Village problems
-
ఆ ఊరికి నీరొచ్చింది
నిర్మల్: తమ ఊరి సమస్యల పరిష్కారంకోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి ఏకంగా 75 కి.మీ. పాదయాత్ర చేసిన చాకిరేవు గ్రామస్తులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, రెండు బోర్లు వేయించడం, మిగతా సమస్యలను తీరుస్తామని అధికారులు చెప్పడంతో శనివారం వారు ఇంటిబాట పట్టారు. నీళ్లు, రోడ్డు, కరెంటు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ పెంబి మండలంలోని చాకిరేవు గ్రామస్తులు గత మంగళవారం కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారు అక్కడే టెంట్ వేసుకుని ఉన్నారు. గోస వినిపించిన ‘సాక్షి’ ఈనెల 16న ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా..’శీర్షికన ‘సాక్షి’చాకిరేవు వాసుల గోసను వినిపించింది. అలాగే ట్విట్టర్లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్‌అలీ, డీఎఫ్ఓ వికాస్మీనాల దృష్టికి తీసుకెళ్లింది. ‘సాక్షి’కథనంపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వెంటనే చాకిరేవు వాసులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా వెళ్లి.. ఆదివాసీల పాదయాత్ర, ‘సాక్షి’కథనం, మంత్రుల ఆదేశాలతో కలెక్టర్ ముషారఫ్‌అలీ ఈనెల 16న అధికారుల బృందాన్ని వెంటతీసుకుని స్వయంగా చాకిరేవు వెళ్లారు. అక్కడ ఉన్న గ్రామస్తులతో ముచ్చటించారు. పునరావాసానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో అక్కడే తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నమాట ప్రకారం మరుసటిరోజు మూడు బోర్లు వేయించగా, రెండింటిలో నీళ్లు పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంటిబాట.. కలెక్టర్ తమ ఊరికి వచ్చి వెళ్లిన తర్వాత నుంచి అధికారులు వస్తుండటం.. సమస్యలు తీర్చేదిశగా అడుగులు పడుతుండటంతో కలెక్టరేట్ ఎదుట టెంట్లో దీక్ష చేస్తున్న చాకిరేవు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సీఐ శ్రీనివాస్ శనివారం వారితో మాట్లాడారు. సమస్యలు తీరుతాయని, మీరు ఇక్కడి నుంచి ఊరికి వెళ్లాలని నచ్చజెప్పారు. దీనికి వారు ఒప్పుకోవడంతో భోజనాలు పెట్టించి, వాహనంలో చాకిరేవుకు పంపించారు. తీరకపోతే మళ్లొస్తం.. మా ఊరికి కలెక్టర్ సారు పోయి వచ్చినప్పటి నుంచి కొంచెం సమస్యలు తీరుతాయన్న నమ్మకం అచ్చింది. ఇప్పటికైతే బోర్లు ఏసిండ్రట. రోడ్డు, కరెంటు సమస్యలు కూడా తీర్చాలె. లేకపోతే మళ్లా.. నిర్మల్ దాకా అస్తం. మా కష్టాలు తీరేదాకా.. ఈడనే ఉంటం. – నిర్మల, చాకిరేవు -
గ్రామ దేవత
చెడును సంహరించి, మంచిని సంరక్షించే వారు దైవంతో సమానం అయిపోతారు. జబ్నా తన ఊరిలోని అనేక చెడులను రూపుమాపి, ఊరిని కాపాడుతోంది. అందుకే ఆమె స్థానికులకు గ్రామ దేవత అవతారంలా కనిపిస్తోంది. జబ్నా చౌహాన్.. పాతికేళ్ల యువతి. ఇరవై రెండేళ్లకే సర్పంచ్‌గా ఎన్నికైంది. అంతకంటే ముందు జర్నలిస్టుగా తన ఊరిలో రాజ్యమేలుతున్న సామాజిక సమస్యలను కెమెరాలో కంటితో చూసింది. ఇంకా వెనక్కి వెళ్తే... కాలేజీ ముఖం చూడకనే చదువు మానేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. మా ఊర్లో డిగ్రీ కాలేజ్ ఉండి ఉంటే... ఈ పరిస్థితి రాకపోయేది కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు తన ఊరికి డిగ్రీ కాలేజ్ కోసం అడుగులు వేస్తోంది.జబ్నా చౌహాన్‌ది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, మండి జిల్లాలోని థార్జున్ గ్రామం. జబ్నా తండ్రి శ్రీహరియా. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. ఆర్థిక కారణాల వల్ల పన్నెండో తరగతి తర్వాత ‘ఇకపై చదివించడం తన వల్ల కాద’ని తేల్చేశాడు హరియా. జబ్నతోపాటు మరో అమ్మాయిని, చూపు సరిలేని కొడుకును పోషించాల్సిన బాధ్యత అతడితో ఆ మాట చెప్పించింది. ఆ సమయంలో చిన్నాన్న సహాయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె ఖర్చులకు తగినంత డబ్బు సంపాదించుకోవడానికి స్థానిక వార్తా పత్రిక ఆఫీస్‌లో పార్ట్ టైమ్ జాబ్ ఇప్పించాడు ఆమె చిన్నాన్న. దాంతో జబ్న స్థానిక సమస్యలను తెలుసుకోవడం కోసం మండి జిల్లాలో ప్రతి మూలకు ప్రయాణించగలిగింది. ఆ అనుభవంతో స్థానిక ‘ఓరియెంటల్ న్యూస్‌చానెల్’ లో యాంకర్, రిపోర్టర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగం జబ్న ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. సామాజిక బాధ్యత కలిగిన రిపోర్టర్‌గా ఆమె మొదటగా తనకు బాగా పరిచయమున్న తన గ్రామ సమస్యల మీదనే ఫోకస్ పెట్టింది. థార్జున్ గ్రామం లోని అట్టడుగు వర్గాల జీవితాలను చిత్రీకరించింది. లింగ వివక్ష, మహిళల సమస్యలు, సామాజిక దురాగతాల మీద కథనాలను ప్రసారం చేసింది. ఆమె ప్రయత్నం ఎంతగా సఫలమైందంటే... అంత వరకు అలాంటి సమస్యలు కరడుగట్టిపోయి ఉన్నాయన్న సంగతి కూడా తెలియని స్థితిలో ఉన్న అధికారులకు చేరాయి ఆమె కథనాలు. యంత్రాంగం ఆ సమస్యల పరిష్కారం కోసం పని చేయడం మొదలైంది. అప్పుడు వచ్చాయి ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు. గ్రామస్థులు ఆమెను సర్పంచ్ పదవికి పోటీ చేయవలసిందిగా కోరారు. అలా 2016, జనవరి ఒకటో తేదీన, ఇరవై రెండేళ్ల జబ్న థార్జున్ గ్రామానికి సర్పంచ్ అయింది. తొలి సమావేశం మద్యం పైనే జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి ఆమెకు గ్రామ సమస్యల మీద అవగాహన ఉండడంతో సర్పంచ్ అయిన వెంటనే మద్యపానం మీద దృష్టి పెట్టింది. అప్పటికి ఆ ఊరి మగవాళ్లలో ఎక్కువ మంది మద్యానికి బానిసలై ఉన్నారు. పేదింటి ఆడవాళ్లు పొలాల్లో, ఉపాధి హామీ పథకాలలో పనులు చేస్తున్నారు. మగవాళ్లు సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆడవాళ్లు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుని మద్యం దుకాణాలకు ధారపోస్తున్నారు. అందుకే... ఆమె తొలి పంచాయతీ సమావేశంలోనే పంచాయతీ సభ్యుల ముందు మద్యపాన నిషేధం ఆలోచనను ప్రతిపాదించింది. మద్యంతోపాటు మద్యం వల్ల ఎదురవుతున్న అనుబంధ సమస్యల వల్లనే గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని కూడా వివరించింది. మొదటి సమావేశంలో ఆమెకు మిగిలిన సభ్యుల మద్దతు లభించలేదు. యువ పాలన జబ్న తన ప్రయత్నాలను వదల్లేదు. గ్రామంలో ఉన్న ఐదు మహిళా మండళ్లను సంప్రదించింది. యువతను సమీకరించింది. వాళ్ల ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. ఆ గ్రూపుల్లో నిరంతరం గ్రామాన్ని సంస్కరించడానికి చేపట్టాల్సిన పనుల గురించే చర్చ సాగేది. వారందరితోపాటు ఆమె డిప్యూటీ కమిషనర్‌ను కలిసి మెమొరాండం సమర్పించి తమ గ్రామంలో ఉన్న మద్యం దుకాణాలను మూసి వేయించమని కోరింది. పొరుగున ఉన్న గ్రామాల్లో మద్యం ఏరులై పారుతూ ఉన్నప్పుడు తమ గ్రామంలో మాత్రమే మద్యం దుకాణాలను మూసివేస్తే సరిపోదని ఆమెకు తెలుసు. సమీప గ్రామాల సర్పంచ్‌లను కలిసి ఈ ఉద్యమంలో సహకరించవలసిందిగా కోరిందామె. ఆమె ప్రయత్నాలను తెలుసుకున్న ‘సుందర్ నగర్స్ సామాజిక్ జాగరణ్ మంచ్’ జబ్నా చౌహాన్‌ను మద్య నిషేధ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని ప్రభుత్వాన్ని కోరింది. అలా ఆమె గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని మద్యపానం వల్ల సమాజం ఎదుర్కొనే కష్టనష్టాల గురించి విపులంగా ప్రసంగించింది. ఆ తర్వాతనే సొంత గ్రామంలో ఆమెను వ్యతిరేకించిన వాళ్లు కూడా ఆమె ఉద్దేశాన్ని గౌరవిస్తూ, ఆమె మార్గాన్ని అనుసరించారు. అలా ఆమె 2017, మార్చి ఒకటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు జరగకూడదని, ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. మద్యానికి బానిసలైన మగవాళ్లు ఆమెను తిట్టరాని తిట్లు తిట్టారు. కొందరైతే దాడికి కూడా దిగారు. వాళ్లందరికీ ఆమె చెప్పిన మాట ఒక్కటే... ‘‘మీరంతా మద్యం లేకుండా ఉండలేరనే నిజాన్ని అంగీకరిస్తున్నాను. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మీరు సృష్టించే న్యూసెన్స్‌ను గ్రామస్థులు ఎందుకు భరించాలి? వాళ్లందరి ఇబ్బందిని అరికట్టడం నా బాధ్యత’’ అని స్థిరంగా చెప్పింది. దీంతోపాటు ఆమె వయసు మళ్లిన వాళ్ల దగ్గర కూర్చుని పొగాకుతో సంభవించే అనారోగ్యాలను పూసగుచ్చినట్లు వివరించేది. చివరికి మద్యం, పొగాకు వినియోగాన్ని పూర్తిగా అరికట్టగలిగింది. గ్రామసభ పెట్టి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ ఉంటుందనే కఠిన నిబంధన కూడా విధించింది. ఆఖరుకి పెళ్లి వంటి వేడుకలకు కూడా మినహాయింపు లేదు. స్వచ్ థార్జున్ జబ్న స్వచ్ భారత్ జాతీయ పథకాన్ని నూటికి నూరు పాళ్లు వినియోగించుకుంది. మహిళల వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. టాయిలెట్లు కట్టించుకోవడానికి ఊరంతటినీ ప్రభావితం చేసింది. థార్జున్ గ్రామం స్వచ్భారత్లో జిల్లా స్థాయిలో ముందు నిలవడంతో ‘బెస్ట్ ప్రధాన్’ అవార్డు అందుకుంది జబ్న. గవర్నర్ ఆచార్యదేవ్ విరాట్ నుంచి సర్పంచ్ జబ్నకు ప్రశంసలు అందాయి. అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆమెను అభినందించి ‘బెస్ట్ సర్పంచ్’ అవార్డు ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రత్యేక పురస్కారం లభించిందామెకి. అక్షయ్ కుమార్ ‘టాయిలెట్– ఏక్ ప్రేమ్‌కథ’ సినిమా ప్రమోషన్లో భాగంగా జబ్నను సత్కారం చేసి, ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక ఇప్పుడామె టార్గెట్ తమ గ్రామంలో డిగ్రీ కాలేజ్ పెట్టించడం, మహిళల కోసం ఒక ఎన్జీవో స్థాపించి వారి ఆదాయ మార్గాలను పెంచడం, మహిళా సాధికారత కోసం పని చేయడం. నాన్న మీద ప్రేమ జబ్న తాను ఎదుర్కొన్న గడ్డు స్థితిని తలుచుకుంటూ ‘‘మా నాన్నకు ముగ్గురు పిల్లల్నీ బాగా చదివించాలనే కోరిక ఉండేది. మా ఊరిలో డిగ్రీ కాలేజ్ ఉండి ఉంటే మమ్మల్ని ఎలాగోలా చదివించేవాడే. డిగ్రీకి జిల్లా కేంద్రం ‘మండి’కి వెళ్లాలి. హాస్టల్ ఫీజులు కట్టే స్థోమత లేని నిస్సహాయ స్థితి ఆయనది’’ అని మాత్రమే అంటుంది తప్ప తండ్రిని మీద మాట పడనివ్వదు. తండ్రి తన కూతుళ్ల కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆడపిల్లలు సాధారణంగా తప్పుపట్టరు. తండ్రి గుండెలోతులను తాకి చూసినట్లు అర్థం చేసుకుంటారు. తండ్రి ప్రేమను గౌరవిస్తారు. ఎంతమందిలో అయినా తండ్రి నిర్ణయాన్ని సమర్థించుకుంటారు. ఇంకా ఆమె ‘‘ఊళ్లో వాళ్లు, బంధువులు కూడా మొదట్లో మా నాన్న మీద చాలా ఒత్తిడి తెచ్చారు. ఉన్న కొడుకు చూపు సరిలేని వాడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసెయ్యమన్నారు. అయితే మా అమ్మానాన్నలు ఆర్థికంగా పేదవారే కానీ, వారికి భావదారిద్య్రం లేదు. వారి ఆలోచనలెప్పుడూ అభ్యుదయం వైపే సాగేవి’’ అని చెప్పింది. – వాకా మంజులారెడ్డి ►‘‘సముద్రాన్ని శుభ్రం చేయాలనే తలంపు నీలో ఉన్నప్పుడు... సముద్రంలో దూకాల్సిందే. అంతేతప్ప, తీరాన కూర్చుని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆ అవకాశం ఎప్పటికీ మన దగ్గరకు రాదు’’ ►‘వయసెంత అనేది విషయం కాదు, ఎక్కడ నుంచి వచ్చారనేది కూడా ముఖ్యం కాదు, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారనేది కూడా ప్రధానం కాదు, నీ శక్తి సామర్థ్యాలే నీ గుర్తింపు, నీవు సాధించిన విజయాలే నీకు గౌరవం’ -
అప్పుల పాలన
సాక్షి, మరికల్(మహాబూబ్‌నగర్) : సర్పంచ్‌లుగా విజయం సాధించి 7 నెలలు అవుతుంది. అయినా ఏం ప్రయోజనం.. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చెక్ పవర్ పేరుతో ఐదు నెలలు కాలయాపన చేశారు. దీంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తోచక సొంత నిధులు, అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామ పాలన కత్తిమీద సాముల మారింది. నూతన పంచాయతీ చట్టం ప్రకారం ఎట్టకేలకు ఉపసర్పంచ్‌తో కలిపి సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తునట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కూడా సర్పంచ్‌లు అసంతృప్తిగా ఉన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ వద్దంటూ ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. అప్పులు తెచ్చి సమస్యల పరిష్కారం మరికల్, ధన్వాడ మండల్లాలో కలిపి 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించడంలో అనేక నిబంధనలు పెట్టడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు, పైపులైన్ లీకేజీలు, డ్రెయినేజీల పూడికతీత, రహదారుల మరమ్మతులు, స్వచ్ఛభారత్ కింద రహదారులను శుభ్రం చేయించుట, తాగునీటి మోటర్లు కాలిపొతే మరమ్మతులు, విధిదీపాలు వేయించుట తదితర సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గ్రామాలను బట్టి ఒక్కో సర్పంచ్ రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు పెట్టారు. కనీసం ఈ సమస్యలను కూడా పరిష్కరించకుంటే ప్రజల నుంచి చీవాట్లు తప్పవని కొందరు సర్పంచులు అప్పులు తెచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. రూ.3లక్షలు ఖర్చు చేశాను.. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయాన్ని ఎటూ తేల్చకపోవడంతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.3లక్షలు ఖర్చు చేయడం జరిగింది. జాయింట్ చెక్ పవర్ కారణంగా విబేధాలు తలెత్తే అవకాశముంది. ఇంతకుముందు మాదిరిగానే కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పిస్తే బాగుంటుంది. – పూణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ అప్పులు చేశాను.. గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే పెరుకుపోతున్నాయి. తన వద్ద కూడా డబ్బులు లేవు. దీంతో సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో రూ.2లక్షలు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. – రాజు, సర్పంచ్, రాకొండ -
నజరానా ఏదీ..
సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పల్లె ప్రజలు స్పందించారు. ఏకగ్రీవమైతే ఇప్పటికే అమలవుతున్న పథకాలతోపాటు మరికొన్ని ప్రోత్సాహాకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాలను ఓటర్లు గమనంలోకి తీసుకున్నారు. ప్రోత్సాహకం మొత్తం గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎన్నుకుని స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో నాలుగున్నర నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామపంచాయతీలకు గాను జిల్లా వ్యాప్తంగా 16 మైనర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. నిధులు లేక పరిష్కారం కాని సమస్యలు... గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులు ఉండాలి. ఆదాయం మార్గం ఉంటేనే నిధుల కొరత ఉండదు. మైనర్ పంచాయతీల విషయానికొస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండడం, ఆదాయ వనరులు లేకపోవడం వంటిది చిన్న పంచాయతీల పాలిట శాపంగా మారుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందుతున్న నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండడంతో చిన్నగ్రామాలకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. కనీసం వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లదీయడమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే ఏకగ్రీవమే ఉత్తమమని గుర్తించిన గ్రామస్తులు వాటి ద్వారా వచ్చే ప్రోత్సాహాకానికి ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవమైతే పది లక్షలతోపాటు మరో రూ.5 లక్షలు తమ కోటానుంచి ఇస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆ మాటలను నమ్మి ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరి నాలుగున్నర నెలలైంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహాకాలను విడుదల చేస్తే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పనులు చేపట్టడానికి వీలవుతుంది. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు, చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం గతంలో మాదిరిగా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజలు కోరుతున్నారు. నిధులు విడుదల చేయాలి ఏకగ్రీవ పంచాయతీలకు నేటికీ ప్రోత్సాహక నిధులు మంజూరు కాలేదు. గ్రామంలో పలు సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో సమస్యలు పరిష్కరించడం ఇబ్బందిగా ఉంది. ప్రోత్సాహాక నిధులను త్వరగా మంజూరు చేస్తే గ్రామంలోని కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడుతుంది. నిధులు త్వరితగతిన మంజూరు చేయాలి. –అబ్బిడి పద్మరవీందర్రెడ్డి, వెన్నంపల్లి సర్పంచ్, సైదాపూర్ మండలం -
పల్లె సమస్యలపై గళం విప్పేనా?
సాక్షి, సూర్యాపేటరూరల్ : కొత్త సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేసేంతవరకూ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు సరిగ్గా లేక అధికారులు స క్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పంచా యతీల్లో ఎక్కడవేసిన గొంగళిఅక్కడే ఉంది. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం, అధికారులు సక్రమంగా విధుల్లో ఉండడంతో గ్రామాలు అభివృద్ధిబాట పట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న (బుధవారం) సూర్యాపేట మండల పరిషత్ సమావేశం జరుగనుంది. అయితే గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశం అసెంబ్లీ లాంటిది. బుధవారం సూర్యాపేట మండలపరిషత్ కార్యాలయంలో జరుగనున్న క్రమంలో తొలిసారిగా హాజరవుతున్న సర్పంచ్‌లు తమ గ్రామసమస్యలపై గళం విప్పుతారో లేదో చూడాల్సి ఉంది. నూతన సర్పంచ్‌లకు తొలి వేదిక మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లకు బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గానికి మండల సర్వసభ్య స మావేశం నూతన సర్పంచ్‌లకు అనుభవంగా మా రనుంది. సూర్యాపేట మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివి ధశాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎం పీటీసీలకు అవకాశం ఉంటుంది. బుధవారం సూ ర్యాపేట మండలపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు సర్వస భ్య సమావేశం నిర్వహించనున్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు వట్టె జానయ్యయాదవ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధశాఖల అధికా రులు, మండల ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం.. బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలాఉంటే ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం మాత్రం ముగియనుంది. అయితే మే నెలలో ఎన్నికలు నిర్వహించకుంటే ఎంపీటీసీలు కూడా మరో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహనకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి సమావేశంలో తమ గళమెత్తే దిశగా సన్నద్ధమవుతున్నారు. చర్చకు రానున్న ఎన్నో అంశాలు.. బుధవారం జరిగే సమావేశంలో 19అంశాలు ప్రధానంగా చర్చించుటకు మండల పరిషత్ అధ్యక్షుడు అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పౌరసరఫరాలశాఖ, గ్రామీణ విద్యుత్, వైద్యఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధిహామీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ, రవాణాశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్‌కాకతీయ, వసతి గృహాలు, రోడ్డు భవనాలు వంటి శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలు సభలో చర్చకు వస్తాయి. అయితే వ్యవసాయ అధికారులు రైతులకు సాగులో సూచనలు ఇస్తున్నారా లేదా..అదేవిధంగా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా లేదా అనే విషయాల తో పాటు అనేక విషయాలు చర్చకు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నారా..కూలీలు ఉపాధి సద్వినియోగం చేసుకుంటున్నారా అనే అంశం చర్చకు రావాల్సి ఉంది. గతేడాది గ్రామాల్లో చేసిన ఉపాధి పనులు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పశుపోషణ ద్వారా పాడిగెదేలు, గొర్రెల పెంపకం తదితర కార్యక్రమాలతో పాటు వివిధ శాఖలైనా ప్రాథమిక వైద్యం పనితీరు, వైద్యసేవలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలలో విద్యాబోధన, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరిగ్గా పోషకాహారం పంపిణీ చేస్తున్నారా..రేషన్ పంపిణీ గ్రామాల్లో సక్రమంగా అవుతుం దా..అనే అంశాలపై నూతన సర్పంచ్‌లకు సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో తమ గ్రామపరిధిలో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తేనే సమస్యలు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంది. ఈ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్నారు. సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటారో.. లేదో వేచి చూడాల్సి ఉంది. -
చింతలపాలెంపై ఎమ్మెల్యే శీతకన్ను!
సాక్షి, చింతలపాలెం (ప్రకాశం): పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత చింతలపాలెం గ్రామానికి వర్తిస్తుంది. ఓట్ల పండగ వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ గ్రామం గుర్తుకు రాదు. సమస్యలతో నేడు ఆ గ్రామస్తులు సహవాసం చేస్తున్నారు. ఇంకొల్లు, పావులూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ గ్రామం ఉంది. దీంతో సమస్యలను పరిష్కరించటంలో రెండు పంచాయతీలు శ్రద్ధ చూపటం లేదు. దీంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ప్రధాన సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణం సగంలో ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేకుండా పోయింది. కనీసం విద్యార్థులు బడికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. గ్రామం మొత్తం పశుపోషణపై ఆధార పడి జీవిస్తున్నారు. కనీసం పశువులకు ఏదైనా బాగోలేక పోతే ఇంకొల్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రక్షిత మంచి నీటి పథకం మూలన పడిపోయింది. గ్రామంలో పెద్ద చెరువు ఉన్నప్పటికీ రక్షిత నీరు గ్రామస్తులకు అందించిన పాపాన పోలేదు. కనీసం రేషన్ దుకాణానికి వెళ్లాలంటే ఇంకొల్లుకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటే ఇంకొల్లులోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో రెండు సిమెంటు రోడ్లు వేశారు. కాలువలు ఏర్పాటు చేయలేదు. లింకు రోడ్లు ధ్వంసమయ్యాయి. డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండటంతో దోమలు కాటేస్తున్నాయి. గ్రామంలో రెండు తాగునీటి బావులు ఉన్నాయి. బావుల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంటుందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామం చింతలపాలెం జనాభా 150 కుటుంబాలు 35 ఓటర్లు 130 ప్రాథమిక పాఠశాల 1 అంగన్వాడీ సెంటర్ 1 రేషన్ దుకాణాలు లేవు చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు వ్యవసాయం చెరువు ఆయకట్టు - 400 ఎకరాలు ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తారు గ్రామంలో ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తున్నారు. చిన్న గ్రామంలో ఓటర్ల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామానికి రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. పశుపోషణపై గ్రామంలో ఆధారపడి జీవిస్తున్నారు. బయటకు వెళ్లి బతకాలంటే జరగని పరిస్థితి కాదు. – పులికం రామకృష్ణారెడ్డి, యువకుడు గ్రామంలో సమస్యలు అలానే తిష్టవేసి ఉన్నాయి గ్రామంలో సమస్యలు అలానే ఉన్నాయి. చెరువులో మట్టి కావాల్సిన వారు అనుమతులు లేకుండా తోలు కుంటున్నారు. దీంతో రోడ్లు గుల్ల అవుతున్నాయి. రెండు గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం కావటమే మేము చేసుకున్న పాపం. అభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. – మాదాసు సాంబశివరావు, గ్రామస్తుడు -
మీ ఊరు గుర్తుందా.. ఎమ్మెల్యే సారు..?
సాక్షి, పెడన: బంటుమిల్లి మండలంలోని నాగేశ్వరరావుపేట పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వగ్రామం. నాగేశ్వరరావు పేట పంచాయతీ పరిధిలో లక్ష్మీనారాయణపురం, జానకీరామపురం, గార్లగుంట శివారు గ్రామాలున్నాయి. కాగిత వెంకట్రావు 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్‌గాను, అంచనాల కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గాను, చీఫ్‌విప్‌గా చేసిన ఘనతా ఉంది. ఇన్ని పదవులు అలంకరించినా స్వగ్రామైన పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. రహదార్ల నిర్మాణం, తాగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జానకీరామపురం, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పేదలకు ఇచ్చిన కాలనీల్లో అనర్హులు పట్టాలు దక్కించుకున్న ఆరోపణలున్నాయి. వారు స్థలాలను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట. ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికీ కుళాయి పథకం ఎమ్మెల్యే కాగిత స్వగ్రామంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు ఉన్నా కనీసం సొంత పంచాయతీ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పించ లేకపోయారు. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ఏర్పడిన సీసీ రోడ్లు తప్ప 20 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు బహు అరుదు అని గ్రామస్తులు వ్యంగ్యంగా చెబుతుంటారు. నాగేశ్వరరావుపేట గ్రామాన్ని ఆనుకుని బంటుమిల్లి ప్రధాన కాలువ ఉన్న గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు ఎక్కువగా ఊట బావులపైనే ఆధారపడుతున్నారు. గార్లగుంట దళితవాడ రోడ్డు నిర్మాణంలో నాణ్య ప్రమాణాలు మృగ్యమయ్యాయి. -
పవర్ లేని ప్రథమ పౌరులు
సాక్షి, ముత్తారం(మంథని): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. వాటిని పాలించే వారే ప్రథమ పౌరులు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. గ్రామాలను ప్రగతి బాటలో నడపాలని.. గత సర్పంచుల దీటుగా అభివృద్ధి చేయాలని ఎంతో ఉత్సాహంగా కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు కూడా పుష్కలంగా ఉండడంతో పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్నారు. నెల రోజులైనా ప్రభుత్వం చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తొచని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. మరోవైపు కొత్త పాలకవర్గం కొలువు తీరితే సమస్యలు పరిష్కారమవుతాయనుకున్న ప్రజలు నెలరోజులైనా ఏ పని ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు గత జనవరిలో మూడు విడతల్లో జరిగాయి. 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికలు చాలా గ్రామాల్లో రసవత్తరంగా జరిగాయి. గెలుస్తాం అనుకున్న వారు ఓటమి పాలయ్యారు. ఓడిపోతారు అనుకున్నవారు గెలిచారు. కొత్త సర్పంచులు ఫిబ్రవరి 2న సర్పంచులు ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచినాఇప్పటికీ అధికారాల బదలాయింపు జరుగలేదు. కొత్త సర్పంచులకు అన్ని గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 263 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పంచాయతీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలు లేకుండా చేయాలని, మొదటగా మహిళల వద్ద మెప్పులు పొందాలనుకున్న సర్పంచులకు నిరాశే మిగిలింది. ప్రజలు వివిధ సమస్యలపై కొత్త స ర్పంచులను ఆశ్రయిస్తున్నారు. చెక్‌పవర్ లేకపోవడంతో సర్పంచులు దిగాలు చెందుతున్నారు. పాత పంచాయతీలు - 228 కొత్త పంచాయతీలు - 65 ఎనిమిది నెలలుగా కుంటుపడిన అభివృద్ధి గత సర్పంచుల పదవీకాలం 2018, జూన్‌లో ము గిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తమ విధుల్లోనే బిజీగా ఉన్న అధికారులు పల్లెలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెళ్లినవా రు కూడా ఎలాంటి పనులు చేయించలేదు. కనీ సం డ్రెయినేజీలు కూడా శుభ్రం చేయించలేదు. ప్రత్యేక అధికారులు శాఖా పరమైన విధులకే పరి మితమయ్యారు తప్ప గ్రామాలపై దృష్టి సారించలేదు. పారిశుధ్య లోపం, దీర్ఘకాలిక సమస్యలు, ఎనిమిది నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు మొదలుకాక సతమతమైన ప్రజలు కొత్త పాలకులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త సర్పంచ్‌లు పాత సమస్యలు వెక్కిరిస్తున్నాయి. తాజాగా ఎండలు కూడా ముదురుతుండతో చెరువులు, కుంటలలో నీరు అడిగంటుతోంది. బోర్లు వట్టిపోతున్నా యి. చేతిపంపులు పనిచేయడంలేదు. పల్లెల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. సర్పంచులకు అధికారాల బదలాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మొదలు కాని స్వయం పాలన జిల్లాలో ప్రస్తుతం 263 పంచాయతీలు ఉన్నాయి. గతంలో 228 పంచాయతీలు మాత్రమే ఉండగా, జిల్లాల పునర్విభజన, నూతన పంచాయతీరాజ్ చ ట్టం ప్రకారం ప్రభుత్వం గత ఆగస్టులో 500పైగా జనాభా ఉన్న అనుబంధ గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో 65 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. పాత పంచాయతీలతోపాటు కొత్త పంచా యతీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. ఇన్ని రోజులు అనుబంధ గ్రామాలుగా, తండాలు గా ఉన్న పల్లెలో స్వయం పాలన మొదలవుతుం దని ప్రజలు సంతోషపడ్డారు. కానీ సర్పంచులకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో పాత పంచాయతీలతోపాటు కొత్త పంచాయతీల్లో ఇప్పటికీ పాలన మొదలు కాలేదనే చెప్పవచ్చు. పవర్‌పై స్పష్టత లేకనే.. కొత్త సర్పంచులకు చెక్ పవర్‌పై స్పష్టత రాలేదు. పంచాయతీల్లో ఏ పని చేసినా వాటికి సంబంధిం చి నిధులు విడుదల చేయడానికి గతంలో సర్పం చి, కార్యదర్శి పేరిట బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరు మీద ఉన్న ఖాతాలు మార్పిడి చేసి సబ్ ట్రేజరీ కార్యాలయం (ఎస్టీవో) కార్యాలయంలో నివేదించారు. ఇప్ప టి వరకు చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే స్పష్టత లేక పోవడంతో చెక్ పవర్ కేటాయింపులో జాప్యం జ రుగుతోందని సమాచారం. నూతన చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ ఖాతా ఉంటుందని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. తాగునీటి సమస్య మొదలైంది గ్రామాలలో ఇప్పటికే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. గతంలో వేసిన బోర్లు, చేతి పంపుల్లో నీరు అడుగంటి పోయింది. కొన్ని చేతి పంపులు మరమ్మతుకు నోచుకోవడంలేదు. విద్యుత్ మోటార్లు కూడా కాలిపోతున్నాయి. చెక్ పవర్ లేక ఏ పని చేయించలేకపోతున్నాం. –సముద్రాల రమేశ్, సర్పంచ్, ఖమ్మంపల్లి సమాధానం చెప్పలేకపోతున్నం గ్రామాలలో సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రామాలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకు పోయాయి. పారిశుధ్యం లోంపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నాం. –తూటి రజిత, సర్పంచ్, ముత్తారం -
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది
సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు. తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది... సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు. 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక... వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తాత్కాలికం ఇంకెన్నాళ్లు..?
సాక్షి, చెన్నూర్‌రూరల్: వాగులపై వంతెన లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు ఉప్పొంగినప్పుడల్లా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులో నడుచుకుంటూ దాటుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా ..ఇప్పటికీ వాగుపై వంతెన ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఈ పరిస్థితి మండలంలోని సుద్దాల, నారాయణపూర్, రాయిపేట గ్రామాల్లో నెలకొంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో వాగులు ఉన్నాయి. కానీ వీటిపై ఎలాంటి వంతెన లేదు. దీంతో సుద్దాల వాగుకు అవతలి వైపు ఉన్న తుర్కపల్లి, కమ్మరిపల్లి, దుబ్బపల్లి, గంగారం గ్రామాల ప్రజలకు ప్రతీ ఏటా వర్షాకాంలో వాగు దాటడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నారాయణపూర్, రాయిపేట గ్రామాల ప్రజలు కూడా వాగుపై వంతెన లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అత్యవర పరిస్థితుల్లో వాగు దాటలేని దుస్థితి నెలకొంది. కనీసం 108 కూడా పరిస్థితి ఉంది. వర్షాకాలంలో రైతులు ఎరువులకు, విత్తనాలకు, ఇతర పనులకు తప్పనిసరిగా మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. ఆ సమయంలో వాగులు ఉప్పొంగితే కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అలాగే చెన్నూర్‌లో కళాశాలల్లో చదువుకొనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హామీలు నెరవేరేనా..? సుద్దాల వాగుపై రోడ్డు డ్యాం నిర్మాణానికి నిధులను 2012లో మంజూరు చేస్తామన్నారు. కానీ ఇంత వరకు నిధులు కాలేదు. అలాగే ఇద్దరు మఖ్య నేతలు సుద్దాల వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని హామీలు ఇచ్చారు కానీ, ఇంత వరకు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. భక్తులకు తీవ్ర ఇబ్బంది సుద్దాల గ్రామంలో ఎంతో ప్రాచనీ చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతీ ఏటా శ్రీ రామనవమికి ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ వర్షాకాలంలో భక్తులు రాలేని దుస్ధితి నెలకొంది. వంతెన ఎప్పుడు నిర్మిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
సీఎం ఆదేశం.. కదలివచ్చిన అధికారగణం
వర్గల్(గజ్వేల్): ‘ఏమమ్మా.. ఊరిలో అంతా బాగేనా’అని బుధవారం తన ఫామ్‌హౌస్ మామిడి తోటలో పనికోసం వచ్చిన మహిళలను సీఎం కేసీఆర్ పలకరించారు. దానికి వారు తమ గ్రామ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘సారూ.. మా ఊరినిండా ఇబ్బందులే.. మోరీలు సరిగా తీస్తలేరు. నాలుగైదు రోజుల సంది నీళ్లు సక్కగొస్తలేవు. డబుల్ బెడ్రూం ఇండ్లు లేవు.. పింఛన్లు లేవు. చెక్కులు లేవు. మా గోస పట్టించుకునేటోళ్లు లేరు’అని ఫామ్‌హౌస్‌లో పనికోసం వెళ్లిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు మహిళలు సీఎం కేసీఆర్‌తో మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం అక్కడి నుంచే కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు గురువారం ఉదయం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, జిల్లా అధికారులతో కలసి పాతూరు గ్రామం చేరుకున్నారు. గ్రామ పాఠశాల వద్ద శాఖల వారీగా విజ్ఞాపనలు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి 500 వరకు ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. అందులో పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్‌కార్డులు వంటి సమస్యలపై వినతులు అందగా, కొన్నింటిని అక్కడికక్కడే విచా రణ జరిపి పరిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామంలో సమస్యల పరిష్కారానికి అధికారగణం వచ్చిందని, తక్షణమే పరిష్కరించగలిగే సమస్యలు పరిశీలించి, మిగతా సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. దీనిపై నివేదికను, ఇంకా పరిష్కారం కాని సమస్యలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని గ్రామస్తులకు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సమస్యలు నివేదిస్తూ గ్రామస్తుల విజ్ఞాపనల జోరు కొనసాగింది. అధికారులు గ్రామానికి వచ్చి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
మందమర్రిరూరల్ : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజక వర్గ ఇన్చార్జి సొత్కు సంజీవరావు అన్నారు. శుక్రవారం మండలంలోని తుర్కపల్లి, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అక్కల రమేశ్, నియోజక వర్గ ఓబీసీ చైర్మన్ గోళ్ల వీరయ్య, నాయకులు మేకల శ్రీనివాస్, కొప్పుల బాపు, షేక్ ఇబ్రహిం, శంకర్ గౌడ్, పైడి బానయ్య, ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికే గ్రామసభలు
ఝరాసంగం: గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకేందుకే గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు, సర్పంచ్‌లు తెలిపారు. మంగళవారం ఝరాసంగంతో పాటు క్రిష్ణాపూర్, చీలమామిడి, కోల్లూర్ గ్రామాలలో గ్రామపంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలను ఏర్పాటు చేశారు. ఈ సభలలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, విద్య తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్తులు, వార్డు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని బాధితులు కోరారు. సభలో పలు సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సభలలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రుద్రప్ప పాటిల్, మల్లన్న పాటిల్, తేజమ్మ ఉప సర్పంచ్‌లు హమీద్, మహబూబ్అలీ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, మహేశ్వర్‌రావు, వార్డుసభ్యులు నాగేశ్, బాబుకుమార్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆకాంక్ష గ్రామానికే ఆదర్శం
హర్యానా: హర్యానా రాష్ట్రం, గుర్గావ్ జిల్లా, బాజ్ఘెరా గ్రామానికి చెందిన ఆకాంక్ష ఇప్పుడు గ్రామానికే ఆదర్శంగా నిలిచింది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గ్రామంలో కనీస సౌకర్యాలు లేక పోవడం వల్ల ఎప్పుడూ చికాకు పడేది. రోజు వెళ్లే స్కూల్‌కు కూడా సరైన రోడ్డు లేక మురుగునీరు పారుతుంటే బాధ పడేది. ఓ రోజు ‘వియ్ ది పీపుల్’ అనే సంస్థ గ్రామంలో నిర్వహించిన ఓ పౌర కార్యక్రమానికి హాజరైంది. పౌరుల హక్కులే మిటో, బాధ్యతలు ఏమిటో, వారికి రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత ఏమిటో ఆ కార్యక్రమంలో అవగాహన చేసుకొంది. ఊరి సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకుంది. అందుకు తోటి విద్యార్థులను తోడు చేసుకుంది. ఊరికి రోడ్లు వేయడం ఎవరి బాధ్యతో టీచర్లను అడిగి తెలుసుకొంది. తోటి విద్యార్థులతో కలసి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సరైన రోడ్లు వేయాల్సిందిగా కోరింది. ఆ సర్పంచ్ పట్టించుకోలేదు. ఆమె మాట వినలేదు. గుర్గావ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. గ్రామ రోడ్ల దుస్థితి గురించి వివరించింది. రోడ్లు వేయడం పంచాయతీ బాధ్యతంటూ రోడ్లు వేయాల్సిందిగా పంచాయతీని కోరుతూ ఓ సిఫారసు లేఖను తీసుకొచ్చింది. మళ్లీ సర్పంచ్‌ను కలిసింది. అయినా సర్పంచ్ పట్టించుకోలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తోటి విద్యార్థులతో కలసి జిల్లా కలెక్టర్‌ను కలసుకుంది. విద్యార్థుల వివరించిన సమస్యలకు స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా రోడ్ల పనులను వెంటనే చేపట్టాల్సిందిగా గ్రామ పంచాయతీని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకొని వచ్చి మళ్లీ సర్పంచ్‌ను ఆకాంక్ష కలిసింది. కలెక్టర్ ఆదేశాలవడంతో సర్పంచ్ ఈసారి స్పందించారు. ఆగమేఘాల మీద రెండు నెలల్లో స్కూల్‌కు మంచి సిమ్మెంట్ రోడ్డు వేయించారు. ఆ తర్వాత గ్రామంలోని అన్ని రోడ్లను వేయించారు. ఊరు కళనే మారిపోయింది. ఎక్కడ మురుగు నీరు నిల్వకుండా కాల్వను కూడా తవ్వించడంతో గ్రామానికి కనీస సౌకర్యాలు సమకూరాయి. ఆకాక్ష కృషిని మెచ్చుకున్న గ్రామస్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని గ్రామానికి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడి సాధించుకుంటున్నారు. ‘మన హక్కులేమిటో తెలుసుకున్నాక నాకో విషయం అర్థమైంది. పనులు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిందించడంకన్నా మన పనులను ప్రభుత్వంతో చేయించుకోవాలని. ముందుగా మన బాధ్యతలను నిర్వహిస్తే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనం గళం విప్పితేనే ప్రభుత్వం కదులక తప్పదు’ అన్న సందేశం ఆకాంక్ష ఇస్తోంది. ఆకాంక్ష పోరాటంతో గ్రామ సర్పంచ్ వైఖరి కూడా మారింది.