రాష్ట్రంలో 43.52 లక్షల మంది అర్హులు.. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున సాయం
రూ.870 కోట్లు జమ చేయనున్న ప్రధానమంత్రి మోదీ
రాష్ట్రంలో ఐదేళ్లూ ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందించిన వైఎస్ జగన్
ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు అందజేత
సాక్షి, అమరావతి: రైతన్నలకు ప్రధానమంత్రి కిసాన్ 17వ విడత సాయం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్‌లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయనుంది. మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ పెట్టుబడి సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు.
అన్నదాతలకు అండగా..
2018–19 నుంచి కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. తొలి విడత సాయం మే–జూన్‌లో, రెండో విడత అక్టోబర్– నవంబర్‌లో, మూడో విడత జనవరి–ఫిబ్రవరిలో జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో దేశ వ్యాప్తంగా రూ.3.04 లక్షల కోట్లు జమ చేసిన కేంద్రం రాష్ట్రంలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.14,717 కోట్లు అందచేసింది. 2024–25 సీజన్‌లో ఏపీలో 43.52 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.870 కోట్లు జమ చేయనుంది. ఇప్పటికే ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. యూపీ పర్యటనలో భాగంగా మంగళవారం పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను ప్రధాని మోదీ నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.
ఐదేళ్లూ ఠంచన్‌గా ఇచ్చిన వైఎస్ జగన్
పీఎం కిసాన్‌తో పాటే గత ఐదేళ్లూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నలకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని అందజేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయంగా అందించి తోడుగా నిలిచింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి వారం రోజులు గడుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటోంది. ఈ సమయంలో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం పట్ల రైతన్నలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment