
సాక్షి, అమరావతి: మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు.
► గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు.
► అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు.
► ఒకసారి బోర్‌వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు.
► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు.
► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు.
► బోర్ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటో తీస్తారు.
Comments
Please login to add a commentAdd a comment