హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లె గ్రామ పంచాయతీ
సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పల్లె ప్రజలు స్పందించారు. ఏకగ్రీవమైతే ఇప్పటికే అమలవుతున్న పథకాలతోపాటు మరికొన్ని ప్రోత్సాహాకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాలను ఓటర్లు గమనంలోకి తీసుకున్నారు. ప్రోత్సాహకం మొత్తం గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎన్నుకుని స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో నాలుగున్నర నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామపంచాయతీలకు గాను జిల్లా వ్యాప్తంగా 16 మైనర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కోసం ఎదురుచూస్తున్నారు.
నిధులు లేక పరిష్కారం కాని సమస్యలు...
గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులు ఉండాలి. ఆదాయం మార్గం ఉంటేనే నిధుల కొరత ఉండదు. మైనర్ పంచాయతీల విషయానికొస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండడం, ఆదాయ వనరులు లేకపోవడం వంటిది చిన్న పంచాయతీల పాలిట శాపంగా మారుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందుతున్న నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండడంతో చిన్నగ్రామాలకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. కనీసం వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లదీయడమే అవుతుంది.
ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే ఏకగ్రీవమే ఉత్తమమని గుర్తించిన గ్రామస్తులు వాటి ద్వారా వచ్చే ప్రోత్సాహాకానికి ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవమైతే పది లక్షలతోపాటు మరో రూ.5 లక్షలు తమ కోటానుంచి ఇస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆ మాటలను నమ్మి ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరి నాలుగున్నర నెలలైంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహాకాలను విడుదల చేస్తే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పనులు చేపట్టడానికి వీలవుతుంది. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు, చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం గతంలో మాదిరిగా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజలు కోరుతున్నారు.
నిధులు విడుదల చేయాలి
ఏకగ్రీవ పంచాయతీలకు నేటికీ ప్రోత్సాహక నిధులు మంజూరు కాలేదు. గ్రామంలో పలు సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో సమస్యలు పరిష్కరించడం ఇబ్బందిగా ఉంది. ప్రోత్సాహాక నిధులను త్వరగా మంజూరు చేస్తే గ్రామంలోని కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడుతుంది. నిధులు త్వరితగతిన మంజూరు చేయాలి.
–అబ్బిడి పద్మరవీందర్‌రెడ్డి, వెన్నంపల్లి సర్పంచ్, సైదాపూర్ మండలం
Comments
Please login to add a commentAdd a comment