సాక్షి, సిరిసిల్ల: ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కోరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10 లక్షలతో పాటు సొంతంగా ఎమ్మెల్యే గ్రాంట్ల నుంచి మరో రూ.15 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, దీంతో ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీల అభివృద్ధికి తక్షణమే రూ.25 లక్షలు ఖాతాల్లో పడ్డట్లేనని చెప్పారు. ‘సిరిసిల్లలో పోటీ మనలో మనకే ఉంటది. అందరూ మనవాళ్లే. నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమవ్వాలి. సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి పార్టీ మండల అధ్యక్షులు చొరవ తీసుకోవాలి.. రాజీపడిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్‌విండో, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తాం’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకున్న మంజులనాయక్‌ను కేటీఆర్ సభలో అభినందించారు.
లేకుంటే వంద సీట్లు గ్యారంటీ
2014లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు 63 సీట్లు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటనలతో వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు రావడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమన్నారు. రాష్ట్రంలో ట్రక్కు గుర్తు వల్ల 1,65,000 ఓట్లు పక్కదారి పట్టాయని, వాటితో కలుపుకుంటే రాష్ట్రంలో 50% ప్రజలు తమకు మద్దతు తెలిపారని అన్నారు. టీఆర్‌ఎస్ కోల్పోయిన వాటిలో పది సీట్లు కేవలం 4 వేల లోపు ఓట్లతో ఓటమి చెందామని, సరిగ్గా అభ్యర్థించి ఉంటే వంద స్థానాలు గెలిచేవాళ్లమని వివరించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలైన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారడం ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.
అడ్డం పడుతవ్ అన్నరు..
‘దేశ చరిత్రలో ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్, వాజ్‌పేయి, ఇందిరాగాంధీ, చంద్రబాబు ఎవరూ కూడా గెలువలే. మీరు కూడా అడ్డం పడుతరని చాలామంది అన్నరు. కానీ తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాసిన్రు. లక్షల మంది పార్టీ కార్యకర్తలు కష్టపడితే 88 మంది ఎమ్మెల్యేలం గెలిచినం. ఈ గెలుపు టీఆర్‌ఎస్ కార్యకర్తలకే అంకితం’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ నేతలు బస్వరాజు సారయ్య, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు.
గుంపుగా వచ్చి గల్లంతయ్యారు
దేశంలోని చిన్నాపెద్ద నేతలంతా గుంపుగా వచ్చి గల్లంతయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఒక్కడిగా నిలబడ్డారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిం డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. లక్షల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమంపై ఉన్న విశ్వాసమే ఆ ధీమాకు కారణమన్నారు. దేశంలోని ఉద్దండులంతా ఒక్కటిగా వచ్చినా ప్రజలు కులమతాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌కు 75% స్థానాలతో మెజార్టీని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలసి వందల సంఖ్యలో తరలివచ్చినా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు కలసి సభలు పెట్టి తమపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. ఆరోగ్యం బాగాలేని సోనియాను కూడా ప్రచారానికి రప్పించి ఆమెను ఇబ్బంది పెట్టారని అన్నారు.
ఎంపీగా వినోద్‌ను గెలిపించుకుందాం
‘మన ఎంపీ వినోద్‌కుమార్ అంత మంచి మనిషి మనకు దొరకడు. సిరిసిల్ల, కరీంనగర్ నుంచి పార్లమెంట్ దాకా ఏ పని కావాలో చేసుకొస్తడు. తన స్వార్థం కోసం కాకుండా నియోజకవర్గం కోసం పనిచేస్తడు. ఈ ఎన్నికల తర్వాత వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలే కాబట్టి మళ్లీ వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించుకోవడానికి మనమంతా కృషిచేయాలే’అని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ వినోద్‌కుమారే పోటీ చేయనున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment