Three phase elections
-
ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్..
శ్రీనగర్ : దేశ ఎన్నికల చరిత్రలోనే ఓ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలేదని, అక్కడ కేవలం లోక్‌సభ ఎన్నికలే జరుగుతాయని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువరిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పేర్కొన్నారు. అనంత్‌నాగ్ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆరు లోక్‌సభ స్ధానాల్లో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్‌లో బారాముల్లా, జమ్మూ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుండగా, 18న శ్రీనగర్, ఉధంపూర్ నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. మే 6న లడఖ్‌లో పోలింగ్ జరగనుండగా, అనంత్‌నాగ్ స్ధానంలో ఏప్రిల్ 23, 29 మే 6న మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మే 23న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి. -
పకడ్బందీగా పంచాయతీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. సమస్యాత్మక పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై రెవెన్యూ, పంచాయతీరాజ్ , పోలీ సు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు, 2966 వార్డులు ఉన్నాయని తెలిపారు. ఇందుకు గాను 2973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడతలో చొప్పదండి, గంగాధర, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లోని 97 పంచాయతీలు, 929 వార్డులకు ఈనెల 21న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండవ విడతలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లోని 107 గ్రామ పంచాయతీలు, 1014 వార్డులకు ఈనెల 25న ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. మూడవ విడతలో ఇల్లందకుంట, వి.సైదాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక మండలాల్లోని 109 గ్రామపంచాయతీలు, 1024 వార్డులకు ఈనెల 30న ఎన్నికలు జరుగుతాయన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈనెల 7వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, బుధవారంతో ముగిసిందన్నారు. ఈ ఎన్నికలు 21న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుందని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. జిల్లాలో 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 14 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. 5వేల జనాభాకు పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.2.5లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.1,50,000, వార్డు సభ్యులు రూ.30వేలు ఎన్నికల ప్రచార ఖర్చును మించరాదని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మైక్ అనుమతి కోసం పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ర్యాలీలు, సమావేశాలకు తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్–1, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తామని అన్నారు. పకడ్బందీగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పంచాయతీ ఎన్నికలకు నియమితులైన జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు మార్గనిర్దేశం చేయాలని అన్నారు. తెలుగు అక్షరమాల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల ప్రచార ఖర్చులను ప్రతిరోజు నమోదు చేయాలని తెలిపారు. మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి)ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కోరారు. ప్రశాంత పోలింగ్‌కు ప్రత్యేక పోలీసులు పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతల్లో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 391 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటి దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 107 సమస్యాత్మక పోలింగ్ ప్రదేశాలున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ ప్రదేశాల్లో పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ బృందాలను కూడా నియమిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఓటరు జాబితాలు యథాతధం ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారందరి ఓట్లు యథాతధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉన్నాయని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఓటర్ల జాబితాల నుంచి ఏ ఒక్క ఓటు కూడా తొలగించబడలేదని అన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే సంబం«ధిత తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితా సరి చూసుకోవాలని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్, జిల్లా కోశాగార అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’కి రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. మూడు విడతల్లో నిర్వహించతలపెట్టిన ఈ ఎన్నికల కోసం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరత్రా సామగ్రిని సమకూర్చిన పంచాయతీ విభాగం.. జిల్లాపరిషత్ నుంచి బుధవారం మండల కేంద్రాలకు తరలించింది. ఈ నెల 7న తొలిదశ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఆలోపు ఎన్నికల సరంజామాను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద పోలింగ్ మెటీరియల్‌ను మండలాలకు తరలించింది. జిల్లావ్యాప్తంగా 558 పంచాయతీలు, 4,992 వార్డులకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7.06 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఇందుకోసం 3,040 బ్యాలెట్ డబ్బాలు అవసరమని గుర్తించింది. కాగా, మొత్తం వార్డుల్లో కనీసం 10శాతమైనా ఏకగ్రీవం కావచ్చని యంత్రాంగం అంచనా వేస్తోంది. పోలింగ్ విధులకు 8వేల మంది పోలింగ్ విధులకు 8వేల మంది ఉద్యోగులను అవసరమని అధికారయంత్రాంగం తేల్చింది. వీరికి అదనంగా నియమించిన స్టేజ్–1, స్టేజ్–2 అధికారులకు ఇదివరకే శిక్షణ కూడా నిర్వహించింది. మరోవైపు ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు పోలింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను కూడా సిద్ధం చేసింది. వ్యయపరిమితి ఇలా..! ఎన్నికల ప్రచార వ్యయంపై ఈసీ పరిమితులు విధించింది. పల్లెల్లో అడ్డగోలుగా ధనప్రవాహం జరుగకుండా ముకుతాడు వేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల వ్యయం ఆకాశన్నంటింది. ఖర్చుపై పరిమితులు ఉన్నా.. ఇవేమీ పట్టని అభ్యర్థులు నగదు, నజరానాలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో సక్సెస్ అయ్యారు. కాగా, తాజాగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపై ఆంక్షలు విధించింది. 10వేల జనాభా ఉన్న పంచాయతీ పరిధిలో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థి రూ.80వేల వరకు ఖర్చు చేసే వీలుంది. అలాగే ఆ ఊరు వార్డు మెంబర్ రూ.10వేల వరకు వ్యయం చేయవచ్చు. కాగా, పదివేల లోపు జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రూ.40వేలు, వార్డు అభ్యర్థి రూ.6వేల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సివుంటుంది. ప్రతిరోజు ప్రచార లెక్కలను స్థానిక రిటర్నింగ్ అధికారికి నివేదించాల్సివుంటుంది. అంతేగాకుండా ప్రచారపర్వాన్ని కూడా నిశితంగా పరిశీలించే బాధ్యతను స్టేజ్–2 ఆఫీసర్లకు అప్పగించింది. -
3 విడతల్లో సం‘గ్రామం’
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 7వ తేదీన ప్రారంభమై 30వ తేదీన ముగియనున్నాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికపై చర్చలు సాగిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే గెలుపు సులభమవుతుందనే అంచనాలు వేస్తున్నారు. సాక్షి, మెదక్ : పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతలుగా జిల్లాలోని 469 పంచాయతీలకు, 4,086 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో పంచాయతీ ఎన్నికలు ముగియటంతో పాటు వెనువెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 154 పంచాయతీలు, 1,364 వార్డుల్లో మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు 21 తేదీన నిర్వహిస్తారు. రెండో విడతగా ఆరు మండలాల్లోని 170 పంచాయతీలు, 1,444 వార్డుల్లో, ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం జనవరి 11 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు జనవరి 25వ తేదీన నిర్వహిస్తారు. మూడో విడతగా ఎనిమిది మండలాల పరిధిలోని 145 పంచాయతీలు, 1,278 వార్డులకు ఎన్నికలు జరుపుతారు. ఇందుకోసం జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలను 30వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఓట్లు లెక్కించటంతోపాటు ఫలితాలను ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది వరకే గ్రామ, వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. నోటిపికేషన్ విడుదల అయిన వెంటనే మండల కేంద్రాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం 130 మంది స్టేజ్ 1 ఆఫీసర్లను నియమించారు. అలాగే ఎన్నికల విధుల నిర్వహణ కోసం 469 మంది స్టేట్ 2 ఆఫీసర్ల నియమించటంతోపాటు 3వేల మంది ఎన్నికల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా 2,500 బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే 12 లక్షల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో నోటా గుర్తు కూడా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల సంఘం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5వేల జనాభాపైన ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, 5వేల లోపు జనాభా ఉన్న అభ్యర్థులు 1.50 లక్షలు ఖర్చు చేయవచ్చు. జనరల్ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2వేలు, వార్డు సభ్యులు రూ.500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1000, వార్డు సభ్యులు రూ.250 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇకపై జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం చేయరు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటానికి వీలు ఉండదు. -
టాప్ టెన్తోనే దశ మారేది
* మొత్తం 543లో 400 స్థానాలు ఈ పది రాష్ట్రాల్లోనే.. * కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రాష్ట్రాల ప్రజలిచ్చే తీర్పే కీలకం * పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా * ఆ పార్టీల మద్దతుతోనే ఎవరైనా అధికారంలోకి నాగోజు సత్యనారాయణ-సాక్షి,ఢిల్లీ: ఎన్నికల పర్వం జోరందుకుంది. మొత్తం 9 దశల్లో ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు(ఏప్రిల్ 12) నాలుగో దశ. మే 16 నాడు అభ్యర్థుల భవితవ్యం తేలుతుంది. మేజిక్ ఫిగర్ అయిన 272ను అందుకుని ఢిల్లీ పీఠం దక్కిం చుకునేదెవరో తెలుస్తుంది. దేశంలో ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల శకం నడుస్తోంది. ఏ ఒక్క పార్టీనో మెజారిటీ సాధించే పరిస్థితి లేదు. దాంతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రతీ రాష్ట్రం, ప్రతీ సీటు కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 400 స్థానాలు 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిలో కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బలంగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లో పొత్తులు అనివార్యమ య్యాయి. ఆ రాష్ట్రాల్లో ఓటరు ఏ పార్టీ, లేదా కూటమికి మొగ్గు చూపితే.. ఆ పార్టీ/కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 10 రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, వాటి బలాబలాలు, ఆ రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించడం ద్వారా వచ్చే అయిదేళ్లూ అధికారంలో ఉండేదెవరో.. కేంద్రంలో చక్రం తిప్పేదెవరో అంచనా వేయొచ్చు. కీలకమైన ఆ 10 రాష్ట్రాల్లోని రాజకీయ ముఖచిత్రంపై విశ్లేషణ.. ఉత్తరప్రదేశ్ 80 లోక్‌సభ స్థానాలున్న కీలక రాష్ట్రం. ఏ పార్టీకైనా ఢిల్లీ పీఠం దక్కాలంటే ఈ రాష్ట్ర మద్దతు చాలా కీలకం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 21, సమాజ్‌వాదీ పార్టీ 23, బీఎస్పీ 20, బీజేపీ 10 స్థానాలు, ఆరెల్డీ 5 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే.. భారతదేశ ప్రధానమంత్రి కావాలని కలలుకంటున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ భవితవ్యం తేల్చేవారిలో ఉత్తరప్రదేశ్ ఓటర్లదే కీలక పాత్ర. 80 స్థానాల్లో బీజేపీ కనీసం 40 నుంచి 45 సీట్లు రాకపోతే మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు సన్నగిల్లినట్టేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతున్నారు. రాష్టంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ ప్రాభవం తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో బీఎస్పీ ఏమేరకు పుంజుకుంటుందోనన్న ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది. ఎస్పీ-బీఎస్పీ మధ్యపోటీతో ముస్లిం ఓట్లు చీలితే అగ్రకులాలతో పాటు జాట్లు, గుజ్జర్లు సహా ఓబీసీ సెలైంట్ ఓటు బ్యాంక్‌తో గట్టెక్కవచ్చన్నది బీజేపీ అంచనా. జాట్లకు రిజర్వేషన్లు ఇవ్వడం మినహా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశాలేవీ లేకపోవడంతో ఉత్తరప్రదే శ్లో కాంగ్రెస్పాత్ర నామమాత్రంగానే ఉండొచ్చు. మహారాష్ట్ర ఇక్కడ 48 లోక్‌సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 25 సీట్లు, బీజేపీ-శివసేన కూటమి 20సీట్లు గెలుచుకున్నాయి. అధికార కాంగ్రెస్ -ఎన్సీపీ కూటమి పాలకపక్ష ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ బీజేపీ-శివసేన కూటమికి విజయం నల్లేరు మీద నడక కాదు. రాజ్‌ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన ఒక్క సీటూ గెలవకపోయినా కాషాయ కూటమి విజయవకాశాలు దెబ్బతీసే అవకాశం ఉంది. ఆదర్శ, నీటిపారుదలశాఖ స్కాంలు కాంగ్రెస్-ఎన్సీపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఉన్న విభేదాలు బీజేపీ, శివసేనలకు కలిసొచ్చే పరిస్థితి ఉంది. 3. ఆంధ్రప్రదేశ్ మొత్తం 42 స్థానాల్లో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో 25, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 6, టీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందాయి. సీమాంధ్రలో విభజన ప్రభావం కాంగ్రెస్‌పై తీవ్రంగా ఉంది. అక్కడ కనీసం ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొందే పరిస్థితి లేదు. విభజనకు సహకరించారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ ఆదరణ కరువైంది. దాంతోపాటు విభజన బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ప్రతికూలంగా మారింది. సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఇటీవలి సర్వేలు కూడా ఈ విషయాన్నే ధ్రువీకరించాయి. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.. గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో బలంగా ఉండటంతో టీడీపీ పరిస్థితి ఇక్కడ కూడా నిరాశాజనకంగానే ఉంది. బీజేపీతో ఉన్న పొత్తు వల్ల ప్రయోజనమేమీ కనిపించడం లేదు. 4. పశ్చిమబెంగాల్ ఈ రాష్ట్రంలోనూ 42 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 19, సీపీఎం 9, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. అప్పటికీ.. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 25 నుంచి 30 స్థానాల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వ్యవహార శైలి తృణమూల్ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. 2009 ఎన్నికల అనంతరం యూపీఏకు మద్దతిచ్చిన మమత ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి సహకరించే అవకాశాలున్నాయిని విశ్లేషకులు భావిస్తున్నారు. 5. బీహార్ 40 స్థానాలున్న బీహార్ ప్రాంతీయ పార్టీల అడ్డా. ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ తదితర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఇక్కడ ఎక్కువ. ముఖ్యంగా జేడీయూ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో జేడీయూ 20, బీజేపీ 12, కాంగ్రెస్ 2, ఆర్జేడీ 4 సీట్లు సాధించాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటకు రావడం జేడీయూకి ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మోడీ ప్రభావం, ఎల్జేపీతో పొత్తుతో బీజేపీ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఉన్నత కులాల ఓట్లతోపాటు ఓబీసీ కార్డు మధ్యతరగతి వర్గాల్లోనూ బీజేపీకి ఓట్లు రాల్చనున్నట్టు తెలుస్తోంది. లాలూప్రసాద్ ప్రాబల్యం, ఆర్జేడీ పార్టీకున్న ఓటుబ్యాంక్ కారణంగా ఆ పార్టీతో పొత్తు కాంగ్రెస్‌కు కొంతవరకు లాభించనుంది. అయితే ప్రధాన పోటీ జేడీయూ, బీజేపీల మధ్యే ఉండనుంది. ముఖ్యమంత్రి నితీశ్ చరిష్మా ఈసారి జేడీయూకి పెద్దగా పని చేయకపోవచ్చునని పరిశీలకుల అంచనా. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కూటమి, జేడీయూల మధ్య చీలితే బీజేపీ పలు స్థానాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. 6.తమిళనాడు ప్రాంతీయపార్టీల రాజ్యమైన తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 స్థానం ఉన్నాయి. 2009 ఎన్నికల్లో డీఎంకే 18, ఏఐఏడీఎంకే 9, కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రస్తుతం ఇక్కడ జయలలిత హవా కొనసాగుతోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. యూపీఏ, ఎన్డీఏలకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ అధికారంలోకి రావొచ్చని, అదే జరిగితే ప్రధాని పదవి దక్కుతుందన్న ఆలోచనలో ఆమె ఉన్నారు. ప్రచారంలోనూ ఈ అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవినీతి కేసులు, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కుమారుడు అళగిరి తిరుగుబాటు ప్రతిపక్ష డీఎంకేను బాగా దెబ్బతీసాయి. అయితే, గత ఎన్నికల్లో దాదాపు 10% ఓట్లు సాధించిన విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే.. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా ఏఐఏడీఎంకే విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ సారి తమిళనాడు నుంచి కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలని యోచిస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు విజయావకాశాలు అంతంతమాత్రమే. 7.మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009లో బీజేపీ 16 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు దక్కించుకున్నాయి. గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినా లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి పెద్దగా కలిసిరాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైన స్థాయిలోనే సీట్లు దక్కించుకుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించింది. అదే హవా లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. మోడీ ప్రభావం, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పనితీరు బీజేపీకి అనుకూలించే అంశాలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. 8. కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009 ఎన్నికల్లో బీజేపీకి 19, కాంగ్రెస్ 6, జేడీఎస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. మోడీ ప్రభావంతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించగలమని బీజేపీ భావిస్తోంది. బీఎస్ యెడ్యూరప్ప మళ్లీ పార్టీలోకి రావడం బీజేపీకి అనుకూలించే అంశం. బీజేపీలో ఉ న్న అంతర్గత కుమ్ములాటలు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభించాయి. మరోమారు అలాంటి పొరపాటు జరగకుండా బీజేపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటామన్న విశ్వాసంతో ఉంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కొంతమేర ప్రభావం చూపినా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. 9.గుజరాత్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, నరేంద్రమోడీకి మూడుసార్లు పట్టం కట్టిన రాష్ట్రం. అయినా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలకు గానూ బీజేపీ 15 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చి 11 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో తమ వాడు ప్రధాని కావాలన్న ఆలోచనతో గుజరాత్ ఓటర్లు బీజేపీనే అత్యధిక స్థానాల్లో గెలిపించే పరిస్థితి కనిపిస్తోంది. 10. రాజస్థాన్ ఇక్కడ 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీకి కంచుకోట లాంటిదే. రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన బీజేపీ.. ఈ రాష్ట్రం నుంచి కనీసం 23 లోక్‌సభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గ్రామస్థాయికి విస్తరించిన ఓటుబ్యాంక్ బలమైన కేడర్ కాంగ్రెస్‌కు అనుకూలించే అంశాలు. అయితే, గత సంవత్సర అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు.