నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న డీఎస్పీ ఉపేంద్రరెడ్డి
నిర్మల్: తమ ఊరి సమస్యల పరిష్కారంకోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి ఏకంగా 75 కి.మీ. పాదయాత్ర చేసిన చాకిరేవు గ్రామస్తులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, రెండు బోర్లు వేయించడం, మిగతా సమస్యలను తీరుస్తామని అధికారులు చెప్పడంతో శనివారం వారు ఇంటిబాట పట్టారు. నీళ్లు, రోడ్డు, కరెంటు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ పెంబి మండలంలోని చాకిరేవు గ్రామస్తులు గత మంగళవారం కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారు అక్కడే టెంట్ వేసుకుని ఉన్నారు.
గోస వినిపించిన ‘సాక్షి’
ఈనెల 16న ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా..’శీర్షికన ‘సాక్షి’చాకిరేవు వాసుల గోసను వినిపించింది. అలాగే ట్విట్టర్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్‌అలీ, డీఎఫ్‌ఓ వికాస్‌మీనాల దృష్టికి తీసుకెళ్లింది. ‘సాక్షి’కథనంపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వెంటనే చాకిరేవు వాసులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కలెక్టర్ స్వయంగా వెళ్లి..
ఆదివాసీల పాదయాత్ర, ‘సాక్షి’కథనం, మంత్రుల ఆదేశాలతో కలెక్టర్ ముషారఫ్‌అలీ ఈనెల 16న అధికారుల బృందాన్ని వెంటతీసుకుని స్వయంగా చాకిరేవు వెళ్లారు. అక్కడ ఉన్న గ్రామస్తులతో ముచ్చటించారు. పునరావాసానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో అక్కడే తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నమాట ప్రకారం మరుసటిరోజు మూడు బోర్లు వేయించగా, రెండింటిలో నీళ్లు పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఇంటిబాట..
కలెక్టర్ తమ ఊరికి వచ్చి వెళ్లిన తర్వాత నుంచి అధికారులు వస్తుండటం.. సమస్యలు తీర్చేదిశగా అడుగులు పడుతుండటంతో కలెక్టరేట్ ఎదుట టెంట్‌లో దీక్ష చేస్తున్న చాకిరేవు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సీఐ శ్రీనివాస్ శనివారం వారితో మాట్లాడారు. సమస్యలు తీరుతాయని, మీరు ఇక్కడి నుంచి ఊరికి వెళ్లాలని నచ్చజెప్పారు. దీనికి వారు ఒప్పుకోవడంతో భోజనాలు పెట్టించి, వాహనంలో చాకిరేవుకు పంపించారు.
తీరకపోతే మళ్లొస్తం..
మా ఊరికి కలెక్టర్ సారు పోయి వచ్చినప్పటి నుంచి కొంచెం సమస్యలు తీరుతాయన్న నమ్మకం అచ్చింది. ఇప్పటికైతే బోర్లు ఏసిండ్రట. రోడ్డు, కరెంటు సమస్యలు కూడా తీర్చాలె. లేకపోతే మళ్లా.. నిర్మల్ దాకా అస్తం. మా కష్టాలు తీరేదాకా.. ఈడనే ఉంటం.
– నిర్మల, చాకిరేవు
Comments
Please login to add a commentAdd a comment