మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌ | CM YS Jagan Launches YSR Jalakala Scheme For Free Borewells | Sakshi
Sakshi News home page

'వైఎస్‌ఆర్‌ జలకళ' పథకానికి శ్రీకారం

Published Mon, Sep 28 2020 12:08 PM | Last Updated on Mon, Sep 28 2020 2:55 PM

CM YS Jagan Launches YSR Jalakala Scheme For Free Borewells - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. 'వైఎస్‌ఆర్‌ జలకళ' పథకానికి శ్రీకారం చుట్టారు. మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. 'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్‌ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందిస్తామని తెలిపారు.

సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే..
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం రూ.2,340 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడంతో పాటు మోటార్లు బిగిస్తాం. మోటార్ల కోసం మరో రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. బోర్‌ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయన్న సర్వే కూడా చేస్తాం. బోర్‌ వేసేందుకు, సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే రైతులు వేసుకున్న బోర్లు ఫెయిలైతే.. మళ్లీ వేయిస్తాం. యూనిట్‌కు 6.80 పైసలు చొప్పున నెలకు రూ.9,272 విద్యుత్‌ బిల్లును భరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8,655 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వంలో పగటిపూట విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు. గత ప్రభుత్వం హయాంలో ఫీడర్ల కెపాసిటీ 59 శాతం మాత్రమే ఉండేది. రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీని 89శాతానికి తీసుకొచ్చాం.

లోపాలుంటే రైతుకు ప్రశ్నించే హక్కు
మీటర్లు బిగించడం ద్వారా రైతులకు ఏ ఇబ్బంది ఉండదు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా లోడ్‌ తెలుసుకునేందుకే మీటర్లు. మీటర్ల ఏర్పాటుతో కరెంట్ ఎంత ఓల్టేజ్‌తో సరఫరా అవుతుందో తెలుసుకోవచ్చులో ఓల్టేజ్‌ ఉన్న చోట ఫీడర్ కెపాసిటీ పెంచి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లులకు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్‌లో వేస్తాం.రైతులే నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు. విద్యుత్‌ సరఫరాలో లోపాలుంటే రైతుకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. సోలార్‌ ఉత్పత్తి ద్వారా యూనిట్‌ రూ.2.30కే అందుబాటులోకి వస్తుంది. రైతులపై విద్యుత్‌ భారం మోపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని రైతులే నిలదీస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనతాబజార్ తీసుకొస్తాం.’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్,  గుమ్మనూరు జయరామ్, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరైయ్యారు.


ఉచిత బోర్లకు మార్గదర్శకాలు..
గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. 
► అనుమతి అనంతరం కాంట్రాక్టర్‌ బోరుబావులను తవ్వుతారు.  
► ఒకసారి బోర్‌వెల్‌ విఫలమైతే మరోసారి కూడా బోర్‌ వేస్తారు. 
► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తారు. 
► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తారు. 
► బోర్‌ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్‌ ఫొటో తీస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement