రైతన్నల ఖాతాల్లోకి కరువు సాయం, మిచాంగ్ పరిహారం
8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్లు జమ
ఇక మిగిలింది 1.54 లక్షల మందికి మరో రూ.163.12 కోట్లు
ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్, పేర్లు సరిగా లేకనే
క్షేత్రస్థాయిలో రీ వెరిఫికేషన్‌తో వారికీ లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు
ఐదేళ్లలో 34.41 లక్షల మందికి ఇన్‌పుట్ సబ్సిడీతో రూ.3,261.60 కోట్లు అందించిన సీఎం జగన్ సర్కారు
వాస్తవాలు తెలుసుకోకుండా విషం కక్కుతున్న రామోజీరావు
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.
అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.
ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే.
తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..
నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్‌ఎస్‌కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్‌ఎంఎస్‌కు ప్రతిపాదనలు పంపింది.
ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలు
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్‌లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.
తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..
చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్‌లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.
2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్‌లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్‌లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.
రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు
నాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్‌లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.
ఆ కథనాల్లో నిజం లేదు..
ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్‌లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment