అన్నదాతకు అందని పెట్టుబడి సాయం..
ఎరువులు, విత్తనాలు లేక ఆర్బీకేలు అస్తవ్యస్థం
ఈసారి ఖరీఫ్‌లో 16 లక్షల ఎకరాలు సాగుకు దూరం.. ప్రత్యామ్నాయ
పంటల ప్రణాళికపై సర్కారు విఫలం
రబీ లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు..
ఇప్పటివరకు 4.65 లక్షల ఎకరాల్లోనే ప్రధాన పంటల సాగు.. రెండో పంటకు నీటి విడుదలపై స్పష్టత ఇవ్వని సర్కారు
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తీవ్ర ఒడిదుడుకుల మధ్య రైతన్నలు ఖరీఫ్ సాగు చేపట్టగా ముందస్తు రబీ ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. రైతన్న చేతికి ఇంతవరకూ పెట్టుబడి సాయం అందకపోవడం.. డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులను సమకూర్చకపోవడం, ఇన్నాళ్లూ చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దీనికి కారణం.
ఒకపక్క ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి..! కానీ రెండో పంటకు నీరు అందుతుందనే భరోసాను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతన్న కదం తొక్కుతున్నాడు!! ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల ఆశలను నీరుగార్చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం రబీ పంటల సాగుపై పడింది.
గతేడాది ఈపాటికి 40 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా ఈ ఏడాది 5–10 శాతం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. రబీ సాగు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండో పంటకు నీరివ్వడంపై సర్కారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కృష్ణా జిల్లా సహా పలు చోట్ల రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది కనిష్టంగా సాగు..
ఈ ఏడాది పెట్టుబడి సాయం లేక, సకాలంలో విత్తనం అందక, ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించే నాథుడు లేక రబీ సాగు నత్తనడకన సాగుతోంది. 3.65 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా ఇప్పటి వరకు కేవలం 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్ చేయగలిగారు. వాటిలో 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు.
ప్రధానంగా 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం కావాలని రైతులు కోరగా 1.10 లక్షల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. దీంతో ముందస్తు రబీ సాగు జరగని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి అత్యల్పంగా 4.65 లక్షల ఎకరాల్లో మాత్రమే రబీ ప్రధాన పంటల సాగు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ ముగిసే నాటికి కనిష్ట స్థాయిలో రబీ పంటల సాగు నమోదయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లూ.. సాధారణం కంటే మిన్నగా
రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా 8.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు, వరదలతో నారుమళ్లు దెబ్బతిన్నప్పటికీ 80 శాతం సబ్సిడీపై వైఎస్ జగన్ ప్రభుత్వం విత్తనాలను సమకూర్చింది.
బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం, సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించడం లాంటి చర్యల కారణంగా రైతులు రబీ సాగుకు ముందుకొచ్చారు. నవంబర్ 10వ తేదీ నాటికి 2019–20లో 18.45 లక్షల ఎకరాలు, 2020–21లో 15.85 లక్షల ఎకరాలు, 2022–23లో 16.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో విఫలం
ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా ఈసారి అతి కష్టంమ్మీద 70 లక్షల ఎకరాల్లో సాగైంది. దాదాపు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాని దుస్థితి నెలకొంది. సాగైన చోట్ల కూడా వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు కారణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విఫలమైంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడంతో రెండో పంట సాగు కోసం దిక్కులు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment