జిల్లాపరిషత్‌లో ఎన్నికల సామగ్రిని సరిచూస్తున్న సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. మూడు విడతల్లో నిర్వహించతలపెట్టిన ఈ ఎన్నికల కోసం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరత్రా సామగ్రిని సమకూర్చిన పంచాయతీ విభాగం.. జిల్లాపరిషత్ నుంచి బుధవారం మండల కేంద్రాలకు తరలించింది. ఈ నెల 7న తొలిదశ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఆలోపు ఎన్నికల సరంజామాను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది.
దీంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద పోలింగ్ మెటీరియల్‌ను మండలాలకు తరలించింది. జిల్లావ్యాప్తంగా 558 పంచాయతీలు, 4,992 వార్డులకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7.06 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఇందుకోసం 3,040 బ్యాలెట్ డబ్బాలు అవసరమని గుర్తించింది. కాగా, మొత్తం వార్డుల్లో కనీసం 10శాతమైనా ఏకగ్రీవం కావచ్చని యంత్రాంగం అంచనా వేస్తోంది.
పోలింగ్ విధులకు 8వేల మంది
పోలింగ్ విధులకు 8వేల మంది ఉద్యోగులను అవసరమని అధికారయంత్రాంగం తేల్చింది. వీరికి అదనంగా నియమించిన స్టేజ్–1, స్టేజ్–2 అధికారులకు ఇదివరకే శిక్షణ కూడా నిర్వహించింది. మరోవైపు ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు పోలింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను కూడా సిద్ధం చేసింది.
వ్యయపరిమితి ఇలా..!
ఎన్నికల ప్రచార వ్యయంపై ఈసీ పరిమితులు విధించింది. పల్లెల్లో అడ్డగోలుగా ధనప్రవాహం జరుగకుండా ముకుతాడు వేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల వ్యయం ఆకాశన్నంటింది. ఖర్చుపై పరిమితులు ఉన్నా.. ఇవేమీ పట్టని అభ్యర్థులు నగదు, నజరానాలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో సక్సెస్ అయ్యారు. కాగా, తాజాగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపై ఆంక్షలు విధించింది.
10వేల జనాభా ఉన్న పంచాయతీ పరిధిలో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థి రూ.80వేల వరకు ఖర్చు చేసే వీలుంది. అలాగే ఆ ఊరు వార్డు మెంబర్ రూ.10వేల వరకు వ్యయం చేయవచ్చు. కాగా, పదివేల లోపు జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రూ.40వేలు, వార్డు అభ్యర్థి రూ.6వేల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సివుంటుంది. ప్రతిరోజు ప్రచార లెక్కలను స్థానిక రిటర్నింగ్ అధికారికి నివేదించాల్సివుంటుంది. అంతేగాకుండా ప్రచారపర్వాన్ని కూడా నిశితంగా పరిశీలించే బాధ్యతను స్టేజ్–2 ఆఫీసర్లకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment