సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసనసభ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న టీఆర్‌ఎస్ పార్టీ పంచాయతీ పోరులోనూ పైచేయి సాధించింది. మూడు విడతల్లో మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 264 జీపీలు టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా ఆయా పంచాయతీల్లో గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా చెప్పుకోదగ్గ రీతిలో జీపీలను హస్తగతం చేసుకున్నారు. 171 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెండు విడతల్లో స్థబ్దుగా ఉన్న బీజేపీ చివరి దశ ఎన్నికలో కాస్త తేరుకుంది. 16 జీపీల్లో కాషాయ జెండాను ఎగురవేసింది.
తుది విడతలో పోటాపోటీ..
మొదటి, రెండో విడతల ఎన్నికల ఫలితాలకు, తుది దశ ఫలితాల్లో కాస్త తేడా కనిపించింది. ఒకటి, రెండు విడతల్లో కారు ప్రభంజనం కొనసాగగా.. ఆఖరి దశ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ రెండు పార్టీల నడుమ రసవత్తర పోరు నడిచింది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మూడు మండలాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మార్క్ కనిపించింది. ఈ మండలాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఆమె గెలిపించుకోగలిగారు. ఆమె సొంత గడ్డ అయిన చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరులో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్ల పంచాయతీని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ మద్దతుదారు పాగా వేయడం విశేషం.
తగ్గిన పోలింగ్ శాతం
తొలి, రెండో విడతలతో పోల్చితే తుది దశ ఎన్నికలు జరిగిన 186 జీపీల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొదటి రెండు విడతల్లో 93 శాతం, 89 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. చివరి దశలో 88 శాతమే నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 నుంచి 11 గంటలలోపే అధికశాతం మంది ఓటేశారు. ఈ రెండు గంటల వ్యవధిలో 37 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య 33 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చివరి రెండు గంటల్లో 18 శాతం మంది ఓటేశారు. అన్ని పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
పల్లె సిగలో గులాబీ జెండా
Published Thu, Jan 31 2019 11:29 AM | Last Updated on Thu, Jan 31 2019 11:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment