పకడ్బందీగా పంచాయతీ | Telangana Panchayat Elections Polling Arrangement Karimnagar | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పంచాయతీ

Published Thu, Jan 10 2019 9:16 AM | Last Updated on Thu, Jan 10 2019 9:16 AM

Telangana Panchayat Elections Polling Arrangement Karimnagar - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పక్కన ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్‌పతి నాయక్, పోలీస్‌ కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి తదితరులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గ్రామపంచాయతీ ఎన్నికలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. సమస్యాత్మక పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై రెవెన్యూ, పంచాయతీరాజ్‌ , పోలీ సు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు, 2966 వార్డులు ఉన్నాయని తెలిపారు. ఇందుకు గాను 2973 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తున్నామని   పేర్కొన్నారు. మొదటి విడతలో చొప్పదండి, గంగాధర, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లోని 97 పంచాయతీలు, 929 వార్డులకు ఈనెల 21న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండవ విడతలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లోని 107 గ్రామ పంచాయతీలు, 1014 వార్డులకు ఈనెల 25న ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. మూడవ విడతలో ఇల్లందకుంట, వి.సైదాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక మండలాల్లోని 109 గ్రామపంచాయతీలు, 1024 వార్డులకు ఈనెల 30న ఎన్నికలు జరుగుతాయన్నారు.

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈనెల 7వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, బుధవారంతో ముగిసిందన్నారు. ఈ ఎన్నికలు 21న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అదే రోజు ఉపసర్పంచ్‌ ఎన్నిక కూడా ఉంటుందని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

జిల్లాలో 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 14 ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. 5వేల జనాభాకు పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.2.5లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.1,50,000, వార్డు సభ్యులు రూ.30వేలు ఎన్నికల ప్రచార ఖర్చును మించరాదని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మైక్‌ అనుమతి కోసం పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నుంచి ర్యాలీలు, సమావేశాలకు తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకోవాలని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్‌–1, స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 107 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తామని అన్నారు.

పకడ్బందీగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పంచాయతీ ఎన్నికలకు నియమితులైన జనరల్‌ అబ్జర్వర్‌ భారతి లక్‌పతి నాయక్‌ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియపై రిటర్నింగ్‌ అధికారులకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు మార్గనిర్దేశం చేయాలని అన్నారు. తెలుగు అక్షరమాల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల ప్రచార ఖర్చులను ప్రతిరోజు నమోదు చేయాలని తెలిపారు. మోడల్‌ కండక్ట్‌ ఆఫ్‌ కోడ్‌ (ఎన్నికల ప్రవర్తన నియమావళి)ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కోరారు.

ప్రశాంత పోలింగ్‌కు ప్రత్యేక పోలీసులు
పోలీసు కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతల్లో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 391 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలున్నాయని, వీటి దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 107 సమస్యాత్మక పోలింగ్‌ ప్రదేశాలున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ ప్రదేశాల్లో పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్‌ బృందాలను కూడా నియమిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లు మూసివేయాలని ఎక్సైజ్‌ అధికారులకు సూచించారు.

ఓటరు జాబితాలు యథాతధం
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారందరి ఓట్లు యథాతధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉన్నాయని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఓటర్ల జాబితాల నుంచి ఏ ఒక్క ఓటు కూడా తొలగించబడలేదని అన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే సంబం«ధిత తహసీల్దార్‌ కార్యాలయాల్లో జాబితా సరి చూసుకోవాలని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాజర్షిషా, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్, హుజూరాబాద్‌ ఆర్డీవోలు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్, జిల్లా కోశాగార అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు స్టేషన్ల హౌస్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement