సాక్షి, అమరావతి: సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూములు ఇకపై పచ్చని పైర్లతో కళకళలాడనున్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ పథకంతో ఇది సాధ్యంకానుంది. ఈ బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు తవ్వించి ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురానుంది. అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తారు. బోర్లు తవ్వించడానికి చిన్న, సన్నకారు రైతులు అప్పులు పాలవుతుండటాన్ని పాదయాత్ర సమయంలో చూసి చలించిన వైఎస్ జగన్.. ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘వైఎస్సార్ జలకళ’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
– వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు 2,00,000 బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
– ఈ పథకానికి రూ. 2,340 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు.
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశారు.
– కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
– దరఖాస్తు చేసుకునే రైతుల భూమిలో అంతకు ముందు బోరు ఉండకూడదు.
– అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
– పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన తరువాతనే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలుపెడతారు.
– భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు.
– వైఎస్సార్ జలకళ పథకంలో పారదర్శకంగా పనులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి వివరాలను ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. ఈ వివరాలు ఆన్‌లైన్ కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు.
ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి: మంత్రి పెద్దిరెడ్డి
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి అన్న విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. జియోలజిస్ట్ నిర్దేశించిన లోతులోనే బోర్ల తవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడుగంటి పోకుండా శాస్త్రీయ పద్ధతుల్లో బోరుబావుల తవ్వకం ఉంటుందన్నారు.
మెట్టభూములకు ‘వైఎస్సార్ జలకళ’
Published Sun, Sep 27 2020 3:23 AM | Last Updated on Sun, Sep 27 2020 10:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment