టాప్ టెన్‌తోనే దశ మారేది
* మొత్తం 543లో 400 స్థానాలు ఈ పది రాష్ట్రాల్లోనే..
* కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రాష్ట్రాల ప్రజలిచ్చే తీర్పే కీలకం
* పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా
* ఆ పార్టీల మద్దతుతోనే ఎవరైనా అధికారంలోకి
నాగోజు సత్యనారాయణ-సాక్షి,ఢిల్లీ: ఎన్నికల పర్వం జోరందుకుంది. మొత్తం 9 దశల్లో ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు(ఏప్రిల్ 12) నాలుగో దశ. మే 16 నాడు అభ్యర్థుల భవితవ్యం తేలుతుంది. మేజిక్ ఫిగర్ అయిన 272ను అందుకుని ఢిల్లీ పీఠం దక్కిం చుకునేదెవరో తెలుస్తుంది. దేశంలో ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల శకం నడుస్తోంది. ఏ ఒక్క పార్టీనో మెజారిటీ సాధించే పరిస్థితి లేదు. దాంతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రతీ రాష్ట్రం, ప్రతీ సీటు కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 400 స్థానాలు 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.
వాటిలో కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బలంగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లో పొత్తులు అనివార్యమ య్యాయి. ఆ రాష్ట్రాల్లో ఓటరు ఏ పార్టీ, లేదా కూటమికి మొగ్గు చూపితే.. ఆ పార్టీ/కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 10 రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, వాటి బలాబలాలు, ఆ రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించడం ద్వారా వచ్చే అయిదేళ్లూ అధికారంలో ఉండేదెవరో.. కేంద్రంలో చక్రం తిప్పేదెవరో అంచనా వేయొచ్చు. కీలకమైన ఆ 10 రాష్ట్రాల్లోని రాజకీయ ముఖచిత్రంపై విశ్లేషణ..
ఉత్తరప్రదేశ్
80 లోక్‌సభ స్థానాలున్న కీలక రాష్ట్రం. ఏ పార్టీకైనా ఢిల్లీ పీఠం దక్కాలంటే ఈ రాష్ట్ర మద్దతు చాలా కీలకం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 21, సమాజ్‌వాదీ పార్టీ 23, బీఎస్పీ 20, బీజేపీ 10 స్థానాలు, ఆరెల్డీ 5 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే.. భారతదేశ ప్రధానమంత్రి కావాలని కలలుకంటున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ భవితవ్యం తేల్చేవారిలో ఉత్తరప్రదేశ్ ఓటర్లదే కీలక పాత్ర. 80 స్థానాల్లో బీజేపీ కనీసం 40 నుంచి 45 సీట్లు రాకపోతే మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు సన్నగిల్లినట్టేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతున్నారు. రాష్టంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ ప్రాభవం తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో బీఎస్పీ ఏమేరకు పుంజుకుంటుందోనన్న ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది. ఎస్పీ-బీఎస్పీ మధ్యపోటీతో ముస్లిం ఓట్లు చీలితే అగ్రకులాలతో పాటు జాట్లు, గుజ్జర్లు సహా ఓబీసీ సెలైంట్ ఓటు బ్యాంక్‌తో గట్టెక్కవచ్చన్నది బీజేపీ అంచనా. జాట్లకు రిజర్వేషన్లు ఇవ్వడం మినహా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశాలేవీ లేకపోవడంతో ఉత్తరప్రదే శ్‌లో కాంగ్రెస్‌పాత్ర నామమాత్రంగానే ఉండొచ్చు.
మహారాష్ట్ర
ఇక్కడ 48 లోక్‌సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 25 సీట్లు, బీజేపీ-శివసేన కూటమి 20సీట్లు గెలుచుకున్నాయి. అధికార కాంగ్రెస్ -ఎన్సీపీ కూటమి పాలకపక్ష ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ బీజేపీ-శివసేన కూటమికి విజయం నల్లేరు మీద నడక కాదు. రాజ్‌ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన ఒక్క సీటూ గెలవకపోయినా కాషాయ కూటమి విజయవకాశాలు దెబ్బతీసే అవకాశం ఉంది. ఆదర్‌శ, నీటిపారుదలశాఖ స్కాంలు కాంగ్రెస్-ఎన్సీపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఉన్న విభేదాలు బీజేపీ, శివసేనలకు కలిసొచ్చే పరిస్థితి ఉంది.
3. ఆంధ్రప్రదేశ్
మొత్తం 42 స్థానాల్లో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో 25, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 6, టీఆర్‌ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందాయి. సీమాంధ్రలో విభజన ప్రభావం కాంగ్రెస్‌పై తీవ్రంగా ఉంది. అక్కడ కనీసం ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొందే పరిస్థితి లేదు. విభజనకు సహకరించారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ ఆదరణ కరువైంది. దాంతోపాటు విభజన బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ప్రతికూలంగా మారింది. సీమాంధ్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఇటీవలి సర్వేలు కూడా ఈ విషయాన్నే ధ్రువీకరించాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.. గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో బలంగా ఉండటంతో టీడీపీ పరిస్థితి ఇక్కడ కూడా నిరాశాజనకంగానే ఉంది. బీజేపీతో ఉన్న పొత్తు వల్ల ప్రయోజనమేమీ కనిపించడం లేదు.
4. పశ్చిమబెంగాల్
ఈ రాష్ట్రంలోనూ 42 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 19, సీపీఎం 9, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. అప్పటికీ.. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 25 నుంచి 30 స్థానాల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వ్యవహార శైలి తృణమూల్ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. 2009 ఎన్నికల అనంతరం యూపీఏకు మద్దతిచ్చిన మమత ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి సహకరించే అవకాశాలున్నాయిని విశ్లేషకులు భావిస్తున్నారు.
5. బీహార్
40 స్థానాలున్న బీహార్ ప్రాంతీయ పార్టీల అడ్డా. ఆర్జేడీ, జేడీయూ, ఎల్‌జేపీ తదితర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఇక్కడ ఎక్కువ. ముఖ్యంగా జేడీయూ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో జేడీయూ 20, బీజేపీ 12, కాంగ్రెస్ 2, ఆర్‌జేడీ 4 సీట్లు సాధించాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటకు రావడం జేడీయూకి ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మోడీ ప్రభావం, ఎల్జేపీతో పొత్తుతో బీజేపీ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఉన్నత కులాల ఓట్లతోపాటు ఓబీసీ కార్డు మధ్యతరగతి వర్గాల్లోనూ బీజేపీకి ఓట్లు రాల్చనున్నట్టు తెలుస్తోంది. లాలూప్రసాద్ ప్రాబల్యం, ఆర్జేడీ పార్టీకున్న ఓటుబ్యాంక్ కారణంగా ఆ పార్టీతో పొత్తు కాంగ్రెస్‌కు కొంతవరకు లాభించనుంది. అయితే ప్రధాన పోటీ జేడీయూ, బీజేపీల మధ్యే ఉండనుంది. ముఖ్యమంత్రి నితీశ్ చరిష్మా ఈసారి జేడీయూకి పెద్దగా పని చేయకపోవచ్చునని పరిశీలకుల అంచనా. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కూటమి, జేడీయూల మధ్య చీలితే బీజేపీ పలు స్థానాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి.
6.తమిళనాడు
ప్రాంతీయపార్టీల రాజ్యమైన తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 స్థానం ఉన్నాయి. 2009 ఎన్నికల్లో డీఎంకే 18, ఏఐఏడీఎంకే 9, కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రస్తుతం ఇక్కడ జయలలిత హవా కొనసాగుతోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. యూపీఏ, ఎన్డీఏలకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ అధికారంలోకి రావొచ్చని, అదే జరిగితే ప్రధాని పదవి దక్కుతుందన్న ఆలోచనలో ఆమె ఉన్నారు. ప్రచారంలోనూ ఈ అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవినీతి కేసులు, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కుమారుడు అళగిరి తిరుగుబాటు ప్రతిపక్ష డీఎంకేను బాగా దెబ్బతీసాయి. అయితే, గత ఎన్నికల్లో దాదాపు 10% ఓట్లు సాధించిన విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే.. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా ఏఐఏడీఎంకే విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ సారి తమిళనాడు నుంచి కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలని యోచిస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు విజయావకాశాలు అంతంతమాత్రమే.
7.మధ్యప్రదేశ్
ఈ రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009లో బీజేపీ 16 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు దక్కించుకున్నాయి. గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినా లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి పెద్దగా కలిసిరాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైన స్థాయిలోనే సీట్లు దక్కించుకుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించింది. అదే హవా లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. మోడీ ప్రభావం, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పనితీరు బీజేపీకి అనుకూలించే అంశాలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
8. కర్ణాటక
రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2009 ఎన్నికల్లో బీజేపీకి 19, కాంగ్రెస్ 6, జేడీఎస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. మోడీ ప్రభావంతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించగలమని బీజేపీ భావిస్తోంది. బీఎస్ యెడ్యూరప్ప మళ్లీ పార్టీలోకి రావడం బీజేపీకి అనుకూలించే అంశం. బీజేపీలో ఉ న్న అంతర్గత కుమ్ములాటలు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభించాయి. మరోమారు అలాంటి పొరపాటు జరగకుండా బీజేపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటామన్న విశ్వాసంతో ఉంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కొంతమేర ప్రభావం చూపినా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది.
9.గుజరాత్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, నరేంద్రమోడీకి మూడుసార్లు పట్టం కట్టిన రాష్ట్రం. అయినా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలకు గానూ బీజేపీ 15 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చి 11 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో తమ వాడు ప్రధాని కావాలన్న ఆలోచనతో గుజరాత్ ఓటర్లు బీజేపీనే అత్యధిక స్థానాల్లో గెలిపించే పరిస్థితి కనిపిస్తోంది.
10. రాజస్థాన్
ఇక్కడ 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీకి కంచుకోట లాంటిదే. రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన బీజేపీ.. ఈ రాష్ట్రం నుంచి కనీసం 23 లోక్‌సభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గ్రామస్థాయికి విస్తరించిన ఓటుబ్యాంక్ బలమైన కేడర్ కాంగ్రెస్‌కు అనుకూలించే అంశాలు. అయితే, గత సంవత్సర అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు.