Unanimous Panchayat
-
మూడేళ్లైంది.. మాటిచ్చి మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వం
ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. గత సర్పంచ్ ఎన్నికల్లో రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. కట్ చేస్తే ప్రభుత్వ మాటలు, హామీలు ఒట్టి మాటలేనని ఆయా గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. మూడేళ్లయినా రూ.10లక్షల నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వం ‘ఒట్టి మాటలు కట్టిపెట్టి పంచాయతీలకు తోడు పడాలి’అని పాలకవర్గాలు కోరుతున్నారు. సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్): జిల్లాలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మూడేళ్లవుతోంది. నజరానా నిధులు కోసం పాలకవర్గాలు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిధుల కొరతతో ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది. (చదవండి: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) 61 పంచాయతీల్లో 9 ఏకగ్రీవం.. ► జిల్లాలో 61 పంచాయతీలు ఉన్నాయి. అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మంత్రులు తలో మాట అంటుండటంతో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు వస్తాయో రావోనని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు.. ► ఘట్కేసర్ మండలంలో మాదారం, శామీర్‌పేట్ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి మండలంలో మూడుచింతలపల్లి, కీసర మండలంలో నర్సంపల్లి, మేడ్చల్ మండలంలో డబీల్‌పూర్, లింగాపూర్, రాజబొల్లారం తండా, రాయిలాపూర్ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అభివృద్ధి చేయొచ్చని ఏకగ్రీవం.. ► అనుబంధ గ్రామాలుగా ఉన్న సమయంలో అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని.. ఒక మాటగా నిలచి ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే నిధులుతో గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చని భావించారు. పాలకవర్గాల ఆశలు ఆవిరి.. ► ఏకగ్రీవమైన చాలా పంచాయతీలు అనుబంధ గ్రామాలుగా ఉండి నూతనంగా ఏర్పడినవే. చిన్న పంచాయతీలు కావడం.. ఓటర్లు తక్కువగా ఉండడంతో గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనపెట్టి సమష్టి నిర్ణయంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏకగ్రీవ నిధులు ఇస్తామన్న సర్కారు మాట తప్పడంతో పాలకవర్గాల ఆశలు ఆవిరయ్యాయనే చెప్పాలి. ఆదాయ మార్గాలు లేక అభివృద్ధికి దూరం.. ► జనాభా ఆధారంగా ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కేటాయింపుతో ప్రయోజనం కలగడం లేదు. ప్రస్తుతం వస్తున్న నిధుల నుంచి ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్, డీజిల్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర బిల్లులను ఏకగ్రీవ పంచాయతీలు చెల్లించకలేపోతున్నాయి. ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. అభివృద్ధికి సహకరించాలి... ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నజరానా ఇవ్వాలి. చిన్న గ్రామం కావడంతో అభివృద్ది పనులు చేపట్టలేకపోతున్నాం. హామీని నిలబెట్టుకొని అభివృద్ధికి సహకరించాలి. – యాదగిరి, మాదారం సర్పంచ్, ఘట్కేసర్ మండలం ప్రభుత్వ పెద్దలవి తలో మాట.. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10లక్షలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హామీలిచ్చి అమలు చేయకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉంది. హామీపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలో మాట మాట్లాడటంసిగ్గుచేటు. – ప్రవీణ్‌రావు, ఘట్కేసర్ మండల బీజేపీ అధ్యక్షుడు -
తుది విడత పంచాయతీ పోరులో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాలుగు దశల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ల సంఖ్య 2,192కు చేరింది. తుది దశ ఎన్నికల కోసం ఈనెల 10న నోటిఫికేషన్ జారీచేసి 12వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,750 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి
సాక్షి, అమరావతి బ్యూరో: అది కృష్ణా జిల్లాలోనే బుల్లి పంచాయతీ.. 1975లో కుందేరు నుంచి వేరుపడి పంచాయతీగా ఏర్పాటైంది. 350 మంది జనాభా, 232 మంది ఓటర్లున్న ఆ ఊరి పేరు కందలంపాడు. కంకిపాడు మండలంలో ఉంది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు గతంలో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఈ పంచాయతీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అవడంతో ఇద్దరు బరిలో నిలిచారు. మంగళవారం నాటి ఓటింగ్‌లో 232 ఓట్లకు గాను 211 పోలయ్యాయి. ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో బాయిరెడ్డి నాగరాజు (వైఎస్సార్సీపీ మద్దతుదారు)కు 103, మొవ్వ శివనాగ సుబ్రహ్మణ్యానికి 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో నాగరాజు సర్పంచ్ అయ్యారు. ఇక ఆ ఊరిలోని నాలుగు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన మూడు వార్డుల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌కు ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. దిబ్బపాలెంలోనూ అంతే.. మాడుగుల రూరల్: విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దిబ్బపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. గ్రామానికి చెందిన నందారపు కాసులమ్మ, తుంపాల నిరంజని పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నిరంజని కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాసులమ్మకు 742 ఓట్లు రాగా, తుంపాల నిరంజనికి 743 ఓట్లు వచ్చాయి. కాపవరం పంచాయతీలోనూ.. సామర్లకోట: ఒక్క ఓటు.. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయనను విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా కాపవరం పంచాయతీలో 8 వార్డులున్నాయి. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో కుంచం మాధవరావు గెలుపొందారు. అధికారులు తిరిగి ఓట్లు లెక్కించడంతో అదే ఒక్క ఓటు తేడాతో మాధవరావు గెలుపొందారు. లాటరీతో వరించిన పదవి గోనేడ సర్పంచ్‌గా గంగరాజు ప్రత్తిపాడు : ఇద్దరు అభ్యర్థులకూ ఓట్లు సమంగా వచ్చాయి.. దీంతో అధికారులు లాటరీ తీసి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో అల్లు విజయకుమార్, పలివెల గంగరాజులకు 1,207 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీయగా విజయ్‌కుమార్‌ను అదృష్టం వరించడంతో సర్పంచ్ అయ్యారు. -
రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు. -
‘కడిమిశెట్టి’కి మల్ల‘వరం’
పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే చాలు.. గ్రామాలు ఒకటే సందడిగా ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం) గ్రామంలో మాత్రం ఏ హడావుడీ ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ గ్రామస్తులందరూ ఒకచోట సమావేశమవుతారు. వచ్చిన రిజర్వేషన్‌కు అనుకూలంగా ఒక వ్యక్తి పేరు సూచిస్తారు. అందరి ఆమోదంతో ఎన్నిక లేకుండా ఊరంతా ఏకగ్రీవంగా ఆ వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఆ పంచాయతీలో సర్పంచ్‌లు మారుతుంటారు. వారి పేర్లు మారతాయి. కానీ ఇంటిపేరు మాత్రం ఒకటే ఉంటుంది. అదే ‘కడిమిశెట్టి’. ఆ గ్రామంలో ఎవరిని కదిపినా కడిమిశెట్టి వారి ఇంటి పేరు మార్మోగుతుంది. గడచిన 11 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పది దఫాలు ఇక్కడ ఏకగ్రీవమే. ఒక్కసారి మాత్రమే ఎన్నిక జరిగింది. ఏపీ మల్లవరం గ్రామం పది దఫాల్లోనూ కడిమిశెట్టి వారి కుటుంబసభ్యులు ఐదుసార్లు సర్పంచ్‌లుగా.. అదీ ఏకగ్రీవం కావడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో రిజర్వేషన్ల వలన ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు తప్ప అవకాశం ఉంటే చాలు కడిమిశెట్టి వారికే పట్టం కడతామంటున్నారు ఆ గ్రామస్తులు. ఈ దఫా ఎన్నికల్లోనూ అక్కడ సర్పంచ్‌తోపాటు 10 మంది వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తొలి సర్పంచ్‌గా గ్రామపెద్ద అయిన కడిమిశెట్టి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కడిమిశెట్టి బుల్లిరాజు, కడిమిశెట్టి పెదరాము, కడిమిశెట్టి వెంకటసత్యనారాయణస్వామి సర్పంచ్‌లయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కడిమిశెట్టి సుశీలను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలవెల్లి ఎస్టేట్.. 3 పంచాయతీలు గొల్లప్రోలు మండలంలో 1964కు ముందు ఆలవెల్లి ఎస్టేట్ ఒకే గ్రామంగా ఉండేది. ఈ గ్రామాన్ని ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం), ఏకే మల్లవరం (ఆలవెల్లి కొత్త మల్లవరం), ఏ విజయనగరం (ఆలవెల్లి విజయనగరం) అనే మూడు గ్రామాలుగా విభజించారు. 1965 నుంచి ఈ మూడు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి. -
పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం
అదో వసుధైక కుటుంబం. అర్ధ శతాబ్ద కాలంగా ఆపకుండా చైతన్య కాగడాలు వెలిగిస్తోంది. గ్రామ రాజకీయాలను నిప్పులతో కడుగుతూ స్వచ్ఛంగా ఉంచింది. రెండు వందల పైచిలుకు గడపలకు నాయకత్వాన్ని ఆస్తిగా పంచింది. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలతో పని లేకుండా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది. తొమ్మిది వందల పైచిలుకు సభ్యులున్న ఆ ఉమ్మడి కుటుంబం పేరు వెంకయ్యపేట. పల్లె ఐకమత్యంగా ఉంటే ఏం సాధించగలదో చెప్పడానికి ఈ ఊరే ఉదాహరణ. సమస్యలుంటే అందరూ కలిసి గుడి వద్ద కూర్చుని పరిష్కరించుకుంటారు. డబ్బులొస్తే ఊరినెలా బాగు చేయాలా అని ఆలోచిస్తారు. ఇంత అందమైన మనుషులున్న ఆ ఊరి గురించి.. సాక్షి, జి.సిగడాం(శ్రీకాకుళం): మండలంలోని వెంకయ్య పేట పంచాయతీ ఎన్నికలకు ఎప్పటి నుంచో దూరంగా ఉంటోంది. ఇక్కడ ఎప్పుడూ ఏకగ్రీవమే. గ్రామంలో సుమారు 900 వరకు జనాభా ఉన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులతో పాటు వివిధ రకాల పట్టభద్రులు ఈ గ్రామ కీర్తిని నలుదిశలా పెంచుతున్నారు. రాజకీయ రంగంలో మాత్రం ఈ గ్రామానిది ఓ ప్రత్యేక శైలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలే జరగలేదు. పారీ్టలు ఏమైనా ఇక్కడ వర్గపోరు ఉండదు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా సంఘటితంగా ఉంటూ గ్రామ నేతను ఎన్నుకోవడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఊరిలో ఏమైనా స్వల్ప వివాదాలు తలెత్తితే గ్రామ పెద్దల సమక్షంలోనే అవి పరిష్కారానికి నోచుకుంటాయి. పోలీసు స్టేషన్లో గానీ, కోర్టులలో గానీ ఈ గ్రామానికి సంబంధించిన కేసులు మచ్చుకైనా కనిపించవు. పంచాయతీ సర్పంచ్‌గా ఎవరు ఎన్నికైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామానికి సరికొత్త రూపును సింగారించుకునేలా కృషి చేస్తుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గ్రామం ఇందిరమ్మ ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది. అప్పటి నుంచి ఆ గ్రామ స్వరూపం మారింది. 200 పక్కా గృహాలు, 210 పింఛన్లతో పాటుగా పలు సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. ఆవిర్భావం నుంచి నేటి వరకు.. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం నుంచి నేటి వరకు గ్రామ సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటి నుంచి ఆ రేళ్ల నారాయణప్పడు ఐదు సార్లు, బత్తుల లక్ష్మణరావు, శ్రవణం ఈశ్వరమ్మ, శ్రవణం పోలీసు, మావిడి శ్రీనివాసరావు, 2013లో మర్రిబందల లక్ష్మి (ఎస్సీ) ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా వరుసగా ఎన్నికయ్యారు. అందరి సహకారంతో.. పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుంచి మా గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. నేటి వరకు పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ తెలీదు. 2009లో జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందించింది. దీంతో ప్రతి వీధిలో సిమ్మెంటు రోడ్డు వేసుకున్నాం. – మావిడి శ్రీను, మాజీ సర్పంచ్ ఐకమత్యంతో ఎన్నుకుంటాం గ్రామంలో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఒకే వేదికపై కలుసుకుని గ్రామ సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలోని రిజర్వేషన్ల ప్రకారమే వ్యక్తులను ఎంపిక చేసుకుంటాం. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం. – డి.అమ్మారావు, రిటైర్డ్ ఉద్యోగి పెద్దలను గౌరవిస్తాం గ్రామంలో ఉన్న పెద్దలందరినీ గౌరవిస్తాం. ఎలాంటి వివాదాలకు వెళ్లం. ఏమైనా సమస్యలుంటే రామాలయం వద్దే పరిష్కరించుకుంటాం. రానున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. – ఎ.గొల్లాజీ, గ్రామస్తుడు -
నజరానా ఏదీ..
సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పల్లె ప్రజలు స్పందించారు. ఏకగ్రీవమైతే ఇప్పటికే అమలవుతున్న పథకాలతోపాటు మరికొన్ని ప్రోత్సాహాకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాలను ఓటర్లు గమనంలోకి తీసుకున్నారు. ప్రోత్సాహకం మొత్తం గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎన్నుకుని స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో నాలుగున్నర నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామపంచాయతీలకు గాను జిల్లా వ్యాప్తంగా 16 మైనర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. నిధులు లేక పరిష్కారం కాని సమస్యలు... గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులు ఉండాలి. ఆదాయం మార్గం ఉంటేనే నిధుల కొరత ఉండదు. మైనర్ పంచాయతీల విషయానికొస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండడం, ఆదాయ వనరులు లేకపోవడం వంటిది చిన్న పంచాయతీల పాలిట శాపంగా మారుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందుతున్న నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండడంతో చిన్నగ్రామాలకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. కనీసం వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లదీయడమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే ఏకగ్రీవమే ఉత్తమమని గుర్తించిన గ్రామస్తులు వాటి ద్వారా వచ్చే ప్రోత్సాహాకానికి ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవమైతే పది లక్షలతోపాటు మరో రూ.5 లక్షలు తమ కోటానుంచి ఇస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆ మాటలను నమ్మి ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరి నాలుగున్నర నెలలైంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహాకాలను విడుదల చేస్తే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పనులు చేపట్టడానికి వీలవుతుంది. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు, చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం గతంలో మాదిరిగా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజలు కోరుతున్నారు. నిధులు విడుదల చేయాలి ఏకగ్రీవ పంచాయతీలకు నేటికీ ప్రోత్సాహక నిధులు మంజూరు కాలేదు. గ్రామంలో పలు సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో సమస్యలు పరిష్కరించడం ఇబ్బందిగా ఉంది. ప్రోత్సాహాక నిధులను త్వరగా మంజూరు చేస్తే గ్రామంలోని కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడుతుంది. నిధులు త్వరితగతిన మంజూరు చేయాలి. –అబ్బిడి పద్మరవీందర్రెడ్డి, వెన్నంపల్లి సర్పంచ్, సైదాపూర్ మండలం -
25 ఏళ్లుగా ఏకగ్రీవమే..
చందంపేట : కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఓ తండా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తండా అభివృద్ధికి స్థానికులు 25 ఏళ్లుగా ఏకతాటిపై నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకుంటూ ప్రభుత్వ నజరానాతో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు చిన్నమునిగల్తండా వాసులు. నల్లగొండ జిల్లాలోనే మారుమూలన ఉండే ఈ తండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏలేశ్వరం వద్ద ఉన్న భూములను కోల్పోవడంతో పునరావాసం కింద పెద్దమునిగల్ గ్రామం పక్కనే ఉన్న ఓ స్థలాన్ని చిన్నమునిగల్గా ఏర్పాటు చేశారు. 25 ఏళ్లుగా ఈ తండాలో సర్పంచ్, వార్డులు ఏకగ్రీవమవుతున్నాయి. గతంలో చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో గతంలో బుగ్గతండా, వైజాక్‌కాలనీ ఉండేవి. ప్రస్తుతం 500 జనాభా పైబడిన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో బుగ్గతండా, వైజాక్‌కాలనీ నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం 250 ఓట్లతో చినమునిగల్ గ్రామపంచాయతీగా ఉంది. ఇప్పుడు కూడా పంచా యతీ ఏకగ్రీవమయ్యింది. అప్పటి నుంచి రాజేశ్వర్, మైసానమ్మ, పాపానాయక్, మకట్‌లాల్ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా పని చేశారు. ఈ సారి కేతావత్ జంకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవానికే తండావాసుల మొగ్గు.. గత ఎన్నికల్లో మకట్‌లాల్ ఏకగ్రీవం కావడంలో రూ.10లక్షల నజరానా అందడంతో గ్రామంలో సీ సీ రోడ్ల కోసం ఉపయోగపడ్డాయని గ్రామానికి చెందిన దేవరకొండ నగరపంచాయతీ మాజీ చై ర్మన్ మంజ్యానాయక్, వ్యాపారవేత్త రూప్లానా యక్ తండా వాసులకు వివరించారు. దీంతో ఈ సారి కూడా ఏకగ్రీవం వైపే మొగ్గు చూపారు. ప్యా రిస్‌లో ఎంబీఏ చేసిన మంజ్యానాయక్ కుమారు డు ఈ సారి ఏకగ్రీవ ఉప సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధిగా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు. ఏకగ్రీవం అయితేనే అభివృద్ధి సాధ్యం అందరి ప్రోత్సాహంతో నేను ఈ సారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా ను. గతంలో నాలుగుసార్లు మా గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. నన్ను ఎ న్నుకున్నందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు. గ్రామాభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. – కేతావత్ జంకు, సర్పంచ్, చిన్నమునిగల్ గ్రామాభివృద్ధే ధ్యేయం మారుమూల గ్రామమైన చిన్నమునిగల్ను అభివృద్ధి చేయడానికి ప్యారి స్లో ఎంబీఏ చేసిన నేను ఈ సారి బరిలో నిలబడ్డా. తండావారంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ మంచి జరగాలన్నదే నా ఉద్దేశం. ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కరిస్తా. – కేతావత్ లాలునాయక్, ఉప సర్పంచ్, చిన్నమునిగల్ -
ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలి
సాక్షి, సిరిసిల్ల: ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కోరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10 లక్షలతో పాటు సొంతంగా ఎమ్మెల్యే గ్రాంట్ల నుంచి మరో రూ.15 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, దీంతో ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీల అభివృద్ధికి తక్షణమే రూ.25 లక్షలు ఖాతాల్లో పడ్డట్లేనని చెప్పారు. ‘సిరిసిల్లలో పోటీ మనలో మనకే ఉంటది. అందరూ మనవాళ్లే. నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమవ్వాలి. సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి పార్టీ మండల అధ్యక్షులు చొరవ తీసుకోవాలి.. రాజీపడిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్‌విండో, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తాం’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకున్న మంజులనాయక్ను కేటీఆర్ సభలో అభినందించారు. లేకుంటే వంద సీట్లు గ్యారంటీ 2014లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్ఎస్కు ప్రజలు 63 సీట్లు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటనలతో వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ టీఆర్ఎస్కు 88 సీట్లు రావడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమన్నారు. రాష్ట్రంలో ట్రక్కు గుర్తు వల్ల 1,65,000 ఓట్లు పక్కదారి పట్టాయని, వాటితో కలుపుకుంటే రాష్ట్రంలో 50% ప్రజలు తమకు మద్దతు తెలిపారని అన్నారు. టీఆర్ఎస్ కోల్పోయిన వాటిలో పది సీట్లు కేవలం 4 వేల లోపు ఓట్లతో ఓటమి చెందామని, సరిగ్గా అభ్యర్థించి ఉంటే వంద స్థానాలు గెలిచేవాళ్లమని వివరించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలైన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారడం ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అడ్డం పడుతవ్ అన్నరు.. ‘దేశ చరిత్రలో ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్, వాజ్‌పేయి, ఇందిరాగాంధీ, చంద్రబాబు ఎవరూ కూడా గెలువలే. మీరు కూడా అడ్డం పడుతరని చాలామంది అన్నరు. కానీ తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాసిన్రు. లక్షల మంది పార్టీ కార్యకర్తలు కష్టపడితే 88 మంది ఎమ్మెల్యేలం గెలిచినం. ఈ గెలుపు టీఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ నేతలు బస్వరాజు సారయ్య, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. గుంపుగా వచ్చి గల్లంతయ్యారు దేశంలోని చిన్నాపెద్ద నేతలంతా గుంపుగా వచ్చి గల్లంతయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఒక్కడిగా నిలబడ్డారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిం డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమంపై ఉన్న విశ్వాసమే ఆ ధీమాకు కారణమన్నారు. దేశంలోని ఉద్దండులంతా ఒక్కటిగా వచ్చినా ప్రజలు కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్కు 75% స్థానాలతో మెజార్టీని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలసి వందల సంఖ్యలో తరలివచ్చినా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు కలసి సభలు పెట్టి తమపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. ఆరోగ్యం బాగాలేని సోనియాను కూడా ప్రచారానికి రప్పించి ఆమెను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీగా వినోద్‌ను గెలిపించుకుందాం ‘మన ఎంపీ వినోద్‌కుమార్ అంత మంచి మనిషి మనకు దొరకడు. సిరిసిల్ల, కరీంనగర్ నుంచి పార్లమెంట్ దాకా ఏ పని కావాలో చేసుకొస్తడు. తన స్వార్థం కోసం కాకుండా నియోజకవర్గం కోసం పనిచేస్తడు. ఈ ఎన్నికల తర్వాత వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలే కాబట్టి మళ్లీ వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించుకోవడానికి మనమంతా కృషిచేయాలే’అని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ వినోద్‌కుమారే పోటీ చేయనున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అన్నీ హిందూ కుటుంబాలే.. ఏకగ్రీవంగా ముస్లిం సర్పంచ్
బద్వేరా/జమ్మూ,కశ్మీర్ : కుల, మతాల కుమ్ములాటలతో భారతావని ఓ పక్క ‘రాజకీయాల’ల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంటే.. కశ్మీర్‌లోని ఓ గ్రామం మాత్రం అందరికీ కనువిప్పు కలిగే పనిచేసింది. గ్రామంలో ఉన్న ఒకేఒక్క ముస్లిం కుటుంబానికి అధికారాన్నిచ్చింది. కులం, మతం కాదు ముఖ్యం.. పనిచేసే తత్వం అని ప్రపంచానికి తెలియజెప్పింది. వివరాలు.. కశ్మీర్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బేలన్-కరోఠి గ్రామం చౌదరీ మహ్మద్ హుస్సేన్ (54) అనే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 450 కుటుంబాలు గల ఈ గ్రామంలో హుస్సేన్ది మాత్రమే ముస్లిం కుటుంబం. మిగతా వారంతా హిందువులే. తమ మధ్య హిందూ ముస్లిం భేదాలు లేవని ప్రపంచానికి తెలిపేందుకు, హుస్సేన్ కుటుంబం ఒంటరిది కాదని దన్నుగా నిలిచేందుకే ఆయన్ని తమ గ్రామ పెద్దగా ఎన్నుకున్నామని అక్కడి ప్రజలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తద్వారా ‘భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం’ అనే మాటలకు నిజమైన అర్థం చెప్పారు. హుస్సేన్‌కు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులున్నారు. గ్రామం మొత్తం హిందువులే నివసిస్తున్నా హుస్సేన్ కుటుంబం మాత్రం ఎప్పుడూ వివక్షకు గురికాలేదు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ తలలో నాలుకలా మెలిగే హుస్సేన్ అంటే గ్రామస్తులకు ఎంతో గౌరవం. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని మతసామరస్యాన్ని చాటారు. ‘ఈ గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’అని హుస్సేన్ ఉద్వేగంగా చెప్పారు. -
ఏదీ నజరానా!
⇒ ‘ఏకగ్రీవ’ సర్పంచులను మరిచిన సర్కారు ⇒ ప్రొత్సాహకాలను పట్టించుకోని వైనం ⇒ రెండేళ్లుగా 74 పంచాయతీల ఎదురుచూపు ⇒ రూ.6.11 కోట్ల విడుదలపై నిర్లక్ష్యం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాస్వామ్య భారతావనిలో తొలిదశ పాలనా వ్యవస్థ పంచాయతీలదే. ఇందులో గ్రామీణుల బాగోగులు, ప్రగ తి పనులు, మౌలిక సదుపాయల కల్పన తదితర బాధ్య తలన్నింటినీ నెరవేర్చాల్సింది సర్పంచులే. అందుకే పల్లెలను రాజకీయ సంగ్రామానికి దూరంగా ఉంచేందుకు సర్కా రు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించింది. ఈ క్రమంలో పలువురు సర్పంచులు పోటీ లేకుండానే పల్లె పీఠంపై కూర్చున్నారు. వారు పదవులు చేపట్టి రెం డేళ్లు గడుస్తున్నా నేటికీ, నజరానాలు రాకపోవడంతో వారు నైరాశ్యం లో మునిగిపోయారు. నజరానా వస్తుందని, గ్రామాలలో మౌలిక వసతులు కల్పించవచ్చని ఆశించినా ఫలితం లే కుండాపోరుుంది. అభివృద్ధికి సంబంధించి ప్రజలకు జవా బు చెప్పలేని స్థితిలో పడిపోయారు. మూడు దశలుగా ఎన్నికలు జిల్లాలో 718 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి 2013 జూలై 23,27,31 తేదీలలో ఎన్నికలు జరిగాయి. మూడు డివిజన్ల పరిధిలో ఎలాంటి ఘర్షణలు, పోటీ లేకుండా 74 గ్రామ పంచాయతీలకు ప్రజలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో 38 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి డివిజన్లో 22, బోధన్ డివిజన్లో 14 పంచాయతీలు ఎలాంటి ఉత్కంఠ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీలన్నింటికీ జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏకగ్రీవ సర్పంచుల ఆశలు నీరుగారుతున్నారుు. పల్లెల అభివృద్ధి కోసం వస్తున్న ఆర్థిక సంఘం నిధులను ఒక పక్క విద్యుత్ బకాయిల పేరుతో లాక్కుంటూ, ఇంకోపక్క ప్రోత్సహకాలు విడుదల చేయక తాత్సారం చేస్తున్నారని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సాధిస్తాయనే పోటీ లేకుండా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే, ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వాలు ‘ఏకగ్రీవాలను’ ప్రోత్సహించాయి. ప్రభుత్వం ఇ చ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు పలుచోట్ల సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే, మన జిల్లాలోనే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఏకగ్రీవంగా ఎన్నికైనవాటిలో మైనర్ గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీకి రూ. 10 ల క్షలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నజరానాలు పెంచింది. మైనర్ పంచాయతీలకు రూ.7 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో ఏకగ్రీవమైన మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 31 మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 3.10 కోట్లు, 43 మైనర్ పంచాయతీలకు రూ.3.01 లక్షల నజరానా రావాలి. ఇంకా ఎన్నాళ్లు? ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహం ఇవ్వడాన్ని ప్రభుత్వం మరచిపోయింది. సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ప్రోత్సాహం ఊసే లేదు. నిధులు లేక గ్రామపంచాయతీలు నిర్వీర్యమైపోతున్నాయి. కనీసం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహమైనా ఆసరాగా ఉంటుందంటే అది కూడా రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రోత్సాహకాలను విడుదల చేయాలి. -గడ్డం నర్సారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి(ఎన్)