనే ఫలితం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం గంట విరామం ఇచ్చాక రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. తొలుత వార్డు సభ్యు ల ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించాక సర్పం చ్ అభ్యర్థుల వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. కాగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి పూర్తయ్యాక ఉప సర్పంచ్‌ను సైతం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్ అభ్యర్థికి అవకాశం వస్తుంది. అలా జరగకపోతే ఎవరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీల నేతలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. సర్పం చ్ పదవి జనరల్ స్థానమైతే ఉప సర్పంచ్ పదవి నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచి రిజర్వ్ అయితే ఉప సర్పంచి జనరల్‌కు ఇవ్వాలని పలు వురు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
సర్వం సిద్ధం
చుంచుపల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో వార్డు సభ్యులు హాజరు కాకుంటే ఉప సర్పంచ్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఎన్నికలు జరిగే అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, చుంచుపల్లి మండలాలకు అధికార యంత్రాంగం, పోలింగ్, పోలీస్ సిబ్బంది గురువారం మధ్యాహ్నానికే ఆయా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసు బందోబస్తుతో పాటు, పలు పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండో విడతలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1294 వార్డులకు గాను ఐదింటికి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 289 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1000 వార్డులకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు జరిగే 122 పంచాయతీలకు 343 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1000 వార్డులకు మొత్తం 2,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిబ్బంది, సామగ్రి తరలింపునకు 100 బస్సులు... రెండో విడత ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు 100 బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 పెద్ద బస్సులు, 25 మినీ బస్సులు ఉన్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి ఈ బస్సుల్లోనే సిబ్బంది, సామగ్రిని గమ్యస్థానాలకు చేరుస్తారు. కాగా, రెండో విడత ఎన్నికల విధులకు 3,423 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఆర్వోలు 43 మంది, ఆర్వో– 1, 43 మంది, ఏఆర్వోలు 156, పీవోలు 1,423, ఓపిఓలు 1,657 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 77 మంది, జోనల్ ఆఫీసర్లను 25 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,455 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్ రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. రెండో విడత ఎన్నికలకు పోలింగ్ సామగ్రిని తరలించే సింగరేణి పాఠశాల కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా మండలాల అధికారులకు సూచించారు. తొలి విడత ఎన్నికల సమయంలో అక్కడక్కడా కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు భోజనాలతో పాటు ఇతర సౌకర్యాలను స్థానిక మండల అధికారులు ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ వెంకటేశ్వర్లు, డీపీఓ ఆశాలత, ఎన్నికల విభాగం అధికారులు ముత్యాల పులిరాజు, కోటయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, చుంచుపల్లి తహసీల్దార్ నాగుబాయి ఉన్నారు. -
అస్తవ్యస్తం..
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇక స్థానిక సంస్థల్లో అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరింత పకడ్బందీగా ఉండాలి. అయితే గతంతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరగడంతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరం వచ్చింది. పైగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే అన్ని అంశాల్లో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ.. సిబ్బందికి విధుల కేటాయింపులో మాత్రం జిల్లాలో అనేక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సగం మందికి ఎన్నికల డ్యూటీ పడకపోగా వందల మంది ప్రైవేటు టీచర్లకు విధులు అప్పగించారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న బాధ్యత ప్రైవేటు వారికి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలకుంటే ప్రైవేటు వారి సేవలు ఉపయోగించుకోవాలే తప్ప ఇలా చేయడమేంటని అంటున్నారు. మరో విషయమేంటంటే చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డ్యూటీలు పడకపోగా, ప్రస్తుతంజరుగుతున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క విడతలోనూ సదరు టీచర్లకు విధులు కేటాయించకపోవడం గమనార్హం. ఇక కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రం మూడు విడతల్లోనూ విధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 4500 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 2వేల మందికి అసలు ఎన్నికలు డ్యూటీలే వేయకపోవడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొందరు ఉపాధ్యాయులైతే తాము ఎన్నికల విధులకు పనికి రామా అని వాపోతున్నారు. అలాగే చాలామంది ఎస్జీటీలకు ఎన్నికల విధులు పడకపోగా, కీలకమైన పదోతరగతి విద్యార్థులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం మూడు విడతల్లో విధులు కేటాయించడం గమనార్హం. రిటైర్డ్ ఉపాధ్యాయులకూ విధులు..! కొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులకు, ఇతర జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించారు. కొందరు వికలాంగ ఉద్యోగులకు కూడా విధులు కేటాయించడంతో, వారు సంబంధిత జీవో కాపీలు తెచ్చుకుని డీపీఓ వద్దకు వెళ్లి డ్యూటీలు రద్దు చేయించుకున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో అనేకమంది అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల డ్యూటీలు వేశారు. చివరకు కాంట్రాక్టు లెక్చరర్లు, సింగరేణి ఉద్యోగులు, ఐటీడీఏ ఉద్యోగులకు సైతం విధులు కేటాయించి తమను విస్మరించడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. టీ– పోల్ వెబ్‌సైట్‌తోనే అసలు తిప్పలు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందరు ఎంపీడీఓలు ఆయా మండలాల పరిధిలోని ఉద్యోగుల వివరాలు ఇచ్చారు. వారు టీ.పోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ టీ.పోల్ ద్వారా మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు ఉద్యోగుల వివరాలు తీసుకుని విడతల వారీగా ఎన్నికల విధులు కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నం కాగా, వాటిని జిల్లా పంచాయతీ అధికారి సాధ్యమైనంత మేరకు సవరించారు. అలాగే ఉపాధ్యాయులు వివిధ సమస్యలను డీపీఓ దృష్టికి తీసుకురాగా వాటిని సైతం సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికలు జరిగిన అన్ని మండలాల్లో ఎన్నికల సిబ్బంది కొరత తలెత్తినప్పటికీ నెట్టుకొచ్చారు. రెండో విడతలో అలాంటి సమస్యలు రాకుండా డీపీఓ సరిచేశారు. ఉద్యోగుల వివరాలను ఎంపీడీఓలు ఆయా మండలాల నుంచి టి.పోల్ వెబ్‌సైట్‌కు పంపారు. అయితే ఉపాధ్యాయుల వివరాలను, రిటైర్డ్ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓల నుంచి ఎంపీడీఓలు తీసుకున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన కచ్చితమైన వివరాలను ఎంఈఓలు సక్రమంగా ఇవ్వలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎంపీడీఓలు తమకు అందిన వివరాలను మాత్రమే పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పంచాయతీ అధికారులకు సమస్యలు ఎదురైనట్లు పలువురు ఉపాధ్యాయులు చెపుతున్నారు. రెమ్యునరేషన్‌లోనూ తేడాలు.. ఎన్నికల విధులకు హాజరైన వివిధ స్థాయిల సిబ్బందికి రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలోనూ ఒక విధానమంటూ లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒక రకంగా చెల్లించారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ చెల్లింపు విషయంలో ఆయా విభాగాల వారీగా సిబ్బందికి అన్ని చోట్లా ఒకేలా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టరుకు వినతిపత్రాలు అందించాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో ఆయా మండల కేంద్రాల వద్ద నుంచి అర్ధరాత్రి సమయంలో రవాణా సదుపాయాలు లేక సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేక అగచాట్లు పడ్డారు. రెండు, మూడు విడతల్లో అయినా ఈ పరిస్థితిని లేకుండా చేయాలని కోరుతున్నారు. ఎంఈఓలు అన్ని వివరాలు ఇచ్చారు అన్ని మండలాల్లో ఆయా ఉపాధ్యాయులకు సంబంధించిన పూర్తి వివరాలను మండల విద్యాశాఖ అధికారులు ఎంపీడీఓలకు అందజేశారు. అయితే ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు కేటాయించకపోవడం, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎన్నికల విధులు కేటాయింపు విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. – వాసంతి, డీఈఓ -
రేపే రెండో దశ పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. దాదాపు వారం రోజులపాటు పోటాపోటీగా సాగిన ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. చివరి రోజు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. రెండో దశగా ఎనిమిది మండలాల పరిధిలోని 181 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 21 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 160 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 489 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 1,656 వార్డులకుగాను 1,400 వార్డుల్లో పోరు జరగనుంది. ఇక్కడ 3,844 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించారు. తమకే ఓటేస్తామన్న వారి ఓటును కాపాడుకునేందుకు జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తుండగా.. డబ్బులు కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
ఉపాధ్యాయులకు కొత్త చిక్కు
పాపన్నపేట(మెదక్): ‘‘ఆమె పాపన్నపేట మండలంలోని మారుమూల గ్రామంలో ఒక టీచర్. ఈ నెల 21న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేగోడ్ మండలంలో విధులు నిర్వహించారు. ఎన్నికల తంతు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఒంటి గంట అయింది. తెల్లవారి 22న తిరిగి పాఠశాల విధులకు వెళ్లారు.’ ఇక్కడ కాస్త ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది లేదు. కానీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పరిస్థితి వేరు. 25న పంచాయతీ రెండో విడత ఎన్నికలు.. తెల్లవారితే పాఠశాలలో గణతంత్ర వేడుకలు. ఇక్కడ కాస్తా అటు ఇటుగా వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏడాదిలాగే గ్రామంలో నిర్ణయించిన ఎజెండా కనుగుణంగా జెండాలు ఎగురుతుంటాయి. కాస్తా ఆలస్యమైతే అందరి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే టీచర్లంతా టెన్షన్‌తో సతమతమవుతున్నారు. 25న జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇందులో కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుండగా, మిగతావి రెండు అంత కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు. ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు పడకపోయినా, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రం 90 శాతం మందికి ఎన్నికల విధులు పడినట్లు తెలుస్తోంది. 25న జరిగే ఎన్నికల కోసం 24వ తేదీనే ఉపాధ్యాయులంతా, సంబంధిత మండలాలకు వెళ్లాల్సి ఉంటుంది. 25న ఎన్నికల విధులు ముగించుకొని తమ తమ ఇళ్లకు వచ్చే సరికి, వారి వారి దూరాన్ని బట్టి రాత్రి 1 నుంచి 2 అయ్యే అవకాశం ఉంది. తెల్లవారి ఉదయం 7 నుంచి 8 లోపు గణతంత్ర వేడుకలకు సంబంధించి జెండాలు ఎగురవేయాలి. జాతీయ పండగ కావడంతో గ్రామాల్లో ప్రభాత్ భేరిలు నిర్వహిస్తూ, వరస క్రమంలో జెండాలు ఎగురవేస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల సమయానికనుగుణంగా జెండా ఎగురవేయాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట కొత్త సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. అందుకే టీచర్లు ఎన్నికలు విధులు ముగించుకొని సమయానికి గణతంత్ర వేడుకలకు హాజరవుతామా? లేదా? అని ఆందోళనకు లోనవుతున్నారు. ఒకవేళ తాము పనిచేసే పాఠశాలలు మారుమూల గ్రామాలైతే..బస్సు సౌకర్యాలు లేకపోతే వారి పరిస్థితి దయనీయం. అలాగే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం, స్వీట్లు పంపిణీ చేయడం, చివరకు సమావేశాలు నిర్వహించడానికి సమయం సరిపోక ఆగమవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్ళిన చోట ఎన్నికల నిర్వాహణలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడినా. సమస్యలు తలెత్తినా రాత్రి వరకు తేలని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఎన్నికలకు వెళ్లిన మండలం నుంచి సకాలంలో బస్సులు వేసి గమ్యం చేర్చాలని అధికారులను కోరుతున్నారు. -
రేపే మలి విడత
నిజామాబాద్‌అర్బన్: బోధన్ డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త య్యాయి. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిపోగా ఈనెల 25న ఎన్నికలు జరుగనున్నా యి. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒం టి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అభ్యర్థులను ప్రకటిస్తారు. డివిజన్లోని బోధన్, కోటగిరి, రెంజల్, రుద్రూ రు, వర్ని, ఎడపల్లి మండలాల్లో 142 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 11న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 13న నామినేషన్ల ముగింపు, ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. 33 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం కాగా, 109 స్థానాలకు ఎన్ని కలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,296 వార్డు లు ఉండగా ఇందులో 452 వార్డు స్థానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా 844 వార్డులకు ఎన్నికలు జరుగనున్నా యి. వార్డు స్థానాలకు 2,002 మంది బరిలో ఉన్నారు. కుల సంఘాలకు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగానే, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో కులసంఘాలు, యు వజన సంఘాలకు విందులు ఏర్పాటు చేస్తున్నా రు. మహిళా సంఘాలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి మద్యం అందిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమకు కేటాయించిన గుర్తులను వస్తువులుగా అభ్యర్థులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కులసంఘాలు, యువజన సంఘాల సభ్యులకు రోజూ విందులు ఇస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. -
ముగిసిన మలివిడత ప్రచారం
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. నాటినుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 276 సర్పంచ్‌లకు 2,376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉప సంహరణ ముగిసిన అనంతరం 52 గ్రామ పంచాయతీలు, 585 వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 5 వార్డులకు నామినేషన్లు రాకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ నెల 25వ తేదీన నిర్వహించే పోలింగ్‌లో 224 సర్పంచ్‌లకు, 1,786 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం డివిజన్ వ్యాప్తంగా 678 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4125 మంది వార్డు సభ్యులకు పోటీలో ఉన్నారు. ప్రలోభాలకు సిద్ధమైన అభ్యర్థులు వారం రోజులపాటు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం ముగియడంతో ఒక్క రోజులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు సిద్దమయ్యారు. మద్యం, డబ్బు పంపిణీకి సిద్ధం పోటా పోటీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ వేసిన నాటినుంచి కూడా మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో బెల్ట్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో సర్పంచ్‌కు ఓటు ఎటు వేసుకున్నా వార్డు సభ్యుడిగా మాత్రం నాకు ఓటెయ్యాలనే ప్రచారం కూడా సాగుతోంది. వార్డు, సభ్యులు సర్పంచ్‌లు కూడా వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్న గ్రామాలు సైతం ఉన్నాయి. -
‘రెండో విడత’కు సిద్ధం
ఆదిలాబాద్‌అర్బన్: రెండోవిడత పంచాయతీకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయగా, బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా గెలుపుకోసం యత్నిస్తున్నారు. రెండోవిడత పోరుకు ఇంకా 24 గంటలే ఉంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన బూత్‌లో పోలింగ్ జరగనుంది. ఇందుకు జిల్లా యంత్రాంగం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుతోపాటు పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు పోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 400 ఓటర్లు దాటిన పోలింగ్‌కేంద్రంలో ముగ్గురు సిబ్బంది చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడత పంచాయతీ ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. రెండో విడతకు అంతారెడీ రెండోవిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఐదు మండలాల్లోని 83 పంచాయతీలకు, 362 వార్డులకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారి చొప్పున మొత్తం 1372 మంది సిబ్బందిని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఇందులో రిజర్వులో ఉండే వారిని కలుపుకొని 580 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, 792 మందిని ఇతర ప్రిసైడింగ్ అధికారులుగా నియమించారు. ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే రిజర్వులోని సిబ్బంది విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరితోపాటు 20 మంది జోనల్, 22 మంది రూట్ అధికారులను నియమించారు. స్టేజ్–1, స్టేజ్–2 అధికారులు కలిపి మొత్తం 219 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఎన్నికలకు 1208 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, 1506 ఇంక్ బాటిళ్లు ఉన్నాయి. మొత్తం సర్పంచ్ 1,11,200 ఉండగా, 85,550 వార్డు బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. సర్పంచ్‌కి 306, వార్డులకు 886 మంది.. రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోథ్, తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ మండలాల్లోని మొత్తం 149 పంచాయతీలకుగాను 65 జీపీలు ఏకగ్రీవం కాగా, 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 306 మంది అభ్యర్థులు ఉన్నారు. ఐదు మండలాల్లో మొత్తం 1208 వార్డులకుగాను 839 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల బరిలో 886 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలోని బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, తలమడుగు మండలాల పరిధిలో 1,18,825 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 36,462 మంది ఉండగా, ఎస్సీలు 26,202 మంది, బీసీలు 48,076 మంది, ఇతరులు 8085 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా మొత్తం 149 పంచాయతీలు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 65 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అంటే 83 పంచాయతీలకే ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవ పంచాయతీల పరిధిలోని ఓటర్లు మినహా సుమారు 83,650 మందికిపైగా ఓటర్లు ఓటింగ్ పాల్గొనే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్.. రెండోవిడతలో 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సీన్‌ను లైవ్‌లో పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి పకడ్బందీగా ఓట్లు లెక్కించనున్నారు. కాగా ఒక పంచాయతీ సమస్యాత్మకంగా గుర్తించగా, ఐదు పంచాయతీలు అత్యంత సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. మరో 14 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 63 పంచాయతీలు సాధారణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముగిసిన పంచాయతీ ప్రచారం.. జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. పదిరోజులుగా ఎన్నికల ప్రచారంతో సందడిగా మారిన పలు గ్రామాలు ప్రచారం ముగియడంతో స్తబ్దుగా మారాయి. ఆయా పదవులకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారంతో నిత్యం సందడి కనిపించగా, ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సౌండ్ బాక్సులు, లౌడ్ స్పీకర్లు, మైకుల సౌండ్‌తో గ్రామాలు హోరేత్తాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న వారిలో టెన్షన్ మొదలైంది. అయితే రెండోవిడత పంచాయతీ తీర్పు ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మోత ఆగింది...
జడ్చర్ల టౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత గ్రామాల్లో పోలింగ్ నిర్వహణకు సమయం వచ్చేసింది. జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు గాను రెండో విడతలో 245 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందులో రెండింటి పాలకవర్గాలకు ఇంకా గడువు ఉండడంతో 243 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు. కాగా, ఈ జీపీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు 58 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 185 పంచాయతీల్లో శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో గడువు ముగియగా.. ప్రజలను నేరుగా కలుస్తూ వారిని ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నయ్యారు. ఇందుకోసం మద్యం, మాంసం పంపిణీకి తెర తీసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరగనున్న జీపీల్లో బుధవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలను మూసివేశారు. కానీ ఇప్పటికే అభ్యర్థులు తాము ప్రజలకు అందజేసేందుకు కావాల్సిన మద్యాన్ని గ్రామాల్లోకి చేరవేసినట్లు సమాచారం. మేమున్నాం... ఎన్నికల సందర్భంగా ఎలాంటి జంకు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, ఉదండాపూర్, వల్లూరు గ్రామాల్లో బుధవారం పోలీసు కవాతు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో ఆయన ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలను కోరారు. జడ్చర్లలో మద్యం స్వాధీనం జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో స్పెషల్ పార్టీ అధికారి చంద్రకాంత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.57వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల నుంచి ఇతర ప్రాంతాలకు రెండు వాహనాల్లో తరలిస్తున్న ఐదు కాటన్ల బీర్లు, 12కాటన్ల లిక్కర్‌ను వారు స్వాధీనం చేసుకుని జడ్చర్ల ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ మద్యాన్ని అమ్మపల్లి, కోడ్గల్ గ్రామాలకు చెందిన అభ్యర్థుల కోసం చేరవేస్తున్నట్లు సమాచారం. ఏడు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు రెండో విడతగా జిల్లాలోని ఏడు మండలాల్లో జరగనున్నాయి. మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్‌తో పాటు హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ విడతలో 58 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగతా 185 పంచాయతీల్లో మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. ఏకగ్రీవ పంచాయతీలివే... రెండో విడత ఎన్నికలు ఏడు జరగనున్న మండలాల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలిలా ఉన్నాయి. మిడ్జిల్ మండలంలో 24 పంచాయతీలకు గాను చిల్వేర్, మసిగొండ్లపల్లి, కొత్తపల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 26 జీపీలకు లాల్యానాయక్ తండా, తెలుగుగూడెం, ఓబ్లాయిపల్లి తండా, రేగడిగడ్డ తండా, బొక్కలోనిపల్లి జీపీలు, రాజాపూర్ మండలంలో 24 జీపీలకు ఖానాపూర్, పలుగుగుట్ట తండా, బోడగుట్ట తండా, కొర్ర తండా, బీబీనగర్, రాఘవాపూర్ జీపీలు, హన్వాడ మండలంలో 35 జీపీలకు నాయినోనిపల్లి, వెంకటమ్మ కుంట తండా, అత్యకుంట తండా, నాగంబాయి తండా, కిష్టంపల్లి, కొనగట్టుపల్లి, రామునాయక్‌తండా జీపీలు, జడ్చర్ల మండలంలో ఎన్నికలు జరగాల్సిన 43 జీపీలకు కొత్తతండా, ఖానాపూర్, గోప్లాపూర్, చిట్టెబోయినపల్లి, చిన్నపల్లి, మాటుబండ తండా, ఈర్లపల్లి, నసురుల్లాబాద్ జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక బాలానగర్ మండలంలో 37 జీపీలకు అప్పాజిపల్లి, బిల్డింగ్ తండా, పల్గుమీది తండా, గౌతాపూర్, నామ్యాతండా, జీడి గుట్ట తండా, ఈదమ్మగడ్డ తండా, నేరళ్లపల్లి, ఏడుగుట్టల తండా, మొదంపల్లి జీపీలు, నవాబుపేట మండలంలోని 54 జీపీలకు గాను కాకర్‌జాల్, చెన్నారెడ్డిపల్లి, తిమ్మయ్యపల్లి, కారూర్, వెంకటేశ్వర తండా, కేశవరావుపల్లి, మల్లారెడ్డిపల్లి, కోళ్లగుట్ట తండా, ఇప్పటూర్, ఆర్సీ.పూర్, బట్టోనిపల్లి తండా, పల్లెగడ్డ, పుట్టోనిపల్లి తండా, లింగన్నపల్లి, కొత్తపల్లి తండా, లోకిరేవు, మెట్టుగడ్డ తండా, పుర్సంపల్లి, నీర్సాబ్ తండా పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవంగా కొలువుదీరాయి. -
107కు చేరిన ఏకగ్రీవాలు
ఆత్మకూరు(పరకాల): అధికార పార్టీ వ్యూహం ఫలించింది. జిల్లాలో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయగలిగింది. మొదటి విడతలో 45 జీపీలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 33 ఏకగ్రీవమయ్యాయి. తాజాగా మంగళవారం మూడోవిడత ఉపసంహరణ ఘట్టం ముగియడంతో 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో 120 స్థానాలకు గాను 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చెన్నారావుపేట మండలంలో 30 జీపీలకు కాలనాయక్‌తండా, బోజెర్వు, ఖాదర్‌పేట, గొల్లభామతండా, తిమ్మరాయనిపహాడ్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. నెక్కొండ మండలంలో 39 జీపీలకు అలంకానిపేట, లావుడ్యానాయక్ తండా, వెంకటనాయక్‌తండా, రెడ్యానాయక్‌తండా, హరిచంద్‌తండా, చెరువుముందరి తండా, నెక్కొండ తండా, దేవునితండా, అప్పలరావుపేట, మూడుతండా, గొల్లపల్లి, మేడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.ఆత్మకూరు మండలంలో 16జీపీలకు గాను పెంచికలపేట, గూడెప్పాడ్, కామారం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దామెర మండలంలో 14జీపీలకు కొగిల్వాయి, సింగరాజుపల్లె, ల్యాదళ్ల, దమ్మన్నపేట, దుర్గంపేట, సీతారాంపురం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గీసుకొండ మండలంలో 21జీపీలకు గాను గీసుకొండ, మచ్చాపూర్, మరియపురం, హర్జతండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. æ ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి అవుతాయనే సంకల్ప ంతో గ్రామాల్లో అందరూ ఒక్కటై జీపీలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. జిల్లాలో ఏకంగా మొదటి విడతలో గతపర్యాయం జిల్లా మొత్తం లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇప్పుడు మొదటివిడతలోనే 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 33 జీపీలు, మూడోవిడతలో 29జీపీలు ఏకగ్రీవం కావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో అత్యధికంగా పర్వతగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో అత్యధికంగా నెక్కొండలో 12 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గులాబీ వ్యూహం సక్సెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ జీపీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైనా అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయాలని గులాబీబాస్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఏకగ్రీవం వైపు పావులు కదిపారు. ఈ దిశలో సక్సెస్ సాధించారు. నజరానా వస్తుందని.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల నజరానాకు తోడు ఎమ్మెల్యేల నిధుల నుంచి రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గ్రామానికి రూ.25లక్షల నిధులు వస్తుండడంతో గ్రామాలలో ప్రజలు పార్టీలను పక్కనపెట్టి ఏకగ్రీవం వైపు కదిలారు.107కు చేరిన ఏకగ్రీవాలు -
16 పంచాయతీలు ఏకగ్రీవం
నల్లగొండ : మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నల్లగొండ డివిజన్లో 257 గ్రామపంచాయతీలు ఉండగా ఉపసంహరణ ముగిసే సమయానికి ఒకే నామినేషన్ ఉండడంతో 16 గ్రామ పంచా యతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. నల్ల గొండ డివిజన్ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రిటర్నింగ్అధికారి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీలు, 21న అప్పీళ్ల పరిష్కారం, 22 మంగళవారంమధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగింది. గడువు ముగిశాక 16 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒకే నామినేషన్ ఉండడంతో వాటిని ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మూడో విడతలో తగ్గిన ఏకగ్రీవాలు మొదటి, రెండో విడతలతో పోల్చుకుంటే మూడో విడత గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు తగ్గాయి. మొదటి విడతలో 52, రెండో విడతలో మరో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడో విడత జరిగే నల్లగొండ డివిజన్లో మాత్రం ఏకగ్రీవాల సంఖ్య తగ్గింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే, మునుగోడు నియోజకవర్గంలో రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. నల్లగొండలో మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. అధికార పక్షం ఏకగ్రీవానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. చాలా చోట్ల ప్రతిపక్షాల కంటే స్వపక్షం నుంచే పోటీ ఎక్కువైంది. ఇది టీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది. దీంతోనే నల్లగొండ డివిజన్లో ఏకగ్రీవాల సంఖ్య తగ్గిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 241 పంచాయతీలకు ఎన్నికలు నల్లగొండ డివిజన్ పరిధిలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 241 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి పోటీలో ఉన్న వారి జాబితాను ప్రకటించి ఎన్నికల గుర్తులను కూడా కేటాయించారు. ఏకగ్రీవమైన గ్రామాలు నల్లగొండ మండలంలో పెద్ద సూరారం, ఖుదావన్‌పూర్, మునుగోడులో దుబ్బకాల్వ, తిప్పర్తి మండలంలో కంకణాలపల్లి, చండూరు మండలంలోని ఉడతలపల్లి, జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, పడమటితాళ్ల, బోడంగిపర్తి, చొప్పవారిగూడెం, నార్కట్‌పల్లి మండలంలో షేరిబాయిగూడెం, కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, ఇస్లాంనగర్, మారెపల్లి గౌరారం, నకిరేకల్ మండలంలో నడిగూడెం, కట్టంగూర్ మండలంలో రామచంద్రాపురం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అధికం టీఆర్ఎస్సే... నల్లగొండ డివిజన్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీ వం కాగా అందులో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే అధికంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. -
చేతులెత్తేసిన కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకోలేక పోతోంది. అసెంబ్లీ ఫలితాల అనంతరం ఓటమిని అంగీకరిస్తూనే... స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పిన పలువురు ఓడిపోయిన అభ్యర్థులు ఆ దిశగా చేసిన ప్రయత్నాలేవీ లేవు. ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే బలమైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహిస్తున్నారే తప్ప అనేక చోట్ల ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1503 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, మొదటి విడత 511 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో ఏకంగా 133 పంచాయతీల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ బలపరిచిన నాయకులే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు జరిగిన 378 పంచాయతీల్లో కూడా టీఆర్ఎస్ వాటా 80 శాతానికి పైగానే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన స్థానాలు కలుపుకొని గెలిచింది కేవలం 62 పంచాయతీలే. అంటే మొత్తం పంచాయతీల్లో 12 శాతం మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ కన్నా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సీట్లలో గెలుపొందడం విశేషం. ఆసక్తి చూపని కాంగ్రెస్ నేతలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని భావించిన సీట్లలో కూడా గులాబీ జెండా ఎగరడంతో పలు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా, ఫలితం నిరాశపర్చడంతో తేరుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కొలువు తీరకముందే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని గ్రామాల్లో తమకు నమ్మకస్తులని భావించిన నాయకులు, గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్ర మే కొంత మేర అందుబాటులో ఉంటున్నారు. మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం వీయగా, రెండు, మూడవ విడతల్లో సైతం అదే పరిస్థితి పునరావృతం అవుతుందని తెలుస్తోంది. రెండు, మూడు విడతల్లో ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాల్లో 90 శాతం వరకు టీఆర్ఎస్ అభ్యర్థులే ఉండడంతో ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా అదే తీరు ఉండబోతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంచా యతీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌కు బలమైన పంచాయతీల్లో సైతం... శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిన స్థానాలపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కన్నేశారు. ఈ మేరకు ఆ పంచాయతీలను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ధీటుగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్, స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది కూడా. ఇక్కడ అత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, రెండు, మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు ఒకటి రెండు మాత్రమే దక్కడం గమనార్హం. ఓడిపోయినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంచాయతీలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. బలమైన అభ్యర్థులను టీఆర్ఎస్ మద్ధతుదారులుగా పోటీలో నిలిపారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నిర్మల్, బోథ్ నియోజకవర్గాలలో సైతం పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ దక్కాయి. బెల్లంపల్లిలో బీఎస్పీ నామమాత్రంగా మిగిలిపోయింది. 101 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఎస్పీ పేరుతో మాజీ మంత్రి గడ్డం వినోద్ మద్దతిచ్చిన 10 మంది మాత్రమే గెలిచారు. మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. మూడవ విడత నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత పరిస్థితిని గమనిస్తే 25, 30 తేదీల్లో జరిగే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాగా స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపనుండడం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్ సర్పంచులు సైతం తమవైపే వస్తారని ఎమ్మెల్యేలు ఆశాభావంతో ఉండడంతో గ్రామాల్లోని పాలకమండళ్లలో కూడా మరో ఐదేళ్ల వరకు గులాబీ గుబాలింపు తప్పదని అర్థమవుతోంది. -
ఈ దఫా 24 మాత్రమే..
దేవరకద్ర : గ్రామపంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ముగియగా.. రెండో దశ గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించి బుధవారంతో ప్రచారానికి తెర పడనుంది. ఇక మూడో విడత జీపీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియగా పోటీలో ఉన్న వారెవరో తేలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. బరిలో మిగిలిన వారికి అధికారులు గుర్తులను కేటాయించారు. ఇక ఆయా గ్రామాల్లో బుధవారం నుంచి ప్రచారం హోరెత్తనుంది. అయితే, తొలి, రెండో దశలతో పోలిస్తే అతి తక్కువ గ్రామపంచాయతీలు ఈ విడతలో ఏకగ్రీవం కావడం గమనార్హం. మొత్తం 126.. ఇప్పుడు 24 జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెండింటి పాలకవర్గాలకు ఇంకా గడువు ఉండడంతో 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 249 జీపీలు, రెండో దశలో 243, చివరి దశలో 227 జీపీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో ఇప్పటికే మొదటి దశ గ్రామపంచాయతీల్లో పోలింగ్ ముగియగా.. రెండో దశలో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొదటి దశ గ్రామపంచాయతీల్లో 46 పంచాయతీలు ఏకగ్రీవం కా>గా, రెండో దశకు సంబంధించి 56 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ రెండు దశలతో పోలిస్తే మూడో దశలో ఈ సంఖ్య మరింత పడిపోవడం గమనార్హం. ఈ దశలో నామినేషన్ల ఉపసం హరణ గడువు మంగళవారం ముగియగా.. కేవలం 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమైనట్లే లెక్క తేలింది. దీంతో మొత్తంగా జిల్లాలో 126 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లే. అత్యధికం మద్దూరు మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ జీపీల్లో 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా మద్దూర్ మండలంలోని 11 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇక భూత్పూర్ మండలంలోని ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. కానీ ఈ మండలంలోని పలు పంచాయతీల్లో 36 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా, గండీడ్ మండలంలో 4, చిన్నచింతకుంట మండలంలో మూడు, అడ్డాకుల, కోస్గిల్లో రెండు చొప్పున, దేవరకద్ర, మూసాపేట మండలాలోఒక్కటి చొప్పున ఏకగ్రీవమైనట్లు మంగళవారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరుసగా రెండోసారి ఏకగ్రీవం అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని పెద్దమునుగల్‌ఛేడ్‌లో వరుసగా రెండోసారి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 2013లో గ్రామపంచాయతీని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయగా గ్రామస్తులంతా కలిసి నర్సమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్ చేయడంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సన్నిహితుడైన రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, ఉప సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఎంపికయ్యారు. వరుసగా రెండో సారి గ్రామంలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గ్రామస్తుల ఐక్యతను చాటుతోంది. ఇదిలా ఉండగా సర్పంచ్‌గా ఎంపికైన విజయలక్ష్మి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు మేఘారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములుసాగర్, యుగేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకట్రాములుసాగర్ తదితరులు మంగళవారం సన్మానించారు. -
పల్లె పోరులో కారు జోరు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సోమవారం మొదటి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలతోపాటు 40 వార్డు స్థానాలను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో ఏకగ్రీవం చేసుకోవటం ద్వారా బోణీ కొట్టిన టీఆర్ఎస్... మొదటి విడత ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. జిల్లాలో 29 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు సోమవారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 14 చోట్ల గెలుపొందారు. తర్వాతస్థానంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ, బీఎస్పీ కూడా తమ ఉనికి నిలుపుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు 28 గ్రామ పంచాయతీ స్థానాల ఫలితాలు విడుదల కాగా, ఇందులో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆరుగురు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఒకరు, బీస్పీ బలపరిచిన అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. ఇక లాల్‌గడ్ మలక్‌పేట స్థానంలో కౌంటింగ్ కొనసాగుతుండగా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపొందిన పంచాయతీలివే శామీర్‌పేట్ మండలంలో మురహరిపల్లి, ఉద్ధమర్రి, అనంతారం, అడ్రాస్‌పల్లి, బాబాగూడ, బొమ్మరాసుపేట్, కేశవరం, లింగాపూర్ తండా, పోతారం, లక్ష్మాపూర్, కీసర మండలంలో కేశ్వాపూర్, తిమ్మాయిపల్లి, రాంపల్లి దాయర, కీసర పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థు«లు గెలుపొందారు. ఐదింటిలో కాంగ్రెస్ శామీర్‌పేట్ మండలంలో కోల్తూర్, నారాయణపూర్, తుర్కపల్లి, కీసర మండలంలో బోగారం, చీర్యాల, శామీర్‌పేట పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు.. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా కీసర మండలంలో యాద్ఘార్‌పల్లి, కరీంగూడ, గోధుమకుంట, అంకిరెడ్డిపల్లి, మజీద్‌పూర్,అలియాబాద్ గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు. వీరంతా త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇక శామీర్‌పేట్ మండలం జగ్గన్‌గూడ పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలువగా, పొన్నాల పంచాయతీలో బీస్పీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాం పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవటానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితర జిల్లా, మండల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏకగ్రీవంలోనూ టీఆర్ఎస్ జిల్లాలో కీసర, శామీర్‌పేట్ మండలాల పరిధిలో 33 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల్లో నాలుగు స్థానాలను టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. అలాగే 322 వార్డు స్థానాల్లో 40 వార్డు సభ్యుల పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న పంచాయతీల్లో కీసర మండలంలో నర్సంపల్లి సర్పంచ్ స్థానంతోపాటు ఆరు వార్డు స్థానాలు, శామీర్‌పేట్ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లిలో సర్పంచ్ స్థానాలతోపాటు వార్డు సభ్యుల పదవులు, మూడు చింతలపల్లి సర్పంచ్ స్థానంతో పాటు ఒక వార్డు పదవి స్థానం ఉంది. -
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు
-
పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దుమ్మురేపుతోంది. సోమవారం 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. మేజర్ పంచాయతీలు మినహా దాదాపు కౌంటింగ్ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ మరోసారి ఆ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 1373 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 343, టీడీపీ 9, సీపీఎం 10 స్థానాల్లో గెలుపొందారు. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. జిల్లాల వారిగా ఫలితాలు.. క్ర.సంఖ్య జిల్లా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సీపీఐ/ సీపీఎం ఇతరులు 1 ఆదిలాబాద్ 112 10 9 0 0 15 2 భద్రాద్రి 65 29 0 2 20 23 3 జగిత్యాల 50 22 1 1 0 41 4 జనగామ 51 21 0 0 0 9 5 భూపాలపల్లి 78 44 3 0 0 17 6 గద్వాల 64 19 0 0 0 6 7 కామరెడ్డి 84 32 0 0 0 13 8 కరీంనగర్ 30 09 03 07 0 33 9 ఖమ్మం 84 49 5 1 10 22 10 ఆసిఫాబాద్ 60 26 0 0 0 18 11 మహబూబ్‌నగర్ 110 8 3 12 0 96 12 మంచిర్యాల 44 06 0 0 0 26 13 మెదక్ 105 28 0 1 0 15 14 మేడ్చల్ 12 6 0 1 0 5 15 నిర్మల్ 90 20 08 0 1 11 16 నాగర్ కర్నూల్ 92 32 1 0 1 23 17 నల్గొండ 145 73 0 2 2 23 18 నిజామాబాద్ 89 9 1 0 0 26 19 పెద్దపల్లి 45 22 0 0 0 16 20 రాజన్నసిరసిల్ల 40 11 1 0 0 23 21 రంగారెడ్డి 75 43 6 3 0 23 22 సంగారెడ్డి 139 58 2 0 0 19 23 సిద్దిపేట 130 5 2 0 1 21 24 సూర్యపేట 73 43 4 1 2 5 25 వికారాబాద్ 91 40 0 0 1 13 26 వనపర్తి 24 7 1 0 0 33 27 వరంగల్ రూరల్ 131 31 0 0 0 8 28 యాదాద్రి 60 19 1 0 1 19 29 వరంగల్ అర్భన్ 13 0 0 0 0 0 30 మహబూబాబాద్ 67 28 0 0 0 11 మొత్తం 2,545 871 34 10 27 725 -
నేడే గ్రామ పంచాయతీ ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలి విడత గ్రామ పంచాయతీ పోరు సోమవారం జరగనుంది. మొత్తం 159 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,341 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తద్వారా ఆయా పంచాయతీలను ఐదేళ్లపాటు పాలించేదెవరో తేలిపోనుంది. ఏకగ్రీవమైన 20 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరగవు. సర్పంచ్ పదవుల కోసం 471 మంది, వార్డుల సభ్యుల కోసం 3,292 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోల్ చిట్టీల పంపిణీ పూర్తి ఈ ఎన్నికల్లో రెండు రకాల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు బ్యాలెట్‌ను సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయడానికి, తెలుపు బ్యాలెట్ పేపర్ని వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగిస్తున్నారు. ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ఆయా మండలాల్లోని 1.90 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వీరందరికీ ఫొటోతో కూడిన పోలింగ్ చిట్టీని అందజేశారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి వీటిని పంపిణీ చేశారు. ఓటు వేయడానికి పోలింగ్ చిట్టీ ఉంటే సరిపోతుంది. ఇతర ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఒకవేళ పోలింగ్ చిట్టీ లేకుంటే ఫొటో ఓటరు గుర్తింపు కార్డుని అనుమతిస్తారు. ఇది కూడా లేకుంటే ఆధార్ కార్డుతో సహా ఎన్నికల విభాగం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ఎన్నికలు జరిగే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే భవనం ఆవరణలో అన్ని వార్డుల పోలింగ్ కేంద్రాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని యంత్రాంగం అందుబాటులో ఉంచింది. వికలాంగులు సులువుగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వీల్‌చైర్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత కోసం పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడడం నిషేధం. ఫలితాలు వెల్లడయ్యే వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తప్పవని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏరులై పారుతున్న మద్యం పంచాయతీ పోరులో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. సర్పంచ్ పదవిని కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు మద్యం, డబ్బుల పంపిణీతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు పోటాపోటీగా విందులు ఇస్తూ తమ చేజారిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతగా దృష్టి పెట్టకపోవడంతో మద్యం పంపిణీ హద్దులు దాటుతోంది. ఫిర్యాదు చేస్తే తప్పా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పలు పల్లెల్లో స్థానికంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన అభ్యర్థులు.. ఓటర్లందరినీ హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పిలిపిస్తున్నారు. అక్కడి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో దావత్‌లు ఇస్తున్న దృశ్యాలు విరివిగా కనిపిస్తున్నాయి. ఎలాగైన పదవి దక్కించుకోవాలనే తపనతో తమకే ఓటు వేయాలని ఓటర్లతో కొందరు అభ్యర్థులు ప్రమాణం కూడా చేయించుకుంటుండటం గమనార్హం. రాజకీయ రంగు.. పార్టీల రహితంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. వీటికి రాజకీయ పార్టీల రంగు పులుముకుంది. అధికార టీఆర్ఎస్ నేతలు బలపర్చిన అభ్యర్థులు వారి పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం సాగించారు. ఆ పార్టీ ఆశీస్సులు లభించనివారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేస్తూ గెలిచిన తర్వాత అదే పార్టీలోకి వెళ్తామంటూ ప్రచారాన్ని సాగించారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులు కూడా ముమ్మర ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు.. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతుండడం గమనార్హం. -
తొలి సమరం నేడే
ఆత్మకూరు(పరకాల): ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్లె పోరు మొదటి దశ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంది. జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బ్యాలెట్ బాక్స్‌లు, సిబ్బందిని తరలించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచారు. జోరుగా సాగిన ప్రచారం శనివారంతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా మరికొన్ని గంటల్లో సర్పంచ్‌గిరి ఎవరిని వరించనుందో తేలనుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుపై తమకు వచ్చే ఓట్లను లెక్కలేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చిన పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలో తొలి దశలోనే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎక్కువ స్థానాలు గెలిచి రెండు, మూడో విడత ఎన్నికల్లో ప్రభావం చూపాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి.సోమవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగుతుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆతర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్ ఎంపిక ఉంటుంది. నేడు తొలివిడతలో 145 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 100 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌కు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కావడానికి అధికార పార్టీ నేతలు ఈ సారి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. గతంలో కంటే పెద్దమొత్తంలో సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యులు ఏకగ్రీవమవడం విశేషం. 1535 బ్యాలెట్ బాక్సులు సిద్ధం.. మొదటి విడత పోలింగ్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి సామగ్రిని అందజేశారు. ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందచేశారు. మొదటి విడత ఎన్నికలకు 1264 పోలింగ్స్టేషన్లను సిద్దం చేశారు.వీరికి 1535 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. దుగ్గొండి మం డలంలో 282 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేసి 344 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు.నర్సంపేట మండలంలో 238 పోలింగ్ స్టేషన్లకు 289 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేశారు. పర్వతగిరి మండలంలో 288 పోలింగ్స్టేషన్లకు 350 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సంగెం మండలంలో 286 పోలింగ్స్టేషన్లకు 348 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. వర్ధన్నపేట మండలంలో 170 పోలింగ్ స్టేషన్లకు 205 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. 3015 మంది సిబ్బంది.. మొదటివిడత పోలింగ్‌కు 3015 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 43 మంది స్టేజ్–1ఆర్ఓ, 43 మంది స్టేజ్–1 ఏఆర్ఓ, 145 మంది స్టేజ్–2 ఏఆర్ఓ, 1264 మంది పీఓ, 1454 ఓపీఓలు, 44 మంది రూట్ ఆఫీసర్లు, 22 మంది జోనల్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. ఒకేరోజు పోలింగ్, ఫలితాలు.. నేడు(సోమవారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇదే రోజు సాయంత్రం వరకు లెక్కింపు జరుగుతుంది. ఒకే రోజులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్నో ఆశలతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. అభ్యర్థులు గ్రామాల్లో శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఓటు కీలకమే.. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎన్నికల్లో కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు ప్రతి ఓటుపై దృష్టి పెడుతున్నారు.దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లలో ఆఫర్లు చెబుతూ పోలింగ్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే గ్రామాల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా నేడు రాత్రివరకు నూరు పంచాయతీల సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్లు సమానంగా వస్తే టాస్.. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారింది. తక్కువ ఓటర్లుండి ఎక్కువ అభ్యర్థులు పోటీ ఉన్న చోట ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ వేయడం లేదా చిట్టీలు తీయడం వంటి పద్ధతులను అనుసరించనున్నారు. అయితే అభ్యర్థులు మాత్రం పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఓటును బ్యాలెట్ బాక్స్‌కు చేరాలా అభ్యర్థులు గ్రామాల్లో ఓటు హక్కు ఉండి నగరాల్లో విద్య, ఉద్యోగాలు చేస్తున్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి చేరుతున్నారు. -
తొలిపోరు నేడే
ఆర్మూర్/నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఆర్మూర్ డివిజన్లోని 141 పంచాయతీలు, 1,004 వార్డులలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి.. ఆర్మూర్ డివిజన్లో 11 మండలాల్లో గల 177 గ్రామ పంచాయతీలు, 1,546 వార్డులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే, 36 పంచాయతీలు, 736 వార్డు లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 గ్రామాల కు, 1,004 వార్డులలో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. 545 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,517 మంది వార్డు స్థానాల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 3,11,148 మంది ఓటర్లు నేడు తమ ఓటు వేయనున్నారు. 1,452 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,957 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థా యి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయా మండల కేం ద్రాల నుంచి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సు లు, ఇతర సామగ్రిని శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ను కలెక్టర్ రామ్మోహన్రావు, జిల్లా పరిశీలకు రాలు క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్, సిబ్బంది ఏర్పాట్లపై అధికారు లకు వివరించారు. మరోవైపు ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,405 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. భారీగా ప్రలోభాలు.. పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపు కోసం చివరి వరకూ సర్వశక్తులు ఒడ్డారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఓటర్ల ను ప్రలోభపరుచుకునేందుకు ఆదివారం తెర లేపారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం ఒక్క రోజే లెక్కకు మించి ఖర్చు అయింది. చికెన్, మద్యంతో పాటు డబ్బులు పంపిణీ చేశా రు. దీంతో చాలా చోట్ల చికెన్‌తో పాటు కూల్‌డ్రింక్స్‌కు కొరత ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంపి ణీ చేసినట్లు సమాచారం. మేజర్ పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి సుమారుగా రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ తదితర మండలాల్లో ఓటర్లకు భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇక, ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. వాహనాల్లో ఓటర్లను తరలించి ఎక్కువ ఓట్లు పొందాలనే ఉద్దేశ్యంతో ఆటోలు, జీపులు, కార్లు సిద్ధం చేసి ఉంచారు. -
నేడే పోలింగ్
కొండమల్లేపల్లి(దేవరకొండ) : దేవరకొండ డివిజన్లో నేడు జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఆలోపు లైన్లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కొద్దిసేపు విరామం తర్వాత లెక్కింపు చేపడుతారు. డివిజన్ పరిధిలోని పది మండలాల్లోని 252 గ్రామపంచాయతీలు, 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ పరిధిలోని మొత్తం 304 గ్రామపంచాయతీలకు గాను 52 పంచాయతీలు, 2572 వార్డులకు గాను 650 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 252 గ్రామపంచాయతీలు 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ స్టేషన్లకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ(డిస్ట్రిబ్యూషన్ సెంటర్) నుంచి బ్యాలెట్ బాక్స్‌లు, సిరా, స్వస్తిక్ స్టాంపులతో పాటు ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన వాహనాల్లో ఆయా పంచాయతీలకు ఆదివారం బయల్దేరి వెళ్లారు. దేవరకొండ డివిజన్ పరిధిలో 106 రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు 2174 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు గాను స్టేజ్–1, స్టేజ్–2, పీఓ, ఏపీఓలతో పాటు పాటు సుమారుగా 5వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు ఆర్డీఓ లింగ్యానాయక్ తెలిపారు. డీఆర్సీ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు డివిజన్ పరిధిలోని పది మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు వేర్వేరుగా పరిశీలించారు. చింతపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లోని డీఆర్సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు పరిశీలించి ఎన్నికలు సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీఏపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. దేవరకొండ డీఆర్సీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ బందోబస్తు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఒక అడిషనల్ ఎస్పీ, 8మంది డీఎస్పీలు, సీఐలు–28మంది, ఎస్ఐలు–75మందితో పాటు 13 ప్లాటూన్ల ప్రత్యేక బలగాలను కేటాయించారు. మొత్తంగా సుమారు 2600 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. డివిజన్ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామపంచాయతీలను గుర్తించి వెబ్ కాస్టింగ్, ప్రత్యేక పోలీసులను మోహరించనున్నారు. డివిజన్ పరిధిలో 73 సమస్యాత్మక, 29 అతి సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసి దేవరకొండలోని డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 10 మంది వరకు పోలీసుల చేత నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు 105 రూట్లలో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి ఎక్కడ గొడవలు జరిగినా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటు పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మద్యం షాపుల బంద్ పంచాయతీ ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో మద్యం షాపులు బంద్ చేయించారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మద్యం షాపులు తెరవరు. ప్రధానంగా గతంలో దేవరకొండ డివిజన్లో చందంపేట, డిండి, తదితర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా గొడవలు చోటు చేసుకున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేందుకువెబ్ కాస్టింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దేవరకొండ డీఆర్సీ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది, విధులకు వెళ్తున్న పోలీసులు -
తొలిపోరుకు సర్వంసిద్ధం
తొలివిడత పంచాయతీ సమరానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొదటి విడతగా ఐదు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 93 గ్రామాలు, 728వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2556 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ : చొప్పదండి మండలంలోని 15 గ్రామపంచాయతీలు, గంగాధర మండలంలో 33, కరీంనగర్‌రూరల్ మండలంలో 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 21 గ్రామపంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు 928 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడంతోపాటు అవసరమయ్యే సామగ్రిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్‌పేపర్లను సిబ్బందికి అందించారు. జిల్లావ్యాప్తంగా 146 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 113 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. ఎన్నికల విధుల్లో 922 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1236 మంది ఇతర సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎన్నికల నిర్వహణకు 13 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని నియమించారు. అదనంగా చెక్‌పోస్టులు, ఫ్లైయింగ్ స్క్యాడ్‌లను నియమించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో కలెక్టర్‌తోపాటు పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతిలక్పతినాయక్ ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే కరీంనగర్, కొత్తపల్లి మండలాల ఎన్నికల సామగ్రిని సిబ్బందికి ఆదివారం మధ్యాహ్నం నుంచే అందజేశారు. రేకుర్తి లయోలా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ పేపర్, వెబ్‌క్యాస్టింగ్ సామగ్రిని పరిశీలించారు. ఆమెవెంట జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మనోజ్‌కుమార్, కరీంనగర్ మండల ప్రజాఅభివృద్ధి అధికారి పవన్, విస్తరణ అధికారి జగన్మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందజేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. – డీపీవో మనోజ్‌కుమార్ -
ఓటేద్దాం రండి
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాల్లోని ఆరు మండలాల్లో తొలి విడత ఎన్నికల జరగనున్నాయి. సుమారు 80 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. తర్వాత అక్కడే చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక చేపడుతారు. కాగా పోలింగ్ జరగనున్న 103 పంచాయతీల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. దీంతో పాటు సర్వీసు ఓటర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది కూడా ఆన్లైన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకున్న సిబ్బంది సాయంత్రం వారికి కేటాయించిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోనే (గ్రామంలో) రాత్రికి బస చేసి ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అయితే సిబ్బందికి అందజేసిన కిట్‌లో ఆరోగ్య దృష్ట్యా కోల్గేట్, సబ్బులు, మందులు, టార్చ్‌లైట్, తదితర వస్తువులు ఉండేట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 103 పంచాయతీల్లో ఐదు జీపీలు సమస్యాత్మకంగా ఉండగా, 17 జీపీలు అత్యంత సమస్యాత్మకంగా, 10 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 71 జీపీలు సాధారణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక జీపీలతో కలిపి ఎనిమిది చోట్ల వెబ్‌కాస్టింగ్ చేపట్టి జిల్లా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సీన్‌ను లైవ్‌లో వీక్షించనున్నారు. మిగతా పంచాయతీల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మండలానికో ఫ్లైయిండ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక్కో బృందంలో డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్‌తో కలిపి మొత్తం నలుగురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఆయా జీపీల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా 80 మంది స్టేజ్–1, 153 మంది స్టేజ్–2 అధికారులను నియమించారు. ఎన్నికల్లో మొత్తం 1546 బ్యాలెట్ బాక్సులను వినియోగించగా, 1240 సిరా బాటిళ్లను అందుబాటులో ఉంచారు. కాగా, సర్పంచ్ ఎన్నికకు మొత్తం 1,11,200, వార్డు సభ్యులకు 85,550 బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు 23 జోనల్ అధికారులు, 28 మంది రూట్ అధికారులను నియమించారు. 103 సర్పంచ్, 638 వార్డులకు ఎన్నికలు జిల్లాలోని ఆరు మండలాల్లో 153 పంచాయతీలు ఉండగా, 50 జీపీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అయితే 103 పంచాయతీలకు సోమవారం పోలింగ్ జరగనుంది. తొలి విడతలోని 103 సర్పంచ్ స్థానాలకు 318 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 638 వార్డులకు 1465 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలాల వారీగా గమనిస్తే... ఆదిలాబాద్ మండలంలోని 22 జీపీలకు ఎన్నికలు జరగనుండగా, 67 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 159 వార్డులకు 349 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావలలో 3 జీపీలు ఉండగా, 16 అభ్యర్థులు, 21 వార్డులకు 52 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. బేలలోని 26 జీపీలకు 71 మంది, 127 వార్డులకు 280 మంది, జైనథ్‌లో 36 సర్పంచ్ స్థానాలకు 96 మంది, 219 వార్డులకు 479 మంది అభ్యర్థులు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తాంసిలోని 5 జీపీలకు 24 మంది, 45 వార్డులకు 110 మంది, భీంపూర్‌లోని 11 జీపీలకు 44 మంది, 67 వార్డులకు 195 మంది బరిలో నిల్చున్నారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లాలోని 103 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒక్కో పంచాయతీల్లో 4 నుంచి 6 వార్డుల వరకు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో 12 వార్డులు కూడా ఉన్నాయి. అయితే ఆయా పదవులకు పోలింగ్ నిర్వహించేందుకు వార్డుకోకటి చొప్పున పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం నుంచి కొనసాగుతున్న పోల్ చిటీల పంపిణీ ఆదివారం కూడా కొనసాగుతోంది. కాగా, పంచాయతీల వారీగా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుని సిబ్బంది సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
తీర్పు నేడే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో మొత్తం 719 గ్రామ పంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేడు మొదటి విడతగా 203 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్ జారీ అవ్వగా 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 203 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొదటి విడుత ఎన్నికలు సోమవారం జరుగుతాయి. 10 మండలాల్లో మొత్తం 249 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 46 పంచాయతీలు ఎప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 203 పంచాయతీలకు సోమవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలోని 203 పంచాయతీలు, 2,274 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. 46 గ్రామాలు ఏకగ్రీవం తొలి విడుతలో 46 పంచాయతీలు ఏకగ్రీవం అ య్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 13వ తేదీవరకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో 46 పంచాయతీలకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవ్వడంతో ఈ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 12 పంచాయతీలు, మరికల్లో ఎనిమిది, నారాయణపేటలో ఆరు, దామరగిద్దలో ఐదు, కృష్ణా, నర్వలో 4, మాగనూర్‌లో 3, మక్తల్‌లో 2, ఊట్కూర్, ధన్వాడలో ఒకటి చొప్పున మొత్తం 46 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్‌కు 5,518 మంది సిబ్బంది తొలి విడుతకు మొత్తం 5518 మంది అధికారులను గుర్తించారు. ఇందులో 2,274 పీఓలు, అదనంగా 228 మంది పీఓలను గుర్తించారు. 2,742 ఏపీలు అదనంగా 274 మందిని ఏపీఓలను గుర్తించారు. వీరు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. ఇక పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక వరకు ఈ అధికారులు విధులు నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మొదలు.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో ఈ మాదిరిగానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన గంట తరువాత (మధ్యాహ్నం 2గంటలకు) నుంచి ఆయా గ్రామ, వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి వార్డు మెంబర్‌కు, మరొకటి సర్పంచ్‌కి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ జరిగే రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపాలని మొదలు అనుకున్నప్పటికీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దానికి అనుగునంగానే ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గులాబీ రంగ బ్యాలెట్ సర్పంచ్‌కు, తెలుపు రంగు బ్యాలెట్ వార్డు సభ్యులకు కేటాయించారు. ఇందులో సర్పంచ్‌కు 30, వార్డు çసభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. నేడే ఫలితాలు నేటి పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యా«హ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యులకు చెందిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఓట్లను లెక్కించేందుకు అధికారులు పంచాయతీల వారిగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు ఉపయోగించే సామాగ్రి అందుబాటులో ఉంచారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అందుకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేశారు. గుండు సూది, క్యాండిల్, రబ్బర్‌బ్యాండ్ లాంటి వస్తువులను సైతం అందుబాటులో ఉంచారు. ఉప సర్పంచ్‌లు సైతం ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. దీంతో ఎవరెవరు గెలిచారో.. ఓడారో తెలిసి పోతుంది. ఎవరి ప్యానెల్‌కు ఎక్కువ సభ్యులు గెలిచారో తేలనుంది. ఆ వెంటనే అసలు రాజకీయం మొదలవుతుంది. ఉప సర్పంచ్ పదవికి పోటీ పెరిగి పోతుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్‌గా అవకాశం వస్తుంది. అనుకున్న అభ్యర్థి ఓడిపోతే గెలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీలు రాజకీయ వ్యుహాలను íసిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. సర్పంచ్ జనరల్ అయితే ఉప సర్పంచ్ నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచ్ రిజర్వు అయితే ఉప సర్పంచ్ జనరల్‌కు ఇవ్వాలనే పోటీ నెలకుంటుంది. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బంది ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నిక పూర్తి అయితేనే సంపూర్ణంగా అధికారులు పని పూర్తి అయినట్లు. ఇంకులో స్వల్ప మార్పు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థి వేలికి వేసే ఇంకును ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా ఎడమ చేతి మధ్య వేలుకు ఇంకు పెడుతారు. ఎందుకంటే డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు పెట్టారు. దీంతో అ ఇంకు ఇప్పటి దాక ఉండవచ్చనే కారణంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. -
ప్రలోభాల పర్వం!
మహబూబ్‌నగర్ క్రైం: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నేడు సోమవారం జరగనున్నాయి. అంచెలంచెల వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీశారు. ప్రలోభాలే ఓటు బ్యాంకుగా భావిస్తూ నోటుకు ఓటు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓటు బలాన్ని నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో భారీగా మద్యం, డబ్బు పంపకానికి తెరతీశారు. శని, ఆదివారాల్లో రాత్రివేళ ఓటర్ల చెంతకు నోట్లను చేరవేశారు. అయితే ముందస్తుగానే నగదును, మద్యాన్ని ఆయా గ్రామాలు, వార్డులకు గుట్టుగా పంపించడంతో పంపిణీ చేసే ప్రక్రియ సులువుగా సాగింది. పంపిణీలోనూ పోటాపోటీ కొన్ని చోట్ల పంపిణీ జరుగుతుండగా వివిధ పార్టీ్ట ల నాయకులు గొడవలకు సైతం దిగుతున్నారు. నువ్వా.. నేనా అంటూ ప్రచారం చేసి పంపిణీలో సైతం అదేస్థాయిలో పోటీ పడ్డారు. ఓటర్లు సైతం బహిరంగంగానే డబ్బులు అడుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.300 మాత్రమే ఇచ్చారని, వేరే పార్టీలు ఇంకా ఎక్కువగానే ఇస్తున్నారని నిలదీసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఒక ఓటు వెయ్యి రూపాయలు ఆపైనే పలికినట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల పక్కా హామీ తీసుకుని అభ్యర్థులు డబ్బును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఊరూవాడా మందు పార్టీలు పల్లెలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జోరుగా మందు పార్టీలు, బిర్యాని విందులు నడుస్తున్నాయి. కొందరు అభ్యర్థులు ఉదయం నుంచి భోజనం ఏర్పాటు చేస్తే మరికొందరు రాత్రి వేళలో మద్యం, చికెన్, మటన్ అడిగిన పద్ధతుల్లో చేసి ఖుషీ చేస్తున్నారు. ఏ వీధి చూసినా బృందాలుగా సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. పార్టీల వారీగా పంపకాలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరిని ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. ఆ మేరకు వార్డుల వారీగా మాత్రమే డబ్బు అందజేస్తున్నారు. పైకి ధీమా..లోలోపల దిగులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కొందరు అభ్యర్థులు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. కింది వ్యక్తులపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయకుల్లో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. ఓటు బాసలు చేయించుకున్నారు. నోటు ఊసులు చెప్పుకున్నారు. కానీ ఓటరు నాడి పట్టుకోవడంలో ఊగిసలాట కొనసాగుతోంది. పంపకాల పేచీలు కలవరపాటు గురి చేస్తున్నాయి. ఒక్క ఓటుకు రూ.300, రూ.500 వెచ్చించినా ఓటు మాకే వేస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం గుబులు పట్టి పీడిస్తోంది. ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి నాయకుల మాత్రం ఇది ఒక దఫా మాత్రమే ఇంకా ఒకరోజు సమయం ఉంది కదా..! కంగారు పడకండి అంటూ ఓటర్లను సముదాయించే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలోపు మీకు నజరానాలు తప్పక అందుతాయంటూ ఆశ పెడుతున్నారు. భారీగా మద్యం నిల్వలు ఈ ధపా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీ స్థాయిలో నిఘా కొనసాగుతున్నా ఓటర్లకు మాత్రం మద్యం చేరుతోంది. కొందరు నాయకులు కార్యక్తలకు చీటీలను పంపిణీ చేస్తే మరి కొందరు టోకన్లు అందిస్తున్నారు. మరి కొందరు నేరుగా ఇంటింటికి వెళ్లికి మరీ ముట్టచెప్పుతున్నారు. ఈ వ్యవహారంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న యువకులు కీలక పాత్ర వహిస్తున్నారు. బృందాలు ఏర్పడి ఆయా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని గ్రామీణా ప్రాంతాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కేవలం కూలీలు, రైతులు, మధ్యతరగతి వారికి చీప్ లిక్కర్, క్వాటర్స్, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులకు బ్రాండెడ్ బాటిల్స్ అందిస్తున్నారు. ఇక పల్లెల్లో ఓటర్లకు ఇవ్వడానికి రూ.100 నోట్లు, రూ.200నొట్లు భారీ సిద్ధం చేసుకొని తెల్లవారుజామున 4గంటల నుంచి 6గంటల మధ్యలో ఓటర్ల చెంతకు చేర్చడానికి అన్ని ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నారు. -
తొలి సమరం
సాక్షిప్రతినిధి,ఖమ్మం: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈ నెల 21న(నేడు) ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఆదివారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల సామగ్రిని సిబ్బంది తీసుకెళ్లారు. బందోబస్తుకు పోలీసులు తరలారు. గ్రామ పంచాయతీకి ఒక బస్సు చొప్పున కేటాయించారు. తొలి విడతలో 6 మండలాల్లోని 188 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1736 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం విదితమే. అందులో 21 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడంతో పాటు 275వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవం కాగా, మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 167గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1458వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 446 మంది, వార్డు స్థానాల్లో అభ్యర్థులు 3,215మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తర్వాత నూతన పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. కోరం పూర్తయితే అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పూర్తి కాని పక్షంలో మరుసటిరోజు ఉంటుంది. అప్పటికీ సాధ్యం కాకపోతే వాయిదా వేసి మరొక తేదీని ప్రకటిస్తారు. పోలింగ్ జరిగే మండలాలివే.. తొలి విడతలో ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, కామేపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 167 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా 5,200మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో మైక్రో సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరణ చేయనున్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రలోభాల పర్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం శనివారం సాయంత్రం 5గంటల వరకు ముగియడంతో ఆయా గ్రామాల్లోని అభ్యర్థులు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారే ఓటర్లను తమవైపు మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. -
నువ్వా.. నేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అభ్యర్థులు చివరి రోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల పెద్దలు రంగంలోకి దిగి తమ అనుచరుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ర్యాలీలతో హోరెత్తించారు. తొలి విడతగా సోమవారం షాద్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలోని ఏడు మండలాల్లో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 20 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 159 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి దాదాపు పది రోజులపాటు విస్తృతంగా సాగిన ప్రచారానికి శనివారం తెర పడడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారిస్తున్నారు. ఏ అభ్యర్థి వెళ్లినా ‘మీకే నా ఓటు’ అంటున్న ఓటర్లు చేజారకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం, డబ్బులు, చీరలు ఇతర తాయిలాలు ఎరవేస్తూ తమవైపు ఉండేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నోటు, మద్యందే పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఉన్న పల్లెల్లో ఓటుకు రూ.1000 రూ.1,500 పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇతర గ్రామాల్లో కనిష్టంగా రూ.500 పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఏర్పాట్లు పూర్తి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రిని ఆదివారం నిర్దేశిత పంపిణీ కేంద్రాల వద్ద అందజేయనున్నారు. మొత్తం 4వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 1,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇది పూర్తికాగానే వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1.90 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
మనీ.. మందు.. మాంసం..!!
ఖమ్మం, అన్నపురెడ్డిపల్లి: పంచాయతీ పోరులో ఓటర్లకు గాలం వేసేందుకు నాయకులు, అభ్యర్థులు తమ ‘అస్త్రాలు’ బయటకు తీస్తున్నారు. ఈ ‘అస్త్రాలు’ ఏమిటో తెలుసా..? ప్రధానంగా మూడు. ఒకటి– డబ్బు (మనీ). రెండు– మందు (మద్యం). నగదు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకుగాను ఎన్నికల సంఘం ఎన్నో నిబంధనలు పెట్టింది. మందు, నగదును కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ, అడ్డుకోలేకపోతోంది. అభ్యర్థులు, నాయకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బును నీళ్లలాగా ఖర్చు చేశారు. ఓటరుకు 500 నుంచి 1000 రూపాయల వరకు పంచి పెట్టారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా పెట్టిన అసెంబ్లీ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని అడ్డుకోలేపోయారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతోంది. ములకలపల్లి మండలంలో ఈ నెల 21న, మిగిలిన అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఈ నెల 25న ఎన్నికలు జరుగుతాయి. ములకలపల్లి మండలంలో అభ్యర్థుల ప్రచారం ముగిసింది. మిగిలిన మండలాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సర్పంచ్ అభ్యర్థులు భారీగానే ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల తరఫున నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళుతున్నారు. నగదు, మద్యం ఇస్తున్నారు. గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడడం లేదు. ఒక్కో ఓటుకు 500 నుంచి 1000 రూపాయలు ఇస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఓట్లు వేయిం చాలంటూ కుల పెద్దలతో బేరసారాలు సాగి స్తున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పంచాయతీ జనాభానుబట్టి ఐదులక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధపడ్డారు. కులాలవారీగా యువతను లోబర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కోసం మందు, మాంసం పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ చివరి రెండు రోజులలో ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంచేందుకుగాను ఓటరు జాబితాను సిద్ధం చేసుకున్నారు. తమ ఓట్లు వేయిస్తే... వ్యక్తిగతంగా ఇచ్చే నగదు కాకుండా, కులం మొత్తానికి 40వేల నుంచి 50వేల రూపాయల వరకు ఇస్తామని నమ్మిస్తున్నారు. పోలీసుల తనిఖీలు, అబ్జర్వర్, ఫ్ల యింగ్ స్క్వాడ్, వీడియోగ్రఫీ, జోనల్ టీంలు... ఇ న్ని తిరుగుతున్నప్పటికీ మనీ–మందు–మాంసం ప్రవాహానికి అడ్డుకట్ట పడడం లేదు. -
ఆ ఊళ్లో ఎన్నికల్లేవు.!
సాక్షి, ఆసిఫాబాద్: కొత్త పంచాయతీలుగా ఏర్పడిన సంబరం ఆ గ్రామస్తులకు లేకుండా పోయిం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవి లేకుండా పోతోంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులే పూర్తిగా ఉండి అసలు గిరిజనులే లేని పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నా యి. రెండో విడత ఎన్నికలు జరిగే 107 పం చాయతీల్లో రెండు గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. అలాగే మూడో విడత ఎన్ని కలు జరిగే 114 గ్రామ పంచాయతీల పరిధిలో ఒక పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలుగుతోంది. ఈ మూడు పంచాయతీ పరిధిలోనూ ఒకటే సమస్య. ఆ గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయినప్పటికీ ఒక్క ఎస్టీ ఓటరు లేకపోవడమే. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో భవిష్యత్‌లోనూ ఈ రిజర్వేషన్లు మార్చే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామాలకు సర్పంచ్ ఎన్నికల జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఎస్టీ లేరు... పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కావడంతో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 334 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో షెడ్యూ ల్డ్ ఏరియా పరిధిలో ఉన్నవి 162. 164 నాన్ షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోఉండగా, మరో ఎని మిది వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ మొత్తం పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే రెండో విడత ఎన్నికలు జరిగే ఆసిఫాబాద్ మండలం రహపల్లి, వెంకటపూర్ గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వు కాగా వీటిలో ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో కనీసం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయారు. అలాగే మూడో విడత ఎన్నికలు జరిగే వాంకిడి మండలం తేజపూర్ గ్రామ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా సర్పంచు స్థానానికి పోటీ చేసేందుకు ఎస్టీలు కరువయ్యారు. గతంలో ఈ మూడు పంచాయతీలు పాత పంచాయతీల్లో ఉండగా గిరిజనులు ఉండేవారు. కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీల్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీంతో సర్పంచ్ ఎన్నిక లేకుండా పోయిం ది. ఈ మూడు పంచాయతీల్లో ఎనిమిది చొప్పున వార్డులు ఉన్నాయి. వీటిలో వెం కటపూర్ గ్రామస్తులు ఎస్టీ రిజర్వేషను వచ్చినందుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తు తీర్మానం చేశారు. మూడు వార్డులకు జనరల్‌కు రిజర్వు అయినప్పటికీ నామినేషన్లు ఎవరూ వేయలేదు. దీంతో ఇక్కడ పూర్తిగా ఎన్నికలే జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇక రహపల్లి, తేజపూర్‌లో ఎనిమిదింటిలో ఒక్కో పంచాయతీలో నాలుగు జనరల్ స్థానాలకు చొప్పున కావడంతో ఈ వార్డులకు నామినేషన్లు రావడంతో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పంచాయతీల్లో నాలుగింటిలో ఎన్నిక జరిగితే ఒక ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే అవకాశముంది. ఉపసర్పంచ్ కోసం భారీ పోటీ.. ఎలాగు సర్పంచ్ అభ్యర్థులు లేకపోవడంతో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఉప సర్పంచ్‌గానైనా గ్రామంలో చక్రం తిప్పుదామని కొంత మంది ఆశావావహులు ఆరాట పడుతున్నారు. ఇందు కోసం తనతో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులను తన వైపు చేర్చుకుంటే ఉపసర్పంచ్ పదవి దక్కే అవకాశముందని భావించి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్ పదవి ఎలాగు దక్కే అవకాశం లేకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు బేరాసారాలు ప్రారంభమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మార్చాలని కోరాం మా గ్రామంలో ఒక్కరు కూ డా ఎస్టీ ఓటరు లేరు. కాని పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వు అయింది. దీనిపై కలెక్టర్‌ను కలిసి రిజర్వేషన్ మార్చాలని కోరాం. అయితే ఎస్టీ రిజర్వేషన్ మార్పు మా పరిధిలో లేదని తెలిపారు. దీంతో భవిష్యత్‌లో ఎన్నికలు జరుగుతాయా అనేది అనుమానంగా ఉంది. – చెండి సోమేశ్వర్, మాజీ ఎంపీటీసీ, గాట్ జనగాం, తేజపూర్ ఒక్క ఎస్టీ ఓటరు లేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు ఎవరూ లేరు. అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలు అధికంగా ఉన్న పంచాయతీలో ఎస్టీకి రిజర్వుకావడంతో సర్పంచ్‌ను ఎన్నుకోలేక పోతున్నాం. రిజర్వేషను మార్చాలి. – చౌదరి శంకర్, తేజపూర్ జనాభా ప్రకారం కేటాయించాలి మా గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకున్నా సర్పంచ్ ఆ కేటగిరికి రిజర్వు అయింది. దీంతో మేం సర్పంచ్‌ను ఎన్నుకోలేకపోతున్నాం. గ్రామంలో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. – పెద్దపల్లి సంతోశ్, రహపల్లి, ఆసిఫాబాద్. -
ప్ర‘లాభం’
పల్లెల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికలకు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆదివారం అధికారులు గుర్తులు కేటాయించటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. గ్రామ పెద్దలను, నాయకులు, యువజన సంఘాల నాయకులను కలిసి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు విందులు, మద్యం, చీరల పంపిణీతో ఓటర్లకు గాలం వేస్తూ.. గరిష్టంగా ఈ ఎన్నికల్లో ‘లాభ’పడాలని చూస్తున్నారు. సాక్షి, మెదక్: జిల్లాలో 469 పంచాయతీలకుగాను మొదటి విడతగా ఆరు మండలాల్లోని 154 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 32 పంచాయతీలు ఏకగ్రీమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 122 పంచాయతీల్లో 321 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,718 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 21న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు గెలుపుకోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈనెల 19వ తేదీన ప్రచారానికి తెరపడనుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో సర్పంచ్ అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. పండుగ రోజులకు తోడు అందరూ ఇళ్లలో ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను కలిసి వారి మద్దతు కోరుతున్నారు. దీనికితోడు గ్రామాల్లో ప్రలోభాలు మొదలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి సైతం సై అంటున్నారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో గుడులు, బడులు కట్టిస్తామని హామీలు ఇస్తూ కొంత నగదు గ్రామ పెద్దలకు ముట్టుజెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే బోర్లు వేయించేందుకు హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా కుల సంఘాల పెద్దలను కలిసి తమను గెలిస్తే అన్నిరకాలుగా అండగా ఉంటామని చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మద్యం పంపిణీ మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులు డబ్బు విషయంలో వెనకాడేది లేదని చెబుతున్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలో సర్పంచ్‌కి పోటీచేస్తున్న నేతలు మద్యం, డబ్బు పంపిణీ ప్రారంభించారు. మాచవరంలో మద్యం, చీరలు పంపిణీ చేస్తున్న ఇరువర్గాలకు చెందిన 8 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పంచాయతీ పోరులో ప్రలోభాలు ఏమేర సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించేందుకు తెరవెనక పావులు కదుపుతున్నాయి. పల్లెపోరు రసవత్తరంగా సాగుతోంది. మండలాల్లో అభ్యర్థులు.. పెద్దశంకరంపేట మండలంలోని 22 పంచాయతీల్లో 49 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అల్లాదుర్గం మండలంలోని 14 పంచాయతీల్లో 43 మంది సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. టేక్మాల్ మండలంలోని 24 పంచాయతీల్లో 64 మంది సర్పంచ్ అభ్యర్థులు, పాపన్నపేట మండలంలోని 24 పంచాయతీల్లో 60 మంది, హవేళిఘనపూర్ మండలంలోని 21 పంచాయతీల్లో 75 మంది, రేగోడ్ మండలంలోని 17 పంచాయతీల్లో 40 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ప్రచారం ప్రారంభించారు. -
తుది సమరానికి తొలి అడుగు..
ఆత్మకూరు(పరకాల): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు జిల్లాలో బుధవారం మొదలయ్యాయి. జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో మొదటి విడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరి జాబితా ఖరారయ్యింది. బ్యాలెట్ పేపర్ల పంపిణీ పూర్తయ్యింది. నర్సంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 238 వార్డులు, దుగ్గొండి మండలంలో 34 గ్రామపంచాయతీలు 282 వార్డులు, పర్వతగిరి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 288 వార్డులు, వర్ధన్నపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలు 170 వార్డులు, సంగెం మండలంలో 33 గ్రామపంచాయతీలు 286 వార్డులు ఉండగా వీటికి ఎన్నికలు మొదటి విడతలో ఈ నెల 21న జరగనున్నాయి. అలాగే రెండో విడతలో ఈ నెల 25న జరిగే పరకాల మండలంలో 10 గ్రామపంచాయతీలు, 94వార్డులు, నడికుడ మండలంలో 14 గ్రామపంచాయతీలు, 138వార్డులు, శాయంపేట మండలంలో 24 గ్రామపంచాయతీలు 212 వార్డులు, నల్లబెల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు 252 వార్డులు, ఖానాపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు 178 వార్డులు, రాయపర్తి మండలంలో 39గ్రామపంచాయతీలు 336 వార్డులు ఉన్నాయి. రెండో విడతకు సంబంధించి నేడు ఉపసంహరణలు జరగనున్నాయి. సర్పంచ్‌కు 36 నామినేషన్లు.. వార్డులకు 58 నామినేషన్లు.. మూడోవిడతలో జరిగే గ్రామపంచాయతీలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. చెన్నారావుపేట మండలంలో 30 గ్రామపంచాయతీలు, 258వార్డులు, నెక్కొండ మండలంలో 39 గ్రామ పంచాయతీలు 340 వార్డులు, ఆత్మకూరు మండలంలో 16 గ్రామపంచాయతీలు152 వార్డులు, దామెర మండలంలో 14 గ్రామ పంచాయతీలు 132 వార్డులు, గీసుకొండ 21 గ్రామపంచాయతీలు 188 వార్డులకుగాను నామినేషన్లను స్వీకరిస్తున్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. నెక్కొండ మండలంలో సర్పంచ్‌కు 9 వార్డు సభ్యులకు 13, ఆత్మకూరు మండలంలో సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. గీసుకొండ మండలంలో సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 14 నామినేషన్లు దాఖలు చేశారు. -
మూడోవిడత షురూ..!
నల్లగొండ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడతకు బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి నోటిఫికేషన్ జారీచేశారు. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత దేవరకొండ, రెండో విడత మిర్యాలగూడ డివిజన్లలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మూడో విడతకు సంబంధించి నల్లగొండ డివిజన్లోని 11 మండలాల్లోగల పంచాయతీల్లో ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా మొదటి రోజు అన్ని మండలాల్లోనూ నామినేషన్లు పడ్డాయి. 11 మండలాల్లో మూడో విడత పోరు.. నల్లగొండ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల పరిధిలోని 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలిరోజు 11 మండలాల పరిధిలో 60 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేయగా 90 మంది ఆయా గ్రామాల్లోని వార్డులకు నామినేషన్లు వేశారు. ముహూర్తాలు చూసుకుని.. కనుమ మంచి రోజు కాదని చాలా మంది నామినేషన్లు వేసేందుకు ముందుకు రాలేదు. జాతకాలు చూపించుకుని మంచిరోజు కాదనడంతో చాలామంది వెనుకడుగు వేశారని తెలుస్తోంది. మంచిరోజు కాకుండా నామినేషన్ వేస్తే కలిసిరాదేమోనన్న పెద్దల సూచనల మేరకు చాలా వరకు నామినేషన్ల దాఖలు వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు. గురువారం ఏకాదశి మంచిరోజు కావడంతో అన్ని గ్రామ పంచాయతీలకు నామినేషన్ భారీగా వేసే అవకాశం ఉంది. -
తొలిరోజు 31 నామినేషన్లు
ఇచ్చోడ(బోథ్): జిల్లాలో మూడోవిడత జరిగే పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రకియ కొనసాగనుంది. తొలిరోజు జరిగిన నామినేషన్ల ప్రకియ మందకొడిగా సాగింది. జిల్లాలో మూడోవిడతలో ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లోని 163 సర్పంచ్ స్థానాలకు, 1358 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. 163 పంచాయతీలకు 31 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1358 వార్డులకు 28 మాత్రమే వచ్చాయి. బుధవారం సంక్రాంతి కావడంతో ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాలేకపోయాయి. గురువారం, శుక్రవారం రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలుస్తోంది. చాలామంది అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడోవిడతలో జరిగే ఎన్నికల్లో అత్యధికంగా ఏజెన్సీ గ్రామాలు ఉండడంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముహూర్తం చూసుకున్నాకే.. ఐదేళ్లపాటు సర్పంచ్ పదవిలో కొనసాగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలంటున్నారు చాలామంది అభ్యర్థులు. ఈనేపథ్యంలో మూడో విడత తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. బుధవారం కనుమ పండుగ కావడం, ముహూర్తం కలిసిరాకపోవడంతో గురు, శుక్రవారాల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీల్, 21న విచారణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులతోపాటు గుర్తులు ప్రకటిస్తారు. -
పల్లెపోరు..ప్రచార జోరు
పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో పోటీదారుల్లో టెన్షన్ పెరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కుల, యువజన సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంత ఖర్చుకైనా సై అంటున్నారు. కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈనెల 21న ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడతలో జిల్లాలోని కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మం డలాల్లోని 97 గ్రామపంచాయతీలకు, 928 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో నాలుగు పంచాయతీలైన చొప్పదండి మండలం మంగళ్లపల్లి, రామడుగు మండలం గోలి రామయ్యపల్లి, పందికుంటపల్లి, కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 93 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు 93 స్థానాల్లో 464 మంది బరిలో ఉన్నారు. మొదటి విడతలో 928 వార్డులకు గాను 220 వార్డులు ఏకగ్రీవం కాగా, 708 వార్డుల కోసం 2092 మంది వార్డు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. జోరందుకున్న ప్రచారం.. తొలివిడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను ఖరారు చేస్తూ గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు పల్లెల్లో విసృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎలాగైనా గెలువాలని పగలురాత్రి తేడా లేకుండా గ్రామాల్లోని వీధులన్ని చుట్టుముడుతున్నారు. కులసంఘాల నాయకులను మచ్చిక చేసుకుంటూ మిగతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం, ఎన్నికల గుర్తులు రావడంతో ప్రచారం జోరందుకుంది. నమూనా బ్యాలెట్ పేపర్లతో... మొదటి విడతకు సంబంధించి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులంతా ప్రింటింగ్ ప్రెస్‌లకు వెళ్లి పోస్టర్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పత్రాలు ముద్రించుకున్నారు. వాటిని ఇంటింటా అంటిస్తూ, నమూనా బ్యాలెట్లో తమ గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50, వార్డు మెంబర్లకు రూ.30వేలు, 5వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు రూ.2.50లక్షలు, వార్డు మెంబర్లకు రూ.50 వేల వరకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలు అనుసరించి తక్కువ ఖర్చుతో ప్రచార సామగ్రిని ముద్రించుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. కొంత మంది ఎక్కువ ముద్రించినా తక్కువ బిల్లులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గెలువాల్సిందే... పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాగైనా గెలువాల్సిందేనని వెనుకా ముందు ఆలోచించకుండా అందినంత ఖర్చపెడుతూ గ్రామాల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కొంత మంది అయితే సర్పంచ్ పీఠంపై కూర్చుండటమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉన్న భూములను అమ్మివేయడంతో పాటు తనఖా పెట్టి డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.3–4 లక్షలు, పెద్ద పంచాయతీల్లో అయితే రూ.10–20 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అయినా వెనుకాడటం లేదు. మరింత కొంత మంది అభ్యర్థులు డబ్బుల జోలికి వెళ్లకుండా తమను గెలుపించాలని కోరుతున్నారు. గెలిచాక పనులు చేయకపోతే నిలదీయండి అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. రెండవ విడతలో మిగిలేది ఎందరో..? జిల్లాలో రెండవ విడత ఎన్నికలు నిర్వహించే మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలు, 1014 వార్డు స్థానాల్లో ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఈనెల 14,15,16 తేదీల్లో అభ్యర్థుల జాబితా, అప్పీళ్లు, పరిష్కారం పూర్తయింది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యే స్థానాలకు పోను మిగిలిన స్థానాలకు ఈనెల 25న ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు. మూడవ విడతకు రేపటికే నామినేషన్లు.. మూడవ విడతలో జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లోని 109 గ్రామపంచాయతీలకు, 1024 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. ఈనెల 19న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా తయారీ, 20న అప్పీళ్లు, 21న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 22న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్నవారి జాబితాను ప్రకటిస్తారు. మూడవ దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 30న నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రోజురోజుకు సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులెవరు? తమకు ఎవరెవరు మద్దతు పలుకుతున్నారు? ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎంత మంది ఉన్నారు? కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఒక్కో గ్రామంలో సర్పంచుకు ఆరు మంది వరకు నామినేషన్లు వేశారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన వారే ముగ్గురేసి పోటీల్లో ఉన్నారు. వారిని పోటీ నుంచి విరమింపజేయడం అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. కాలనీలకు, సంఘాలకు పలు నజరానాలు ప్రకటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంత ఖర్చుతో దేవాలయాల అభివృద్ది, బోరుబావులు తవ్వించడం, తదితర పనులు చేపడుతాననే çహామీలు ఇవ్వడంతో పాటు ఒక్కో ఓటుకు ఎంతైనా చెల్లించేందుకు వెనకాడట్లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. -
పల్లె పోరు..జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇటు పంచాయతీ ఎన్నికలు, అటు సంక్రాంతి సంబురాలు.. పల్లెల్లో కోలాహలం నెలకొంది. మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం, మూడో విడతకు బుధవారం నోటిఫికేషన్ వెలువనుండడంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత దేవరకొండ డివిజన్లోని 10 మండలాల్లో పంచాయతీలకు, రెండో విడత మిర్యాలగూడలోని 10 మండలాల పరిధిలోని పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నల్లగొండ డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనేనామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొదటి విడత ఎన్నికలకు జోరందుకున్న ప్రచారం మొదటి విడత దేవరకొండ డివిజన్లో పది మండలాల్లో 304గ్రామ పంచాయతీలు, 2572వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 52 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారికంగా ఆదివారం ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అదే విధంగా 2572 వార్డుల్లో 518 వార్డుల్లో వార్డు సభ్యత్వానికి ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. దీంతో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే మిగిలిన 252 గ్రామ పంచాయతీలతో పాటు మిగిలిన వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సంక్రాంతి పండుగ అయినప్పటికీ ఎక్కడ చూసినా ప్రచార జోరే కనిపించింది. అభ్యర్థులు ప్రతి ఇంటికీ తిరుగుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పండుగ వారి ప్రచారానికి బాగా కలిసొచ్చినట్లయ్యింది. అన్ని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. సంక్రాంతి సెలవుల్లో ఇతర పట్టణాల్లో ఉద్యోగరీత్యా, ఇతర వ్యాపార, చదువు నిమిత్తం ఉండే వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి మరింత పెరిగింది. ఏ ఇంట్లో చూసినా జనాల సందడి, మరో పక్కప్రచార జోరు కొనసాగుతోంది. రెండో విడతలో ముగిసిన నామినేషన్ మిర్యాలగూడ డివిజన్లో 10 మండలాల పరిధి లోని పంచాయతీల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిం ది. 276 సర్పంచ్‌లకు, 2376 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో నామినేషన్ల స్క్రూట్నీ కొనసాగుతుంది. అదే విధంగా అభ్యంతరాలు పరిష్కారం అనంతరం 17న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగనుంది. అయితే మిర్యాలగూడ మండల పరిధిలో పంచాయతీలో నాలుగు పంచాయతీల్లో సర్పంచ్ కు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా వేములపల్లి మండలంలోని మరో పంచాయతీలో ఒక నామినేషన్ దాఖలైంది. ఈ ఐదు పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్టే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. 276 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌కి 2,298 నామినేషన్లు రాగా, 2376 వార్డులకు 6,783 నామినేషన్లు దాఖలయ్యాయి. 17న ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది. ఏకగ్రీవం చేసేందుకు ఆయా గ్రామాల్లో నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జిలే అత్యధికంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి బుజ్జగింపుల కార్యక్రమం పండుగైనప్పటికీ తమ అనుచరులను పంపి మొదలుపెట్టారు. నేతలకు ఓ పక్క పండుగ కావడంతో రెండు రోజులు ప్రచారం కలిసిరావడంతోపాటు మరో పక్క ఖర్చు కూడా తడిసి మోపెడయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నల్లగొండ డివిజన్లో ఎన్నికకు రేపు నోటిఫికేషన్ నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలకు 2,322 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి బుధవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 20వ తేదీన అభ్యంతరాలు స్వీకరణ, 21వ తేదీన అప్పీళ్లను పరిష్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి అదే రోజు 3గంటల తర్వాత ఉపసంహరణ కార్యక్రమం చేపట్టనున్నారు. పోలింగ్ ఈనెల 30న జరగనుంది. నల్లగొండ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు ఏకగ్రీవం చేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలను పంపించి గ్రామాల్లో ఒకే అభ్యర్థి పోటీ చేసే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తమ మాట వినని వారిని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమక్షంలో పిలిపించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా కూడా వినకపోతే బలమైన అభ్యర్థిని రంగంలో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఏకగ్రీవం చేయవద్దని పోటీలో నిలబడి ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. -
ఏకగ్రీవాలపై గులాబీ నజర్
. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో గులాబీ వికసిస్తోంది. సర్పంచ్‌లుగా ఏకగ్రీవమైన అభ్యర్థులు ఒక్కొక్కరుగా అధికార పార్టీ గూటికి చేరుతున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల విజయోత్సాహంతో స్థానిక సంస్థల్లోనూ తమ ముద్ర వేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ హవా కొనసాగేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 18 మంది అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన వారే కావడం విశేషం. వీరిలో కొందరు మొదటి నుంచి టీఆర్ఎస్ సానుభూతి పరులు కాగా.. మరికొందరు ఇటీవల పార్టీకి దగ్గరయ్యారు. వీలైనంత మంది సర్పంచ్‌లు తమ పార్టీ వారు ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగించవచ్చని గులాబీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలపై నేతలు దృష్టి సారించారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులూ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు 14 జీపీలకు ప్రోత్సాహం.. మొదటి ఎన్నిక జరగాల్సిన 179 జీపీల్లో 14 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానంతోపాటు సదరు పల్లెలోని వార్డులన్నీ ఏకగ్రీవమే. ఈ గ్రామ పంచాయతీలన్నీ ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహానికి అర్హత సాధించాయి. ఏకగ్రీవమైన జీపీ జనాభా ఐదు వేలలోపు ఉంటే రూ.5 లక్షలు, అంతకుమించితే రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ప్రోత్సాహం అందాలంటే సర్పంచ్ స్థానంతోపాటు వార్డులన్నీ ఏకగ్రీవం కావాల్సిందే. మరో ఆరు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కాగా.. పూర్తిస్థాయిలో వార్డులు సభ్యులు కాలేకపోయారు. దీంతో ఈ జీపీలు ప్రోత్సాహానికి దూరమైనట్లే. ఏకగ్రీవమైన 20 సర్పంచ్ స్థానాలు పోను.. మిగిలిన 159 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఈనెల 21న ఎన్నిక జరగనుంది. సర్పంచ్ స్థానాలకు 471 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,580 వార్డులకుగాను.. 236 వార్డుల ఏకగ్రీవమయ్యాయి. మరో వార్డుల్లో స్థానికులు ఎన్నికలను బహిష్కరించారు. ఇవి మినహా 1,341 వార్డులకుగాను 3,292 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో దశపైనా దృష్టి.. రెండో దశగా 25న ఎన్నికలు జరిగే 181 పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. ఇందులో సర్పంచ్ స్థానాలకు 947, వార్డులకు 4,988 నామినేషన్లు ఓకే అయ్యాయి. మంగళవారం అప్పీళ్లను అధికారులు స్వీకరించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 1,232, 1,656 వార్డులకుగాను 5,391 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ 17తో ముగియనుంది. ఈ పంచాయతీలపైనా నేతలు దృష్టిసారించారు. ఏకగ్రీవం చేసేందుకు అధికార, విపక్ష పార్టీల నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులకు టచ్‌లోకి వచ్చి బుజ్జగింపులు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నేతల మధ్యే పోరు
గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు కొన్ని పంచాయతీల్లో రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలంటే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉం టుంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు సైతం ఆయా పార్టీల మద్దతుదారులే ప్రత్యర్థులుగా ఉం టారు. అయితే ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆయా మం డలాల్లో రెండు, మూడు గ్రామ పంచాయతీ లు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు టీఆర్ఎస్ నేతలే పోటీ చేయడంతో పోరు రసవత్తరంగా మారింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో టీఆర్ఎస్ గ్రామ స్థాయి కేడర్ రెండు, మూడు గ్రూపులుగా తయారైంది. ఇటీవ ల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కలిసి పనిచేసిన కేడర్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే అన్న చందంగా మారిపోయింది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ కేడర్ స్తబ్ధుగా ఉండటం తో టీఆర్ఎస్ నేతల్లోనే ప్రధాన పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది. సగటున నలుగురు పోటీ.. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న 177 గ్రామ పంచాయతీల్లో 36 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 పంచాయతీల్లో మొత్తం 545 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పంచాయతీలో సగటున సుమా రు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా భీంగల్ మండలంలో ఎన్నికలు జరుగుతున్న 20 జీపీలకు 103 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల మధ్యే ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎవరికి మద్దుతు పలకా లో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 42 శాతం వార్డులు ఏకగ్రీవమే.. సర్పంచ్ స్థానాలు నామమాత్రంగా ఏకగ్రీ వం కాగా, వార్డు సభ్యుల స్థానాలు మాత్రం భారీ గా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం వార్డుల్లో ఏకంగా 42 శాతం వార్డులు ఏకగ్రీవం కావడం గమనార్హం. మొదటి విడతలోని 177 గ్రామపంచాయతీల్లో మొత్తం 1,746 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏకంగా 736 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగీవ్రంగా ఎన్నిక జరిగింది. మిగితా 1004 వార్డు సభ్యుల స్థానాలకు 2,386 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా మరో ఆరు వార్డు సభ్యుల స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, ఈ 6 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు. జోరందుకున్న విందు రాజకీయాలు.. బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలడంతో గ్రామ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గుర్తులు కూడా అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెరపైకి తెచ్చి తమను గెలిపిస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీలు ఇస్తున్నారు. గంప గుత్తాగా ఓట్లు రాబట్టుకునేందుకు ఆయా కుల సంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు విందులు ఇస్తున్నారు. అలాగే యువకుల ఓట్లకు గాలం వేసేందుకు యువజన సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తున్నారు. రూ.లక్షల్లో వ్యయం.. జనాభా ఐదు వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షలకు మించి ఉండరాదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.2.5 లక్షలుగా నిర్దేశించింది. కాగా అభ్యర్థుల వ్యయం భారీగా ఉంటోంది. నాలుగైదు వందల ఓటర్లు ఉన్న పంచాయతీల్లో సైతం రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు అభ్యర్థులు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. -
ఎన్నికల్లో పోటీ కోసం పెళ్లి
కోహీర్(జహీరాబాద్) : కోహీర్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు ఎస్కే జావెద్ ఓ ఇంటి వారయ్యారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని నూర్ మసీదులో ఆయన వివాహం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కోహీర్ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని జావెద్ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే రిజర్వేషన్లో జనరల్ (మహిళ)కు కేటాయించారు. దీంతో జావెద్ మొదట తన సహోదరి చేత ఎన్నికల్లో పోటీ చేయిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అనంతరం కోహీర్ పట్టణంలోని కాజీవాడకు చెందిన బాబుమియా కూతురు అతియా సుల్తానతో నూర్మసీద్లో వివాహం జరిగింది. టీఆర్ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉమర్ అహమద్‌తో పాటు గ్రామపెద్దలు, నాయకులు పెళ్లి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.