Borewells
-
పాతాళానికి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలవక ముందే బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. యాసంగిలో బోరుబావుల కింద సాగుచేస్తున్న పంటలకు నీటి కోసం కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతుగా ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జనవరిలో 7.46 మీటర్ల లోతుకు తగ్గిపోయింది. అంటే నెల రోజుల్లోనే సుమారు 0.74 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోవడం ఆందోళన రేపుతోంది. వ్యవసాయం, ఇతర అవసరాలకుతోడు తాగునీటి కోసం వేసవిలో వినియోగం మరింత పెరగనుండటంతో.. రానున్న రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింతగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. 8 జిల్లాల్లో 10 మీటర్ల కంటే లోతున... రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 12.29 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా భూగర్భ జలశాఖ వర్గీకరించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 6 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్లలోపు భూగర్భ జలమట్టం ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నది కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే. మరో 9 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్య, మిగతా 8 జిల్లాల్లో 10 మీటర్లకుపైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇలా 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 18 జిల్లాల్లో భారీ క్షీణత గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో భారీ క్షీణత నమోదైంది. గత ఏడాది జనవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.72 మీటర్లుకాగా.. ఈ ఏడాది 7.46 మీటర్లకు తగ్గింది. రాష్ట్ర సగటు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా... కొన్ని జిల్లాల్లో బాగా పడిపోయాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 7.29 మీటర్ల నుంచి 10 మీటర్లలోతుకు అంటే.. 2.71 మీటర్ల మేర పడిపోవడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో.. రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 4 శాతమని అధికారులు చెబుతున్నారు. మరో 18 శాతం భూభాగంలో 10–15 మీటర్ల లోతున.. ఇంకో 54 శాతం ప్రాంతాల్లో 5–10 మీటర్లు లోతున, 25శాతం ప్రాంతాల్లో పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువ లోతున భూగర్భ జలమట్టాలు ఉన్నట్టు గుర్తించారు. 156 మండలాల్లో దశాబ్ద సగటుకన్నా తగ్గి.. గత దశాబ్ద కాల (2015–2024) సగటుతో పోల్చినప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలకుగాను 456 మండలాల్లో భూగర్భ జల మట్టాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిగతా 156 మండలాల్లో క్షీణించాయి. 53 మండలాల్లో 0.5 మీటర్ల మేర, 33 మండలాల్లో 1–2 మీటర్ల మేర, 37 మండలాల్లో 2 మీటర్లకుపైగా పడిపోయాయి. -
బోరు బావిలో పడ్డ బాలుడు
-
ఆ ఊరికి నీరొచ్చింది
నిర్మల్: తమ ఊరి సమస్యల పరిష్కారంకోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి ఏకంగా 75 కి.మీ. పాదయాత్ర చేసిన చాకిరేవు గ్రామస్తులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, రెండు బోర్లు వేయించడం, మిగతా సమస్యలను తీరుస్తామని అధికారులు చెప్పడంతో శనివారం వారు ఇంటిబాట పట్టారు. నీళ్లు, రోడ్డు, కరెంటు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ పెంబి మండలంలోని చాకిరేవు గ్రామస్తులు గత మంగళవారం కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారు అక్కడే టెంట్ వేసుకుని ఉన్నారు. గోస వినిపించిన ‘సాక్షి’ ఈనెల 16న ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా..’శీర్షికన ‘సాక్షి’చాకిరేవు వాసుల గోసను వినిపించింది. అలాగే ట్విట్టర్లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్‌అలీ, డీఎఫ్ఓ వికాస్మీనాల దృష్టికి తీసుకెళ్లింది. ‘సాక్షి’కథనంపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వెంటనే చాకిరేవు వాసులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా వెళ్లి.. ఆదివాసీల పాదయాత్ర, ‘సాక్షి’కథనం, మంత్రుల ఆదేశాలతో కలెక్టర్ ముషారఫ్‌అలీ ఈనెల 16న అధికారుల బృందాన్ని వెంటతీసుకుని స్వయంగా చాకిరేవు వెళ్లారు. అక్కడ ఉన్న గ్రామస్తులతో ముచ్చటించారు. పునరావాసానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో అక్కడే తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నమాట ప్రకారం మరుసటిరోజు మూడు బోర్లు వేయించగా, రెండింటిలో నీళ్లు పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంటిబాట.. కలెక్టర్ తమ ఊరికి వచ్చి వెళ్లిన తర్వాత నుంచి అధికారులు వస్తుండటం.. సమస్యలు తీర్చేదిశగా అడుగులు పడుతుండటంతో కలెక్టరేట్ ఎదుట టెంట్లో దీక్ష చేస్తున్న చాకిరేవు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సీఐ శ్రీనివాస్ శనివారం వారితో మాట్లాడారు. సమస్యలు తీరుతాయని, మీరు ఇక్కడి నుంచి ఊరికి వెళ్లాలని నచ్చజెప్పారు. దీనికి వారు ఒప్పుకోవడంతో భోజనాలు పెట్టించి, వాహనంలో చాకిరేవుకు పంపించారు. తీరకపోతే మళ్లొస్తం.. మా ఊరికి కలెక్టర్ సారు పోయి వచ్చినప్పటి నుంచి కొంచెం సమస్యలు తీరుతాయన్న నమ్మకం అచ్చింది. ఇప్పటికైతే బోర్లు ఏసిండ్రట. రోడ్డు, కరెంటు సమస్యలు కూడా తీర్చాలె. లేకపోతే మళ్లా.. నిర్మల్ దాకా అస్తం. మా కష్టాలు తీరేదాకా.. ఈడనే ఉంటం. – నిర్మల, చాకిరేవు -
ఎండిన భూముల్లో జలకళ
బుట్టాయగూడెం: సన్న, చిన్నకారు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బోర్ల పథకం సత్ఫలితాలిస్తోంది. గతంలో పూర్తిగా వర్షాధారం, చెరువు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉచితంగా బోర్లు వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతిలేని భూములు సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో వైఎస్సార్ జలకళ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పొలాల్లో బోర్లు వేసి పంటలకు సాగు నీరు అందేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్ జలకళ పథకంలో సుమారు 3,263 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు దరఖాస్తులు పరిశీలించి 3,075 బోర్లు మంజూరు చేశారు. వీటిలో ఇంతవరకూ రిగ్‌ల ద్వారా 516 బోర్లు విజయవంతంగా వేశారు. జిల్లాలోని 48 మండలాలు, 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 14 రిగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రిగ్‌ల ద్వారా రైతులకు ఉచితంగా బోర్లను వేసి సాగునీటి కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సుమారు రూ. 100 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. ఇంతవరకూ వర్షాధారం మీదే ఆధారపడిన రైతులు సొంతంగా ఉచితబోరు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో.. ఈ పథకంలో భాగంగా గిరిజన ప్రాంతంలో వేస్తున్న ఉచిత బోర్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉచితబోర్ల పథకం ద్వారా 1132 బోర్లు మంజూరు కాగా ఇంత వరకూ 210 బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత బోర్ల పథకంలో సాగునీటి సదుపాయం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో బోర్ల ఏర్పాటు కోసం ఇంతవరకూ రూ. 2.88 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. మంజూరైన బోర్ల పనులను గిరిజన మండలాల్లో వేగవంతం చేశారు. నిబంధనల ప్రకారమే ఉచిత బోర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారి భూముల్లో ఉచిత బోర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఇంతవరకూ 516 బోర్లు విజయవంతంగా వేసి రైతుల భూములకు సాగునీరు అందించే ఏర్పాటు చేశాం. మంజూరైన మిగిలిన బోర్ల పనులు అన్ని మండలాల్లో వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నాం. –డి.రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు పుష్కలంగా సాగునీరు ఉచిత బోర్ల పథకంలో ఇంతవరకూ వేసిన బోర్లు విజయవంతమయ్యాయి. గిరిజన ప్రాంతంలో సుమారు 210 బోర్లు వేశాం. రైతులు ఆయా భూముల్లో మొక్కజొన్న, వరి, ప్రత్తి, పొగాకు వంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరైన ప్రతీ రైతు భూమిలో బోర్లు వేసి సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. –కె. ప్రపుల్‌కుమార్, డ్వామా ఏపీడీ, జంగారెడ్డిగూడెం క్లస్టర్ సాగునీరు అందించడం ఆనందంగా ఉంది నేను 12 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. 3 ఎకరాల 15 సెంట్ల భూమిలో జీడిమామిడి సాగు చేస్తున్నాను. సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాను. ఉచిత బోర్ల పథకంలో బోరు వేయడంతో కష్టాలు తీరాయి. ప్రస్తుతం సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాను. –మడకం దుర్గారావు, గిరిజన రైతు, వంకవారిగూడెం -
Telangana: బోరు బావుల కింద వరి సాగుకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో బోరు బావుల కింద వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ రఘునందన్ రావు మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగి సీజన్లో ఉత్పత్తి చేసిన బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ నుంచి తీసుకునే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆ సీజన్లో వరి సాగును పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులను వరి సాగు నుంచి ఎలా మళ్లించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే యాసంగి సీజన్లో బోరుబావుల కింద వరి సాగును నియంత్రించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల బోరుబావులు ఉన్నాయి. గత యాసంగిలో మొత్తం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఒక్క బోరు బావులు కిందనే 46 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వరి సాగు నుంచి రైతుల్ని మళ్ళించి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి రైతు సదస్సులు మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభించాలని, ఈ నెలాఖరు కల్లా ముగించాలని డీఏవోలకు సూచించారు. వ్యవసాయ శాఖ నిర్ణయం -
‘వైఎస్సార్ జలకళ’ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు అందాయి. అయితే.. ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వాల్టా చట్టంలో ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి పథకం అర్హత నిబంధనలలో సవరణలు సూచిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అర్హత నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరణలతో కూడిన నిబంధన ప్రకారం.. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ పథకంలో ఉచిత బోరు మంజూరైతే.. ఆ కుటుంబంలో మరొకరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని పేర్కొన్నారు. సవరించిన నిబంధనలివీ.. ► ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ► ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్ సర్వే జరిపించాలి. ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ► వైఎస్సార్ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు. -
‘జలకళ’తో రైతుల్లో ఆనందం: అవంతి
సాక్షి, విశాఖపట్నం: జలకళ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రిగ్ వాహనాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 వాహనాలు మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి లాంఛనంగా వాహనాలను ప్రారంభించారు. అనంతరం వాహనాలు ఆర్కే బీచ్ గుండా ర్యాలీగా వెళ్ళిన దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. (చదవండి: మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్) ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ‘వైఎస్సార్ జలకళ’ ద్వారా వందలాది ఎకరాలు సాగులోకి రానున్నాయని తెలిపారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరత నుంచి రైతులు బయటపడే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా రైతుల్లో ఆర్థిక భరోసా వస్తోందన్నారు. సీఎం జగన్ పదవి చేపట్టిన తర్వాత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రిజర్వాయర్ల నీటితో నిండాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ రైతుల్లో జలకళ స్పష్టంగా కనిపించిందన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. గ్రామీణ ప్రాంతాల్లో బోరు ఉంటే రైతులు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారని అన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు ఒక్కొక్క రిగ్ వాహనం మంజూరైంది. కేవలం బోరు తీయడమే కాకుండా సన్నకారు రైతులకు మోటార్ కూడా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం పట్ల చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. -
మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. 'వైఎస్ఆర్ జలకళ' పథకానికి శ్రీకారం చుట్టారు. మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. 'వైఎస్ఆర్ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందిస్తామని తెలిపారు. సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘'వైఎస్ఆర్ జలకళ' కోసం రూ.2,340 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడంతో పాటు మోటార్లు బిగిస్తాం. మోటార్ల కోసం మరో రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. బోర్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయన్న సర్వే కూడా చేస్తాం. బోర్ వేసేందుకు, సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే రైతులు వేసుకున్న బోర్లు ఫెయిలైతే.. మళ్లీ వేయిస్తాం. యూనిట్‌కు 6.80 పైసలు చొప్పున నెలకు రూ.9,272 విద్యుత్ బిల్లును భరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8,655 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వంలో పగటిపూట విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు. గత ప్రభుత్వం హయాంలో ఫీడర్ల కెపాసిటీ 59 శాతం మాత్రమే ఉండేది. రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీని 89శాతానికి తీసుకొచ్చాం. లోపాలుంటే రైతుకు ప్రశ్నించే హక్కు మీటర్లు బిగించడం ద్వారా రైతులకు ఏ ఇబ్బంది ఉండదు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా లోడ్ తెలుసుకునేందుకే మీటర్లు. మీటర్ల ఏర్పాటుతో కరెంట్ ఎంత ఓల్టేజ్‌తో సరఫరా అవుతుందో తెలుసుకోవచ్చులో ఓల్టేజ్ ఉన్న చోట ఫీడర్ కెపాసిటీ పెంచి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లులకు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తాం.రైతులే నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు. విద్యుత్ సరఫరాలో లోపాలుంటే రైతుకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. 10వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ ఉత్పత్తి ద్వారా యూనిట్ రూ.2.30కే అందుబాటులోకి వస్తుంది. రైతులపై విద్యుత్ భారం మోపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని రైతులే నిలదీస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనతాబజార్ తీసుకొస్తాం.’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరైయ్యారు. ఉచిత బోర్లకు మార్గదర్శకాలు.. గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. ► అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు. ► ఒకసారి బోర్వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు. ► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. ► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు. ► బోర్ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటో తీస్తారు. -
అర్హులైన రైతులందరికీ ‘వైఎస్సార్ జలకళ’
సాక్షి, అమరావతి: మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ► గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. ► అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు. ► ఒకసారి బోర్వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు. ► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. ► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు. ► బోర్ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటో తీస్తారు. -
మెట్టభూములకు ‘వైఎస్సార్ జలకళ’
సాక్షి, అమరావతి: సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూములు ఇకపై పచ్చని పైర్లతో కళకళలాడనున్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ పథకంతో ఇది సాధ్యంకానుంది. ఈ బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు తవ్వించి ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురానుంది. అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తారు. బోర్లు తవ్వించడానికి చిన్న, సన్నకారు రైతులు అప్పులు పాలవుతుండటాన్ని పాదయాత్ర సమయంలో చూసి చలించిన వైఎస్ జగన్.. ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘వైఎస్సార్ జలకళ’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. – వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు 2,00,000 బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. – ఈ పథకానికి రూ. 2,340 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. – ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశారు. – కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. – దరఖాస్తు చేసుకునే రైతుల భూమిలో అంతకు ముందు బోరు ఉండకూడదు. – అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. – పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన తరువాతనే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలుపెడతారు. – భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. – వైఎస్సార్ జలకళ పథకంలో పారదర్శకంగా పనులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి వివరాలను ఎస్ఎస్ఎంల ద్వారా పంపిస్తారు. ఈ వివరాలు ఆన్లైన్ కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి: మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి అన్న విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. జియోలజిస్ట్ నిర్దేశించిన లోతులోనే బోర్ల తవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడుగంటి పోకుండా శాస్త్రీయ పద్ధతుల్లో బోరుబావుల తవ్వకం ఉంటుందన్నారు. -
28న ‘వైఎస్సార్ జలకళ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో పెద్ద పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ► వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ► ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్ రిగ్ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సీఎం అదే రోజు ప్రారంభిస్తారు. ► ఆన్లైన్ విధానంతో పాటు ఎంపీడీవోల ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్ విభాగపు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
రైతులకు ఏపీ సర్కార్ తీపి కబురు
సాక్షి, అమరావతి : విద్యా, వైద్యం, ఆరోగ్యంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమల్లో ఉన్న ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రైతుల పంటపొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అర్హత గల రైతులు గ్రామ సచివాలయంలో పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డుల ఆధారంగా దరఖస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హతలు, విధివిధానాలు.. ► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. ► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. -
ఉచిత బోరు.. రైతు కష్టాలు తీరు
‘బక్కిరెడ్డి బావి ఎండిపోయింది. మళ్లీ రెండు మూడు మట్లు తవ్వితేగాని నీళ్లు పడవు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చి రెండు మట్లు తవ్వడానికి 24 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. కానీ నీటి జాడ కనబడలేదు. దీంతో బక్కిరెడ్డి మానసికంగా బాగా కుంగిపోయాడు. బాకీ తీర్చే మార్గం కనిపించడం లేదు. ఓ రోజు పొద్దున్నే బ్యాంకుల వాళ్లు వచ్చి ఊరోళ్ల సమక్షంలో బక్కిరెడ్డి పొలాన్ని వేలం వేశారు. తరతరాలుగా వచ్చిన పొలాలు పోయాయని, పొలం పోయిన రైతుకు ఊళ్లో ఇక ఏమాత్రం గౌరవం ఉండదని భావించిన బక్కిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు’... ఇదీ ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి రాసిన మూగవాని పిల్లన గ్రోవి నవల్లోని ఓ హృదయ విదారక దృశ్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సగటు రైతు బతుక్కి అద్దంపట్టే వర్ణన అది. ఇలా ఎందరో నిత్యం రాష్ట్రంలో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే పడే నీళ్లు ఈవేళ ఏడెనిమిది వందల అడుగులు దాటినా కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలలో 12 వందలు, 14 వందల అడుగులు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు రైతులు. చేసిన బాకీలు తీర్చక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యం. ఈ దుస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లక్షలాది మంది రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలే కీలకం... ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 శాతం సాగు భూమి భూగర్భ జలాలతోనే సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో సగటున భూగర్భజల మట్టం 2.5 మీటర్లు తగ్గింది. మోటబావులు, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బోరు బావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందేలా ఆ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అనుమతితోపాటు రూ.12వందల ప్రీమియం, జియలాజికల్ సర్వే కోసం మరో రూ.1000 (చిన్న సన్నకారు రైతులైతే రూ.500) చెల్లించి బోర్ వేసుకోవాలి, నీరు పడకపోతే ప్రభుత్వం నుంచి రూ.10 వేల రూపాయల బీమా లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీ పడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు. సంబంధిత బోరు బావి కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారంగా రైతులందరూ నీళ్లను వినియోగించుకునే పద్ధతిని– ఉమ్మడి నీటి యాజమాన్య సంఘం– ప్రవేశపెట్టారు. భూ గర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో సైతం తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్నసన్నకారురైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కాలదోషం పట్టిన ప్రభుత్వ అంచనాల ప్రకారం బోరు వేయడానికి వ్యయం రూ.18,500ఖర్చు, వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలవుతుంది. బోరు వేసే లోతును బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. బోరు విఫలమైతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నాబార్డ్ లాంటి సంస్థలు వీటిని రీచార్జ్ చేసేందుకు సాయం అందిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు. డీజిల్ ధర పెరగడంతో అడుగు లోతుకి రూ.300 నుంచి రూ.400 చార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే సుమారు లక్షన్నర ఖర్చు వస్తుంది. భార్య పుస్తెలమ్మి బోరు వేస్తే... ఆ బోరులో నీళ్లు పడతాయో లేదో తెలియదు. పంట చేను తడుస్తుందనే భరోసా ఉండదు కానీ ఆ రైతు నట్టిల్లు మాత్రం కన్నీళ్లతో నానిపోతుంది. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. ఉచిత బోరు.. బడుగు రైతుకు భరోసా (ప్రతీకాత్మక చిత్రం) – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
బోరుబావి రైతులను ఆదుకోరా?
వర్షపునీటితో వ్యవసాయం చేయటమనేది అత్యంత ప్రాచీనమైన కళ. పంటభూమికి నీరందించటానికి మనకున్న ముఖ్యమైన నీటివనరులు మూడు. అవి 1. వర్షపాతం, 2.భూతలజలం, 3. భూగర్భజలం. తెలంగాణలో సగటు వార్షికవర్షపాతం 929 మి.మీ. ఇందులో నైరుతి ఋతుపవనాల ద్వారా రమారమి 67శాతం జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లోనే లభిస్తుంది. 23శాతం వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల ద్వారా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు లభిస్తుంది. ఇవి పోగా మిగతా పదిశాతం వర్షపాతం జనవరి నుండి మే నెలల మధ్య ఐదు నెలల్లో లభిస్తుంది. రాష్ట్రంలోని పంటభూమిలో ఒక కోటీæ 43 లక్షల ఎకరాలలో మూడింట ఒక వంతు భూమికి మాత్రమే నీటి వసతి ఉంది. ఈ నీటి వసతి కల్పిం చిన పంట భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా అప్పులు చేసి ఎన్నో బాధలుపడి బోరుబావుల ద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులు, కుంటలు 41,131. వీటి కింద ఉన్న పారుదల 1956–57లో 5,30,565 హెక్టార్లుగా ఉన్నది. 2000–01 నాటికి 1,65,303 హెక్టార్లకు పడిపోయింది. అంటే ఐదు దశాబ్దాలలో చెరువులు, కుంటల కింద నీటిపారుదలలో తగ్గిన విస్తీర్ణం 8,50,000 ఎకరాలకు పైగానే ఉంది. అదే విధంగా కాలువల కింద పారకం 1990–91లో 3,38,276 హెక్టార్లుగా ఉన్నది 2000–01 నాటికి 1,62,315 హెక్టార్లకు పడిపోయింది. రాష్ట్రంలో వాణిజ్యపంటలవైపు మొగ్గుచూపు తున్న రైతులు ప్రాజెక్టులు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు లభించకపోవటంతో గత్యంతరం లేక బోరు బావులపై ఆధారపడుతున్నారని గత 50 ఏళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 1970–71లో రాష్ట్రంలో 2,14,500 బోరుబావులుంటే 2017 నాటికి వాటి సంఖ్య 20,21,084కు చేరుకుంది. ప్రస్తుతం 22,50,000వరకు ఉంటాయని నిపుణుల అంచనా. ఒక్కో బోరుబావిపై రైతులు ఖర్చుపెడుతున్నది సగటున లక్షరూపాయలనుకుంటే ఇన్ని బోరుబావులపై రైతులు పెట్టిన ఖర్చు 22,500 కోట్లకు పైగానే ఉంటుంది. నేడు మనరాష్ట్రంలో 1,43,00, 000 ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉంటే అందులో సాగవుతుంది మాత్రం గరిష్టంగా ఒక కోటీ పది లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పంటభూమిలో మూడింట ఒకవంతు భూమికి సాగునీటి వసతి 6 భారీ, 30 మధ్యతరహా, 41.131 చెరువుల, కుంటల వ్యవస్థల ద్వారా ప్రభుత్వం గత కొంతకాలంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్పించింది. నీటివసతి గల భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా బోర్లద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది ప్రశ్న? పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ బోరుబావుల రైతులంతా చిన్నసన్నకారురైతులే. వీళ్లంతా అరెకరం నుండి ఐదు ఎకరాల లోపు వ్యవసాయభూకమతాలు కల్గిఉన్నవారే. వీళ్లలో మెజార్టీ రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు. 80శాతం పైగా బోరుబావులున్నవి వీళ్ల వ్యవసాయక్షేత్రాల్లోనే. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 80శాతం వరకు ఈ కుటుంబాల నేపథ్యంలోని వారేనని నిపుణుల అంచనా. ఈ చిన్నసన్నకారు రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై, బంధుమిత్రులపై వ్యవసాయంలో తమ పెట్టుబడి అవసరాల కోసం ఆధారపడుతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో రుణాలు తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలోని బోరుబావులలో 25శాతం బోరుబావులు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయి. మిగతావన్నీ డేంజర్ జోన్లోనివే. భూగర్భజలాశయం ఒకబ్యాంకు లాంటిది. బ్యాంకులో మనం ఎంత డబ్బును జమచేస్తే అంతే తీసుకోగలం. అలాగే ఎంత వాననీరు భూగర్భజలాశయానికి చేరుతుందో అంతనీటిని మాత్రమే మనం బయటకు తీసి వాడుకోవాలి. రాష్ట్రంలోని బోరుబావులను, వాటి సంబంధిత రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసే నిమిత్తం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేసి వారి సూచనలు, సలహాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. దాంతోపాటు దక్కన్‌పీఠభూమిలో భాగంగా ఉన్న మన రాష్ట్ర నైసర్గిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు స్వస్తి పలికి వీటికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియను చేపట్టాలి. చైనా, రాజస్తాన్ లాంటి ప్రాంతాల్లో హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియ సత్ఫలితాలనిస్తున్నట్లుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం మన రాష్ట్ర నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఉండి సత్ఫలితాలనిస్తుంది. వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98491 36104 ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ -
అనుమతి లేని బోర్లు మూసివేత
కలకోవ(మునగాల): మండలంలోని కలకోవలో అనుమతి లేకుండా వివాదస్పదంగా మారిన నాలుగు బోర్లను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ ఎల్.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన ఓ రైతు అనుమతి లేకుండా బోర్లు వేశాడని గ్రామానికి చెందిన ఓ మాజీ విశ్రాంత ఉద్యోగి తహసీల్దాకు గతంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు ఓ నివేదిక అందచేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి లేని బోర్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం తహసీల్దార్ ఎల్.భద్రయ్య తన సిబ్బందితో సహా గ్రామానిక చేరుకోవడంతో బోర్ల యజమానితో పాటు పలువురు గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. తిరిగి మంగళవారం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో ఎట్టకేలకు బోర్లను సీజ్ చేశారు. అంతే కాకుండా విద్యుత్ శాఖ ఏఈ సదరు బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కూడా తొలగించారు. దీంతో బోర్ల వివాదం సమసిపోయంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ స్వప్న, వీఆర్వోలు అస్మా సుల్తానా, సురేష్, నరేష్, భిక్షంలు పాల్గొన్నారు. -
బాలుడిని మింగిన బోరుబావి
రక్తస్రావం, ఊపిరాడక చిన్నారి రాకేశ్ మృతి * 22 గంటలపాటు సాగిన సహాయక చర్యలు వృథా * ఆదివారం ఉదయం 6:45గంటలకు బాలుడి వెలికితీత * హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలింపు * అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారణ * జారి పడిన 3-4 గంటల్లోనే బాలుడు మరణించి ఉండొచ్చన్న వైద్యులు సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: జరగరానిదే జరిగింది... మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా ‘బోరుబావి ఘటన’ విషాదాంతమైంది. మూడేళ్ల బాలుడు రాకేశ్‌ను బోరుబావి మింగేసింది. అతన్ని సజీవంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం దాదాపు 22 గంటలపాటు పడిన శ్రమ వృథా అయింది. ఆదివారం ఉదయం సరిగ్గా 6.45 గంటలకు బాలుడిని సహాయ బృందాలు బయటకు తీయగా అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్సులో అతన్ని హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాకేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ విజయ్‌కుమార్ బాలుడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మ, సోదరుడు బాలేష్, సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు శ్వాస అందక ఆ చిన్నారి మరణించి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. బాలుడు తలకిందులుగా బోరుబావిలో పడినందున అతను పడిన మూడు నాలుగు గంటల్లోనే మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బాలుడిని కాపాడేందుకు సహాయ బృందాలు అంతకుముందు తీవ్రంగా శ్రమించాయి. మూడు భారీ ప్లొక్లెయిన్లను ఉపయోగించినా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు అధికారులు బోరుబావికి సమాంతరంగా కేవలం 18 అడుగుల గుంత మాత్రమే తీయగలిగారు. అడ్డువచ్చిన భారీ బండరాళ్లు సహాయక చర్యలను ముందకు కదలనివ్వలేదు. అయితే నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు 4 గంటలకు ఘటనా స్థలికి చేరుకొని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ నుంచి వివరాలు సేకరించి రంగంలోకి దిగాయి. అయితే సమాంతర గుంతకు మరో పెద్ద బండరాయి అడ్డు రావడంతో దాన్ని డైనమెట్లతో పేల్చేయాలని నిర్ణయించాయి. బోరుబావికి నష్టం కలగకుండా పేల్చేందుకు ఉదయం 4.30కి డ్రిల్లింగ్ మెషిన్‌తో బండకు వరుస రంధ్రాలు చేశాయి. బోరు బావిలోకి సీసీ కెమెరాలను వదిలి బాలుడి పరిస్థితిని, చుట్టూ పరిసరాలను గమనించాయి. సాధారణ మెకానిక్ సాయం బోరుబావి ఘటనను టీవీలో చూసి తెలుసుకున్న నల్లగొండ జిల్లా వేములపల్లికి చెందిన సాధారణ బోరుబావి మెకానిక్ పుట్టా కరుణాకర్ తన వంతు సాయం అందించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాడు. సమాంతర బావి తవ్వే అవసరం లేకుండా తన వద్ద ఉన్న పరికరాలతో బాలుడిని సురక్షితంగా బయటకు తీస్తానని... అందుకు అవకాశం ఇవ్వాలని సహాయ బృందాలు, ఆర్డీఓ నగేశ్‌ను అభ్యర్థించాడు. సీసీ కెమెరాలను బోరుబావిలోకి పంపి వాటి ఆధారంగా బాలుడికి గాయం కాకుండా క్లిప్పులు తగిలించి 3, 4 నిమిషాల్లో కప్పి సాయంతో బయటికి లాగుతానంటూ అప్పటికప్పుడు డెమో నిర్వహిం చాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ...డిజాస్టర్ మేనేజ్మెంటు సభ్యుల అభిప్రాయం తీసుకొని కరుణాకర్‌ను కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు అనుమతించారు. వెంట తెచ్చుకున్న పరికరాల సాయంతో 40 నిమిషాలు ప్రయత్నించి రాకేశ్ కాళ్లకు క్లిప్పులు తగిలించిన కరుణాకర్...తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కప్పి ద్వారా సరిగ్గా ఉదయం 6.45కు రాకేష్‌ను బయటికి తీశారు. కాగా, చిన్నారి రాకేశ్ మరణం దురదృష్టకరమని, ఈ ఘటన తనను కలచివేసిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. విఫలమైన బోరుబావులను ప్రజలు ఇప్పటికైనా గుర్తించి వెంటనే పూడ్చేయాలని కోరారు. -
బోరుబావి మింగేసింది
-
బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి
-
బోరుబావిలో చిన్నారి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడిపోయిన బాలుణ్ని కాపాడేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ డీ ఆర్ ఎఫ్) బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా రాకేశ్ ను బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన భారీ యంత్రాలతో బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. అయితే బండరాళ్లు అడ్డుపడటం సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. కాగా, రాకేశ్ బావిలో పడిపోయి 24 గంటలు గడుస్తుండటంతో అతడి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మలు సహా బంధుగణం కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం సోదరుడు బాలేష్‌తో ఆడుకుంటున్న సమయంలో రాకేశ్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికిరాత్రే వేసి, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బోరును వదిలిళ్లడం ప్రమాదానికి కారణమైంది. అభం శుభం తెలియని పసిబిడ్డలను బోరుబావులు నిర్ధాక్షిణ్యంగా మింగేస్తున్నాయని, విఫలమైన బోరుబావులతో ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించింది. వాటి పూడ్చివేత కోసం అక్షర ఉద్యమం చేపట్టినా అనర్థాలు పునరావృతమవుతుండటం దారుణం. సోదరుడు చెప్పడంతో.. సోదరుడు రాకేష్ బోరులో పడిపోయిన విషయం బాలేష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్థులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. తాడు, కొక్కాలు వేసి లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలోనే కొంత మట్టి బోరులోకి పడినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న 108 సిబ్బంది 12 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకొని 8.22 నిమిషాలకు బోరుబావిలోకి ఆక్సీజన్ అందించారు. వెల్దుర్తి నుంచి శ్రీనివాస్ అనే యువకుడిని పిలిపించి నైట్ విజన్ కెమెరాలు బోరుబావిలోకి పంపించి రాకేష్ ఉన్న స్థానాన్ని గుర్తించారు. 30 ఫీట్ల లోతులో తలకిందులుగా ఉన్నట్టు, చుట్టూ మట్టి పేరుకుపోయినట్టు నిర్ధారించారు. స్థానికంగా లభించిన మూడు జేసీబీలు, బయటి నుంచి మూడు 200 సీసీ, రెండు 70సీసీ హిటాచి యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. వాటి ద్వారా బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపడుతున్నారు. అడ్డుపడుతున్న బండ రాళ్లు... భూమి పైపొరలోనే పెద్ద పెద్ద బండరాళ్లు రావటంతో జేసీబీలతో పని సాధ్యం కావడంలేదు. రాత్రి 11.45గంటల వరకు కేవలం 15 ఫీట్లలోతు గుంతను మాత్రమే తవ్వగలిగారు. 10 ఫీట్ల లోతులో మరో పెద్ద బండరాయి అడ్డుపడింది. దీన్ని బయటికి పెకిలించేందుకు మూడు హిటాచీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. గుంటూర్ నుంచి నిపుణులు... ఈ బండరాళ్లు కోయడానికి హైదరాబాద్ నుంచి విపత్తు నివారణ యాజమాన్యం బృందాన్ని, గుంటూరు నుంచి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ బృందాన్ని రప్పిస్తున్నామని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మీడియాతో చెప్పారు. ఆదివారం వారితో బండరాయిని కోయిస్తామని చెప్పారు. జోగిపేట సీఐ నాగయ్య, పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సహాయక చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ ప్రకటించారు. ఆయన ఉదయం నుంచి సంఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి సాయంత్రం వేళలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సందర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కొద్దిసేపు అక్కడే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు. -
చిన్న కమతాల్లో ఆకుకూరల సాగు
మొయినాబాద్ రూరల్: మండలంలోని రైతులు తమకున్న చిన్న కమతాల్లో ఆకుకూరల పంట ల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వర్షాభా వ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో ఆశించినంత నీరు లేకపోవడంతో వచ్చే కొద్దిపాటి నీటితో ఆయా పంటలు పండించుకుంటున్నారు. దీనికితోడు ఆకుకూర పంటలు వేసుకునేందుకు పెట్టుబడి వ్యయం కూడా తక్కువ అవుతుంది. మార్కెట్లో ఆకుకూరలకు ఎప్పుడూ ధర అధికంగా ఉండటంతో రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు వీలు కలుగుతోంది. దీంతో మండల పరిధిలోని హిమాయత్నరగ్, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్, ఖాసింబౌలి, శ్రీరాంనగర్, సురంగల్, తోల్కట్ట, తదితర గ్రామాల రైతులు ఆకుకూర పంటలపై దృష్టి పెట్టారు. పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వంటి పంటలు గ్రామాల్లో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి.. పెట్టుబడి తక్కువ, కూలీల అవసరం అంతగా లేకపోవడంతో ఆదాయం బాగానే వస్తుందంటున్నారు ఇక్కడి రైతులు. పంట దిగుబడులను రైతులే నేరుగా మెహిదీపట్నం రైతుబజార్, గుడ్డిమల్కాపూర్ సబ్జిమండీ, శంషాబాద్ రైతు బజార్లకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.